Friday, 9 December 2016

మార్గశుద్ధ ఏకాదశి - గీతాజయంతి



 మార్గశుద్ధ ఏకాదశి, గీతాజయంతి. ఈ ఏకాదశిని ‘మోక్షద’ ఏకాదశి అని పిలుస్తున్నాము. ఈ ఏకాదశినాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఇది గీతాజయంతి. ‘మోక్షద’ ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. వైఖానసుడు అన్నరాజు తన తండ్రి ‘నరమం’లో బాధలను పొందుతున్నట్లు కల గంటాడు. రుషి మునుల సలహాలపై వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం చేశాడు. ఈ వ్రతఫలంగా వైఖానసుని తండ్రికి నరకబాధ తొలగిపోయి మోక్షప్రాప్తి కలిగిందట.
ఈరోజున ఉపవాసం, విష్ణు ఆరాధన – విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి.


మానవజీవితంలో ప్రతి దశలోనూ ప్రతి సమస్యకీ పరిష్కారం చెప్పగలిగే గ్రంథం భగవద్గీత. ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తిస్తే మనం ఈ జీవితాన్ని సార్థక పరచుకోగలం? చిట్టచివరికి జీవన పరమార్థమైన కైవల్యాన్ని పొందగలమో చెప్తున్న గ్రంథమిది.
ముందుగా "అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే" అని మొదలౌతుంది. అశోచ్యానన్వ శోచస్త్వం అంటే దుఃఖించ గూడని వాటి కోసం దుఃఖించకు అని మొదలు పెడుతున్నది. అంటే ఆనందంగా ఉండు, దుఃఖపడకు అనేది ప్రధమ వాక్యం కృష్ణ బోధలో. మళ్ళీ చిట్టచివరికి 


సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ!
అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః!! 


అన్నాడు. దుఃఖపడకు అనేది చివరి వాక్యం. మొదట దేని గురించి దుఃఖ పడకూదదో దాని గురించి దుఃఖపడకు అని. చిట్టచివరికి దుఃఖపడకు, శోకించకు అని చెప్తున్నాడు. అంటే గీతయొక్క పరమార్థం శోకనాశనం, దుఃఖనాశనం. సృష్టిలో ఎవరైనా కోరుకొనేది అదే. దుఃఖం లేకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అటువంటి పరమానందం అంటే ఏమిటో తెలియజేస్తూ అజ్ఞాన జనితమైన సర్వ శోకాలనీ నశింప చేయడం కోసమే భగవద్గీత పుట్టింది. అందుకే మొదటి వాక్యం చివరి వాక్యం రెండూ కూడా మనలో ఉన్నటువంటి సర్వ దోషాలనీ దుఃఖాలనీ పోగొట్టి పరమానంద జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యమని తేటపరుస్తున్నది. 


మార్గ శిర శుద్ధ ఏకాదశినాడు కురుక్షేత్ర సమర ప్రాంగణంలో యదుకుల కృష్ణుడు కురుకుల అర్జునునికి సకల వేదసారమైన ఉపనిషత్ రూపమైన గీతను బోధించాడన్నది తరతరాల విశ్వాసం. భగవంతుడు బోధించిన గీత భగవద్గీత. అందువల్ల మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి.


ఏకాదశి ముందు రోజు ఏకభుక్తం చేసి ఏకాదశి నాడు శక్తి కొలది ఉపవసించాలి. ఆ రోజు షోడశోపచారాలతో నారాయణుని అర్చించాలి. ద్వాదశినాడు తిరిగి పూజించి అన్నాదికాలు నివేదించి పారణచేయాలి.


ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని!
భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత!!


 అని మంత్రము ఉచ్చరించి పుష్పాంజలిని దేవునికి సమర్పించాలి.

No comments:

Post a Comment