Monday, 4 February 2019

మాఘ మాసం విశేషం


మాఘమాసం వస్తూనే శుభాలని,శుభకార్యాలని వెంటతెచ్చుకుని వస్తుంది.
ఈ పేరు వినగానే *మామిడితోరణాలు,పచ్చని పందిర్లు,పెళ్ళిళ్ళు మాత్రమే కాదు,చన్నీటి స్నానాలు,భీష్మ ఏకాదశి,శివరాత్రి జాగారాలు* కూడా గుర్తొస్తాయి.
సామాజిక, ఆధ్యాత్మిక శోభలను ఏకకాలంలో మన కళ్ళ ముందు ఉంచే మాఘమాసాన్ని ఆనందంగా ఆహ్వానించ్చేద్దాం.
ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాఘమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఒక్కసారైనా సముద్ర స్నానం చేసినా లేదా నదీ స్నానం చేసినా పాపాల నుండి విముక్తి పొంది మరణానంతరం మోక్షాన్ని పొందుతారని పురాణాలు మనకు చెపుతున్నాయి.
ఈ మాసంలో *ప్రయాగలో* ఉన్న గంగా నదిలో వేకువజామునే నిండా మునిగి స్నానం చేస్తే ఇక పునర్జన్మ ఉండదనేది కూడా ఒక నమ్మకం.
ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మహామాఘం అంటారు. నెలలో అన్ని రోజులు సూర్యోదయానికి ముందు స్నానం చెయ్యటానికి వీలుకుదరని వారు పౌర్ణమి నాడైనా తప్పక స్నానం చెయ్యాలంటారు.
ఏ మాసంలోనైనా కొద్ది రోజలకే ప్రాధాన్యత ఉంటుంది. కాని మాఘమాసంలో ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉందనే చెప్పాలి.
*తిల చతుర్థి:*
మాఘ శుద్ధ చతుర్థిని కుండ చతుర్థి అని అంటారు. దీనికే తిల చతుర్థి అని కూడా పేరు. తిల అంటే నువ్వులు కదా! ఈ రోజు తప్పకుండా నువ్వులు తింటారు చాలామంది. నువ్వుల ఉండలను పంచిపెడతారు. నువ్వులను దానం ఇచ్చినా కూడా మంచిదట.
*శ్రీ పంచమి:*
మాఘ శుద్ధ పంచమి అంటే శ్రీ పంచమి లేదా వసంత పంచమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పంచమి నాడే చదువుల తల్లి సరస్వతిదేవి జన్మించిందట. అందుకే ఈ రోజున అక్షరాభ్యాసం చేసిన పిల్లలకి చదువులో తిరుగులేదని అంటారు మన పెద్దవాళ్ళు.
*రథసప్తమి:*
మనకి ప్రత్యక్ష దైవమై రోజు దర్శనమిచ్చే సూర్యభగవానుడు తన రథాన్ని ఎక్కి పయనం ప్రారంభించిన రోజే ఈ రథసప్తమి.
చాలా మంది చిక్కుడు కాయలతో రథాన్ని చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి,చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యుడికి నైవేద్యంగా పెడతారు. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని ఓ నమ్మకం.
*భీష్మ ఏకాదశి:*
అంపశయ్యపై ఉన్న భీష్ముడికి తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరం ఉన్నందువల్ల మాఘ శుద్ధ ఏకాదశి రోజు తనువు చాలించాడు. అలా మరణించే ముందు కృష్ణుడిని స్తుతిస్తూ చేసిన పారాయణే ఈ విష్ణు సహస్ర నామ పారాయణ.
ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం విష్ణు సహస్రనామస్తోత్రం పారాయణ చేస్తే పుణ్యం లభిస్తుందని ప్రతీతి.
*బహుళ ఏకాదశి:*
దీనినే విజయ ఏకాదశి అని కూడా అంటారు. లంకను చేరటానికి శ్రీరామ చంద్రుడు సేతు నిర్మాణం పూర్తి చేసిన రోజు ఈ రోజేనట. అందుకే ఈ రోజు ఎవరు ఏ పని మొదలుపెట్టినా తప్పక విజయం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.
*మహా శివరాత్రి:*
హాలాహలం సేవించిన శివుని కోసం నిద్రాహారాలు మాని భక్తులందరూ తపించిన రోజు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి పుణ్యం సంపాదించుకునే భక్తులకి ఇదొక గొప్ప పర్వదినం.
ఇలా నెలలో ప్రతీ రోజుకి ఒక ప్రత్యేకతని సంతరించుకున్న మాఘ మాసానికి స్వాగతం పలుకుదాం.

No comments:

Post a Comment