Monday, 5 November 2018

ధన త్రయోదశి..!! ధన్వంతరి జయంతి..!!



ఈరోజు...
ధన త్రయోదశి..!!
ధన్వంతరి జయంతి..
ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి ధన్వంతరి జయంతి. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి.
దేవదానవులు కలసి పాలకడలిని మధించినపుడు చిట్టచివరగా శ్రీమన్నారాయణుడే అమృతకలశంతో ఆవిర్భవించాడు.
ఇతణ్ణే విష్ణుమూర్తి అబ్జుడని అన్నాడు.
ఆ అబ్జుడే మహావిష్ణువును తనకు యజ్ఞ్భాగాన్నివ్వమని కోరగా ‘‘రెండవ ద్వాపరంలో నీవు శ్రేష్ఠుడిగా పిలువబడుతావు.
అపుడే నిన్ను ఉద్దేశించి యజ్ఞకర్తలు చాతుర్మంత్రాలతో వేలుస్తారు.’’అనే వరాన్ని అనుగ్రహించాడు ఆ విష్ణుమూర్తి.
ఈ అబ్జుడే - పుత్రార్థి అయ దీర్ఘతపుడు చేస్తున్న తపస్సుకు మెచ్చి కొడుకుగా జన్మనెత్తాడు.
అతడే దివోదాసుగా కాశీరాజ్యానికి రాజు అయ్యాడు.
ఈ దివోదాసు భరద్వాజునకు శిష్యునిగా ఆయుర్వేదాన్ని నేర్చుకొన్నాడని బ్రహ్మాండపురాణం ద్వారా మనకు తెలుస్తుంది.
ధన్వంతరి చేతినున్న అమృతకలశంలోని అమృతంతోనే దేవతలు మృత్యుంజయులు అయ్యారు.
ఈ ధన్వంతరిని కొలిచిన వారికి సర్వరోగాలు దూరం అయ్య సంపూర్ణఆయురారోగ్యాలు లభిస్తాయ.
ఆరోగ్యమే మహాభాగ్యము కనుక సర్వులూ ఈ ధన్వంతరి పూజచేయడం సనాతనంగా వస్తోంది.
ఆయుర్వేదాన్ని వృత్తిగా గ్రహించిన వారు ధన్వంతరి జయంతిని వైభవంగా జరుపుతారు.
ప్రపంచంలోని ప్రతి చెట్టులో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది.
ధన్వంతరికి కేరళ రాష్ట్రంలో త్రిశూర్‌వద్ద ఓ ఆలయం ఉంది.
అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామార్చన చేస్తే అన్ని రోగాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం.
ఈ ధన్వంతరినే ఒకచేత్తో అమృతకలశాన్ని,
రెండవ చేతిలో జలగను పట్టుకొని ఉంటాడని ఓ కథనం ప్రచారంలో ఉంది.
ఆశ్వీయుజ బహుళ ద్వాదశిన ఆవిర్భవించిన ధన్వంతరిని స్మరిస్తూ ధన్వంతరి ప్రతిమను గాని,
లేకుంటే విష్ణుమూర్తి పటాన్ని లేక ప్రతిమను పువ్వులతో అలంకరించి తెల్లటి అక్షతలు, తెల్లని పూవులతో స్వామి సహస్రనామావళి, అష్టోత్తర శతనామాలతో పూజచేస్తారు.
ఈ ధన్వంతరికి పాల పాయసాన్ని నివేదన చేసి దాన్ని ముందుగా ఇంట్లో వారు స్వీకరించి తదుపరి తమ చుట్టు పక్కల ఉన్న వారిలో కనీసం ఐదుగురికి పంచుతారు.
ఇలా చేయడం వల్ల ధన్వంతరి ప్రీతి చెందుతాడనే ఐతిహ్యం.
ధన్వంతరిని స్మరించుకొని హరినామస్మరణ చేసినా సకల రోగాలు పటాపంచలవుతాయి.
ఈ ధన్వంతరిని పూజిస్తే ఆయురారోగ్యాలే లభించడమే కాక భవరోగాలు దూరం అవుతాయ.
కనుక ఈ ధన్వంతరిని..
నమామి ధన్వంతరి మాదిదైవం సురాసురైర్వందితపాదపద్మం
లోకేజరారుగ్భయమృత్యునాశనం
దాతారమీశం వివిధౌషధానం
అని ప్రార్థించాలి.
కలియుగంలోనూ పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ, వాతావరణాన్ని కలుషితం చేసే పనులను దూరం చేసుకొంటూ - ఈ ధన్వంతరిని పూజిస్తే అందరికి మంచి ఆరోగ్యం లభిస్తుంది.
ద్వాదశి తరువాత వచ్చే త్రయోదశి కూడా దీపావళి పండుగలో భాగమే.
ఇది గుజరాతీలకు సంవత్సరాది.
దీనినే ధనత్రయోదశి గాను ధన్ తేరాస్‌గాను అంటుంటారు.
ఈరోజు కూడా దీపాలను వెలిగించి లక్ష్మీదేవి పూజను చేస్తారు.
13 సంఖ్య పాశ్చాత్యులకు మంచిది కాదనే అభిప్రాయం ఉన్నా మనం మాత్రం త్రయోదశి తిథి శుభదినంగానే భావిస్తాం.
అన్ని పుణ్యకార్యాలను చేస్తుంటాం.
అలాంటి ఈ రోజున చేసే లక్ష్మీదేవి పూజ సకల శుభాలను కలిగిస్తుంది.
మహారాష్ట్రులు కూడా ఈ ధనత్రయోదశిని ఘనంగా జరుపుకుంటారు.
వర్తకులు ఈ త్రయోదశినాడు పద్దులు చూచుకొని కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభిస్తారు.
ఇల్లంతా దీపతోరణాలతో అలంకరిస్తారు.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!!

No comments:

Post a Comment