Monday, 27 March 2017

హేమలంబ నామ సంవత్సర నవనాయకుల పలితాలు.


హేమలంబ నామ సంవత్సర నవ నాయకులలో నలుగురు శుభులు, ఐదుగురు పాపులు. అశుభాదిపత్యం వలన లాభ నష్టాలు రెండు తీవ్ర స్ధాయిలో ఉన్నప్పటికి మంత్రిత్వం శుక్రునికి రావటం, అర్ఘ, మేఘాధిపత్యం గురువునికి రావటం వలన దేశం సుభిక్షంగా ఉండును. పంటలు బాగా పండుతాయి. రాజకీయాలలో స్త్రీల ప్రాబల్యం అధికం. శుభగ్రహ ఆదిపత్యం వచ్చిన బావాలు రక్షణ కలిగి ఉంటాయి. పాపగ్రహ ఆదిపత్యం ఉన్న బావాలు ఇబ్బందికరంగా ఉంటాయి.
వర్షలగ్నం, జగల్లగ్న కుండలి ద్వారా దేశ భవిష్యత్, ప్రజల భవిష్యత్, వ్యవసాయ, రాజకీయ, వ్యాపార రంగాల భవిష్యత్, ప్రకృతి వైపరీత్యాలు, వర్షయోగాలు, ధరల హెచ్చుతగ్గులు పరిశీలించవచ్చును.
వర్ష లగ్నం:- ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి ప్రవేశించే సమయంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్ధితి గతులను బట్టి వర్ష లగ్న కుండలిని సాధిస్తారు. దృక్ సిద్దాంత రీత్యా వర్ష లగ్నం మేష లగ్నం అయినది. లగ్నం నందు తృతీయ, షష్ఠాధిపతి అయిన బుధుడు, లగ్న, అష్టమాధిపతి అయిన కుజుడు; పంచమం నందు రాహువు, షష్ఠం నందు గురువు, నవమ స్ధానం నందు శని, లాభ స్ధానం నందు కేతువు, వ్యయ స్ధానం నందు చంద్రుడు, రవి, శుక్రుడు ఉండటం జరిగింది.
జగల్లగ్న కుండలి:- ప్రతి సంవత్సరం సూర్యుడు అశ్వనీ నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించిన సమయంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్ధితి గతులను బట్టి జగల్లగ్న కుండలిని సాధిస్తారు. దృక్ సిద్దాంత రీత్యా జగల్లగ్నం మకర లగ్నం అయినది. ద్వితీయం నందు కేతువు, తృతీయం నందు శుక్రుడు, చతుర్ధం నందు రవి, బుధులు, పంచమం నందు కుజుడు, అష్టమం నందు రాహువు, నవమం నందు గురువు, దశమం నందు చంద్రుడు, వ్యయం నందు శని ఉండటం జరిగింది.
చైత్ర శుక్ల సంవత్సరానికి అధిపతులుగా రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అంటూ 9 మంది నాయకులను నిర్ణయిస్తారు.
1)రాజు – కుజుడు
శ్లో :- అగ్ని తస్కర రోగాస్యుర్నృ పవిగ్రహ తాభృశం Ι
హతసస్యో బహువ్యాళో భౌమే వర్షాధిపే సతి ΙΙ
చైత్ర శుక్ల పాడ్యమి ఏ వారమో ఆ వారాధిపతిని ఆ సంవత్సరానికి రాజుగా నిర్ణయించాలి. చైత్ర శుక్ల పాడ్యమి మంగళవారం అయినది. హేమలంబ నామ సంవత్సరానికి రాజు కుజుడు అయినాడు కావున పరిపాలకులకు శతృత్వం, ప్రజలకు అగ్ని భయం, చోర భయం, సర్ప భయం ఉంటుంది. పంటలు సరిగా పండకపోవటం జరుగుతుంది.
2)మంత్రి – శుక్రుడు
శ్లో:- స్త్రీ సంయోగే సదా ప్రీతిర్పలితా ధాన్యజాతయః Ι
భవంతి వస్సు దూఘా స్సువృష్టి స్శాచివే భృగే ΙΙ
సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన వారాధిపతి మంత్రి అవుతాడు. మేష సంక్రమణం శుక్రవారం జరుగుటచే శుక్రుడు మంత్రి అయినాడు కావున వర్షాలు విశేషంగా కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. గోవులు పుష్కలంగా పాలిస్తాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్నత కలిగి ఉంటారు.
3)సేనాధిపతి – బుధుడు
శ్లో:- వాతాహతా వారిధారాః కదాచిత్ వర్షంతి సస్యాని ఫలన్వితాని Ι
నరాస్త్రియః కామరాటా భవేయు స్సేనాపత్యే ఖలు సోమసూనోః ΙΙ
సూర్యుడు సింహారాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు సేనాధిపతి అవుతాడు. సింహా సంక్రమణం బుధవారం జరుగుటచే బుధుడు సేనాధిపతి అయినాడు. మేఘాలు గాలికి ఎగరగొట్టబడి అరుదుగా వర్షిస్తాయి. పంటలు బాగా పండుతాయి. భార్యా భర్తలు సౌఖ్యంగా ఉంటారు. స్త్రీలపైన అఘాయిత్యాలు జరుగును. శత్రువులను రక్షణ శాఖ సమర్ధవంతంగా ఎదుర్కోనగలదు.
4)సస్యాధిపతి – రవి
శ్లో:- గోధుమ యవ ముఖ్యాని కుళుత్ధ చణకానిచ Ι
సమృద్ధాని భవిష్యంతి రవౌ సస్యాధి నాయకే ΙΙ
సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు సస్యాధిపతి అవుతాడు. కర్కాటక సంక్రమణం ఆదివారం జరుగుటచే రవి సస్యాధిపతి అవుతాడు. దీనివల్ల ఉలవలు, గోధుమలు, శెనగలు, యవలు మొదలైనవి సమృద్ధిగా పండుతాయి. ఎర్రనేల పంటలు ఎక్కువగా ఉంటాయి.
5)ధాన్యాధిపతి – శని
శ్లో:- కృష్ణ ధాన్యాని సర్వాణి సూక్షధాన్యాని యానిచ Ι
కృష్ణ భూమిస్తు ఫలితా మందే ధాన్యాధిపే సతి ΙΙ
సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు ధాన్యాధిపతి అవుతాడు. ధనస్సు సంక్రమణం శనివారం జరుగుటచే శని ధాన్యాధిపతి అవుతాడు. శని ధాన్యాధిపతి కావటం వలన నల్ల ధాన్యాలు, చిరుధాన్యాలు సమృద్ధిగా పండుతాయి. నల్ల నేల పంటలు సమృద్ధిగా పండుతాయి.
6)అర్ఘాధిపతి (అర్ఘాధిపతి అంటే ధరలకు అధిపతి) – గురువు
శ్లో:- సువృష్టి భిర్ధాన్య ధనైర్విరాజితా భూమిర్మహయజ్ఞ వరా మహీసురాః Ι
నిత్యోత్సవా మంగళ తూర్య నిస్వనై ర్భవంతి చార్ఘపతౌ గురౌ సతి ΙΙ
సూర్యుడు మిధునరాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు అర్ఘాధిపతి అవుతాడు. మిధున సంక్రమణం గురువారం జరుగుటచే గురువు అర్ఘాధిపతి అవుతాడు. దీనివల్ల మంచి వర్షాలతో, సమస్త ధాన్యరాశులతో, ధనంతో భూమి తలతూగుతుంది. బ్రాహ్మణులు యజ్ఞ కర్మలపై ఆసక్తి చూపుతారు. ఉత్సవాలతోనూ, జాతర, మంగళ వాయుద్యాలతో దేశం చూడముచ్చటగా ఉంటుంది. ధరలు అదుపులో ఉంటాయి.
7)మేఘాధిపతి – గురువు
శ్లో:- సస్యార్ఘ వృష్టిభిస్తుష్టాభవేద్భూమిర్నిరంతరం Ι
రోగభయాస్సర్వే గురౌ మేఘాధిపేసతి ΙΙ
సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు మేఘాధిపతి అవుతాడు. సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి గురువారం ప్రవేశించుట చేత గురువు మేఘాధిపతి అవుతాడు. దీని వలన దేశం సస్య శ్యామలంగా ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా లభిస్తాయి. ధరలు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు.
8)రసాధిపతి – కుజుడు
శ్లో:- రజితం లవణం సర్పి తిల తైల గుడాడయః
శూన్యార్ఘం యాంతి తే సర్వే భౌమే యధి రసాధిపే
సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు రసాధిపతి అవుతాడు. తులా సంక్రమణం మంగళవారం జరుగుటచే కుజుడు రసాధిపతి అవుతాడు. కుజుడు రసాధిపతి కావటం వలన వెండి, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, నూనె, నెయ్యి, బెల్లం మొదలైన రస వస్తువుల ధరలు తగ్గు ముఖం పడతాయి.
9)నీరసాధిపతి – రవి
శ్లో:- నీరశాధిపతౌ సూర్యే తామ్ర చందన యోరపి Ι
రత్న మాణిక్య ముక్తానాం జాయతే వృద్ధి రుత్తమా ΙΙ
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన వారాధిపతి ఆ సంవత్సరపు నీరసాధిపతి అవుతాడు. మకర సంక్రమణం ఆదివారం జరుగుటచే రవి నీరశాధిపతి అవుతాడు. రవి నీరశాధిపతి కావటం వలన రాగి, మంచి గంధం, మాణిక్యాలు, ముత్యాలు వృద్ధి చెందుతాయి. ప్రజలకు క్షోభ కలుగుతుంది. వినాశాలు కలుగుతాయి.

No comments:

Post a Comment