గురుకులంలో శ్రీరాముడి విద్యాభ్యాసం ముగిసింది. శ్రీరామచంద్రుడు వేద శాస్త్రాలను ఆపోసశన పట్టాడు. చెట్టూపుట్టా, కొండాకోనా, మృగమూ పక్షీ సర్వమూ భగవంతుడి అంశే అని ఆయనకు బోధపడింది. అయినా ఎప్పటికైనా నశించేదే కాబట్టి జగత్తు ఓ మిథ్యగా తోచసాగింది. జగత్తును శాశ్వతమని భావించి తన పాత్రలో ఒదిగి నటించడం హాస్యాస్పదమని భావించాడు రఘుపతి. నశ్వరమైన జీవితాన్ని త్యజించాలని నిశ్చయించుకున్నాడు. శ్రీరాముడి నిర్ణయం విన్న దశరథ మహారాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. శ్రీరామచంద్రుడికి నచ్చజెప్పే ప్రయత్నం సఫలీకృతం కాకపోవడంతో ఆస్ధాన పురోహితుడైన వసిష్టుడికి కబురంపాడు. వసిష్ఠుడు వచ్చి శ్రీరాముడితో "రామా! ఈ దృశ్య జగత్తు మిథ్య" అని భావిస్తున్నావు. దానికి, భగవంతుడికి భేదం లేదు. సృష్ఠి యావత్తూ దైవంలో అంతర్భాగం.
ఆయన శాశ్వతుడైనప్పుడు ఆయనలో నిబిడీకృతమై ఉన్న జగత్తు కూడా శాశ్వతంగా ప్రళయాంతం వరకూ కొనసాగుతుంది. ఉపాధులు నశిస్తూ, జన్మిస్తూ ఉండవచ్చు వ్యవస్ధ శాశ్వతం. దైవంతోటే అది కొనసాగుతుంది అన్నాడు. రాముడికి సృష్టిరహస్యం గురుముఖంగా బోథపడింది. వసిష్టమహర్షి పాదాలను స్రృశించి ప్రణమిల్లాడు. సమగ్ర ఐశ్వర్యం, పరిపూర్ణ ధర్మం, సత్కీర్తి, ఉత్తమ సంపద, నిర్మల జ్ఞానం, సంపూర్ణ వైరాగ్యం అనే ఆరు గుణాలను "భగం" అంటారు. ఆ సద్గుణాలు కలిగిన ప్రభువు భగవంతుడు.
భగవంతుడు సర్వవ్యాపి. ఆయన లీలలు అనంతం. జీవుడొక వింత, జీవితం మరో వింత, ఆకలి దప్పులు ఇంకో వింత. వాటిని తృణధాన్యాలు, నీటితో చల్లార్చడం వింత కాని వింత! ఇన్ని వింతలు సృజించిన భగవంతుని చూడాలనే మనిషి కోరిక తీరని కోరికే అవుతుంది. అందుకు కారణం దైవం కంటికి కనిపించని ఇంద్రజాలికుడు కావడమే! సాధారణ ఇంద్రజాలికుడు ప్రేక్షకులకు కనిపిస్తూ వేదిక మీద వింతలు సృజిస్తాడు.
కానీ దైవమనే ఇంద్రజాలికుడు వేదికను అలంకరించకుండా వింతలు వింతలు సృష్టిస్తాడు. ఆ మహిమలు దర్శించాలంటే భక్తి అనే దివ్యదర్శిని కావాలి. అందుకు వారిని వారు సర్వసమర్ధులుగా ఎన్నడూ భావించలేదు. వాటిని దైవ ప్రేరణలుగానే స్వీకరించి తమ వినమ్రత చాటుకున్నారు. దైవలీలలు వినడం, కనడం కోసమే మాత్రమే వారు తమ శేష జీవితాలను కొనసాగించారు. దైవ లీలలను విని, చూసి వారు తమ జన్మలు సార్ధకం చేసుకున్నారు.
రామరావణ యుద్ధంలో రక్తసంబంధీకులు, ముఖ్యులైన బంధువులందరూ చనిపోయాక రావణుడు స్వయంగా రాముడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. ఎంత ప్రతిఘటించినా రావణుడు చివరకు శ్రీరాముడి బాణాగ్ని ధాటికి తాళలేక శలభంగా మాడిపోయాడు. మృత్యుదేవత ఒడి చేరాడు. లంక శ్రీరాముడి స్వాధీనమైంది. అంతఃపురాన్ని వీక్షించేందుకు రామదండు ఉబలాటపడి వెళ్ళగా, వారిని చూసిన రావణుడి వృద్ధమాత పారిపోసాగింది. లక్ష్మణుడికి ఆ దృశ్యం వింతగొలిపింది. "అన్నా, శ్రీరామా! రావణ కుటుంబంలోని యోధానుయోధులందరూ యమపురికి చేరారు.
విభీషణుడు తప్ప తన సంతానమెవరూ రావణ జననికి బతికిలేరు. ఇంకా బతికి ఏం సాధించాలని భావించి ఆ వృద్ధమాత రామదండును చూసి భయంతో పారిపోతుంది" అన్నాడు. ఆ వృద్ధమాతను శ్రీరాముడు అనునయంగా చేరదీసి లక్ష్మణుడి ప్రశ్న ఆమె ముందుంచాడు. అందుకామె వినమ్రంగా చేతులు జోడించి, "శ్రీరామా! నేను ప్రాణభీతితో పరుగిడటంలేదు. జీవించి ఉన్నాను కాబట్టి నీ లీలలు కొన్నింటిని వినగలిగాను, చూడగలిగాను.
ప్రాణాలతో ఉంటే మరెన్నో లీలలు చూడగలిగే అవకాశం ఉంటుందని, అందుకోసం ఇంకా బతకాలని భావిస్తూ పారిపోతూ మీకు పట్టుబడ్డాను తప్ప ప్రాణం పట్ల తీపితో కాదు" అంది. లక్ష్మణుడికి సందేహనివృత్తి జరిగింది! భగవంతుడు భక్తుల పాలిట ప్రసన్నమూర్తి, కల్పవృక్షం! ఆయన కథలు, గాథలు శ్రవణ మనోహరంగా ఆనందించి భక్తులు తరిస్తారు.ఇహపరాల్లో వాంఛితార్ధాలు నెరవేరే సులభ మార్గం దైవంపట్ల ఆకుంఠత భక్తి కలిగిఉండటమే! జగత్తు, భగవంతుడు వేరువేరు కాదు కాబట్టి, సద్భక్తులు జగత్తును ప్రేమిస్తారు. ఆ ప్రేమ నారాయణ సేవగా వ్యక్తమౌతుంది. మానవ సేవే మాధవ సేవన్న మధుర భావన జగత్తును సుభిక్షంగా ఉంచడంలో ప్రధాన ప్రాత్ర పోషిస్తుంది.
No comments:
Post a Comment