Saturday 15 December 2018

ధనుర్మాసం - ధనుర్మాస వ్రతం ఎలా చేయాలి? ఫలితాలు ఏమిటి?


కార్తీకమాసం శివన్నామ స్మర ణతో ఓలలాడిన మనందరి లోని ఆధ్యాత్మిక భావాలను మరోసారి తట్టిలేపేందుకు ధనుర్మాసం వచ్చేస్తోంది. కార్తీకమాసం పరమేశ్వరునికి ఇష్టమైన మాసం కాగా, దనుర్మాసం శ్రీమహా విష్ణువును కొలిచి తరించేమాసం.
ఈ మార్గశిర శుద్ధ త్రయోదశితో అంటే డిసెంబరు 16 నుండి ధనుర్మాసం ప్రారంభం అవుతోంది. సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించే శుభముహూర్తమే ధనుర్మాసారంభం కూడా. డిసెంబరు 16వ తేదీన సాయంత్రం 5.29 గంటలకు ధనుస్సంక్రమణం ప్రవేశిస్తుంది. ఈ సందర్భంగా ధనుస్సంక్రమణ విశేషాలు, ధనుర్మాస ప్రాధాన్యతను తెలుసుకుందాం.
ధనుస్సంక్రమణం
సూర్యుడు ఆయా రాశుల్లోకి ప్రవేశించే సమయాన్ని సంక్రమణం అంటారు. సూర్యుడు ఒక్కో రాశిలో నెలరోజులు ఉంటాడు. అలా మనకు ఒక ఏడాదిలో 12 సంక్రాంతులు వస్తాయి. భూభ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి, భూమి యొక్క అక్షాంశ, రేఖాంశలను బట్టి, భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని అనుసరించి ఈ సంక్రమణ నిర్ణయం జరుగుతుంది. ఈ విధంగా సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది.
ధనుర్మాసం శ్రీమహావిష్ణువు ఆరాధనకు అత్యంత విశేషమైన మాసం. అన్ని పండుగలు చాంద్రమానం ప్రకారం చేసుకున్నా, ధనుర్మాసాన్ని మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. ధనుర్మాసం అనగానే గుర్తుకు వచ్చేది తిరుప్పావై, ఆండాళ్‌ అమ్మవారు, రంగవల్లులు, గొబ్బెమ్మలు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది.
ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. గోదాదేవి (అండాళ్‌) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం చాలా మంచిది. సూర్యాలయాలు, వైష్ణ వాలయాలు సందర్శించడం శుభప్రదం.
ఎంతో పవిత్రమైన మాసం
ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం, తెలుగు సంస్కృతిలో ఒక ప్రధాన భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు.
తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇతర విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని బాలభోగం అని పిలుస్తారు.
_*తిరుప్పావై పారాయణం*_
ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్రప్రవచనం. సాక్షాత్‌ భూదేవి అవతార మూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో ‘తిరు’ అనగా పవిత్రమైన, ‘పావై’ అనగా వ్రతం లేదా ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వీకులు చెబుతారు.
ఉపనిషత్తులే గోదాదేవి నోట సులభరీతిలో వెలువడి నాయనీ, తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలనీ చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దధ్యోదనం అర్పించాలి. పెళ్లీడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి ‘మార్గళి’ వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.
_*ఆండాళ్‌ అమ్మవారి కధ*_
ఆండాళ్‌ అమ్మవారు ఈ మాసంలో శ్రీ కృష్ణుడి గురించి వ్రతం చేసి ఆయన్ను చేరుకున్నారు. కలియుగం ఆదిలో అనగా 93వ సంవత్సరంలో శ్రీఆండాళ్‌ అమ్మవారు తమిళనాట శ్రీవిల్లిపుత్తూర్‌ లోని వటపత్రశాయి మందిర తులసి వనంలో విష్ణుచిత్తులవారికి (పెరియాళ్వార్) లభించారు. తమిళంలో ‘కోదై’ అనగా తులసిమాల అని అర్థం. తండ్రి ఆమెను ‘కోదా’ అని పిలిచేవారు. క్రమేపి ఆపేరే గోదాగా మారింది. తండ్రిపెంపకంలో ఆమెకు కృష్ణ పరమాత్మ పట్ల గొప్ప భక్తి అలవడింది.
కాలక్రమంలో ఆమె శ్రీకృష్ణుడినే తన పతిగా భావించింది. ఆమె తండ్రి శ్రీకృష్ణుడికి నిత్యం తులసి మాలలు సమర్పించేవారు. గోదాదేవి విష్ణుచిత్తులవారికి తెలియకుండా ఆ మాలలు తాను ధరించి, తాను భగవంతుని వివాహమాడటానికి సరిపోదునా అని చూసుకుని, మురిసిపోయి, తన తండ్రికి తెలియకుండా ఆ మాలలను యధావిధిగా బుట్టలో ఉంచేదట. ఒకనాడు తండ్రికి మాలలో వెంట్రుక కనిపించగా, అది గోదా ధరించిందని గ్రహించి, ఒకరు ధరించిన మాలను స్వామికి సమర్పించడం తప్పని సమర్పించలేదు.
ఆ రాత్రి స్వామి స్వప్నంలో కనిపించి, తనకు గోదా ధరించిన మాల అంటే ఇష్టం అని, అది ఎందుకు సమర్పించలేదని ప్రశ్నిస్తాడు. ఆ సంఘటనతో గోదాదేవి కారణజన్మురాలని అర్ధం చేసుకుని, మమ్మల్ని కాపాడుటకు వచ్చావని, ఆమెను ఆండాళ్‌ అని పిలవటం మొదలుపెట్టారు విష్ణుచిత్తుడు. అప్పటినుంచే రోజు ఆండాళ్‌ సమర్పించిన మాలనే స్వామికి సమర్పించేవారు.
గోదాదేవికి పెళ్ళి వయసు రాగానే తండ్రి వరుని వెదకటానికి సిద్ధమవ్వగా, ఆమె శ్రీకృష్ణుని మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్తుంది. కాని తండ్రి శ్రీకృష్ణుడు ఉండేది ద్వాపరలో నందగోకులమనే ప్రాంతము అని, అది చాలదూరము, కాలము కూడా వేరని, ఇప్పుడు శ్రీకృష్ణుని కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చని చెప్తారు.
విష్ణుచిత్తులవారు వివిధ దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల వైభవాన్ని కీర్తించగా, గోదాదేవి శ్రీరంగంలో ఉన్న రంగనాయకులని తనకు వరునిగా తలచింది. శ్రీరంగనాథుని వివాహమాడుటకై తాను ”తిరుప్పావై” మరియు ”నాచియార్‌ తిరుమొ” అనే దివ్యప్రబంధాలను పాడారు. ఆ తర్వాత ఆమె శ్రీ రంగనాధుని వివాహమాడి, ఆయనలో ఐక్యమైంది. ఆండాళ్‌ అమ్మవారు చేసిన ఆ గానాన్ని ఈ ధనుర్మాసం నెల రోజులు వైష్ణవదేవాలయాల్లో సుప్రభాతానికి బదులుగా గానం చేస్తారు. శైవాలయాల్లో ఇదేె సమయంలో తిరువెంబావైని గానం చేస్తారు.
తులసిమాల ఎంతో పవిత్రం
శ్రీకృష్ణునికి ధనుర్మాసం నెలరోజులూ తులసీమాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలను కునేవారు శక్తిమేరకు విష్ణు ప్రతిమని తయారుచేయించి, పూజా గృహంలో ప్రతిష్టించుకోవాలి.
ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి, స్నానాదికాలు ముగించాలి. పంచా మృతాలతో శ్రీమహా విష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణు కథలను చదవటం, తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులూ చెయ్యలేనివారు పదిహేను రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి, ఆశీస్సులు అందుకోవాలి.
శ్లో. మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రదా
తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా:
_*ధనుర్మాస వ్రత ఫలితం*_
ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం అంటారు పెద్దలు. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ, నిరూపించిన ఆరాధనా తపస్విని గోదాదేవి. ఆమె పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి, తిరుప్పావై గాన, శ్రవణం చేసిన వారికీ ఆయు రారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదం కాగలదనీ ఆశిద్దాం.
_*ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలు*_
ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం, పాయసం, దధ్యోదనం సమర్పించాలి. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసరపప్పులలో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.
_*ఆడపిల్లలకు మేలు జరుగుతుంది*_
వివాహం కాని, మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుని కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక శ్రీరంగనాధునే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది.
అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment