Wednesday, 26 December 2018

కళ్యాణ చిలక


తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ పురాణప్రసిధ్ధికెక్కిన పట్టణం. కానీ, ఒకానొకప్పుడు దట్టమైన అడవి. విశాలమైన పెద్దపెద్ద మఱ్ఱి చెట్లతో నిండివుండేది. అలాటి అరణ్యప్రాంతానికి చెందిన 'విల్లి' ఒక కోయదొర. అతడు వేటకోసం తిరుగాడుతున్న సమయంలో ఒక ముళ్ళ పొదలో శ్రీమహావిష్ణువు యొక్క శిలాప్రతిమను, ఆ పక్కనే ఒక ధనపాతరను చూసి వాటిని బయటకు తీశాడు. అదే స్థలంలో శ్రీమహావిష్ణువు కు దొరికిన నిధితో ఆలయాన్ని నిర్మించి ఆలయంలో ఆప్రతిమను ప్రతిష్టించాడు. అలాగే, ఆలయం చుట్టూ ఉన్న అడవిని నిర్మూలించి ఒక నగరాన్ని నిర్మించాడు. అదే నేటి శ్రీవిల్లిపుత్తూర్. ఆ వైష్ణవాలయంలో స్వామివారి సేవచేసుకునే పెరియాళ్వారుకు తులసివనంలో దొరికిన శిశువే ఆండాళ్ లేదా గోదాదేవి. గొప్ప విష్ణుభక్తురాలు. కవయిత్రి. స్త్రీ జనోధ్ధారణ కోసం నడుంకట్టిన ప్రధమ మహిళగా కీర్తిపొందినది. ఆలయంలోని శ్రీమహావిష్ణువు నే వరించి కళ్యాణం చేసుకున్న అనన్యసామాన్య భక్తురాలు. స్వామి వారి మీద అనేక స్తోత్రాలను రచించింది. వాటిని తమిళంలో ' పాశురం' అని అంటారు. నేటికీ ప్రసిధ్ధి పొందిన అన్ని వైష్ణవాలయాలలో ఆండాళ్ పాశురాలతోనే శ్రీమహావిష్ణువు ను అర్చించి సేవించుకుంటారు.
అటువంటి ప్రసిధ్ధిపొందిన ఆండాళ్ నాచియార్ ఆలయంలో మార్గశిరమాసం వైకుంఠ ఏకాదశి నుండి జరిగే మహోత్సవాలలో భాగంగా శ్రీ ఆండాళ్ అమ్మవారు తన భర్తతో కలసి తమ పుట్టింటివారైన భట్టర్ గృహానికి విచ్చేస్తుంది. ఈ భట్టర్లు ఆండాళ్ ను పెంచి పెద్దచేసిన పెరియాళ్వారు వంశస్తులు. వారు ఆలయంలోనుండి విచ్చేసిన దైవ దంపతులను సాదరంగా ఆహ్వానించి తమ యింట ఘనమైన విందును ఏర్పాటు చేస్తారు. ఆండాళ్, శ్రీ రంగమన్నారులకు విందులో భాగంగా ముందు బెల్లపుపాక శనగపప్పు వుండలు, జున్నుపాలు సమర్పిస్తారు. తమ యింటి అరుగులమీద
గుమ్మడి, పనస నుండి ఉసిరి, నిమ్మ వరకు గల కూరగాయలు , చెరకు, వివిధరకాల ఫలాలు ను తమ యింటి సారెగా పరచిపెడతారు. ఈ ఆచారాన్ని తమిళంలో ' పచ్చైపరప్పు' అని అంటారు. ఈ సందర్భంలో ఆండాళ్ చేత మార్గశిరమాస నోము పట్టిస్తారు. దీనిని 'తైలకాప్పు' అనే ఉత్సవంగా జరుపుతారు. మంచినూనె, ఉసిరికాయ, కొబ్బరినీరు, మొ.వాటిలో ఆరు రకాల మూలికలు వేసి నలభైరోజులు కాచి వడబోసి తయారుచేసిన తైలాన్ని ఆండాళ్ నాచ్చియారుకు సమర్పిస్తారు. ఈ తైలాన్ని భక్తులకు పంచిపెడతారు.
ఈ ఉత్సవసమయంలో ప్రతీ రాత్రి శ్రీ ఆండాళ్, శ్రీ రంగమన్నారులకు వడ, పుట్టు, వెన్నపొంగలి, అప్పం, చెక్కెరపొంగలి, పాలు నివేదన చేస్తారు.
ఈ మార్గశిర మాస మహోత్సవంలోని ప్రధాన ఆకర్షణ శ్రీ ఆండాళ్ అమ్మవారి ఎడమచేతిలోని చిలక. నిత్యం ఒక నూతన చిలకతో అమ్మవారి దర్శనం జరుగుతుంది. ఈ చిలకను కళ్యాణ కిళి గా స్తుతిస్తారు. దేవర్షియైన శుకబ్రహ్మే ఆండాళ్, రంగమన్నారుల మధ్య రాయభారాలు నడిపి వారి వివాహానికి తోడ్పాటును యిచ్చింది.
శుకబ్రహ్మ చేసిన సహాయానికి ప్రత్యుపకారంగా వరం కోరుకోమని ఆండాళ్ అడిగితే తాను సదా ఆండాళ్ అమ్మవారి సాన్నిధ్యంలోనే ,అమ్మవారి హస్తాలలోనే వుండేలా అనుగ్రహించమని కోరుకోవడం వలన ఆ చిలకకు అమ్మవారి చేతిలో వుంటూ అందరికి ప్రత్యేకంగా కనిపిస్తూంటుంది. ఆండాళ్, శ్రీరంగమన్నార్ ల వివాహానికి కారణభూతురాలైన యీ దైవీక చిలకను కళ్యాణ కిళి ( కళ్యాణ చిలక) గా అభివర్ణిస్తారు.

No comments:

Post a Comment