Friday 24 November 2017

కూర్మావతారము



హిందూమత పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం

 

అవతార గాథ

ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.
దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.
అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించెను. ఆ అవతారాన్ని పోతన తన భాగవతంలో ఇలా వర్ణించాడు.
సవరనై లక్ష యోజనముల వెడల్పై కడు గఠోరంబైన కర్పరమున
నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు
సకల చరాచర జంతురాసులనెల్ల మ్రింగి లోగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైబడ్డ నాగిన గదలనియట్టి కాళ్ళు
వెలిగి లోనికి జనుదెంచు విపుల తుండ
మంబుజంబుల బోలెడి యక్షియుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి
కూర్మి చెలువొందనొక మహా కూర్మమయ్యె.
అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించింది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.

స్తోత్రము

జయదేవుని స్తోత్రంలో కూర్మావతార వర్ణన

క్షితిరతి విపులతరే తవ తిష్ఠతి పృష్టే
ధరణి ధరణ కిణ చక్ర గరిష్ఠే
కేశవ! ధృత కచ్ఛప రూప!
జయ జగదీశ హరే!

దేవాలయములు

  • శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్ణానికి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి.
  • పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి మండలానికి చెందిన కంచుమర్రు గ్రామంలో కూర్మావతారుని ఆలయం ఉంది. కాలువలోంచి గ్రామంలోకి వచ్చి గ్రామస్తులకు డిప్పపై విష్ణుమూర్తి నామాలు సహజంగా కలిగిన ఓ తాబేలు కనిపించింది. దానిని తగిన ఏర్పాటుచేసి కాపాడుకుంటూ, పూజిస్తూ వచ్చాకా కొన్నేళ్ళకు తాబేలు మరణించింది. దాని శరీరం పెట్టి దాని రూపాన్ని నిర్మించి అక్కడే ఆలయాన్ని నిర్మించారు.
  • చిత్తూరు జిల్లా లోని పెలమనేరు మండలంలోని కూర్మాయి గ్రామంలో "కూర్మ వరదరాజ స్వామి దేవాలయం" కలదు


  1. మంధర పర్వతాన్ని మోస్తున్న తాబేలు
  2. కూర్మావతారము
  3. హంపిలో విఠలాలయం స్తంభంపై కూర్మావతార శిల్పం

No comments:

Post a Comment