Thursday, 23 February 2017

ఈశ్వర తత్వానికి మేలైన దారి - శివరాత్రి




కాలగమనంలో శుక్లపక్షం, కృష్ణపక్షం ఎలా ఉన్నాయో, పూర్తి చీకటి– అమావాస్య వైపుకు తిరిగిన కాలంలో ఇంద్రియ నిగ్రహం, ఆత్మ సంయమనం అనే మార్గాల ద్వారా ఈశ్వర తత్వానికి దగ్గరగా వెళ్లగలిగే సోపానాలే, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఇవి మాసానికి ఒకమారు, సంవత్సరానికి ఒకమారు మనకు లభిస్తాయి. ఇది ఈశ్వరుడు మనకోసం ఎంచుకున్న కాలం. మహాశివరాత్రి రోజున జరిగే రుద్రాధ్యాయ పారాయణ నమక చమకంతో జరిపే అభిషేకాలు ఎంతో లాభదాయకాలు. సమస్త పాపక్షయానికి, అనావృష్టి నివారణకు, గోరక్షకు, అకాల మృత్యువు దోష నివారణకు, అభయానికి, నాయకత్వం పొందటానికి, వ్యాధి నివారణకు, సంతాన ప్రాప్తికి, కుటుంబ సంక్షేమం, తదితరాలకు మొదటి అనువాకం, ధనప్రాప్తికి, శత్రుక్షయానికి, విజ్ఞతప్రాప్తికి రెండవ అనువాకం, ఆరోగ్యానికి మూడవ అనువాకం, క్షయవ్యాధి నివారణకు, సంపూర్ణ ఆరోగ్యానికి నాల్గవ అనువాకం, మోక్షప్రాప్తికి అయిదవ అనువాకం, శివునితో సమానమైన పుత్రప్రాప్తికి అయిదు, ఆరు అనువాకాలు, ఆయువుకు ఏడవ అనువాకం, రాజ్యప్రాప్తికి ఎనిమిదవ అనువాకం, ధనకనక వస్తువాహనాలు, వివాహం జరగడానికి తొమ్మిదవ అనువాకం, సమస్త భయ నాశనానికి పదవ అనువాకం, తీర్థయాత్రలకు, జ్ఞానార్జనకు పదకొండవ అనువాకం, ఇలా సకల కార్యసిద్ధికోసం మహాశివరాత్రి అనువాకాలను ఉచ్చరిస్తూ అభిషేకం చేయడం ఆచారం. దీని తర్వాత శివునితో మమేకమవుతూ చమకంతో అభిషేకం జరుపుతారు.
పూర్వం రాక్షసులు శివరాత్రి పూజ చూసి, సుషుప్తి దశలో శివ శివ అని మంత్ర పఠనం చేశారని, దానితో వారి పాపాలు మటుమాయమయ్యాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన మహాశివరాత్రి పర్వదినం రోజున శివరాత్రి వ్రతం ఆచరించాలని సంకల్పం చేసుకొన్నవారు ఉదయాన లేచి దినకృత్యాలు పూర్తిచేసి స్నానమాచరించి ఆలయానికి వెళ్లాలి. శివుని దర్శనం చేసుకోవాలి. భక్తులు ఉపవాస దీక్ష బూని శివపురాణం చదవాలి. రాత్రి పూర్తి శివనామం జపిస్తూ జాగరణం చేయాలి. శివపురాణ కథలను వినాలి. నాలుగు యామాల పూజ జరపాలి.
అలాగే శివరాత్రి రాత్రి పూట ఆలయాల్లో పూజ జరుగుతుంది. ఆలయ గర్భగుళ్లలోని శివలింగాలని పూలతో, బిల్వపత్రితో అలంకరిస్తారు. రుద్రం, నమకం, చమకం పఠనం జరుపుతారు. ప్రత్యేక అభిషేకాలు జరుపుతారు. శివరాత్రి రోజున శివుని దర్శనం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. శివరాత్రి రోజున శివుడిని దర్శనం చేసుకోవడం ద్వారా శుభకార్యాలు నిర్వహించిన ఫలితం దక్కుతుంది.

No comments:

Post a Comment