Thursday 10 January 2019

కుంభస్నానం మరియు దాని విశిష్టత..


జనవరి 15 వతేదీ నుండి ప్రయాగరాజ్ లో జరిగే కుంభమేళా గురించి , దాని ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాము.
దక్షిణాదిన మనందరకూ పుష్కరాలు , పుష్కరస్నానాలు , ఏయేనదులలో ఎప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసు కానీ ఈ కుంభస్నానాలనేవి కేవలం ఉత్తరదేశపు తీర్థాలకే సొంతం.
ఈ కుంభస్నానాలు..
ప్రయాగ,
ఉజ్జయిని,
నాసిక్ మరియు
హరిద్వార్ లలో జరుగుతాయి.
మనవైపు పుష్కరాలు గురుగ్రహం యొక్క సంచారం లో ఒక్కొక్క రాశిప్రవేశంతో ప్రారంభమౌతాయి. 12రోజులవరకూ కొనసాగుతాయి.
అయితే ఈ కుంభస్నానాలు పైన పేర్కొన్న 4 చోట్ల ఖగోళీయ గ్రహగతుల ఆధారంగా ప్రారంభమౌతాయి. పుష్కరస్నానాలకు గురుచారం ఒకటే ప్రాతిపదిక అయితే ,
ఈ కుంభస్నానాలకు గురుచారంతోబాటు రవి,చంద్రుల సంచారం కూడా ప్రాతిపదికగా తీసుకుని స్నానతేదీలను నిర్ణయిస్తారు.
ప్రయాగలో..కుంభస్నాన..నిర్ణయం:💐
మేషరాశింగతే జీవే మకరే చంద్రభాస్కరౌ ।
అమావాస్యా తదాయోగః కుంభాఖ్యస్తీర్థనాయకే ।।
- స్కందపురాణం.
"గురుడు మేషరాశిలో ఉండి రవి,చంద్రులు మకరరాశిలో ఉన్నపుడు అమావాస్య నాడు కుంభయోగం ఏర్పడుతుంది."
అలా ఏర్పడిన తరువాత, మకరసంక్రమణం నాడు మొదటి షాహీస్నాన్ తో కుంభస్నానాలు ప్రారంభమౌతాయి.
పై గ్రహస్థితి ప్రకారం 2013 న జనవరి 14 న మకరసంక్రమణం నాడు ప్రయాగలో కుంభమేళా ప్రారంభమైంది.
అయితే మరి ఇప్పుడు ఏమిటి?💐
ఇది అర్ధకుంభ్ . ప్రధాన కుంభమేళా 12 సం.కు ఒకసారి వస్తుంది.
మధ్యలో 6 సం.కు ఒకసారి అర్ధకుంభ్ ని నిర్వహించాలని కొన్ని శతాబ్దాలక్రితమే సాధు-సంత్ ల మండలి నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ అర్ధకుంభ్ కేవలం ప్రయాగ, హరిద్వార్ లలో మాత్రమే జరుగుతుంది.
ఆయాచోట్ల ప్రధాన కుంభయోగానికి సరిగ్గా 6 సం.కు అర్ధకుంభ్ జరుపుతారు.
అందువలన 2013 లో కుంభ్ జరిగాక ,
2019 లో అర్ధకుంభ్ జరుగుతోంది.
అర్ధకుంభ్ నకు ఖగోళగ్రహగతులతో సంబంధం లేదు. ప్రధాన కుంభమేళాజరిగాక 6 సంవత్సరాలవ్వాలి అంతే.
అర్ధకుంభమేళా,
పూర్ణకుంభమేళా,
సాధారణ కుంభమేళా గురించి క్లుప్తముగా..💐
అర్ధకుంభమేళా.💐
2019 జనవరి 15 మంగళవారం సంక్రాంతి నుండి
49 రోజులపాటు మార్చి 4 మహాశివరాత్రి వరకు జరుగును.
వివరణ.💐
కుంభము అంటే కుండ లేదా కలశము అనిఅర్ధము.
మేళా అంటే కలయిక, కూటమి అనిఅర్ధము.
ఈ కుంభమేళా గురించి..
భాగవతము,
మహాభారతము,
రామాయణము,
విష్ణుపురాణము మొదలైన గ్రంధాలలో ఉన్నది.
క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుండగా
ఆ కలశం ఒలికి నాలుగు చుక్కల అమృతం : అలహాబాద్,
హరిద్వార్,
ఉజ్జయిని,
నాసిక్‌లలోని నదుల్లో పడ్డాయి.
అందువల్ల ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట
ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది.
దీనిని సాధారణ కుంభమేళా అంటారు.
6 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళాన్ని అర్ధకుంభమేళ అని,
12 సంవత్సరాలకు కొకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు.
12 పూర్ణ కుంభమేళాలు
12*12= 144 ఏళ్లకోసారి చేసే కుంభమేళాన్ని మహాకుంభ
మేళాఅంటారు.
2025 లో మరలా పూర్ణ కుంభమేళా జరగనుంది.
అలాగే ప్రతి సంవత్సరము కొన్ని పుణ్యనదులకు పుష్కరాలు వస్తాయి.
గురుడు ఏరాశిలో ప్రవేశిస్తే ఆనదికి పుష్కరము వస్తుంది.
పుష్కరము అంటే 12 సంవత్సరాలు అనిఅర్ధము.
ఈసారి గురుడు ధను రాశిలో ప్రవేసిస్తున్నాడు.
కనుక 2019 నవంబర్ 5 మంగళవారం నుండి బ్రహ్మపుత్ర నదికి అనగా పుష్కరవాహిని నదికి పుష్కరాలు ప్రారంభము అగును.
ఇక అర్ధకుంభమేళా విషయానికి వస్తే జనవరి 15 నుండి గంగ,యమున, సరస్వతినదుల త్రివేణి సంగమంలో ( అలహాబాద్) ప్రయాగ్ రాజ్ వద్దజరుగుతాయి.
ఈ అర్ధకుంభమేళాకి ఎన్నోలక్షలమంది అఘోరాలు,
సాధువులు స్నానము ఆచరిస్తారు.
కుంభమేళా_పౌరాణిక_ప్రాశస్త్యం.💐
స్కందపురాణంలో దీనివర్ణన ఉంది.
మనకు దేవదానవుల క్షీరసాగరమథనం కథ
తెలుసు కదా!
అపుడు ఉద్భవించిన అమృతం కోసం దేవదానవుల నడుమ 12 రోజులపాటు యుద్ధం జరిగింది.
దేవతలకు 12 రోజులంటే మానవులకు
12 సంవత్సరములే కదా!
కుంభపర్వాలు కూడా 12 ఉన్నాయి.
అయితే మానవులకు 4 ,
దేవతలకు 8 కేటాయించడం జరిగింది.
అందువలన భూమిపై 4 ,
దేవలోకంలో 8 కుంభపర్వాలు జరుగుతాయని స్కందపురాణవచనం.
దేవదానవ సంగ్రామ సమయంలో అమృతకుంభాన్ని సూర్యచంద్రులు, గురుడు, శని రక్షించారు.
చంద్రుడు కలశంనుండి అమృతం బయటకు ఒలకకుండా కాపాడితే ,
సూర్యుడు కలశం పగిలిపోకుండా చూసుకున్నాడట. గురుడు కలశాన్ని రాక్షసులనుండి కాపాడితే ,
శనైశ్చరుడు ఇంద్రునినుండి కలశాన్ని కాపాడాడని స్కందపురాణం ఇలా తెలియజేస్తుంది -
" చంద్రః ప్రస్రవణాద్రక్షాం సూర్యో విస్ఫోటనాద్దధౌ ।
దైత్యేభ్యశ్చ గురూ రక్షాం శౌరిదేవేంద్రజాద్భయాత్।।"
ఏ సమయంలో ఈ గ్రహాలు కలశాన్ని రక్షించాయో
అప్పటి గ్రహస్థితికి అనుగుణంగా వర్తమాన గ్రహస్థితులలోకి ఆయా గ్రహాలు వచ్చినప్పుడు కుంభయోగం ఏర్పడుతుంది.
అయితే ఆ అమృతకుంభం నుండి
కొన్ని అమృతబిందువులు తుళ్ళి నాలుగుచోట్ల పడ్డాయనీ ,
అందువలన అవి పడిన నాలుగుచోట్ల..
ప్రయాగ,
ఉజ్జయిని,
నాసిక్ మరియు
హరిద్వార్ లలో కుంభమేళా జరుగుతుందని స్కందపురాణం అంటోంది -
" విష్ణుద్వారే తీర్థరాజేఽవన్త్యాం గోదావరీతటే।
సుధాబిందువినిక్షేపాత్ కుంభపర్వేతి విశ్రుతమ్।।"
ప్రయాగస్నానమాహాత్మ్యం:💐
మామూలురోజులలోనే ప్రయాగలో స్నానానికి
ఎంతో ప్రాధాన్యతని పురాణాలు తెలుపుతున్నాయి,
ఇక కుంభయోగంలో చెప్పేదేముంది?
"అశ్వమేధసహస్రాణి వాజపేయశతాని చ।
లక్షం ప్రదక్షిణా భూమేః కుంభస్నానేన తత్ఫలమ్।।"
"వెయ్యి అశ్వమేధయాగాలు,
వంద వాజపేయ యాగాలు,
లక్షసార్లు భూప్రదక్షిణలు చేస్తే ఎంతఫలితమో ,
కుంభస్నానం ప్రయాగలో చేస్తే అంతఫలితమని విష్ణుపురాణవచనం.
"సహస్రం కార్తికే స్నానం మాఘే స్నానశతానిచ।
వైశాఖే నర్మదాకోటిః కుంభస్నానేన తత్ఫలమ్।।"
"వెయ్యి కార్తికమాసస్నానాలు గంగలో చేసిన ఫలితం, వందమాఘమాసస్నానాలు గంగలో చేసినఫలితం , వైశాఖమాసస్నానాలు కోటిమారులు నర్మదా నదిలో చేసినఫలితాన్ని ఒక్కమారు కుంభస్నానంతో మానవుడు పొందుతాడని స్కందపురాణవచనం.
గ్రహాలలో సూర్యుడు,
నక్షత్రాలలో చంద్రుడు ఎలా శ్రేష్ఠమో,
తీర్థాలలో ప్రయాగ అలా శ్రేష్ఠమని పద్మపురాణవచనం.
ప్రయాగలోని అక్షయవటదర్శనం చేస్తే
బ్రహ్మహత్యాది పాతకనాశనం అవుతుందని
కూడా పద్మపురాణం తెలుపుతోంది.
ప్రయాగతీర్థాన్ని 60వేల ధనుర్ధారులు గంగానదిని, సూర్యభగవానుడు యమునానదిని ,
ఇంద్రుడు ప్రయాగక్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారని మత్స్యపురాణవచనం.
మాఘమాసంలో త్రివేణీసంగమస్నానం విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నారదపురాణవచనం.
అందువలన వీలు చేసుకుని ,
పుణ్యాభిలాషులమై ,
దురితక్షయాన్ని కాంక్షిస్తూ ప్రయాగరాజ్ లో స్నానం ఆచరించి సాధుదర్శనం చేసుకుని తరిద్దాం.
కుంభమేళాలో ముఖ్యమైన రోజులు :💐
జనవరి 15 మంగళవారం రాజ స్నానము.
జనవరి 21 సోమవారం పుష్య పౌర్ణమి.
ఫిబ్రవరి 4 సోమవారం మౌని అమావాస్య.
ఫిబ్రవరి 9 శనివారం శ్రీపంచమి.
ఫిబ్రవరి 19మంగళవారం వ్యాసపూర్ణిమ,మాఘపూర్ణిమ.
మార్చి 4 సోమవారం మహాశివరాత్రి.
ఓం నమః శివాయ..!!🙏
*💐లోకా సమస్తా సుఖినోభవంతు..!!💐*


No comments:

Post a Comment