Friday, 24 February 2017

భగవత్బందువులందరికి "మహ శివరాత్రి" శుభాకాంక్షలు....



ప్రతి మాసానిదీ ఒక విశిష్టత.. ప్రతి మాసంలోనూ ఒక పండుగ..ప్రతి రోజూ ఒక కొత్తదనం. పండుగలంటే మనకెంతో సరదా. ఎంతో ఉత్సాహంగా సరదాగా జరుపుకుంటాం. ఎంత బీదవారైనా గొప్ప వారైనా ఎలాగో అలాగ జరుపుకోవాలనే చూస్తారు. శ్రీరామనవమి నుంచి శివరాత్రిదాకా సంవత్సరం పొడుగునా పండుగలే. బహుశా ఏ మతంలోనూ కూడా మనకున్నన్ని పండుగలు, పూజలు, వ్రతాలు ఉండవేమోననిపిస్తుంది. పండుగలనగానే పిండివంటలు చేసుకోవటం బంధుమిత్రులతో వినోదంగా కాలక్షేపం చేయటమేనని చాలా మంది భావన అయితే మనకి కనిపించే వ్యవహారమిదే. కాని ఆంతర్యంలో చాలా విశేషాలుంటాయి. ప్రతి పండుగా ఏదో ఒక దేవుడిని దేవతను ఆరాధించాలని సంప్రదాయం. దేవుళ్లు అంటే అమర్త్యులు..... మనం మర్త్యులం. -- జన్మ, మృత్యు, జరావ్యాధులతో బాధలను తప్పించుకోవాలంటే అవి లేని వారినారాధించాలి.  అప్పుడు వారిలోని దివ్యగుణాలు కొన్నైనా మనలో చోటు చేసుకుంటాయి. అందుకే పండుగలలో ఆహారం కంటే పూజలకే ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు.గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .




మాస శివరాత్రి :
ప్రతి నెలలోను వచ్చే బహుళ పక్షంలోని చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు .అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తే అందులో గొప్పదైన ఈ శివరాత్రి - అంటే -మాఘ మాస శివరాత్రి ' మహా శివరాత్రి (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) అవుతోంది .'మహా' అని ఎక్కడ అనిపించినా కొన్ని అలాంటి వాటికంటే గొప్పదని భావం . శివ పార్వతులిరువురికి కలిపి 'శివులు' అని పేరు ( శివ శ్చ శివా చ సివౌ ).ఆ ఇద్దరికీ సంభందించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం . అందుకే శివరాత్రి నాడు అయ్యకి - అమ్మకి కుడా వుత్సవం సాగుతుంది .శివ - మంగళకరమైన - రాత్రి ఏదో అది శివరాత్రి అనేది మూడో అర్థం .
మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మాహాశివరాత్రి అంటారు. మ అంటే లేనిది, అఘం అంటే పాపం, మాఘం అంటే పాపవిమోచనం అని అర్ధం.
క్షీరసాగర మధనంలో పుట్టిన హాలాహలాన్ని శివుడు తన కంఠంలో నిలుపుకున్న రాత్రియే శివరాత్రి అంటారు.
మరియొక గాధ ప్రకారం బ్రహ్మ విష్ణుమూర్తులలో ఏర్పడిన అహంకారాన్ని పోగొట్టడానికి మాఘమాసం చతుర్ధశి నాడు శివుడు ఇరువురికి మధ్య జ్యోతిర్లింగాకారము దాల్చాడు...రాత్రియే శివరాత్రి అంటారు.

ప్రాణికోటి యావత్తు నిద్రపోతూ ఉండే కాలం.. రాత్రి , నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం. ఆ రాత్రి వేల తానూ మేల్కొని రక్షించే శంకరుడు రాత్రి దేవుడు . తన వివాహం కూడా అర్దరాత్రి దాటాకనే మొదలవుతుంది. చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది. చలి , మంచు భాధకు తాళలేక శరీరంలో పుట్టే చలిని తట్టుకోలేక గొంగల్లని కప్పుకుని వుండగా - పిశాచ , భూత ప్రేతాలకి దుఃఖాన్ని చేకూర్చే వాడైన శంకరుడు, నెలవంకను శిరోభూషనముగా ధరించి భస్మ లేపనం వాసనల మద్య కన్నుల పండువగా జరిగే పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవము కోసం ఎన్ని రాత్రులైనా వేచి చూడాల్సిందే.....
ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, "ఓం నమఃశివాయ" అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.
భారత దేశపు హిందూ మతం పండుగలలో శివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.


మహాశివ రాత్రి వృత్తాంతం
మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.
గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణ మహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.
అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.


బ్రహ్మ, విష్ణువుల యుద్ధం
ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.
ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుచుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.


బ్రహ్మకు శాపము
శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానము లో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు.


మొగలి పువ్వుకు శాపము
ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము
అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరము లు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.

శివరాత్రి పర్వదినం
ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు , దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.
ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

జాగరణము
జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము.


No comments:

Post a Comment