పులి బారినుండి తప్పించుకోవడానికి ఆ ఆవు ఒక నీళ్ళులేని, బాగా బురదగా ఉన్న చిన్న చెరువులో దూకేసింది. ఆ ఆవును తరుముకుంటూ వస్తున్న పులి కూడా ఆ తమకంలో ఆ బురదగా ఉన్న చెరువులో దూకేసింది.
ఆ రెండు ఆ నీళ్ళు లేని బురదతో ఉన్న చెరువులో ఎంత ఒకదాని మీద ఒకటి పడ్డా, ఆ చెరువులో నుండి బయట పడటం వాటి వల్ల కాలేదు.
పులి ఆవుని చూసి, ” ఇప్పుడు నీ ఎముకలు పరపరా నమిలేయాలని ఉంది ” అన్నది.
ఆ పులి ఆవు పైకి పంజా విసరాలని శతవిదాల ప్రయత్నించి విఫలమైంది. ఆ బురదలో నుండి తప్పించుకోలేక నిస్సహాయురాలైంది.
అప్పుడా ఆవు పులిని చూసి నవ్వి, ”నీకు యజమాని ఎవరైనా ఉన్నారా? అనడిగింది
పులి, "_”ఏం మాట్లాడుతున్నావు. ఈ అడవికి యజమానిని నేనే!! నువ్వెందుకు అలా అడుగుతున్నావు. నాకు నేనే కదా యజమానిని”_ అని గర్వంగా గర్జించింది.
అప్పుడా ఆవు _”నువ్వీ అడవికి రాజువే కావచ్చు. కానీ ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకోలేని స్థితిలో ఉన్నావు కదా”_ అన్నది..
పులి _”నీ పరిస్థితి అంతే కదా!! నువ్వు ఈ బురదలో కూరుకుని ఉన్నావు కదా!! ఆకలితో చస్తావు కదా”_ అన్నది.
అప్పుడా ఆవు *”నేను చావను.”* అన్నది.
”ఈ అడవికి రాజునైన నేనే ఈ బురదలో కూరుకుని పోయి బయటకు రాలేక పోతున్నాను. నువ్వొక సాధుజంతువైన నిన్ను ఎవరు రక్షిస్తారు” అన్నది పులి.
_”నిజమే !! నన్ను నేను రక్షించుకోలేను. కానీ నా స్వామి నన్ను రక్షిస్తాడు. సూర్యాస్తమయం అవ్వడంతో నేను ఇంటికి చేరక పోవడంతో నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నన్ను ఈ బురదనుండి పైకి లేపి నన్ను రక్షించి, మా ఇంటికి నన్ను తీసుకువెడతాడు.”_ అని మధురంగా, మెల్లగా చెప్పింది.
పులి స్థబ్దురాలై, దిగాలుపడిపోయింది.
సూర్యాస్తమయం కాగానే, ఆవు చెప్పినట్లు, దాని యజమాని వచ్చి, ఆవు దురవస్థ చూచి, ఆ బురదలో నుండి దానిని పైకి తీశాడు. దానిని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఆవు యజమాని దయపట్ల ఎంతో కృతజ్జత మనస్సులోనే చెప్పుకుంది. ఆవు దాని యజమాని, పులి దురవస్థకు చింతించారు. *కానీ దాని దురహంకారం వారిని దాని దగ్గరకు చేరనివ్వలేదు.*
మనం ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే, ఆవు శరణాగతి చేసినవాడికి ప్రతీక. పులి సామాన్య మానవునిలో ఉన్న అహంకారపూరిత మనస్సుకు ప్రతీక. యజమాని గురువు లేదా మన స్వామి. బురద మన చుట్టూ ఉన్న ప్రపంచం, ఆకర్షణలు, పులి ఆవును తరుముకు రావడం మన జీవిత పోరాటం అన్నమాట.
జీవిత పోరాటం అలసిపోయి, ఏమీ చేతకాక, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడే దైవాన్ని ప్రార్దించడం కాక, మనకు స్వామి ఒకడు ఉన్నాడు అని ఎల్లప్పుడూ అనుకుంటూ మనం ఆ స్వామికి శరణాగతి చేస్తే, దైవమయిన ఆ యజమాని జీవన సమరంలో మనం ఓడిపొతున్నప్పుడు, ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు *”నేనున్నాను”* అంటూ వచ్చి మనలను పంకిలం నుండి లేవదీసి ఈ భవబంధాల నుండి విముక్తి ని ప్రసాదిస్తాడు.
No comments:
Post a Comment