Saturday, 2 January 2021

శివపురాణం 40

 పార్వతి కల్యాణం (పార్ట్ 7)


కొన్ని కోట్లమంది అన్ని లోకములనుండి ఆ పెళ్ళికి బయలుదేరి పోతే ఆ బరువు ఒక్కచోటికి వెళ్ళిపోయేటప్పటికీ ఇంకా శేషుడు భూమిని పట్టుకోలేక ఒక పక్కకి వంగిపోయాడు. ఆ సమయంలో దేవతలందరూ శంకరుని దగ్గరకు వచ్చి ‘శంకరా, ఇప్పుడు నీ నిజరూపమును చూసి పరిపూర్ణమయిన మనస్సుతో మేనకా హిమవంతులు పరవశించి పోయి కన్యాదానం చేసేస్తారు. అలా చేయగానే మోక్షం వచ్చేసి వారికి ఆ రూపం పోతుంది. అప్పుడు హిమశైలం ఉండదు. హిమశైలం అనేక రత్నములకు, బంగారమునకు ఆలవాలం. ఆ శైలం మీద ఎందఱో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. అది లేకపోతే భూమికి శోభ ఉండదు. కానీ నీకు నిండు మనస్సుతో కన్యాదానం చేయకుండా ‘ఏమిటి బాబోయ్ ఇలాంటి అల్లుడు వచ్చాడు’ అనే అర్థ మనస్సుతో నీకు కన్యాదానం చేసేటట్లుగా వాళ్ళ మనస్సు నీవే మార్చు శంకరా’ అని అడిగారు. అపుడు శంకరుడు మీ అందరికీ హిమవత్పర్వతము కావలసివస్తే తప్పకుండా నేను అలాగే ప్రవర్తిస్తాను’ అన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు.
ఈలోగా హిమవంతుడు తానూ శుభలేఖలు వేయించి బంధువులందరికీ పంపించాడు. ఆయన తన కుమార్తె పెండ్లి శుభలేఖలను లోకములన్నిటిలో ఉన్న పర్వతములన్నిటికీ పంపించాడు. హిమవంతుడు ఎంత గొప్పగా తన కూతురి వివాహం చేస్తాడో చూడాలని పిలవబడిన ఆ పర్వతములన్నీ తమతమ కుటుంబములు, బంధు మిత్రులతో బయలుదేరాయి. పెళ్ళికి నదులన్నీ వచ్చాయి. నదులతో పాటు రాజ్యములు, అరణ్యములు, అన్నీ బయలుదేరాయి. ఇంతమంది బయలుదేరి పార్వతీ కళ్యాణమునకు హిమవత్పర్వతము మీదికి చేరుకున్నారు.
వీళ్ళందరినీ చూసి హిమవంతుడు పొంగిపోయాడు. తన పురమును చక్కగా అలంకరింపచేశాడు. ఇళ్ళముందు సువాసనలతో కూడిన జలములను ప్రతి వీధిలో జల్లారు. ముత్యములతో ముగ్గులు పెట్టారు. ప్రతి ఇంట్లో హేమకుంభములను ఎత్తారు. శంకరుడు చూసి పొంగిపోవాలని నందీశ్వరుని పటములను గీసి ఊరు ఊరంతా పెట్టేశారు. ఎవరికి వచ్చిన వాద్యములు వారు వాయిస్తున్నారు. ఈలోగా పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడన్నారు. హిమవంతునితో ఎదురు సన్నాహమునకు వెళ్ళడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఈలోగా మేనకాదేవికి దూరం నుంచి అల్లుడిని ఒకసారి చూద్దామని అనిపించింది. అంతఃపుర గవాక్షం నుంచి చూస్తూ ‘నారదా వచ్చే వారిలో మా అల్లుడు ఎవరో చెప్పవలసినది’ అని అడిగింది. నారదుడు చాలా తమాషా అయిన మనిషి. ఎప్పుడూ లోకకళ్యాణం కోసం ప్రవర్తిస్తూ ఉంటాడు. భూతప్రేత గణములు వస్తున్నాయి. వాటి మధ్యలో ఒంటిమీద బట్ట లేకుండా దిగంబరుడై పుర్రెల మాల వేసుకుని, ఒకాయన ఎగురుతూ ఆడుతూ వస్తున్నాడు. ఆవిడ మొహం తిప్పుకుంది. అపుడు నారదుడు ‘అలా మొహం తిప్పుకుంటావేమిటి’ చూడు ఆయనే మీ అల్లుడు’ అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఆవిడ వెంటనే బాధతో అంతఃపురంలోకి వెళ్ళి పార్వతీ దేవిని పిలిచి ఇందుకోసం తపస్సు చేశావా? అని అడిగింది. పార్వతీదేవి అమ్మా, నీకు వచ్చిన బాధ ఏమిటి? అని అడిగింది. మేనకాదేవి ‘అమ్మా, వాడు పెళ్ళికొడుకు ఏమిటి? ఒంటి మీద బట్ట కూడాలేదు. ఆయన అల్లుడేమిటి? ఆ ఎగురుడు ఏమిటి? ఆ నాట్యం ఏమిటి? ఇంతమంది జనంలో ఒక్కడూ నచ్చలేదా నీకు! ఈ దిగంబరుడు నచ్చాడా? ఒక్కనాటికీ నిన్ను వీనికిచ్చి కన్యాదానం చేయను’ అని చెప్పింది. ఇపుడు దేవతలు కోరిన కోరిక తీరిపోయింది.
అందరూ విడిదికి వెళ్ళిపోయారు. తరువాత శంకరుడు మరల స్వస్వరూపమును పొందేశాడు. ఇప్పుడు మేనకాదేవిని ఎదురు సన్నాహమునకు వెడదాము రమ్మనమని కబురు చేస్తే తాను ఒక్కనాటికీ రానని చెప్పింది. పార్వతీదేవి అయ్యో ఇదేమిటి చిట్టచివరకు వచ్చి స్వామి మరల ఇలాంటి మెలికపెట్టారు. అది దేవకార్యము అని తెలుసుకుంది. అప్పుడు మళ్ళీ అరుంధతీదేవి వచ్చింది. ఆమె మేనకాదేవితో ‘అమ్మా, పిచ్చిదానా, నీకు శంకరుడంటే ఏమి తెలుసు? ఆయన కృపాళువు. మహానుభావుడు. ఆయన దేవతలకార్యమై ఇలా చేయవలసి వచ్చింది. శంకరుని సహజమయిన రూపం అది కాదు. నిజంగా శంకరుడు ఎలా ఉంటాడో చూడడానికి నీవు ఎదురు సన్నాహంలో మధుపర్కం పట్టుకుని పెద్దలయిన వాళ్ళతో కలిసి వెళ్ళి చూడు అని చెప్పింది. ఇపుడు మేనకాదేవి ఎదురు సన్నాహంలో పెద్దలతో కలిసి వెడుతోంది. కానీ అల్లుడు ఎలా వస్తాడో ఏమిటోనని రుసరుసలాడుతోంది. అటునుంచి శంకరుడు పెళ్ళికుమారుడిగా వస్తున్నాడు.
కోటి సూర్యప్రకాశం సర్వావయవ సుందరం – విచిత్రవసనంచ్ఛాదా నానాభూషణ భూషితం’ అయి ఆయన విడిదిలోంచి బయటకు వచ్చే ముందే కోటి సూర్యుల కాంతి వచ్చింది. ఇప్పుడు బంగారు సరిగంచు పంచె కట్టాడు. అటువంటి ఉత్తరీయం వేసుకున్నాడు. అనేకమయిన భూషణములు ధరించాడు. బంగారు కంకణములు, హారములు, కేయూరములు అన్నీ పెట్టుకుని వస్తున్నాడు. ఆ వస్తున్నా శంకరుని నిజ స్వరూపం ఇది. నవ్వుతూ ఉన్నాడు. ముట్టుకుంటే కందిపోతాడేమో అనేలా ఉన్నాడు. చిన్ని చిరునవ్వు నవ్వుతున్నాడు. సూర్యుడు గొడుగు అయ్యాడు. చంద్రుడు గొడుగుకి దండం అయ్యాడు. శంకరుడు వస్తున్నప్పుడు గంగాదేవి, యమునాదేవి ఇద్దరూ రెండు పక్కలా శంకరుడికి వింజామరలు వీస్తూ వస్తున్నారు. ఇలా బయలుదేరి వచ్చేసరికి మేనకాదేవి చూసి పొంగిపోయింది. కానీ చిన్న అనుమానం. త్రికరణ శుద్ధి లేకపోవడం వలన హిమవంతుడిని పరమాత్మ అట్టేపెట్టాడు. ఇప్పుడు పెళ్ళికొడుక్కి ఎదురు వచ్చి వీళ్ళందరూ ఆయనకు నమస్కారం చేశారు. మేనకాదేవి ఆయన అందం, లావణ్యం, చూసి మురిసిపోయింది. ఇప్పటివరకు మూతులు తిప్పిన వాళ్ళందరూ అమ్మ బాబోయ్ – శంకరుడు ఎంత చమత్కారో’ అని అనుకున్నారు. స్వామికి మధుపర్కం ఇచ్చి, మేళతాళములతో ఆ దేవతలనందరినీ తోడ్కొని అంతఃపురంలోకి తీసుకుని వస్తున్నారు. అలా తీసుకు వస్తుంటే శ్రీమహావిష్ణువు శంకరుని దగ్గరకు వచ్చి ‘శంకరా, మొత్తం అన్ని లోకములలో ఉన్న దేవతలు, దానవులు దైత్యులు యక్షులు కిన్నరులు కింపురుషులు సాధ్యులు సిద్ధులు పర్వతములు నదులు సముద్రములు జంతువులు సమస్త చరాచర ప్రపంచము ఇక్కడికి నీ పెళ్ళికి వచ్చేసింది. దానితో దక్షిణదిక్కు పైకి లేచిపోయింది. ఉత్తర దిక్కు వంగిపోతోంది. దక్షిణదిక్కు ఈ పెళ్ళి నేనెందుకు చూడకూడదన్నట్లు క్షణక్షణమునకు పైకి లేచిపోతోంది. భూమిని ఇప్పుడు సమతలం చేయాలి. మీరు తొందరపడి ఏదో ఒకటి చేయండి’ అన్నాడు. శంకరుడు అన్నాడు ‘సముద్రమును ఆపోశనపట్టినవాడు, అపారమయిన శక్తి సంపన్నుడు, లలితాసహస్రనామ స్తోత్రమును ఉపదేశం పొందినప్పుడు శ్రోత, పంచాక్షరీ మహా మంత్రమును కొన్ని కోట్లు చేసినవాడు, ఏ మహానుభావుడి ఆశ్రమంలో పులులు, ఆవు దూడలు కలిసి ఆడుకుంటాయో ఏ మహానుభావుడు నడిచి వెడుతుంటే సమస్త జగత్తు నమస్కారం చేస్తుందో, ఎవడు ఒక్కసారి కడుపు మీద రాసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని జీర్ణం చేసుకున్న వాడో అటువంటి వాడు, నాకు మహాభక్తుడు అయిన అగస్త్యుడి దివ్యమయిన బరువు ఒక్కటిచాలయ్యా – అందుకని అగస్త్యుడిని దక్షిణ దిక్కుకు వెళ్ళమనండి. అపుడు భూమి మళ్ళీ కుదురుకుంటుంది. ఆయన దివ్యతేజస్సు అటువంటిది’ అన్నాడు. అపుడు అగస్త్యుడు శంకరా, నాకు నీ కళ్యాణం చూసే భాగ్యం లేదా? అని అడిగాడు. అపుడు శంకరుడు నీకు తప్పకుండా నా కళ్యాణం గోచరం అవుతుంది వెళ్ళవలసినది అని చెప్పారు. ఆనాడు అగస్త్యుడు దక్షిణ దిక్కుకు వచ్చాడు. భూమి సమతలంగా నిలబడింది.
ఇప్పుడు పెళ్లి మంటపంలోకి శంకరుడిని తీసుకువెళ్ళి పెళ్ళి కొడుక్కి, పెళ్ళి కూతురుకి మంగళ స్నానములు చేయించాలి. పార్వతీ దేవికి మంగళ స్నానం చేయిస్తున్నారు. ఇలాంటివి విన్నంత మాత్రం చేత ఇంటికి తోరణములు నిలబడతాయి. పార్వతీ దేవి మంగళ స్నానం అంటే మాటలు కాదు. అది అభిషేకం కాదు. అమ్మవారికి చక్కగా నూనె పెట్టించి, వొళ్ళు నలిపించి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించారు. కళ్యాణ మండపం చుట్టూ చక్కగా ముగ్గులు పెట్టారు. రత్నపీఠం తెచ్చి దాని మీద పార్వతీదేవిని కూర్చోపెట్టారు. అమ్మవారికి ముత్తైదువలందరూ అక్షతలు వేసి తలస్నానం చేయిస్తున్నారు. పెద్ద ముత్తైదువలు వచ్చి కుంకుడు పులుసు పోస్తుంటే తల్లిగారు స్వయంగా అమ్మవారి తల రుద్దింది. ఏమి తల అది. ఆ జుట్టు కనపడితే చాలు అజ్ఞానం పోతుంది. ఏమీ తెలియని దానిలా అందరి మెడలలో మంగళ సూత్రములు నిలబడడానికి కారణం అయిన సర్వమంగళ ఆ రోజున తానే పెళ్ళికూతురు అయింది. తలస్నానం చేయించి పొడి బట్టతో చక్కగా ఒళ్ళంతా తుడిచారు. అనేక రత్నహారములు, అలంకారములు చసి అమ్మవారికి పట్టుబట్టలు తొడిగారు. పేరంటాండ్రు అందరూ వచ్చేసరికి ఆ తల్లిని తీసుకువచ్చి అక్కడ కూర్చోపెట్టారు. ఈ రత్నాలంకారములన్నీ చేసి అమ్మాయిని కూర్చోపెట్టాక మేనకాదేవికి బెంగ కలిగింది. మా అమ్మాయి ఇంత అందగత్తె. దిష్టి తగిలిపోతుందేమోనని ముఖం కనపడకుండా ఎక్కువ అలంకారం చేసేయమని మేనకాదేవి చెప్పేసరికి అక్కడి స్త్రీలు ఆమెకు అలా అలంకారం చేసేశారు. అమ్మవారిని బుట్టలో కూర్చోబెట్టి బ్రహ్మగారు ముందు, లక్ష్మీనారాయణులు పక్కన నడుస్తుండగా అమ్మవారిని తీసుకుని మేళతాళములతో పువ్వులు జల్లుతుండగా అక్కడికి తీసుకు వచ్చారు.

పార్వతీ కళ్యాణము – పార్ట్ 8


కళ్యాణం కోసమని శివుడు పీటల మీదకు వచ్చి కూర్చుంటున్నాడు. అది గొప్ప చారిత్రాత్మకమయిన కళ్యాణము. కాబట్టి శివుడు పీటల మీదికి వస్తుంటే మేఘముల లోంచి వృష్టి పడిపోయిందా అన్నట్లుగా పువ్వులు జల్లేశారు. అయ్యవారు పెద్దపుష్ప వృష్టితో పెద్ద మేళతాళముల ధ్వనులతో గణాధిపులు అందరూ నిలబడి ఎక్కడ చూసినా జయజయశంకర హరహర శంకర అని జయజయ ధ్వానాలు చేస్తుంటే పీటల మీదికి వచ్చి కూర్చున్నాడు. పార్వతీదేవి గౌరీతపస్సు చేసింది. ఆవిడే ఆవిడ గురించి తపస్సు. ఎందఱో ధన్యులు అయినవారు, దిక్పాలకులు, ఇంతమంది మధ్యలో నిలబడి కొలుస్తుండగా చుట్టూ ఒకపక్కన సరస్వతీదేవి, మరొక పక్కన లక్ష్మీదేవి, అరుంధతి శచీదేవి వీళ్ళందరూ వెంట వస్తుంటే అమ్మవారు పెళ్ళి పీటల మీదికి బయలుదేరి వస్తోంది.
ఎన్నడూ అలా వెళ్ళవలసిన అవసరం లేని శంకరుడు పార్వతీదేవి అడిగిందని కన్యాదాత గారింటికి తానే వచ్చాడు. హిమవంతుడి ఇంటికి వచ్చి లోపల పొంగిపోతూ సంతోషంగా ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు పూర్ణ చంద్రుడు అవుతుంటే కళలు పెరుగుతుంటే సముద్రంలో పోతూ పెరుగుతుంది. పెళ్ళి పీటల మీదకి స్వామివస్తుంటే పౌర్ణమి చంద్రుని చూసిన సముద్రం పొంగిపోయినట్లు జనం అందరూ ఆ దేవసార్వభౌముడిని జగదంబతో పీటల మీద చూస్తున్నాము మా కలలు పండిపోయాయి. మాకు కన్ను ఉన్నందుకు ఇన్ని కోట్ల జన్మల తరువాత మా నేత్రములు సార్ధకత చెందాయి’ అని పరవశించి పోతున్నారు.
ఇపుడు హిమవంతుడు శంకరుడిని తీసుకువచ్చి చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి మహానుభావుడు శంకరుడు నాకు అల్లుడు అవడానికి తనకు పిల్లనివ్వమని కబురు చేయడం మాని తానే వచ్చాడని పొంగిపోయి వినయ విధేయతలతో ఆ పెళ్ళికొడుకు కాళ్ళు కడిగాడు. పార్వతీ పరమేశ్వరులకు మధ్యలో తెర కట్టారు. తెరకు అటువైపు శంకరుడు, ఇటువైపు పార్వతీదేవి కూర్చున్నారు. పార్వతీ పరమేశ్వరులవి శరీరములు రెండు, కానీ మనస్సు మాత్రం ఒక్కటే. ఇద్దరి మనస్సులో ఒక్కటే కోరిక ఉంది. ఇది లోకంలో ఏ దంపతుల మధ్యనయినా ఉండేదే. అబ్బ మధ్యలో ఈ తెరను ఎప్పుడు తీసేస్తారా అని అనుకుంటున్నారు. అనగా ఇద్దరి మనస్సులలోను ఒకటే కోర్కె దంపతులకు అలా ఉండాలి.
ఇపుడు హిమవంతుడు కన్యాదానం చేయడం కోసమని చెప్పి మేనకాదేవి కలశంతో నీళ్ళు పట్టుకొనగా శంకరుని పాదములు కడగడం కోసమని సిద్ధపడ్డాడు. అక్కడ బ్రహ్మగారు యాజ్ఞీకం చేస్తున్నారు. ఆయన అన్నారు ‘పిల్లవాడి ప్రవర చెప్పాలి కదా ఎవరికి తెలుసండి’ అని అడిగారు. అపుడు అక్కడ ఉన్నవారిలో ఒక పెద్దాయన ‘నీవు చతుర్ముఖ బ్రహ్మవి – బ్రహ్మ స్థానంలో ఉన్నవాడివి. అటువంటి వాడివి నీకే తెలియక పోతే ఎవరికీ తెలుస్తుంది? పోనీ లక్ష్మీ నారాయణులను అడగండి. అన్నారు. అపుడు నారాయణుడు నేను ఆయన వామభాగంలోంచి పుట్టాను నాకన్నా ముందు ఉన్నాడు ఆయన. నాకు ఆయన సంగతి తెలియదు అన్నాడు. మరి ఎవరిని అడిగితే తెలుస్తుందా అని పరికిస్తే అక్కడ పొంగిపోతూ వీణ వాయిస్తున్న నారదుడు కనిపించాడు. నారదుని అడుగగా మహాత్ముడికి ప్రవర ఏమిటి? నిర్గుణ నిష్కలంక నిరంజన అని ప్రవర చెప్పేయండి అంతే అని చెప్పేసరికి సభలో ఉన్నవారు పొంగిపోయి శంకరుడికి ప్రవర అలా చెప్పండని అన్నారు.
అప్పుడు అల ప్రవర చెప్పి హిమవంతుడు మేనకాదేవి పార్వతీ దేవిని కన్యాదానం చేస్తున్నారు. అప్పుడు తెరతీసి శుభముహూర్తంలో జీలకర్ర, బెల్లం పెట్టిస్తున్నారు. తెర పైకెత్తినపుడు కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి. తెర తీసివేయగానే ఆవిడ ఆయనను, ఆయన ఆవిడ చూసుకుంటారు. ఆ శుభ ముహూర్తంలో కళ్ళు కళ్ళు కలుసుకుంటే జీవితాంతం మనస్సులు ఏకీకృతం అవుతాయి. ఇద్దరి మధ్య అనురాగం అంకురిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. వారు లోకమునకు పాఠం చెప్తున్నారు.
ఇపుడు తలంబ్రాలు పోసుకోమన్నారు. కోరికలు పోస్తోందా అన్నట్లు అమ్మవారు తలంబ్రాలను పోస్తోంది. అన్నీ తీరుతాయి అన్నట్లుగా పున్నమి చంద్రుడి వంటి ముఖము ఉన్న పార్వతీదేవి తలమీద తలంబ్రాలను శంకరుడు పోశాడు. అలా ఇద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్న ఘట్టం చూసి లోకం అంతా పొంగిపోయింది. తరువాత పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణమునకు శక్తిమంతమయిన మంత్రం చెప్తారు. తరువాత విడిది గృహప్రవేశం చేయించాలి. అప్పుడు వారిని బయటకు తీసుకు వచ్చి పీఠంమీద విడిది గృహప్రవేశం చేయించారు. తదుపరి లాజహోమంతో కార్యక్రమం పూర్తిచేస్తారు. అప్పుడు దేవతలందరూ వచ్చి ‘అయ్యా, పూర్వం మీరు రతీదేవికి అభయం ఇచ్చారు. దయచేసి మన్మథుని బ్రతికించండి’ అని అడిగారు. అపుడు శంకరుడు పార్వతివంక సంతోషంగా చూశాడు. అంతే మరల మన్మథుడు పుట్టేశాడు. మళ్ళీ జగత్ సృష్టి ప్రారంభం అయింది.
హిమవంతుడు పొంగిపోయి పార్వతీదేవిని దగ్గరకు పిలిచి ‘అమ్మా ఎంత అదృష్టం నీకు తండ్రిని అయ్యాను. నువ్వు ఈవేళ ఒక ఇల్లాలివి అయిపోయావు, నిన్ను అత్తవారింటికి పంపిస్తున్నాను అని తలమీద నెమ్మదిగా జుట్టంతా రాస్తూ పదిమంది చూస్తుండగా కన్నుల నీరు కార్చేశాడు. ఇప్పుడు అప్పగింతలు పెడుతూ పార్వతీదేవికి సుద్దులు చెప్తున్నారు. తరువాత పార్వతీదేవి వద్దకు చెలికత్తెలందరూ వచ్చారు. అమ్మా నీకు సారె పెడతాము అల్లుడు గారికి కూడా సారె పెట్టాలని ఉంది. కానీ అల్లుడు గారికి సారె పెడదామంటే మా దగ్గరే కాదు ఇంత ఐశ్వర్యవంతమయిన హిమవత్పర్వతం దగ్గరే కాదు శంకరుడికి ఇవ్వగలిగిన వస్తువులు ఎవరి ఇంట్లోనూ ఉండవు అన్నారు. చెలికత్తెలు పరిహాసం ఆడినట్లూ ఉంది, శంకరుడికి ఇవ్వలేనితనమును చెప్తున్నారు. హిమవంతుడు తన ఐశ్వర్యమునకు తగినట్లు కూతురు అత్తవారింటికి వెడుతోందని ఎన్నో కానుకలను ఇచ్చాడు. ఎన్నో పట్టు చీరలను, ఎన్నో బంగారు నగలను, అనేక మత్తగజములను, అనేక అశ్వములను, అనేక పల్లకీలను, అనేక భూములను, పురములను, పుష్పములను, సారెగా ఇచ్చి పంపాడు.
పార్వతీ పరమేశ్వరులిద్దరూ నందివాహనం ఎక్కి కైలాసమునకు బయలుదేరారు. వెనక సరస్వతీ దేవి, చతుర్ముఖ బ్రహ్మ, వారి వెనుక లక్ష్మీ నారాయణులు, శచీదేవి, ఇంద్రుడు బయలుదేరారు. ఇంతమంది దేవతలు కైలాసమును చేరుకున్నారు. పార్వతీ దేవి వచ్చింది కాబట్టి ఇప్పుడు కైలాసంలో నిత్యోత్సవములు ప్రారంభం అయ్యాయి. తరువాత ఆ దేవతలు అందరూ శంకరుని వద్దనుండి కానుకలు, తాంబూలములు పుచ్చుకుని స్వస్థానములకు వెళ్ళిపోయారు.
పార్వతీ పరమేశ్వరులిద్దరూ కైలాస పర్వతం మీద కూర్చుని అక్కడి నుండి ఎప్పుడూ తమను నమ్మినవారిని, కొలిచిన వారిని, తమకు నమస్కరించినవారిని అలా చూస్తూ, కాపాడుతూ, జగత్తుకి తల్లిదండ్రులై విరాజిల్లుతున్నారు.
కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే
శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్సురదనుభవాభ్యాం నతిరియమ్!!
అంటారు శంకరభగవత్పాదులు. కోరి కొలిచిన వాళ్ళకి ఇక్కడే ఉండి రక్షించే ఆ మాతాపితరులు లోకములను చల్లగా చూస్తున్నారు.
ఈ పార్వతీ కళ్యాణ ఘట్టమును, ఈ శివమహాపురాణ ప్రవచనమును ఎవరు విన్నారో, ఎవరు చదివారో, వాళ్ళకు సర్వ కాలములయందు పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది.
సర్వం శ్రీ ఉమా మహేశ్వర పదబ్రహ్మార్పణమస్తు!!

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment