Thursday 16 June 2016

గురువు అంటే ఏమిటి.....!!

గురువు అంటే ఏమిటి.....!!


గురువు అనగా ఘనమైనది, పెద్దది అని అర్ధం. మహిమ కలవాడని అర్ధం. బ్రహ్మ అంటే కూడా గొప్ప, పెద్ద అని అర్ధం. గురువు అంటే అంతర్గతముగా ఒక ఉత్తమ స్థితిని అందుకొన్నవాడు అని తేలుతోంది. బాహ్యంలో ఒక వ్యక్తి యొక్క నడతా, విద్వతూ అతనిని ఆచార్యునిగా నిర్దేశిస్తుంది. అతని ఆచార అనుష్టానాల వలన, అతని బోధనా చాతుర్యం చేతనూ, అతని శీలసంపద చేతనూ మనం ఒకరిని ఆచార్యునిగా ఎన్నగలము.
ఇక గురువు బహిరంగముగా ఏదీ చేయవలసిన అవసరము లేదు. తాను తానుగా ఉంటూ, ఏకాంతంగా పూర్ణత్వం భజిస్తూ, ఎవరైనా ఉంటే అతని ప్రభావం గుర్తించి ప్రజలు అతనిని గురువుగా వరిస్తారు. అంతమాత్రాన అతడు వీరికి శాస్త్రపాఠాలు చెప్పవలసిన అవసరము లేదు. అతనిని గురువుగా వరించిన వారికి అతని అనుగ్రహశక్తియే పనిచేస్తుంది. వీరిని అతడు శిష్యులుగా భావించి కూడా ఉండకపోవచ్చును. కానీ ఆయనను గురువుగా ఏ ఫలాన్ని ఉద్దేశించి ఆశ్రయించారో, ఆ ఫలం వీరికి శులభంగా సిద్ధిస్తున్నది.
ఏ శాస్త్రాచారమూ పాటించని ఇలాంటి గురువులెందరో ఉన్నారు. ఉన్మత్తులవలె, పిశాచముల వలే నిరంకుశులుగా తిరిగిన అత్యాశ్రములు ఎందరో గురువులుగా మన దేశంలో ఉండేవారు. ఈ విధంగా దిగంబరంగా తిరిగిన దత్తాత్రేయులు అవధూత గురువు అని ప్రసిద్ధి పొందారు.
గురువుని మహాత్ముడు అంటారు, అతని ఆత్మానుభవం కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉండడం చేతనే అతనిని ప్రజలు గురువుగా వరిస్తున్నారు. వారు జ్ఞానులు, వారెప్పుడూ బ్రహ్మ నిష్టలో ఉండేవారు. వారెప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలో ఉండే ఆనందోన్మత్తులగానో, చిత్తవృత్తుల నిరోధంతో సమాధి స్థితిలో ఉండే యోగులగానో ఉంటారు.
ఒక గురువు స్వయంగా "గురుత్వం" ఒప్పుకోకపోయినా, "నేను నీ శిష్యుడను" అని అతనిని ఆశ్రయించిన వాని మధ్యా, అయిష్టుడైన ఆ గురువు మధ్యా ఒక సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం అతని అనుగ్రహం వల్లనే. ఒకరికి అంతరంగిక ఘనత ఉంటుంది. కానీ అతనికి బహిర్ప్రపంచముపైన ఏ కోరికా లేకపోవచ్చు. అతనికి అతని ఆత్మానుభూతిలోనే నిష్ట, అతడు గురువుగా చేయవలసిన కర్తవ్యం ఏదీ లేదు. 'గు' అంటే అంధకారం, 'రు' అంటే తన్నిరోధకం. గురువు అంటే చీకట్లను పారద్రోలేవారు. అజ్ఞాన నివర్తకుడు. దేశ శబ్దానికి ప్రకాశరూపి అని అర్ధం. "తమసోమాజ్యోర్గమయ". మనం అంధకారంలోంచి ప్రకాశంలోకి రావాలి. తమస్ అంటే చీకటి, జ్యోతిస్ అంటే వెలుతురు. అజ్ఞానం అంటే చీకటి, వెలుతురు (జ్ఞానం) ప్రకాశిస్తే కానీ చీకటి పోదు. ఒక విషయాన్ని గురువు బోధిస్తాడు. శిష్యుడు తన బుద్ధిచేత దానిని గ్రహిస్తాడు. అజ్ఞానమనే అంధకారంలో ఉన్న శిష్యునికి జ్ఞానబోధ చేయగలిగినది ప్రకాశరూపియైన గురువు ఒక్కడే.

No comments:

Post a Comment