Wednesday, 20 February 2019

పుష్కరాంశ ప్రాముఖ్యత



"పుష్కరాంశ" ఈ పదం ప్రతి హిందూ ఆలయ,విగ్రహ,వివాహ అహ్వాన పత్రిక యందు ,అన్ని శుభ ముహూర్తాలయందు ఉంటుంది.

ఉదా:-స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర నిజ జ్యేష్ట నవమీ గురువారం హస్తా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరాంశ యందు అనగా 23-6-1988నస్వామి వారల పునః ప్రతిస్టా మహోత్సవం.

ముహూర్త దర్పణం,విద్యమాధవీయం,కాలామృతం అను జ్యోతిష్య ముహూర్త గ్రంధాలలో పుష్కరాంశ ప్రస్తావన కలదు.పుష్కరాంశ అనగా పవిత్రత అని అర్ధం.పుష్కరాంశ శుభత్వాన్ని సూచిస్తుంది. పుష్కరాంశ అనగా ఒక రాశిలో 1 నవాంశ అనగా 3° 20¹ నిడివి.

వీటిని ప్రతి రాశిలోని పుష్కరాంశ భాగాలు లేక డిగ్రీలు అంటారు.గ్రహం పుష్కర భాగాలలో వచ్చినప్పుడు అది పుష్కర భాగం అంటారు.

ఒకొక్క రాశిలో తొమ్మిది నవాంశలు ఉంటాయి.శుభగ్రహ ఆధిపత్య అంశలు వున్న సమయాన్ని ‘పుష్కరాంశ’ అంటారు. ముహూర్తం కూడా లగ్నంలో మంచి శుభ గ్రహాల ఆధిపత్యం వున్న నవాంశలో నడిచే సమయమునకే ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్కో లగ్నంలో తొమ్మిది నవాంశలు ఉంటాయి. అందులో శుభ గ్రహాల ఆధిపత్యం ఉన్న నవాంశల కాలంతో కూడిన లగ్నము సుముహూర్తంగా పరిగణిస్తారు.

ఏకవంశతి దోషాలలో ‘కునవాంశ’ అని ఒక దోషం చెప్పారు. అంటే మనం పెట్టే ముహూర్త లగ్నం కాలంలో పాప గ్రహాధిపత్యం ఉన్న నవాంశ కాలమును పరిధిలోకి తీసుకోవద్దు అని. లగ్న వ్యవధి సుమారు 2 గంటల కాలం ఉంటుంది. అందులో ఏ సమయం మంచిది అని నిర్ణయం కోసం ఈ సిద్ధాంతం వచ్చింది. ‘కునవాంశ’ పాపగ్రహ నవాంశలు వదిలి అదే లగ్నంలో శుభగ్రహ నవాంశలతో ముహూర్తాలు చేస్తారు.

‘అజవృషభ ధను కన్య కాడౌ భుజంగ - మేష మకర కుళీరే వృశ్చికాంతే చరాయః’ మిథున ఘట తులానాం సింహ మధ్యే తుఘృధ్ర - సకలము నిమతం స్సాత్ సర్వకార్యేషు వర్జ్యం’ మేష వృషభ కన్య ధనస్సులకు మోదటి నవాంశ ‘భుజంగ’ అనే దోషమును, మీన మకర కర్కాటక వృశ్చిక లగ్నములలో చివరి నవాంశ రాహు అనే దోషమును, మిథున, కుంభ, తులా, సింహములకు అయిదవ నవాంశ ‘ఘృధ్ర’ అనే దోషము సూచించును. కావున ఆయా నవాంశలు విడనాడి మిగిలిన నవాంశములలో ముహూర్తం చేయమని చెప్పారు.

మేషంలో 21° భరణి నక్షత్రం 3వపాదం పుష్కరభాగం అవుతుంది.
వృషభంలో 14° రోహిణి నక్షత్రం 2వపాదం పుష్కరభాగం అవుతుంది.
మిధునంలో 24°పునర్వసు నక్షత్రం 2వపాదం పుష్కరభాగం అవుతుంది.
కర్కాటకంలో 7° పుష్యమి నక్షత్రం 2వపాదం పుష్కరభాగం అవుతుంది.
సింహరాశిలో 21° పుబ్బ నక్షత్రం 3వపాదం పుష్కరభాగం అవుతుంది.
కన్యారాశిలో 14° హస్త నక్షత్రం 2వపాదం పుష్కరభాగం అవుతుంది.
తులారాశిలో 24°విశాఖ నక్షత్రం 2వపాదం పుష్కరభాగం అవుతుంది.
వృశ్చికరాశిలో 7° అనురాధా నక్షత్రం 2వపాదం పుష్కరభాగం అవుతుంది.
దనస్సురాశిలో 21° పూర్వాషాడ నక్షత్రం 3వపాదం పుష్కరభాగం అవుతుంది.
మకరరాశిలో 14° శ్రావణా నక్షత్రం 2వపాదం పుష్కరభాగం అవుతుంది.
కుంభరాశిలో 24° పూర్వాభాద్ర నక్షత్రం 2వపాదం పుష్కరభాగం అవుతుంది.
మీనరాశిలో 7° ఉత్తరాభాద్ర నక్షత్రం 2వపాదం పుష్కరభాగం అవుతుంది.

ప్రతి రాశిలోను 2 పుష్కరాంశలు చొప్పున 12 రాశులలోను మొత్తం 24 పుష్కరాంశలు ఉంటాయి.వీటిలో 3 పుష్కరాంశలు వర్గోత్తమాంశలు ఉన్నాయి.

ధనస్సు రాశిలో 9 వ నవాంశ వర్గోత్తమాంశ ,వృషభ రాశిలో 5 వ నవాంశ వర్గోత్తమాంశ,కర్కాటక రాశిలో 1 వ నవాంశ వర్గోత్తమాంశ అవుతుంది.ఈ మూడు వర్గోత్తమాంశలలో ముహూర్తాలు చాలా మంచివి.

జాతకచక్రంలో లగ్నం ఈ పుష్కర భాగాలలో ఉన్నప్పుడు వ్యక్తి పవిత్రంగా, నైపుణ్యంగా, చొరవ కలిగి ఉంటారు.ముహూర్త లగ్నంలో బావ సంబంద గ్రహం పుష్కరభాగంలో ఉన్నప్పుడు అది మంచి పవిత్రమైన లగ్నంగా భావిస్తారు.ఉదా:-వివాహ బావ కారకుడు శుక్రుడు ముహూర్త లగ్నంలో పుష్కర భాగాలలో ఉండుట.

గోచారంలోను గ్రహం పాప స్థానాలైన పుష్కర భాగాలలోకి వచ్చినప్పుడు ఆ గ్రహం మంచి ఫలితాలను ఇస్తుంది.మహాదశ ,అంతర్దశలలోను పుష్కర భాగంలో ఉండే గ్రహం శుభ పలితాలనే ఇస్తుంది.ఆదిపత్య పాపులైనా సరే పుష్కర భాగాలలో ఉన్న గ్రహం శుభ పలితాన్నే ఇస్తుంది.రాశి చక్రం లగ్నం,నవాంశ లగ్నం అశుభ షష్టాష్టకాలు కారాదు.                 

No comments:

Post a Comment