Saturday 3 November 2018

ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చేయాలి?


తమోహరం... సంపత్ప్రదం!
దీపారాధన సనాతన భారతీయ సంస్కృతిలో ప్రధానమైనది. దీపం ప్రాధాన్యాన్ని ఋగ్వేదం ఎంతో గొప్పగా నిర్వచించింది. సృష్టి, స్థితి, లయాలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు, ఎర్ర రంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు. అందుకే-
‘‘దీపం పరంజ్యోతి కళాది నమో నమో
దీప మంగళ జ్యోతి నమో నమో’’
‘పరంజ్యోతి అయిన దీపానికి నమస్కారం. శుభాలను ఇచ్చే దీపానికి నమస్కారం’ అని ప్రార్థిస్తాం.
‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే
ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్‌’’ అన్నారు పూర్వ ఋషులు. అంటే ‘ప్రబోధం’ అనే ప్రమిదలో, ‘వైరాగ్యం’ అనే తైలం పోసి, ‘భక్తి’ అనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు.
నర(క) స్వభావం నశించి నారాయణత్వం
దీపావళికి సంబంధించిన కథలు చాలా ఉన్నాయి. ప్రధానంగా నరకుడనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించగా, లోకాలన్నీ ఆనందంతో పండుగ చేసుకున్నాయనీ, ముల్లోకాలనూ చీకట్లలో నింపిన అసురుని మరణంతో తిరిగి వెలుగులను నింపి చీకట్లను తరిమేయాలనే ఉద్దేశంతో ప్రజలంతా దీపాలను వెలిగించి, కాంతిని నింపారనీ ఒక కథనం.
నరకుని సంహారాన్ని లోతుగా పరిశీలిస్తే, అతనిలో నరతత్త్వం ప్రధానంగా కనిపిస్తుంది. ప్రాగ్జ్యోతిషపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని అతను పరిపాలించేవాడు. అది నరకుని మనస్తత్త్వానికి దీటైనది. వెలుగు లేనిది. దుర్మార్గాలకు ఆలవాలమైనది. అరిషడ్వర్గాలనూ ఆసరాగా చేసుకొని, స్వార్థచింతనే పరమావధిగా భావించి అతను చేయని అకృత్యం లేదు. ద్వాపరంలో సత్యభామగా అవతరించిన భూదేవి తన కుమారుడి అకృత్యాలను చూడలేక... నరకుడిని వధించాలని తన పతి అయిన శ్రీకృష్ణుడిని కోరింది. నరక సంహారం జరిగింది.
చీకట్లు తొలగేయి. ప్రాగ్జ్యోతిషపురంలో శ్రీకృష్ణుని కారణంగా ఉదయకాంతులు వెల్లివిరిశాయి. ప్రజలందరూ ఆనంద హేలలో దీపాలను వెలిగించి దీపావళి చేసుకున్నారు. నారాయణుడిని నమ్మితే మనలోని నర(క) స్వభావాలు తొలగి, నారాయణత్వం సిద్ధిస్తుంది. దేహభావం నరకుడైతే, ఆత్మభావన నారాయణుడు. శరీరం తాను కాదనీ, అందులో ఉన్న క్షేత్రజ్ఞుడు (ఆత్మ) తాననీ తెలుసుకున్నప్పుడు పొందే అనుభూతే నరక సంహారం. ఇలా దీప ప్రజ్వలనాన్ని ప్రపంచంలో దాదాపు అన్ని మతాలవారూ సంప్రదాయబద్ధంగా ఆచరిస్తారు. సనాతన భారతీయ సంస్కృతికి సంకేతంగా నిలిచిన దీపారాధన- దీపావళి పర్వంగా ప్రాచుర్యం పొందింది.
లక్ష్మి స్థిరంగా ఉండేది అక్కడే!
ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. ‘పరమాత్మే పరంజ్యోతి’ అని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం. లౌకికంగా చెప్పాలంటే, మన ‘హృదయా’న్ని ప్రమిదగా భావించి, అందులో ‘భకి’్త అనే తైలం పోసి, ‘ప్రేమ’ అనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం.
కళ్ళలో కనిపించే వెలుగు దాని కాంతి. జ్ఞానాన్ని దీపకాంతిగా, అజ్ఞానాన్ని చీకటిగా సంభావించారు. దీపకాంతి బాహ్యంలో చీకట్లను తొలగించడమే కాక, ఆంతర్యంలో ఆధ్యాత్మికతకు బీజం వేస్తుంది. కాబట్టి ప్రతి ఇంటా ఉభయ సంధ్యలలో దీపాలు వెలిగించాలి. దీపకాంతులు విరజిమ్మే ఇంటిలో లక్ష్మిసుస్థిరంగా ఉంటుందనీ, ఆ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయనీ, అశుభాలకు తావు ఉండదనీ శాస్త్రాలు అంటున్నాయి. యజ్ఞరూపమైన దీపారాధనకూ, లక్ష్మీ కృప పొందేందుకూ దీపావళి దోహదకారి అయిన పర్వం. ప్రతి ఇంటి ముంగిట దీపావళి రోజున దీపాల వరుసలు ప్రసరించే వెలుగులు అమవస నిశిని పున్నమి వెన్నెలతో నింపుతాయి. ఎటు చూసినా ఆనంద హేల. ప్రతి ఒక్కరిలో సంతోషాల సంరంభం.
మన పురాణాల్లో... కావ్యాల్లో...
దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేత
ుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని ‘కఠోపనిషత్తు’ కథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన
శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని ‘పద్మపురాణం’ పేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది.
దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుంద’ని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది.
దీపావళిని ‘దీపాన్విక’గా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని ‘దీప దాన మహోత్సవం’ అని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం ‘శారదోత్సవం’గా, నాగానందం గ్రంథంలో ‘దీప ప్రతిపాదనోత్సవం’గా దీపావళిని పేర్కొన్నారు.సంస్కృత కావ్యాల్లోనే కాదు, పాళీ భాషలో కూడా దీపావళి మహోత్సవ ప్రస్తావన ఉంది.
కేవలం హిందువులేకాదు, జైన, బౌద్ధ మతానుయాయులు కూడా దీపావళి పండుగను పాటిస్తారు. క్రైస్తవ, మహమ్మదీయ మతస్థులు వారివారి ఆచార సంప్రదాయాలను అనుసరించి దీపాలను వెలిగించడం జరుగుతుంది..

No comments:

Post a Comment