Wednesday 29 March 2017

పంచాంగాలు - ఫలితాలు


ప్రపంచంలోనే భారతదేశం అత్యంత ప్రాచీన పంచాంగం రూపొందించింది. భారతీయ పంచాంగం చాంద్ర-సౌర మాన అధారంగా నిర్మించబడింది. ప్రపంచంలో మరే దేశం ఇలా పంచాంగాలు లేవు. అధిక మాసాలు, క్షయ మాసాలు ఉదాహరణలు ఋగ్వేదంలో, 'వేదాంగ జ్యోతిషం' గ్రంధంలో ఉన్నాయి.


తిథులు శ్రేయస్సుకు, వారాలు ఆయువృద్ధికి, నక్షత్రాలు పాప పరిహారానికి, యోగాలు రోగ నివారణకు, కరణములు కార్యసిద్ధికి తోడ్పడతాయి. పైన ఐదింటీనీ కలిగినదే పంచాంగం. పంచాంగం చూడటం వలన కళ్యాణం, దుస్వప్న దోష ఫలితాల నివారణ, గంగా స్నాన పుణ్యఫలం, గోదాన ఫలం, సంపదలు, ఆరోగ్యం మొదలైన శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని ప్రతీతి.


పంచాంగం అంటే 5 అంగాలు. తిథి, వార, నక్షత్ర, యోగ, కారణాలు. చాంద్ర దశను బట్టి 'తిథి' ఏర్పడింది. సప్త గ్రహములతో 7 రోజులు (వారాలు) ఏర్పాటు చేశారు. ఆదివారం అంటే సూర్యుడితో మొదలవుతుంది. చంద్రుడు భూమి చుట్టు తిరుగుతూ, ఒక ప్రదక్షిణం పూర్తి చేయటానికి సుమారు నెల రోజుల సమయం తీసుకుంటుంది. సూర్యుడు, ఒక్కక్క రాశిలో ఒక్కక్క నెల వుంటాడు. సూర్యుడు మకరంలోకి సంక్రమణం చేసినప్పుడు సంక్రాంతి వస్తుంది. 12 రాశులలో 12 నెలలు గడుస్తాయి, అంటే ఓ సంవత్సరం. ఇది భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కాలం. 2 నెలలకు ఒక ఋతువు, 6 నెలలకు ఒక ఆయనం (ఉత్తరరాయణం లేదా దక్షిణయణం) ఏర్పడ్డాయి.
నక్షత్రం – సూర్యోదయం వేళ, చంద్రుడు యే నక్షత్రానికి అతి సమీపంగా ఉంటాడో అది ఆ రోజు నక్షత్రం అవుతుంది. 'యోగం' చంద్ర-సౌర రోజు. కరణం – తిథిలో సగం. ఈ పంచ అంగాలను ఉపయోగించి సృష్టి మొదలైనప్పటి నుంచి కాలాన్ని కొలిచే సాధనం తయరయింది.


తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం(పంచ+అంగం). పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు 2 రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది) , సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది).


పంచ అంగాలు:
1. ఉపాయం, 2. సహాయం, 3. దేశకాల విభజన, 4. ఆపదకు ప్రతిక్రియ, 5. కార్యసిద్ధి


పంచాంగం ఎందుకు చూడాలి?
 
ముహూర్తం చూసేందుకు పంచాంగం తిరగే యడం పెద్దల అలవాటు. అసలింతకీ పంచాంగంలో ఏముంటుందీ అని ప్రశ్నించుకుంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాలు అంటే భాగాలుంటాయి.
 

తిథి: సూర్యచంద్రుల కలయికను అనుస రించి అంటే అమావాస్య నుంచి తిరిగి అమావాస్య వరకు గల కాలాన్ని పాడ్యమి, విదియ, తదియ. వంటి తిథుల పేర్లతో లెక్కిస్తారు.
పాడ్యమి నుంచి పున్నమి వరకు గల కాలం శుక్లపక్షమైతే, పాడ్యమి నుంచి అమావాస్య వరకు గల కాలం బహుళ పక్షం లేదా కృష్ణపక్షం. మొత్తం 30 తిథులతో కూడుకుని ఉన్నదే చాంద్రమానం. దక్షిణాదిన చాంద్రమానాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మనం ఏ శుభలేఖను తీసుకున్నా అందులో స్వస్తిశ్రీ చాంద్రమానేన.. ప్రారంభం కావడం గమనించవచ్చు.
 

వారం: సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గల కాలాన్ని రోజు గాను, ఆదివారం నుంచి వరుసగా 7 రోజులను ఒక వారంగానూ పరిగణిస్తారు.
 

నక్షత్రం: చంద్రగతిని ఆధారంగా చేసుకుని అశ్వని మొదలు రేవతి వరకు 27 నక్షత్రాలతో కూడిన కాలాన్ని నక్షత్రం అంటారు.
 

యోగం: రవి చంద్రుల కలయికను యోగం అంటారు. నక్షత్రాల వలె విష్కంభాది యోగాలు కూడా 27.
 

కరణం: చంద్రగతిని అనుసరించి బవాది 11 కరణాలు వరుసగా తిధిలో సగభాగంగా లెక్కిస్తారు. శుభతిథిని ఎన్నుకుని పని - ప్రారంభిస్తే సంపద, వారం వల్ల - ఆయుషు, నక్షత్రం వల్ల పుణ్యం, యోగం వల్ల వ్యాధినాశం, కరణం వల్ల ఇష్టకామ్యం సిద్ధిస్తాయి. కాబట్టి వివాహాది శుభకార్యాలను సుముహూర్తంలో ప్రారంభించడం వల్ల కార్యసిద్ధి, విజయం ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెపుతున్నాయి.

No comments:

Post a Comment