Friday 30 September 2016

శరదృతువులో శక్తి ఆరాధన





అశ్వని నుండి రేవతి వరకు ఇరువది ఏడు నక్షత్రములు. గ్రహములు - తొమ్మిది. ఈ నవగ్రహములకు ఇరువది ఏడు నక్షత్రాల్ని ఒక్కొక్కటికి మూడు నక్షత్రాలు చొప్పున ఆధిపత్యం ఇచ్చారు. అందులో చంద్రునికి సంబంధించిన నక్షత్రాలు-రోహిణి, హస్త, శ్రవణం. చంద్రుడు మనసుకి కారకుడు. నిశ్చలమైన మనసుతో అన్ని కార్యాల్ని సాధించవచ్చు. చంద్రుడంటే జ్యోతిషశాస్త్రంలో తల్లి. జన్మనిచ్చిన తల్లి అంటే- జగన్మాత.
జగన్మాతను ఆరాధిస్తే, పూజిస్తే, ఉపాసిస్తే, మనోనిశ్చలతను, ఆత్మస్థైర్యాన్ని అనుగ్రహిస్తుంది. చం ద్రుడు వెనె్నలను బాగా ప్రసరింపచేసే కాలము- శరదృతువు. ఆ పేరును బట్టే తెలుస్తుంది మనకా విషయం.
ఆశ్వయుజ, కార్తీక మాసములు శరదృతువు.
‘‘ఇషశ్చోర్జశ్చ శారదా వృతూ’’ అన్నది శ్రుతి. ‘‘ఇషః’’ అనే పదానికి అశ్విన మాసము అనగా ఆశ్వయుజ మాసము అని అర్థము. ‘‘ఊర్జః’’ అనే పదానికి కార్తీక మాసము, శక్తి, బలము, జీవితము అనే అర్థాలున్నాయి.
పూర్ణిమ, అశ్వనీ నక్షత్రముతో కూడి ఉండే మాసము ఆశ్వయుజ మాసం. ‘అశ్వినో అశ్వయుజౌ’ అను శ్రుతి వాక్యం వల్ల అశ్వనీ నక్షత్రానికి అశ్వనీ దేవతలు అధిదేవతలుగా భావించాలి. ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు.
పూర్ణిమ ‘కృత్తికా’ నక్షత్రంలో వచ్చే మాసం- కార్తీకమాసం. కృత్తికా నక్షత్రానికి ‘అగ్ని’ అధిదేవత. ఈ నెలలో సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటాడు. ఆశ్వయుజ, కార్తీకమాసములతో కూడినది- శరదృతువు. దీనికి ‘మిత్రావరుణులు’ అధిపతులు. వీరందరి విశేషములతో, ధర్మములతో అలాలరారేది- శరదృతువు.
శరదృతువులో, ఆశ్వయుజమాసంలో శుక్లపాడ్యమి తిథిలో హస్తానక్షత్రం అనగా చంద్ర నక్షత్రంలో జగన్మాత పూజను, కలశ స్థాపనతో శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవముగా జరుపుతారు.
‘‘మహాపాతక సంయుక్తో నవరాత్ర వ్రతం చరేత్
ముచ్యతే సర్వపాపేభ్యో నాత్ర కార్యా విచారణా’’
ఈ నవరాత్ర వ్రతాన్ని ఆచరించి ఎందరో తరించారు. ఈ వ్రతాచరణతో పాపములన్నీ భస్మమవుతాయని దేవీభాగవతాది పురాణములు పేర్కొన్నాయి.
సర్వరోగములను నశింపజేసి, సర్వశుభములను చేకూర్చుతుంది ఈ వ్రతం. మనోధైర్యాన్నిస్తుంది అని పేర్కొన్నది స్కాంద పురాణం.
సర్వ రోగోపశమనం సర్వోపద్రవ నాశనమ్
శాన్తిదం సర్వారిష్టానాం నవరాత్ర వ్రతం శుభమ్
‘శరత్’ పదము, ‘శృ-హింసాయామ్’ అనే ధాతువు నుండి ఏర్పడింది. అంటే మనిషిలో ఇంద్రియ నిగ్రహం లేక, కామక్రోధాది ఆరు శతృవుల్ని జయించలేక హింసా ప్రవృత్తి ఎక్కువ అవుతుంది. మానవుడు తనలో ఉన్న పశు, రాక్షస ప్రవృత్తిని అణచికొని దైవీశక్తిని పెంపొందించుకోవాలని హెచ్చర్తింది- శరదృతువులో దేవీ శరన్నవరాత్రి వ్రత మహోత్సవము.
శరదృతువు, శరత్ శబ్దములను తెలిసికొన్నాక, ‘నవ’ శబ్దాన్ని పరిశీలిద్దాం. ‘నవ’ అంటే కొత్త అని, తొమ్మిది అనే అర్థాలు మనకు సామాన్యంగా తెలుసు. ‘నవ’ అంటే పరమేశ్వరుని, ‘రాత్రి’ అంటే ‘పరమేశ్వరి’ అని నిర్ణయ సింధువు తెలుపుతోంది. కనుక, నవరాత్రి వ్రతమంటే పార్వతీ పరమేశ్వరుల, శివశక్తుల, ప్రకృతీ పురుషుల ఆరాధన లేక వ్రతము, పూజ అని అర్థము. పరమాత్మ నవ స్వరూపుడు.
‘సూయతే స్తూయతే ఇతి నవః’
నవ శబ్దమునకు స్తుతింపబడుచున్న వాడని అర్థము. శబ్దరూపమైన వేదం- ప్రకృష్టమైన నవ స్వరూపం. అదే- ప్రణవ స్వరూపం.
‘‘నవో నవో భవతి జాయమానః’’
పరమాత్మ నిత్యనూతనుడు. అందరి చేత స్తోత్రింపబడుచున్నవాడు. శివశక్తులకు భేదం లేదు. అందుకే జగన్మాతకు ‘శివా’ అనే నామం కూడా ఉంది గదా.
జగన్మాత తొమ్మిది రూపములు ధరించింది. ఆమె తొమ్మిది చక్రాలు, తొమ్మిది ముద్రలు, తొమ్మిది యోగినులు, తొమ్మిది యోగములు, తొమ్మిది భద్రములతో విలసిల్లుతూ ఉంటుంది. తొమ్మిది ఆవరణలు కలిగి లలితా త్రిపురసుందరి అనే దివ్య నామంతో భక్తుల కోర్కెలను తీర్చే జగన్మాత- త్రైలోక్యమోహన చక్రం, సర్వాశా పరిపూరక చక్రం, సర్వ సంక్షోభణ చక్రం, సర్వ సౌభాగ్యదాయక చక్రం, సర్వార్థసాధక చక్రం, సర్వరక్షాకర చక్రం, సర్వరోగహర చక్రం, సర్వసిద్ధిప్రద చక్రం, సర్వానందమయ చక్రం.. ఇవే నవావరణములు నవ శబ్దానికి స్ఫూర్తి. తొమ్మిది కోణములు కలిగి శ్రీచక్రమని వెలుగొందుతోంది.
నీవే తస్మిన్మహీపాలే సర్వం నవమి వా భవత్
-అన్నది రఘువంశము. దిలీప మహారాజు కుమారుడు రఘు మహారాజు. అతడు పట్ట్భాషిక్తుడై సింహాసనాన్ని అధిరోహించాడు. నూతనుడైన రఘు మహారాజు రాగానే అంతా నవముగా అ యిందట. అంతా స్తుత్యముగా, నూతనముగా కనపడింది అంటాడు కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో. ఇది నవ శబ్దానికి దీప్తి.
ఇక రాత్రి శబ్దాన్ని విశే్లషిస్తే- జగన్మాత రాత్రి రూపిణి. పరమేశ్వరుడు పగలు. జగములనేలే తల్లి ఆరాధనే- రాత్రి వ్రతము.
రాత్రి రూపాయతో దేవీ దివారూపో మహేశ్వరః
రాత్రి వ్రత మిదం దేవి సర్వపాప ప్రశమనమ్
దివా అంటే పగలు.
ఆ పరమేశ్వరీ పూజయే రాత్రి వ్రతము.
సీతామాత కాలరాత్రి. ఆమె జోలికి పోయినా, అవమానించినా మొత్తం లంకను భస్మం చేస్తుంది. నిన్ను సర్వనాశనము చేస్తుంది. అయితే, ఆరాధింపబడినచో సీతామాత జ్ఞానభిక్షనొసగి కాపాడుతుంది. కాళరాత్రి అయిన సీతామాతయే వేద విద్య.
‘‘తదలం కాల పాశేన సీతా విగ్రహ రూపిణీమ్
కాలరాత్రేతి తాం విద్ధి సర్వలంకా వినాశినీమ్’’
-అని చెప్పాడు రామాయణంలో హనుమంతుని ద్వారా రావణాసురునికి జ్ఞానబోధ చేయిస్తూ వాల్మీక మహర్షి.
కాలరాత్య్రాది శక్త్యాదివృతా స్నిగ్థౌదనప్రియా
-అన్నది లలితా సహస్రనామం. జగన్మాత లలితాదేవికి కాళరాత్రి అను శక్తిగలదని వివరిస్తూ.
జగన్మాత ఆరాధనే, రాత్రివ్రతం. రాత్రి దేవియే- మహాకాళి మహాలక్ష్మి, మహా సరస్వతి రూప నామములతో పూజింపబడుతోంది. అందుకే జగన్మాతకు ‘కాలరాత్రి’అని పేరు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి, పగలు తొమ్మిది రోజులు చేస్తారు.
‘రాత్రి శబ్దస్య తిధి వాచకత్వాత్’ అనే అర్థాన్ని బట్టి, రాత్రి అనగా తిథి అని అర్థము తీసుకొని తొమ్మిది తిథులు అనగా పాడ్యమి మొదలు నవమి తిథి వరకు శ్రీదేవీ పూజ చేస్తారు. ఈ సంవత్సరం అష్టమి, నవమి తిథులు రెండూ ఒకే రోజు వచ్చాయి (అక్టోబరు 2 గురువారం) ఉ దయం దుర్గాదేవికి, మ ధ్యాహ్నం మహిషాసురమర్దినీ దేవికి పూజలు చేస్తారు ఆ రోజున.
‘పాడ్యమి’ అంటే ‘బుద్ధి’ అని చెప్పబడింది. మనుషుల బుద్ధియే శారదాదేవి. పాడ్యమి నుండి శారదాదేవిని ఆరాధిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది, సర్వశుభములను చేకూరుస్తుంది. మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించటమే ‘ఉత్సవం’.
‘ఊత్ సూతే హర్షః అనేన ఇతి ఉత్సవః’
- ఇది పెద్ద ఉత్సవం, మహోత్సవం.
వరం తనోతీతి వ్రతమ్.

వరమనగా శ్రేష్ఠము, తేజస్సు, శుభము, మంగళప్రదము అని అర్థాలు. వీటిని ప్రసాదించేదే వ్రతము. ఇదీ సూక్ష్మంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి వ్రత పూజా మహోత్సవముల వివరణ.
శ్యామలాంబికే భవాబ్ధి తరణే
శ్యామకృష్ణ పరిపాలిత
జనని కామితార్థ ఫలదాయకి
కామాక్షి సకల లోక సాక్షి

విశ్వప్రేమ త్యాగానికి, త్యాగం అమృతమైన మనసును ఇస్తుంది. మనఃకారకుడు- చంద్రుడు. చంద్రుడంటే తల్లి, జగన్మాత. కనుక విశ్వప్రేమతో జగన్మాత కరుణా కటాక్షములను పొందుతామని చెపుతోంది- శరన్నవరాత్రి పూజలో మొదటిరోజు ఆరాధన.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
















 

No comments:

Post a Comment