మనకు ముక్కోటి దేవతలున్నారు. వారిలో ఎవరికి నచ్చిన దేవుడు వారి వారికి విడిగా ఉన్నారు. కొందరు విష్ణువును ఇష్టపడితే... కొందరు శివుని ఇష్టపడతారు. కానీ...అందరూ ఇష్టపడే దేవుడు మాత్రం ‘హనుమంతుడు’ ఒక్కడే. అదే ఆయన వైభవం. ఎవరికైనా... భయం కలిగితే...తన ఇష్టదైవాన్ని కూడా కాదని, ముందు ప్రార్థించేది హనుమంతుడినే. ఛిన్నపిల్లలకు దిష్టి తగిలినా..గాలి సోకినా...ముందుగా గుర్తొచ్చేది హనుమంతుడే. ఏ విషయంలోనైనా ఆటంకాలు ఎదురైతే...విజయం కోసం ముందుగా ప్రార్థించేది హనుమంతుడినే. ఎవరెవరి ఇష్టదైవం సంగతి ఎలా ఉన్నా...వ్యాయామ కళాశాలల్లో దర్శనమిచ్చే దేవుడు మన హనుమంతుడే. మిగతా దేవుళ్ల విషంయంలో వ్యక్తిగత భేదాభిప్రాయాల సంగతి ఎలా ఉన్నా...హనుమంతుని విషయంలో ఎవరికీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అదే ఆయన వైభవం. ఏడు కాండలతో..ఇరవైనాలుగు వేల శ్లోకాలతో అలరారే ‘శ్రీమద్వాల్మీకి రామాయణ’ మహా కావ్యంలో... ‘కిష్కింథాకాండ’లో మనకు పరిచయమైన ‘హనుమంతుడు’ యుగాలు మారుతున్నా.. నేటికీ మనందరిచేత ‘జన్మదినోత్సవాలు’ చేయించుకుంటున్నాడంటే...అది ఆయన వైభవం కాక మరేమిటి ? హనుమంతునితో పాటు పరిచయమైన వారే...వాలి, సుగ్రీవ, జాంబవంతాదులు. మరి... వారెవరికీ లేని, రాని ప్రత్యేకత., హనుమంతునకు ఎలా వచ్చింది ?
రామ, లక్ష్మణులను చూసి ప్రాణభయంతో పరుగు తీస్తున్న వానరేశ్వరుడు సుగ్రీవునకు ధైర్యం చెప్పి...భిక్షుకరూపంలో రామ, లక్ష్మణుల దగ్గరకు వస్తాడు హనుమంతుడు. తను వచ్చిన విషయాన్ని.., తడబడకుండా, గొంతు చించుకు అరవకుండా, కనుబొమలు ఎగరేయకుండా.,స్పష్ఠంగా,ముచ్చటగా మూడుమాటల్లో చెప్పి., వారు ఎందుకు వచ్చారో అడుగుతాడు హనుమంతుడు. ‘లక్ష్మణా.. విన్నావుకదా.. ఈ వానరుని ప్రసంగం. చతుర్వేదాలు, నవ వ్యాకరణాలు ఆమూలాగ్రంగా వచ్చినవాడే.. ఇంత ఆహ్లాదకరంగా ప్రసంగించగలడు. ఇటువంటి సచివుడు ఉన్న రాజు, ప్రపంచాన్నే శాసించగలడు. ఇట్టి వాక్చాతుర్య కుశలునితో, మనం వచ్చిన కార్యాన్ని చాలా జాగ్రత్తగా వివరించాలి సుమా.’ అనిఅంటాడు శ్రీరాముడు. సకలకళాకోవిదుడైన శ్రీరాముడు., తనంతటి వాడైన లక్ష్మణుని హెచ్చరించిన సందర్బము రామాయణంలో ఇది ఒక్కటే. అదీ... మన హనుమంతుని వాగ్వైభవం. రామ, సుగ్రీవులకు అగ్నిసాక్షిగా మైత్రి కలిపి, ధర్మచ్యుతుడైన వాలి వధకు మార్గం సుగమం చేసి., రాజ్యభ్రష్ఠుడైన సుగ్రీవుని తిరిగి కిష్కింధాధిపతిగా అభిషిక్తుని చేసినదీ హనుమంతుడే. అదీ ఆయన మంత్రాంగ వైభవం. సీతాన్వేషణ కార్యంలో భాగంగా హనుమదాదులు దక్షిణ సముద్రతీరం దగ్గర కూర్చున్నారు. సముద్రం దాటాలి. ఒకడు పది యోజనాలు దాటుతానన్నాడు. మరొకడు ఇరవై..ఇంకడు యాభై...ఇలా ఎవరి శక్తికి తగిన విధంగా వారివారి బలం చాటారు.
చివరకు జాంబవంతుడు కూడా...సాగరలంఘనం చేయగలనే కానీ.. తిరిగి రాలేను అన్నాడు. అందరూ ప్రాణత్యాగానికి సిద్ధపడితే...జాంబవంతుని ప్రోత్సాహంతో సాగర లంఘనం చేసాడు హనుమ. ఆ మహత్తర కార్యంలో తన ప్రయాణానికి విఘ్నం కలిగించబోయిన మైనాకుని సంతృప్తి పరచి, నాగమాత సురసను జయించి, ఛాయాగ్రాహిణి సింహికను సంహరించి.,లంకానగరం చేరాడు. దుర్భేద్యమైన లంకను చూసి రకరకాలుగా ఆలోచనలు చేసి.. ముందుగా లంకానగరాధి దేవత లంకిణి దర్పమణచి లంకలో ప్రవేశిస్తాడు. అదీ ఆయన వీర, విక్రమ వైభవం. హనుమంతుని ధీశక్తికి అసలు పరీక్ష ఇక్కడే ఉంది. లంకలో సీతాన్వేషణ చేస్తున్నాడు హనుమ. లంకానగర వైభవం ఆయన మనసు హరించలేదు. అతిలోక సౌందర్యవతులైన ఎందరో మోహనాంగులు నగ్నంగా నిదురిస్తూంటే.. సీతకోసం., వారిని నఖశిఖ పర్యంతం చూస్తున్నా హనుమ మనసు చలించలేదు. అదీ ఆయన ఇంద్రియ నిగ్రహ వైభవం.
‘అయ్యో.. పరస్త్రీని చూడడమే పాపం కదా..ఇలా నగ్నంగా చూడడం మరింత పాపం కదా..ఇంత సౌందర్యాన్ని చూస్తున్నా, నా మనసు చలించకుండా, నిర్మలంగా ఉంది. కనుక నాకు పాపం లేదు. అయినా సీతను వెతకాలంటే స్త్రీల మధ్యనే కదా వెతకాలి. కనుక నా తప్పు ఏమీ లేదు’ అనుకుని సీతాన్వేషణ చేస్తున్నాడు హనుమ. ఇదీ... ఆయన ధర్మచింతనా వైభవం. రావణుని శయనం మీద నిదురిస్తున్న మందోదరిని చూసి..సీత అని భ్రమపడి ఆనందంతో గంతులు వేస్తాడు. మరుక్షణంలో ఆలోచనలో పడి...‘రామునకు దూరమైన సీత అలంకరించుకోదు..అన్న పానాలు ముట్టదు...ఇలా సుఖంగా నిదురించదు..కనుక ఈమె సీత కాదు.’ అని నిర్ణయించుకుంటాడు. ఇదీ..ఆయన తార్కిక వైభవం. అశోకవనంలో సీత కనిపించింది. ఎలా కనిపించింది.? ప్రాణత్యాగానికి సిద్ధపడుతూ కనిపించింది. ఇప్పుడు...ఆమె ప్రయత్నాన్ని ఆపాలి. రామగానం చేసి,రామాంగుళి ఆమెకు ఇచ్చి, ఆమెకు ధైర్యం చెప్తాడు. అదీ ఆయన ఆలోచనా వైభవం.
చిన్న వానరరూపంలో ఉన్న హనుమంతుని శక్తిని సీతమ్మ శంకించినవేళ.. తన విశ్వరూపం చూపించి ‘వానరసేనలో అందరూ నన్ను మించిన ఉద్దండులేనమ్మా...సుగ్రీవుని సేనలో ఏమీ చేతకానివాడను, ఏమీ తెలియనివాడను., నేను ఒక్కడినేనమ్మా. దూతగా మహామహులను పంపరు కదమ్మా’ అని వినయంగా పలుకడం ...అఖండ ప్రతిభావంతుడైన ఒక్క హనుమంతునకే చెల్లు. అదీ...ఆయన వినమ్రతా వైభవం. వచ్చిన కార్యం పూర్తయింది. అలాని వెంటనే వెనుతిరిగి వెళ్లిపోలేదు. తమ బలం శత్రువుకు తెలియచెప్పాలి. అందుకే అశోకవనం ధ్వంసం చేసాడు. మంత్రి పుత్రులను, సేనాధిపతులను, రావణపుత్రుడు అక్షకుమారునితో పాటు కొన్ని వేల మంది రాక్షసవీరులను ఏకాకిగా సంహరించాడు. రావణసభలో...రావణునికి హితోపదేశం ఛేసాడు. తనను పరాభవించిన రావణునికి బుద్ధివచ్చేలా.. లంకాదహనం చేసి., శ్రీరామునికి సీతమ్మ జాడ తెలిపిన కార్యసాధకుడు హనుమ. అదీ ఆయన కార్యసాధనా వైభవం. అంతేనా...యుద్ధరంగంలో లక్ష్మణుడు మూర్ఛనొందిన వేళ..అనన్య సామాన్యమైన సంజీవిని పర్వతాన్ని తెచ్చి కాపాడిన ఆయన ప్రతిభా వైభవం ఇంకెవరికి ఉంటుంది?
శ్రీరామ పట్టాభిషేకం వేళ..అందరూ వారివారి ఉచితాసపాలలో కూర్చుంటే..హనుమ మాత్రం శ్రీరామ పాద సాన్నిధ్యాన్ని మించిన ఉచితస్థానం మరొకటి లేదని తలచి., భక్తిగా చేతులు జోడించి శ్రీరాముని పాదాల చెంత కూర్చున్న హనుమంతుని భక్తి వైభవాన్ని వివరించడానికి భాష చాలదు. అందుకే...భక్తిభావనతో ఆ ఈశ్వరాంశ సంభూతుని ఆశీస్సులు అందుకుని ఆనందిద్దాం.
ఆంజనేయ మతిపాటలాననమ్ - కాంచనాద్రి కమనీయ విగ్రహమ్
పారిజాత తరుమూల వాసినమ్ - భావయామి పవమాన నందనమ్
యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్ - తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణ లోచనమ్ - మారుతిం నమత రాక్షసాంతకమ్
No comments:
Post a Comment