Thursday, 23 February 2017

శివరాత్రి మహత్యం!



మాఘ బహుళ చతుర్దశి… మహాశివరాత్రి. ఆత్మలింగోద్భవం జరిగిన రోజు ఇది. ఓసారి బ్రహ్మవిష్ణువులు నేను గొప్పంటే, నేనుగొప్పంటూ గొడవపడ్డారు. ఇద్దరు మూర్తుల అహాన్నీ కరిగించడానికి… పరమేశ్వరుడు తన విరాట్‌ రూపాన్ని చూపిన రోజే శివరాత్రి అని ఓ కథనం. వందే పార్వతీపరమేశ్వరౌ…అతడు సగం, ఆమె సగం. ఆమెతో కూడినప్పుడే శివుడు పరిపూర్ణుడు. అందుకే, పరమశివుడి జన్మదినంగా భావించే శివరాత్రి నాడే పార్వతీపరమేశ్వరుల కల్యాణం జరుపుతారు. పగలంతా ఉపవాసం, రాత్రంతా జాగారం, నోరారా నామస్మరణం…అంతకు మించిన శివానందం ఏం ఉంటుందీ! ఈరోజే శైవులు నిత్యధారణ కోసం విభూతి తయారు చేసుకుంటారని పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర చెబుతోంది. శివరాత్రి మహత్యాన్ని చాటే ఉదంతాలు ప్రాచీన తెలుగు సాహిత్యంలో అనేకం. చోరులూ జారులూ కూడా… తెలిసో తెలియకో ఉపవాసం చేసో, ఏ దురుద్దేశంతోనో శివాలయంలో దీపం వెలిగించో ముక్తిని పొందిన ఉదంతాలు కోకొల్లలు. శివ అనే పదానికి శుభం, మంగళకరం, కల్యాణం, భద్రం, విశ్వశ్రేయస్సు, సర్వ సంరక్షణం, మోక్షప్రదాయకం అనే అర్థాలున్నాయి. అందరూ అమంగళ కరమైనవిగా భావించే శ్మశానం, కపాలం, చితాభస్మం, విషసర్పాలు వంటివి శివుడికి ప్రీతిపాత్రమైనవి. ఆయన శ్మశానంలో నివసిస్తాడు. చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు. విషసర్పాలను ఆభరణాలుగా ధరిస్తాడు. అయినప్పటికీ ఆయన మంగళ ప్రదాత, మంగళస్వరూపుడు. సర్వదేవతా వంద్యుడు.ఆదిమధ్యాంత రహితుడు, అనుగ్రహప్రదాత, బోళాశంకరుడు, పరమేశ్వరుడు. అందుకే పరమేశ్వర శబ్దం దేవ, దానవ, మానవ జాతులందరికీ పూజనీయమైనది. తాను విషాన్ని మింగి, లోకాలకు అమృతాన్ని పంచిన మహా ఉదారుడాయన. అందుకే ఆయనకు మహాదేవుడు అని పేరు. అంటే దేవతలందరిలోకీ ఉన్నతమైనవాడన్నమాట. తాను శ్మశానవాసిగా భిక్షాటన చేస్తూ, తన భక్తులకు సకలైశ్వర్యాలను ప్రసాదించే భక్తసులభుడాయన. ఆర్తితో పిలిస్తే పలికే దైవం ఆయన. ఆయనకు అత్యంత ప్రీతికరమైన రేయి మహాశివరాత్రి.శివరాత్రి అంటే మంగళకరమయిన రాత్రి అని అర్థం. ప్రతినెలా శివరాత్రి వస్తుంది. అయితే అది మాస శివరాత్రి. మాఘకృష్ణ చతుర్దశినాడు వచ్చే శివరాత్రి మహాశివరాత్రి. అంటే లింగోద్భవ సమయమన్నమాట. సకల చరాచరజీవులలో, ప్రాణులలో శివుడు అంతర్యామిగా జ్యోత్లింగ స్వరూపునిగా కొలువై వున్నాడు. ఈ జగత్తులో ప్రతిజీవి తనను పూజించేందుకు పన్నెండు ప్రదేశాలలో జ్యోతిర్లింగరూపాలలో వెలిశాడాయన. లోకకళ్యాణంకోసం పరమ శివుడు మహాశివరాత్రి నాడు శివలింగం నుంచి బయటకు వస్తాడని, సమస్త సృష్టి ప్రారంభం శివరాత్రినాడే జరిగిందని పురాణాలుచెబుతున్నాయి.జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.

No comments:

Post a Comment