Sunday 19 February 2017

మాఘపురాణం - 8వ అధ్యాయము


యమలోక విశేషములు

మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కాంచినటుల లేచి, వారు యమలోకమందు చూచిన వింతలూ, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి.
యమలోక మందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తానూ చేసిన పాపకర్మలకెంతటి శిక్షలననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపినీ ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయింది.
అపుడా కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే యున్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖముల ననుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానము చేయుట తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు యిత్యాది పుణ్యకార్యములు చేయుటవలన నంతకుముందు చేసియున్న పాపములన్నియు పటాపంచలై నశించుటయే గాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్దమయినది.
మాఘమాసమందు నదీస్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట కంతకంటే సులభమార్గము మరియొకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.



No comments:

Post a Comment