Tuesday 4 April 2017

తక్కువేమీ మనకు రాముడొక్క డుండు వరకు -


రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః ! రూప దాక్షిన్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే !
తేజసా దిత్యసంకాశః క్షమయా పృథివీసమః ! బృహస్పతిసమో బుద్ధ్యా యశసా వాసవోపమః !

శ్రీ రాముడు మానవాళికి మార్గదర్శకుడు. ఒక ఉత్తమ మానవుడి లక్షణాలు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన మహనీయుడు. శ్రీరామనవమి , శ్రీరాముడి యొక్క జన్మదిన వేడుక. విష్ణుమూర్తి యొక్క (7) వ అవతారమే రామావతారం. చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నమధ్యాన్న సమయ మందు రాముడు జన్మించెను . వసంత నవరాత్రులు ఆఖరి రోజు. ఈ తొమ్మిది రోజులు అంటే ఉగాది రోజు మొదలు కొని, శ్రీరామనవమి రోజు వరకు, ఉత్సవాలు, అర్చనలు, పూజలు, భజనలు, కీర్తనలు చేస్తారు. నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తారు. మరునాడు దశమి రోజున పట్టాభిషేకం చేస్తారు. ఉత్తర భారతదేశంలో మిధిలా, అయోధ్య - తమిళనాడు లో రామేశ్వరం లో ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం లో చాల వైభవం గా ఉత్సవాలు జరుగుతాయి. అయోధ్య లో లక్షలాది మంది పవిత్రమైన సరయు నదిలో స్నానం చేస్తారు, రధయాత్ర లో పాల్గొంటారు.

రాముడి ఆలయం లేని ఊరంటూ భారతదేశంలో ఉండదు. అన్ని ఆలయాలలోను పందిళ్ళు వేసి సీతారామకల్యాణం తప్పకుండా చేస్తారు. చైత్రమాసం ఆరంభం ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతూ ఉంటాయి, అందుకేనేమో సీతారామకల్యాణం లో తప్పకుండా మిరియాలు వేసిన పానకం అందరికి ఇస్తారు, పాయసం తప్పకుండా చేస్తారు. కళ్యాణం లోని తలంబ్రాలని పెళ్లి కాని పిల్లలు అక్షతలు గా వేసుకొంటే వెంటనే పెళ్లి కుదురుతుంది అని నమ్మకం. 

మనం కూడా ఇంట్లో యధా శక్తి రాముడి పూజ చేసుకొని, మల్లెపూల దండల తో సీతారాములని అలంకరించి, పానకం, వడపప్పు, పాయసం నైవేద్యం గా పెట్టి ప్రసాదం గా స్వీకరించండి. తప్పనిసరిగా సీతారామకల్యాణా నికి వెళ్ళండి. వీలుకాకపోతే live telecast భద్రాచల కళ్యాణం చుడండి.

రామాయణం : రామాయణకధ తెలియని భారతీయులు ఎవరు ఉండరు. రామాయణం చదవని వాళ్ళు చాలామంది ఉంటారు. కర్ణాకర్ణి గా కధ తెలియని వారు ఉండరు. ఎందుకంటే రాముడు మన జీవనానికి అంతర్వాహిని లాంటి వారు. రామాయణం కధగా పారాయణం చేయటం కంటే, శ్రీరాముడు మానవాళికి అందించిన సందేశాన్ని, ఆయన ఆచరించి చూపిన జీవనశైలిని మనం అందిపుచ్చుకొంటే తిరిగి రామరాజ్యమే భువిపై వెలుస్తుంది. అద్దం లో చూసుకొని ముఖం దిద్దుకొన్నట్టు మనం రామాయణం చదివి మన నడవడిని దిద్దుకొందాం. తండ్రి తో ఎలా మాట్లాడాలి, తల్లి తో ఎలా మాట్లాడాలి , భార్య తో ఎలా ప్రవర్తించాలి, సోదరులతో ఎలా ఉండాలి, ప్రభువు ఎలా ఉండాలి, సేవకుల తో ఎలా మెలగాలి, శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ మన నిత్య జీవితం లో ఎదుర్కొనే సమస్యలు, వీటన్నిటి పరిష్కారం మనకి రామాయణ కావ్యం లో వాల్మీకి మహర్షి అందించారు.
రామాయణకాలం : రామాయణాన్ని ఆది కావ్యం అన్నారు. రామాయణం త్రేతాయుగం లో వ్రాయబడింది. (ద్వాపరయుగం లో - భారతం, కలియుగం లో - భాగవతం). మరి అంతకు ముందు కృతయుగం లో ఏ గ్రంధము లేదా అనే సందేహం వస్తుంది. 

దీనికి సూటి సమాధానం లేక పోయినా, మనం ఒక విధమైన ప్రామాణికం చెప్పుకొవచ్చు - కృతయుగం లో ధర్మం నాలుగు పాదాలా నడచింది అని శాస్త్రం చెపుతుంది. తప్పొప్పులు అందరికి స్పష్టంగా తెలిసేవి. సమాజం కోసం ఏదైనా వ్రాయవలసిన/ఆచరించవలసిన అవసరం ఆ యుగం లో లేక పోయింది. అందువలన వేదాలని రక్షించి ముందు తరాలకి అందింఛడమే లక్ష్యం గా ఆ యుగం ముగిసింది. 

త్రేతాయుగం నాటికి సమాజం లో మార్పులు వచ్హాయి. మానవుడు విజ్ఞానం లో నూ, ఆర్థికం గాను అభివృద్ధి సాధించాడు. ఆర్ధిక వికాసం వల్ల అవసరాల నుంచి ఆశ ల లోకి, అక్కడ నుంచి దురాశ లోకి ప్రయాణించటం మొదలు పెట్టాడు. 

ఇలాంటి సందర్భం లో సమాజం దారి తప్ప కుండా ఉండాలంటే అంతవరకు వేదాలలో చెప్పబడిన విషయాలు అందరికి అర్థం కావాలని బ్రహ్మ సంకల్పించారు. దీన్ని ఆచరించి చూపించటానికి ఒక మానవుడి కధ ఆధారం కావాలని, అలా ఐతే అందరికి అర్ధం అవుతుంది అని సంకల్పించారు.

అంటే రాముడు మానవుడు అనుకోండి -అయన అనుభవించిన సుఖాలు చదివి మనం ఆనందిస్తాం, కష్టాలకి చలించిపోతాం, విజయాలు చదివితే ధర్మం జయంచింది అని గర్వ పడతాము, కష్టాలలో కూడా ఎలా మనో ధైర్యం గా ఉండాలో నేర్చుకుంటాము. ధర్మ మార్గంలో నడవటం అలవాటు చేసుకుంటాము . అదే రాముడు దేముడు, అవతార పురుషుడు అనుకుంటే - దేముడు కాబట్టి సాద్యం అయింది, మానవమాత్రులం మనవల్ల ఏమవుతుంది అనుకుంటాము . ఇదే రామాయణ పరమార్ధం, మానవుడు ఎలా ఉండాలో చెప్పేదే రామాయణం.
దీనికి నాంది - ఇంకో ముఖ్య కారణం - రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వల్ల - దేవ, దానవ, యక్ష , కిన్నెర, గంధర్వుల లో ఎవరివలనా మరణం లేని వరాన్ని పొందేడు. వర గర్వం తో ప్రాణికోటి ని హింసిస్తున్నాడు. మానవుల పట్ల చులకన భావం తో వారివల్ల మృత్యువు లేకుండా వరం పొందలేదు. అందువల్ల రాముడు మానవుడు ఐతే తప్ప రావణ సంహారం జరగదు. 

బ్రహ్మ గారి సంకల్పానికి అనుగుణంగా నారద మహర్షి వారు వాల్మికి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు సంభాషణ లో వాల్మీకి వారు ఇలా అడిగారు - 
  
కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ! ధర్మజ్ఞశ్చ సత్యవాక్యో ధృడవ్రతః !
(ఇక్కడ 5 శ్లోకాలు ఉన్నాయి ) 

ఓ నారద మునీంద్ర , సకల సద్గుణ సంపన్నుడు, ఎట్టి విపత్కర పరిస్థిలొను తొణకనివాడు, సకలధర్మాలు తెలిసినవాడు, శరణాగతవత్సలుడు, ఆడితప్పనివాడు , సకలప్రాణులకు హితము గూర్చువాడు, ధైర్యశాలి, అరిషడ్వర్గమును జయించినవాడును, అరివీరభయంకరుడు ఐనటువంటి మానవుడు ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించారు. 
                
దానికి సమాధానంగా నారదులవారు చాల సంతోషంతో ఈ విధంగా చెప్పారు -     
      
ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనై శ్రుతః ! నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన ధృతిమాన్ వశీ !
మీరు అడిగిన సమస్త సద్గుణాలు రాసిపోసి మానవరూపం ఇస్తే ఎలా ఉంటుందో అతడే శ్రీరామచంద్రమూర్తి. ఇక్ష్వాకువంశంలో దశరధుడి కి పుత్రుడిగా జన్మించారు అని చెప్పి, సంక్షిప్తంగా రామకధని కుడా చెపుతారు.
రామాయణ కావ్య ఆవిర్భావం : వాల్మికి మహర్షి, భరద్వాజుడు అనే శిష్యుడిని వెంటపెట్టుకొని ఆశ్రమం దగ్గర ఉన్న తమసా నదికి స్నానికి వెళ్లారు. సమీపంలో ఉన్న చెట్ల పై క్రౌంచ పక్షుల జంట అన్యోనానురాగాలతో విహరిస్తూ కనిపించాయి. వాటిని చూస్తూ మహర్షి చాల ఆనందం పొందుతున్నారు. ఇంతలో ఒక బోయవాడు హటాత్తుగా భాణం వేయటం తో అందులో మగపక్షి నేలమీదపడి గిలగిలా కొట్టుకొని మరణించింది, క్రిందపడిన ఆ మగపక్షి చుట్టూ తిరుగుతూ ఆడపక్షి రోదించటం మొదలుపెట్టింది. ఆ హృదయవిదారక దృశ్యం చుసిన వాల్మికి మహర్షి గుండె భారమై, ఆ భాధ కోపమై, శాపమై మహర్షి నోటివెంట ఈ క్రింది శ్లోకం అప్రయత్నం గా వచ్చినది.
మానిషాద ప్రతిస్టాం త్వ మగమశ్సాశ్వతీస్సమాః ! యత్ క్రౌంచ మిధునాదేక మవధీః కామమొహితమ్ !
(ఓరి కిరాతకుడా క్రౌంచ పక్షుల జంట లో కామమోహితమగు ఒకదానిని చంపి నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి -నీవు ఎక్కువ కాలం జీవించవు)        
   
ఆ తరువాత సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని ఆశ్రమానికి వచ్చినా మహర్షి ఆ శ్లోకం గురించే ఆలోచిస్తూ శిష్యుడి తో చెపుతూ ఉంటారు - ఈ శ్లోకం నాలుగుపాదాలతో ఒక్కక్క పాదానికి ఎనిమిది అక్షరాలు ఉండేలా అమరింది, లయబద్దంగా ఉంది, పాడుకొనేందుకు అనువైన లయ తో ఉంది, అంటూ దాన్నే పదేపదే తలచుకొంటున్నారు.       
       
అప్పుడు బ్రహ్మగారు వాల్మీకి ఆశ్రమానికి విచ్చేసి, తన సంకల్పం వల్లే నారదుడు రామకధను వినిపించారని, తన సంకల్పం వల్లేసరస్వతీదేవి వాల్మీకి నాలుకపై నిలిచి ఆ శ్లోకం పలికించింది అని చెప్పి, ఇలాంటి మనోహరమైన శ్లోకాలతో, వేదాలు చెప్పిన జీవనవిధానాన్ని కావ్యం లో ప్రతిబింబిస్తూ రామాయణకావ్యం వ్రాయమని ఆదేశించారు. మహర్షి సంకల్పమాత్రంచేత రాముడికధ అతడి మనోరదంలో గోచరమయేటట్లు ఆశ్వీర్వదించారు.
సంక్షిప్త రామాయణం          
                                                     
ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం ! వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవనమ్భాషణం !
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం ! పశ్చాద్రావణ కుంభకర్ణ హననం యేతద్ది రామాయణం !
కోసలదేశంలో సరయూనదీ తీరంలో అయోధ్యానగారాన్ని దశరధుడు అనే రాజు పరిపాలించాడు. అతనికి ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. పుత్రసంతానం లేని రాజు కి యాగఫలంగా నలుగురు కొడుకులు కలిగారు. వారు రామ,లక్ష్మణ ,భరత,శతృజ్ఞులు. రామలక్ష్మనుల వయస్సు ఒక్క రోజు తేడా. - చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కౌసల్యకు రాముడు, అదే రోజు కొన్నిగంటల తరవాత పుష్యమి నక్షత్రంలో కైకేయికి భరతుడు. మరునాడు ఆశ్లేషా నక్షత్రం లో సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు.       
                                                 
శ్రీరాముడు మిథిలా నగరాధిపతి అయిన జనకుని కుమార్తె సీత ను వివాహమాడెను. పినతల్లి కైకేయి తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరిపించాలని, రాముని పద్నాలుగేళ్ళు వనవాసానికి పంపించాలని దశరథుడిని కోరింది. పితృ వాక్య పరిపాలకుడైన రాముడు సీతతోను, సోదరుడు లక్ష్మనుడి తొను కలసి అరణ్యవాసం చేసాడు. లంకేశ్వరుడైన రావణుడు సీతను అపహరించుకొని పోగా శ్రీరాముడు వానర సైన్య సహాయంతో రావణుని వధించి భార్య సమేతంగా అయోధ్య చేరి పట్టాభిషిక్తుడై జనరంజకంగా పరిపాలన చేసాడు.
ఇంతేనా అనిపించిందా ? ఇంత కాదు - నేను చెప్పింది సముద్రంలో నీటిబొట్టంత.           
                                             
రామాయణ గొప్పతనం, అందులోని పాత్రల ఔన్నత్యం లో , సన్నివేశాల గంభీరత లో , ధర్మబద్దమైన నిర్ణయాల లో అడుగడుగునా ప్రస్పుటమౌతుంది. నేను చేసిన ఈ ప్రయత్నం సూర్యుడిని అద్దం లో చూపించటం లాంటిది. అందుకే అందరు ఒక్క సారైనా రామాయణం చదవండి. మీ పిల్లలకి చెప్పండి. 

మనకధానాయకుడైన శ్రీరాముని గురించి కొంచెం చెప్పుకుందాం
రామాయ రామభద్రాయ రామచంద్రయ వేధసే ! రఘునాదాయ నాధాయ సీతాయాః పతయే నమః !
రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః ! రాజా సర్వస్య లోకస్య దేవానాం మాఘ వానివ !
రాముడు మూర్తీభవించిన ధర్మం, సత్పురుషుడు, సత్యపరాక్రముడు, దేవతలకు ఇంద్రుడు ప్రభువైతే, రాముడు సకలలోకాలకు ప్రభువు. 

ఈ వాక్యం అన్నది ఒక రాక్షసుడు -- రెండు సార్లు రాముడి చేతిలో పరాజితుడై, మూడవ సారి అతని చేతిలో మరణించిన మారీచుడు.

శ్రీరాముడు చక్రవర్తికి లేక లేక పుట్టిన కొదుకు. అల్లారుముద్దుగా పెంచారు. 16 సంవత్సరాల ప్రాయానికే సకలవిద్యా పారంగతుడయ్యాడు, తీర్ధయాత్రలు,లోకసంచారము చేసి వచ్చాడు. తండ్రి కుమారుడికి పెండ్లి చేద్దాం అనే ఆలోచనలోకి వచ్చారు. ఎందుకో రామచంద్రుల వదనం లో ప్రశాంతత కనిపించలేదు. తండ్రిగారు కంగారు పడి విషయం అడిగారు. శ్రీరాముడు ఈ విధంగా అన్నారు " తండ్రి, లోకం అంతా, ఈ సకలచరాచర జీవరాసి అశాశ్వతం, నశించి పోతోంది, శాశ్వతమైనది, ఆనందకరమైనది ఏమిటి ? నేనెవరు ? ఈ సృష్టి రహస్యం ఏమిటి ? ఇది విని దశరధుడు కంగారు పడ్డాడు, పెళ్లి చేద్దాం అంటే వైరాగ్యం లోకి వెళ్ళాడేమిటని, వశిష్టుల వారికి విన్నవించాడు. ఈ లోపు యాగరక్షణార్థమై రామ,లక్ష్మనులను తీసుకు వెళ్ళటానికి విశ్వామిత్రులవారు సభకి వచ్చారు. అప్పుడు రాముడి లోని చింతలకన్నిటికి సమాధానాలు ( యోగవాసిష్టం ) వశిష్టుల వారు వివరించి రాముణ్ణి కార్యోన్ముఖుడిని చేశారు. ఇదే మొట్టమొదటిమైలురాయి రాముడి ఆత్మసంయమనానికి.
ఇది ఎందుకు చెప్పానంటే 16 సం. ప్రాయంలో ఇలాంటి జిజ్ఞాస కలిగితే, అందరు శ్రీరాములే అవుతారు. 60 సంవతరాల వయస్సు లో, బ్రతుకు కొట్టిన చెంపదెబ్బలకి జిజ్ఞాస కలిగినా తెలుసుకొనే సమయము లేదు, అధవా తెలుసుకొన్నా అమలుజరిపే సమయము ఉండదు .

విశ్వామిత్రుడి వెంట యాగరక్షణ కి వెళ్లిన రాముడి కి, ఋషి బల , అతిబల విద్యలు, అనేకదివ్యాస్త్రా లు అనుగ్రహించాడు. సీతను వివాహం చేసుకొని అయోధ్య కు తిరిగి వచ్చాడు రాముడు. దశరధుడు, శ్రీరాముని పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేసి రాముడికి చెప్పారు. రాముడు సరే అన్నారు. తెల్లవారింది, ఇంక పట్టాభిషేకం జరుగుతుంది అనగా అది రద్ధయింది . తండ్రిమాటకోసం సీత, లక్ష్మను లతో అరణ్యాలకి వెళ్ళాడు. దశరధుడు క్రుంగి పోయాడు, రాణివాసం, అయోధ్య విలపించాయి , కానీ రాముడి నిగ్రహం మాత్రం చెదరలేదు.
సీతారామలక్ష్మణులు అరణ్యం లో శరభంగ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆ మహర్షి జరిగిందంతా తెలుసుకొని, నేను తపశక్తి వల్ల స్వర్గలోకాన్ని, బ్రహ్మలోకాన్ని జయించానని అది రాముడికి ఇస్తానని చెప్పారు . అప్పుడు రాముడు - ఓ మునివర్యా - మీరు చెప్పిన వన్నీ నేను సంపాదించుకోగలను, కాని అవి నాకు వద్దు, ఈ అరణ్యం లో నివాసయోగ్యమయిన ప్రదేశం చెప్పండి అని అడుగుతారు. . ఇతరులనుంచి ఏది ఆశించని గుణం రాముడిది.
అరణ్యం లో రాక్షసు లందరు, ఋషులను చాలా భాదలు పెడుతున్నారు. మమ్మల్ని కాపాడమని ఋషులు రాముడిని అడుగుతారు. రాముడు సరే అని మాట ఇస్తారు. అప్పుడు సీతాదేవి అంటుంది - ఆ రాక్షసు లెవరు మనజోలికి రాలేదు కదా - వాళ్లతో అకారణ వైరం ఎందుకు అని - శ్రీరాముడికి కోపం వచ్చింది - చాలా తీవ్రంగా ఇలా అన్నారు - క్షత్రియుడు ధనుర్భాణాలు ధరించింది ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి, నిరాయుధు లైన యీ మునులను హింసించే రాక్షసులను వధించటం నా విధి. రాముడికి ధర్మం పట్ల అంత త్రీవ్రమైన నిష్ట ఉంది.
తల్లి కైకేయి చేసిన పనికి భరతుడు కుమిలిపోయి, రాముణ్ణి తిరిగి అయోధ్య కు తిసుకువెళ్ళటానికి అరణ్యానికి వస్తాడు రాముణ్ణి ఎంతో బ్రతిమాలుతాడు. రాముడు ఆడినమాట తప్పను అని - రాజ్య పరిపాలనకి అవసరమైన అన్ని రాజనీతి భొదలు చేస్తాడు. భరతుడు ప్రాయోపవేశం చేస్తానని గట్టి పట్టు పడితే పాదుకలు ఇచ్చి పంపిస్తాడు.
పంచవటిలో మారీచుడు బంగారు లేడి గా సీత దృష్టి ని ఆకర్షిస్తాడు. ఆ లేడి కావాలని ఆమె రాముణ్ణి కోరుతుంది. లక్ష్మణుడు ఇది మాయా మృగం అని అన్నగారితో అంటాడు. అప్పుడు రాముడు - లక్ష్మణా భార్య కోరిన కోరికను వీరుడైన భర్త ఎలా కాదనగలడు. శక్తి సామర్థ్యాలు ఉన్న సాహసి సంపాదించినదే అసలైన సంపద. ఒకవేళ ఈ లేడి రాక్షస మాయ ఐతే దాన్ని వధించటం క్షత్రియుడిగా నా కర్తవ్యం . 

సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు. తీరని దుఖం తో చలించిపోయాడు. కోపం కట్టలుతెంచుకొని వచ్చింది, లక్ష్మణుడి అజాగ్రత్తని తిట్టాడు. దేవతలను నిందించాడు - లక్ష్మణా - నేను దేవతా ప్రీతి కోసం ఎన్ని పుణ్యకార్యాలు చేసాను , కష్ట నస్టాలు ఎదురైనా ధర్మ మార్గం వదలలేదు. ఇంద్రియాలను జయించి, దయామూర్తినై లోకాలకి మేలు చేయటమే లక్ష్యం గా పెట్టుకున్నాను అయినా కష్టం మీద కష్టం ఎలా వచ్చి పడుతోందో చూడు అని నిర్వేదానికి లోను అయ్యాడు. 

కొంతదూరం, వెళ్ళగానే కబందుడు అనే రాక్షసుడు అడ్డగించటం తో అతడిని సంహరించి అతని ద్వారా తనలాగే దుర్దశ లో ఉన్న సుగ్రీవుడి గురించి తెలుసుకుంటాడు. ఆపదలు బలవంతుడైన శత్రువు వల్ల కలిగినప్పుడు వాటిని అధిగమించటానికి ఆరు ఉపాయాలు ఉన్నాయి, అందులో సమశ్రాయణం అంటే ఇంకొక బలవంతుడయి ఆపదలో ఉన్న వారి సహాయం తీసుకోవటం. ఇదే రాముడు ఎన్ను కొన్న మార్గం. రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయారు. రాముడు వాలి ని చంపుతానని ప్రతిజ్ఞ చేసాడు. ఆకాశమార్గం లో వెడుతూ సీత వదిలిన నగలమూట చూపించారు. సీతాన్వేషణ మొదలైంది. సీత లంకలో రావణాసురుడి దగ్గర ఉంది అని లంకకు చేరటానికి నూరు యోజనాలు సముద్రం దాటాలని హనుమంతుడు చెప్పాడు. రాముడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వ్యూహ రచన మొదలుపెట్టాడు. శత్రువు బలాబలాల గురించి ఆలోచించలేదు, తన పరాక్రమం పై నమ్మకం, భార్యను రక్షించు కోవాలన్న తపన. 

లంకలో విభీషణుడు, రావణునికి మంచి చెప్పటానికి ప్రయత్నించాడు, అతడు వినలేదు, విభీషణుడికి కోపం వచ్చింది - రావణా, రాజు మెచ్చే మాటలు చెప్పేవాళ్ళు చాల మంది ఉంటారు, వాళ్ళ మాటలు వినటం వాల్ల వచ్చే ప్రమాదం తరువాత తెలుస్తుంది, తమ్ముడిగా నీ మేలుకోరి మాట్లాడాను - నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని అక్కడ నుంచి రాముడి దగ్గరికి వచ్చి రాముడి శరణు పొందేడు . రామరావణ యుద్ధం జరిగింది , రావణుడు మరణించాడు. ఇక్కడ వాల్మీకి ఒక ఉపమానం చెపుతారు = సముద్రాన్ని వర్ణించటానికి సముద్రమే ఉపమానం - అలాగే రామరావణ యుద్ధం వర్ణించటానికి మరో ఉపమానం లేదు దానికదే పోలిక. రావణ సంహారానంతరం దేవతలు అందరు ప్రత్యక్షమై రాముడిని అభినందించి వరం కోరుకోమంటారు - అప్పుడు రాముడు యుద్ధం లో మరణించిన వానరులందరినీ బ్రతికించమంటాడు. దుష్టుడైన రావణుని చెరలో ఉన్నందుకు, ఉత్తరోత్రా ప్రజా విమర్శలకు అవకాశం రాకూడదని సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమంటాడు. విభీషణుడిని పట్టాభిషక్తుడిని చేసి రాముడు అయోధ్య కు వచ్చి పట్టాభిషక్తుడై 11 వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ధర్మం కోసం బ్రతికి, ధర్మాన్ని బ్రతికించి మానవాళికి మార్గదర్సకుడయ్యాడు.
ఇలా రామాయణం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందులోని ప్రతి పాత్ర ఉదాత్తమైనవే. అలాగే శ్రీరాముడి కంటే రామ నామం ఇంకా గొప్పది - ఈ నామం తో తరించిన వాళ్ళు ఏంతో మంది - శబరి, త్యాగయ్య, రామదాసు, మొల్ల మొదలైనవారు. 

ఎందరో మహానుభావులు అందరికి వందనం.


No comments:

Post a Comment