Friday, 22 February 2019

మాఘ పురాణం 15వ అధ్యాయము



శిష్యుడు పశ్చాత్తాపము పొందుట

సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానమువలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగా తిరిగి నీలకంఠుని పార్వతీ దెవి ఇట్లు ప్రశ్నించెను.
“నాధా! సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగ తెలియజేసితిరి. మరి సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడేమైనాడు? అతడే స్థితిలో నున్నాడు? వివరింపుడు. వినకుతుహలముగానున్నది” అని సాంబశివుని కోరినది. అందులకా పార్వతీపతి యిట్లు వివరించెను. 
“సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగక్రీడలు దేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను. తానూ చేసిన పాపమునకు ఫలితమనుభవించుచుంటిని గదా యని పశ్చాత్తాప మనస్కుడై గురువు గారి వద్దకు పోయి గురువు పాదములపై పడి “గురువర్యా! నేను మహా పాపినైతిని. క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోబడిపోయి నీకుమార్తెయగు సుశీలతో కూడితిని. అయినను అది నాదోషము కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని. దారియందున్న ఉద్యానవనంలో నీకుమార్తె చెలికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవుట చూచి నెమ్మదిగా నావెంట వచ్చినది. నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టుక్రింద విశ్రమించగా నీకుమార్తె మెల్లమెల్లగా నాచెంత జేరి నన్ను మంచిమాటలతో వంచించి తన కామ వాంఛ తెలియజేసినది. నేనందులకు ఒప్పుకొనలేదు. నన్ను బలవంత పెట్టినది. నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభం లేదని “నాతొ నీవు క్రీడించకుందువేని నీ ఎదుటనే ప్రాణత్యాగ మొనరించుకొందును” అని చెప్పుసరికి నాకు భయము కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించెదరని వెరచి ఆమెతో క్రీడించి, ఆమె వాంఛను తీర్చితిని. ఇందు ణా తప్పేమీ లేదు. ఐనను నేను మహాపాప మనుభవించుచున్నాను. నేను కూడా పాపరహితుడ నెటులకాగలనో సెలవిండ”ని బ్రతిమాలెను.
శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వశించి, తన కుమార్తె వలె తన శిష్యుని గూడ పాపరహితుని జేయనెంచి సుమిత్రా! నీపాప కర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నీవును మావలె పాపరహితుడవు కాగలవు. అదెటులనిన నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అచట పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకొనుము. ఆ తపస్సుచే కలుగు ఫలితము వలన పాపము మబ్బు విడిపోయినటుల నశించిపోవును. అప్పుడు నీవు ముక్తుడగుదువు అని శిష్యునితో జెప్పెను.
“ధన్యోస్మి ధన్యోస్మి” మీయాజ్ఞ ప్రకారము నేనిప్పుడే ప్రయాణ సన్నద్ధుడనగుచున్నాను” అని గురువర్యులకు దండ ప్రమాణములాచరించి గంగానదీ తీరమునకు బయలుదేరెను.అటుల ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, సెలయేళ్ళు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెడలెను. అచట మనోహరమైన ఆహ్లాద మొనరించు దృశ్యములు కనిపించినవి. కౄరమృగములు సాధుజంతువులు కలసిమెలసి తిరుగుచున్నవి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి. పరస్పర వైరుధ్యములు ఏ మాత్రము కనిపించలేదు. అచట ప్రకృతి రమణీయత మనస్సునకానంద మొనరించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొందమని ఒక వటవృక్షము క్రింద విశ్రమించి నలుదిశల పరికించి చూడగా ఒక ఆశ్రమము కనిపించినది.
వెంటనే లేచి ఆయాశ్రమం వద్దకు వచ్చి తొంగిచూడగా ఆయాశ్రమములో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయాంబరములు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూపదీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనం చేయుచుండిరి. మధ్యమధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి “హరిహరీ”యని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి. ఆ దృశ్యమంతటినీ సుమిత్రుడు కనులార గాంచెను. పూజ పూర్తయిన తరువాత ప్రసాదం అందరూ సేవించిరి. బైట కూర్చుని వున్న సుబుద్ధికి కూడా ప్రసాదమివ్వగా “స్వామీ! మీరాచరించిన వ్రతమెట్టిది? దీనివలన ఫలితమేమి కలుగును? మనుజుడు పాపరహితుడగునా? ఈ నా సందియములను తీర్పవేడుచున్నాను” అని వినయవిగా ఆ మునిసత్తముల నడిగెను.
పాపములచే పీడింపబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అచ్చటనున్న మనుజులందరూ మాఘమాసమందాచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకు గాను వారిలో నొకరిని నియమించిరి. అంత ణా మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహాత్మ్యమును ఇట్లు వివరించెను. “విద్యార్థీ! మేము చేసినది మాఘమాసమందాచరించవలసిన మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయుటవలన ఎటువంటి పాపములు చేసిననూ, వాటినన్నింటినీ నశింపచేయును. అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికిన్నీ ఈ వ్రతము చేసినంత మాత్రమున అవియన్నియు పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా, పాపము లన్నియు నశించిపోవుట, మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో వుండగా ఆదినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు ఏమనుజుడు స్నానం చేయునో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీస్నాన మొనర్చువారు వైకుంఠ వాసులగుదురు. అలాగున చేయనివాడు, అసత్యంలాడువాడు, పెద్దలను, గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరత్వము చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు. అటులనే ఇండ్లు తగులబెట్టుట, అబద్ధ సాక్ష్యములు చెప్పుట, జన సమర్ధముండు చోట మలమూత్రములను విడచుట, గుర్రములను పశువులను కన్యలను ఇతరులకమ్ముట, మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసినవారితో సమానం. మరియు దైవసంబంధమగు ధనమును అపహరించు వాడు, ఏ పుణ్య దినములలోనైన శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించనివాడు, దానమిచ్చెదనని వాగ్దానము చేసి ఇవ్వనివాడు, బంగారము వెండి రత్నములు సాలగ్రామములు దొంగిలించు వాడును, జాతి భ్రష్టులై జార చోరత్వములు చేసి వేశ్యయింటికి తిరుగువాడు,వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసినవారితో సమానులగుదురు. ఇవిగాక అన్నభార్యను సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతి సల్పువాడును, తనకన్న వయసులో పెద్దయగు స్త్రీతో రతి సల్పువాడును, జీవహింసలు చేయువాడును, బీదప్రజలను హింసించువాడును, దోపిడీలు చేయువాడును మహాపాతకులు. అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసినవారితో సమానుడు. ఇవిగాక తల్లిదండ్రులను హింసించు వాడును, వివాహ సంబంధములు చెడగొట్టు వాడును, నోరులేని పసిపాపల దొంగిలించి ఇతరులకు అమ్మువాడును, శరణు జొచ్చిన వానిని దండించు వాడును, ధర్మ కార్యములకు విఘ్నములు కలిగించు వాడును, పరధనం అపహరించు వాడును, చేసిన మేలు మరచిన కృతఘ్నుడును తానూ తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని జూచి ఎగతాళి చేయువాడును బ్రహ్మహత్య చేసిన వానితో సమానుడగును.
గాన మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం. ఈ వ్రతం చేయుట వలన మాకు ఏ మాత్రమూ పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి వున్ననూ అవి నశించిపోవును. ఇది ముమ్మాటికీ నిజం. అందుచేతనే మేమందరం మాఘమాసవ్రతం భక్తిశ్రద్ధలతో ఆచరించుచున్నాము. మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికిపోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి, నీళ్ళు విడువవలెను. తరువాత విష్ణుమందిరమునకు పోయి శ్రీహరికి పూజచేసి తులసితీర్థము ప్రసాదం పుచ్చుకోవలెను. ఆవిధంగా మాసాంతము వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధయాగము చేసినంత ఫలితం కలుగును. మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత. గాన యీ మాసమందు ఆచరించిన స్నానం వలన కల్గు ఫలము నిచ్చువాడు అతడే గనుక ఆ వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలెను. శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీతీరమునందు గానీ, చెరువు దగ్గరగానీ విష్ణుమందిరము లేకపోయినచో విష్ణు మూర్తి విగ్రహమును గాని విష్ణు పటమును గాని తీసుకువెళ్ళి నదీతీరమందు తులసీదళంతోను కస్తూరి గంధం, అగరు ధూపదీప నైవేద్యం, ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణము గావించవలయును.
ఈవిధముగా మాఘమాసమంతా చేసి మాసాన్తమున ఒక సద్బ్రాహ్మణునకు వస్త్రములు, బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండివంటలతో భోజనము పెట్టాలి. ధనమున్న వారు బ్రాహ్మణ సమారాధన చేసినయెడల ముక్కోటి దేవతలు సంతసించుటే గాక యముడు తన దూతలను పంపజాలదు. పునర్జన్మ కలుగదు. ఈ ణా వచనముల్ అసత్యములు కావు. ఇప్పటివరకూ మాఘస్నాన ఫలితమంతయు విన్నావు గదా! ఇక మాఘమాసం మూడు దినాలు మాత్రమే వున్నది. గాన ఈ మూడు దినములలోను ఈ నదిలో స్నానము చేసి పూజా కార్యక్రమమునకు సంసిద్ధుడవు కమ్ము” అని మునీశ్వరుడు తెలియజేసెను. 
అంత సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి తన పాపపరిహార్ధము గంగానదీ తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు. అని మునీశ్వరునితో చెప్పగా – మరల ఆ ముని యిట్లు చెప్పినాడు.
“నీ గురువు చెప్పిన విషయం యదార్థము నీ గురువు పుత్రికతో గూడి రతి సల్పినావు. అందు నీదోషమేమియు లేకున్ననూ మహాపాపము మాత్రము సంక్రమించినది. అది నిన్ను వెంటాడుచునే యున్నది. తరుణోపాయము చేయనిచో ఈజన్మలోను మరుజన్మలోను కూడా నరకబాధలు తప్పవు. గాన ఆమాఘమాసమందలి మూదిదినములయినను స్నానముచేసి, శ్రీహరిని పూజించుము. తరువాత నీవు గంగా తీరమునకుపోయి నీ గురువు చెప్పినవిధంగా భక్తితో తపస్సు చేసినయెడల నీవు జన్మ రాహిత్యమును పొందగలవు. మానవుని మనస్సు వార్ధము, చంచల భావము గలది. నీవు ఇంద్రియాలన్నింటిని బంధించి ఏకాగ్ర చిత్తముతో లక్ష్మీ నారాయణుని ధ్యానించుము” అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడి దినములుండి మాఘస్నానములు చేసి నదీతీరమందు విష్ణువును పూజించి పురాణ పఠనమును గావించెను. తదనంతరము ఆ ఆశ్రమ వాసులకు నమస్కరించి గంగా నదీ తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయెను.

No comments:

Post a Comment