మానవ జాతి ఉజ్జీవించటానికి ఆండాళ్ తల్లి
ఉత్తమమైన, పరమ సాత్వికమైన, సర్వ సులభమైన వ్రతాన్ని అందించాలని ఈ లోకంలో అవతరించింది.
భగవంతుడు ఈ లోకంలో ఎన్నో సార్లు అవతరించాడు. మానవ జాతి బాగుపడటానికి ఎన్నో ప్రయత్నాలు
చేసాడు. ఆయన చేసిన ఉపదేశాల్లో కర్మాచరణ చేయాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, భక్తిని పెంపోందించుకోవాలి
అంటూ ఎన్నో రకముల సాధనములని చూపించాడు. చివరికి "మామేకం శరణం వ్రజ" అంటూ
తననే ఆశ్రయించమని చరమోపాయాన్ని ఉపదేశించినా పెద్దగా ఫలితం లేకపోయింది. భగవంతుడి కృషి
అంతగా ఫలించలేక పోయే సరికి ఆయనకి విసుగు ఏర్పడి కలియుగంలో వీళ్ళ మధ్యకి రానే రాను అనుకునేంత
స్థితికి వెళ్ళి పోయాడు. ఇది వరకు యుగాల్లో తిరిగే రూపాల్లో వచ్చాడు. ఒక్కో అవతారంలో
ఒక్కో చరమోపదేశాన్ని ఇచ్చాడు. ఈ కలియుగంలో అలా చరమోపదేశాన్ని ఇవ్వడానికి రావలని అనిపించలేదు
కనుక తిరగని అర్చారూపంలోనే ఉంటాను అని నిర్ణయించుకున్నాడు భగవంతుడు. చెప్పాల్సింది
అలాకాదు, చెప్పే పద్దతి ఒకటుంటుంది. నేను వెళ్ళి నేర్పుతా అంటూ ఆండాళ్ తల్లి ఈ లోకంలో
అవతరించింది. ఏమి నేర్పాలని మన వద్దకి వచ్చింది అంటే అవి మూడు కార్యాలు చేస్తానని ప్రతిజ్ఞ
పూని వచ్చింది అమ్మ.
కల్పాదౌ
హరిణా స్వయం జనహితం దృష్ట్వైవ సర్వాత్మనాం
ప్రోక్తం
స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం |
సర్వేషాం
ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యే పురే
జాతాం
వైదికవిష్ణుచిత్తతనయాం గోదాముదారాంస్తుమః ||
ఒకటి "కీర్తనం". అంటే లోకంలో
వాళ్ళకి పాట అంటే ఇష్టం, మొదట తాను పాడి అందరిచే పాడించింది. భగవంతుడు కూడా ఒక పాటని
ఇచ్చాడు, అదే భగవద్గీత. అదీ పాటే కానీ ప్రయోజనం అనుకున్నంతగా లేక పోయింది. భగవద్గీతను
అర్జునునికి అందించినప్పుడు "యుద్ధారంభే శస్త్రాభ్యాసః" అన్నట్లు అవతల యుద్ధరంగంలో
సందిగ్థత, చెప్పేంత ఓపిక భగవంతునికీ లేదు, వినే శ్రద్ధ అర్జునునికీ లేదు. అర్జునుడు
అంతా విన్నా పెద్దగా అర్థం కాలేదు. ఎంత కష్టపడి చెప్పినా అర్థకాలేదని "నోనమశ్రద్ధధానోసి
దుర్మేదాసాష్చపాండవ" అంత అశ్రధ్ధ పనికిరాదయా అంటూ మొదట ఉపనిషద్ సారముగా చెప్పిన
దానికి మళ్ళీ సారముగా "అనుగీతాని" మొరొక సారాన్ని చెప్పాడు భగవానుడు. ఇలా
ఎంత చెప్పినా సరే ఆ చెప్పడం చిన్న చిన్న పాటలవలె ఉండకపోవటంచే ఆయన చెప్పినది అంతగా ఫలించలేదు.
అందుకే “కీర్తనం", ఎలా పాడాలో,
ఎట్లా పాడాలో, నేను నేర్పిస్తానంటూ వచ్చింది అమ్మ. ప్రేమతో
చెబితే వింటారు కానీ కోపంతో చెబితే ఎవ్వరికి నచ్చదు. "ప్రకటం విధాతుమ్",
అందుకోసమే బుజ్జగించి అందరికి ఇలాంటివి ఎలా ఉంటాయో తెలియజేయటానికి వచ్చింది అమ్మ. చక్కగా
పాడితే లోపల ఉన్న మానస ప్రవృత్తులంతా పరిశుభ్రం అవుతాయి. మనిషి పాటలో పరవసిస్తాడు.
ఇలా చేయండి అని ఆండాళ్ తల్లి చెప్పలేదెప్పుడూనూ, ఇలా చేద్దాం రండి అని తనతో పాటు మనల్ని
చేర్చుకుంది. మరి ఏది పడితే అది పాడుతే సరికాదు కదా! మన ఇళ్ళల్లో మురికి నీటి నాళాలు
వాడగా వాడగా పాడైనప్పుడు అందులో దాని జిడ్డును తొలగించే ద్రవాన్ని పోస్తే చక్కగా మారినట్లే,
ఈ లోపల మన ఇంద్రియాల్లో మన మనస్సులో మన బుద్ధిలో ఉన్న మాళిన్యాన్ని తొలగించే భగవన్నామ
అమృతాన్ని కనుక పోయగలిగితే అవి శుద్ది అవుతాయి. ఉపదేశంగా కావలన్నా లేదా హాయిగా పాడుకోవాలన్నా
అదే నారాయణ నామమే అని ఋషులు వెలుగెత్తి చాటిన నారాయణ నామమనే ఉత్తమ మంత్రాన్ని అందించింది
అమ్మ.
రెండవది "ప్రపదనం", మనం భగవంతునికి
శరణాగతి చేయాలి. ఎలా చేయాలి ? అదేదో నిర్భందంగా చేయాలా ? సహజంగా చేయాలా ? అట్లా సహజంగా
ఎలా చేయాలో తెలుపడానికి వచ్చింది అమ్మ.
మూడోది "స్వస్మై ప్రసూనార్పణం".
సహజంగా ప్రేమతో ఎప్పుడైతే భగవంతునికేసి ఒంగుతావో అది స్వామికి ఆనంద దాయకం. అప్పుడు
భగవంతునికి నీవేమీ చేయనక్కరలేదు, హృదయ కమలాన్ని అర్పణ చేస్తే చాలు, భక్తి పరిమళం కల్గిన
మనస్సుని అర్పిస్తే చాలు. మనం అర్పించాల్సింది లోన వికసించిన శ్రద్ధని.
ఇవి
ఎలా చెయ్యాలో చెప్పడానికి అమ్మ అవతరించింది.
No comments:
Post a Comment