లయకారుడైన శివుని మహోన్నత అవతారమే ఇది. సమస్త సృష్టిలోని శక్తులన్నింటినీ మించిన అనంత శక్తి సమన్వితుడు భైరవుడు. ప్రధానంగా తాంత్రిక దేవుడే అయినా భక్తి భావనా పరంగా కాలభైరవుని ప్రాధాన్యం ఇంతా అంతా కాదు. ఆది శంకరాచార్యుల వారి ‘కాలభైరవాష్టకం’ వింటుంటే భక్తుల శరీరాలలోని అణువణువూ ఆధ్యాత్మిక ప్రకంపనలతో నిండిపోతుంది. అంతటి మహోగ్రమూర్తి అనుగ్రహాన్ని పొందడానికి ప్రస్తుతానికి దీనిని మించిన దివ్యమంత్ర స్తోత్రం మరొకటి లేదు.
భారతీయ పౌరాణిక సాహిత్యంలో మహాకాల భైరవునికి ప్రత్యామ్నాయం లేదు. ఈ పేరు వింటేనే బ్రహ్మాది దేవతలంతా గడగడలాడవలసిందే. అలాంటిది మానవ మాత్రులెంత? భీకర భయోన్నతమైన ఆ రూపానికి వణికిపోని వారుండరు. అందుకేనేమో, కాలభైరవుడు ప్రత్యేకమైన తన రూపంలో ఆరాధనలు అందుకోవడం చాలా అరుదు. శివుని విశేష అవతారమే కాబట్టి, ఈశ్వరుణ్ణి పూజిస్తే కాలభైరవుణ్ణి పూజించినట్టేనని వేదపండితులు అంటారు. అయితే, కాలాష్టమి లేదా కాలభైరవ జయంతి రోజు మాత్రం ఈ పేరుతోనే స్వామిని పూజించడం వల్ల విశేష ఫలితం లభిస్తుందనీ వారంటారు. సాధారణంగా చాలామంది సామాన్యభక్తులకు శివుని ఆరాధనే తప్ప పనికట్టుకొని కాలుడిని పూజించడం తెలియదు. కారణం, ఈ దేవుని పేరుమీదే వెలసిన ఆలయాలే చాలా తక్కువ. కానీ, ఇంచుమించు ప్రతీ శివాలయం మనకు తెలిసో తెలియకో కాలభైరవునికి నెలవై ఉంటుంది. ‘శ్రీ మహాకాలాయనమ:’ అన్న ధ్యానమొకటి చాలు ఎవరికైనా.
కాలభైరవుని కథ ఎంత విలక్షణమో, అంత ఆసక్తికరం కూడా. శివమహా, స్కాంద పురాణాలలో ప్రధానంగా బ్రహ్మదేవుని గర్వాన్ని అణచడానికే శివుని అవతారంగా ‘భైరవ జననం’జరిగినట్లు ఉంది. బ్రహ్మను ‘చతుర్భుజుడు’ అంటారు. కానీ, అంతకంటే ముందు ఆయనకు అయిదు తలలుండేవి. తానే శ్రీ మహావిష్ణువు కన్నా కూడా గొప్పవాడినని బ్రహ్మ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. పైగా శివుణ్ణి నిందిస్తాడు. నిజానికి శివునికీ అయిదు తలలు ఉంటాయి. ఈ సంగతి బ్రహ్మకు అప్పటికి తెలియదనే చెప్పాలి. శివుని కొనగోటిలోంచి పుట్టిన శక్తి ‘కాలభైరవుని’గా ఆవిర్భవిస్తుంది. మహోగ్రరూపంతో అవతరించిన మహాకాల భైరవుని విశ్వరూపం అత్యంత భీకర భయానకం.
అలా ఉద్భవించిన కాలభైరవుడే బ్రహ్మదేవుని అయిదు తలల్లోంచి ఒక దానిని ఖండిస్తాడు. జ్ఞానోదయమైన బ్రహ్మదేవుడు నాటినుంచీ నాలుగు తలలతోనే కొనసాగుతాడు. ఆ కాలభైరవుడే శివాజ్ఞతో విశ్వసంరక్షకుడుగా ఉన్నాడన్నది శాస్త్రీయ కథనం. కాలభైరవుడు అవతరించిన ఆ రోజునే భైరవాష్టమి లేదా కాలాష్టమిగా ప్రజలు జరుపుకొంటున్నారు. ‘ఖండితమైన బ్రహ్మ కపాలాన్ని పట్టుకొని భైరవుడు వివిధ ప్రాంతాలు తిరుగుతుండగా, అది ఎక్కడైతే పడుతుందో అక్కడ తనకు పాపప్రక్షాళన కాగలదు.’ చివరకు అది కాశీనగరంలో పడుతుంది. దీనివల్లే ఈ నగరానికి ‘బ్రహ్మకపాలం’ అని పేరు వచ్చిందని పౌరాణికుల కథనం. బ్రహ్మహత్యా పాపాన్ని సైతం తొలగించేంత శక్తి ఈ పవిత్రనగరానికి ఇలా సంప్రాప్తించింది.
మరికొన్ని పౌరాణిక కథనాల ప్రకారం భైరవుని పుట్టుక, పరమార్థం మరొక రకంగానూ ఉన్నవి. దేవతలకు-రాక్షసులకు మధ్య నెలకొన్న వైరాన్ని తొలగించడానికి కాలభైరవుణ్ణి సృష్టిస్తాడు శివుడు. ఆయనలోంచి అష్టభైరవులు పుట్టుకు రాగా, వారు అష్టమాతృకలను వివాహమాడినట్టు కథనం. రాక్షస సంహారంలో పాల్గొనడానికి వీరినుంచి 64 మంది భైరవులు, 64 మంది యోగినులు పుడతారు. మరొక కథనం మేరకు దహరాసురుడు అనే రాక్షసుణ్ణి వధించడానికి పార్వతీదేవి కాళికాదేవిగా అవతరిస్తుంది. ఈ సమయంలోనే భైరవుణ్ణి కూడా శివుడు సృష్టిస్తాడని, నిజానికి ఈ తల్లీబిడ్డలిద్దరూ ఆయన అంశలోని వారేనని వేదవిజ్ఞానులు చెప్తారు. ఈ భైరవుడు ఎనిమిది చేతులతో పుట్టడం విశేషం. భైరవుణ్ణి ‘దండపాణి’ (పాపులను శిక్షించేవాడు)గానూ పిలుస్తారు. బైరవుని ఆయుధాలలో యమపాశం, త్రిశూలం ప్రధానమైనవి.
శైవ తాంత్రిక ఆగమశా్రస్త్రం ప్రకారం విశ్వంలోని అష్టదిక్కులకు నియంత్రికులు, సంరక్షకులుగా 64 మంది భైరవులు ఉంటారు. వీరంతా ఎనిమిది వర్గాలు (అష్టాంగ భైరవులు)గా విభజితమై, వారిలోంచి ఒక్కో భైరవుడు మిగిలిన ఏడుగురి బృందానికి నాయకత్వం వహిస్తారు. ఈ అందరు భైరవులూ ‘మహాస్వర్ణ కాలభైరవుని’ అధీనంలో ఉంటారు. ఆయనే యావత్ విశ్వ కాలానికి అధినాయకుడు. అష్టభైరవుల (అసితాంగ భైరవ, రురు భైరవ, చందభైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీష్మ భైరవ, సంహార భైరవ)ను పంచభూతాలు (పృథ్వి, జలం, ఆకాశం, వాయువు, అగ్ని), సూర్యుడు, చంద్రుడు, ఆత్మలకు ప్రతినిధులుగా కూడా వేదవిజ్ఞానులు చెప్తారు. వీరందరికి భిన్న రూపాలు, ఆయుధాలు, వాహనాలు ఉంటాయని, తాము ప్రాతినిధ్యం వహించే అష్టలక్ష్ముల ఐశ్వర్యాలతో వీరంతా తమ భక్తులను ఆనుగ్రహిస్తుంటారన్నది శాస్త్ర కథనం.
అనేక శివాలయాల లోపలే భైరవ దేవాలయాలు ఉంటాయి. ప్రత్యేకించి చాలావరకు జ్యోతిర్లింగాలయాలలో తప్పనిసరిగా భైరవ విగ్రహాలు ఉంటాయి. వారణాసి (కాశి)లోని కాశీ విశ్వనాథ్ ఆలయం, ఉజ్జయిని (మధ్యప్రదేశ్)లోని కాలభైరవ దేవాలయం వాటిలో ప్రముఖమైనవి. ఉజ్జయినిలోనే పాతాళభైరవ, విక్రాంత్ భైరవ దేవాలయాలు ప్రసిద్ధినొందాయి. పంజాబ్‌లోని సాంగ్రూర్ జిల్లాకు చెందిన ధూరీ నగరంలోనూ ఒక ప్రాచీన కాలభైరవ ఆలయం ఉన్నది. ఇక్కడి కాలభైరవుని విగ్రహం కొన్ని వందల సంవత్సరాల కిందటిదిగా చెప్తారు. శివరాత్రి పండుగ నాడు భైరవపూజ చేయడం గోరట్ కశ్మీరీల సంప్రదాయం. ఆదిశంకరాచార్యుల వారు కాశీ నగరంలోనే ‘శ్రీ కాలభైరవాష్టకం’ స్తోత్రరచన చేశారు.
దాదాపు అన్ని శక్తి పీఠాలలోనూ భైరవుల ఆరాధన జరుగుతున్నది. ఆయా దేవాలయాలలో భైరవుడు వివిధ రూపాలలో కొలువై ఉండి, అక్కడి క్షేత్ర రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్టు వేదపండితులు చెప్తారు. చాలావరకు భైరవ ఆలయాలు నేపాల్‌లోనే ఉన్నాయి. ఖాట్మండు లోయలోనూ పలు భైరవాలయాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని గ్రామాలలో కాలభైరవుణ్ణి గ్రామదేవునిగా పూజిస్తారు. అక్కడ భైరవ/భైరవనాథ్, భైరవార్‌గా వ్యవహరిస్తారు. మధ్యప్రదేశ్‌లోని ‘శ్రీకాలభైరవనాథ్ స్వామి’ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. దక్షిణ కర్నాటకలోని శ్రీఆదిచుంచనగిరి కొండలలోని ఆలయంలో శ్రీకాలభైరవేశ్వరుడు వెలసి, అక్కడ క్షేత్రపాలకుడుగా పూజలు అందుకొంటున్నాడు. ప్రధానంగా, శునకం (కుక్క) భైరవుని వాహనం కావడం వల్ల ప్రతీ శునకాన్నీ హైందవులు అదే ఆరాధనాభావనతో చూడడం విశేషం.
తనను నిరంతరం సేవించే వారికి తానొక నిజమైన గురువువలె కాలభైరవుడు మార్గనిర్దేశనం చేస్తాడని, అష్ట భైరవులు అందరికీ వేర్వేరు మంత్రోపాసనలు ఉంటాయని వేదశాస్ర్తాలు చెబుతున్నాయి. భైరవుడు కొలువైన శివాలయాలలో విగ్రహం సాధారణంగా దక్షిణాభిముఖంగా, ఉత్తరం వైపున ఉంటుంది. తూర్పు ముఖంగా భైరవ విగ్రహాలు ఉండడం మంచిది కాదని, పడమర ముఖంగానైనా ఉండవచ్చునని వేదపండితులు అంటారు. ప్రతీ ఆలయంలోనూ భైరవుడే ‘క్షేత్రపాలకుడు’. నిల్చొన్న భంగిమలో నాలుగు చేతులతో ఆయన దర్శనమిస్తాడు. ఇంకొన్ని రూపాలు నాలుగుకు మించిన చేతులేకాక తన వాహనమైన శునకంతో, దిగంబరంగానూ ఉంటాయి. ఇవన్నీ అత్యంత భయంకరమైనవి.
బైరవుని దేహవర్ణాలు నలుపు, ఎరుపు, నీలం. ఆయన ఒంటికి ప్రధానంగా నడుముకు, జంధ్యం వలె సర్పాలను ధరిస్తాడు. వాటిని దండలుగా అలంకరించుకొంటాడు. నాగులు చెవిపోగులుగానూ ఉంటాయి. పులి చర్మాన్ని, ఎముకలను ధరిస్తాడని, కొన్నిసార్లు స్వర్ణవస్ర్తాలు ధరిస్తాడని కూడా వేదవిజ్ఞానులు చెప్తారు. ఆయన తలపై చంద్రుడు కొలువై వుంటాడు. నాలుగు చేతులలోనూ బంగారు పాత్రలు ధరిస్తాడు. మహాకాల భైరవుడు తనను ఆరాధించే భక్తులకు సౌభాగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని అంటారు. కొన్ని ప్రాచీనశాస్త్ర గ్రంథాలలో ఆయన 32 చేతులతోనూ ఉన్నట్టు తెలుస్తున్నది. కిందివైపు పక్షి ఆకారంగా, పై భాగం మానవాకారంతో ఉంటుంది. దేహం బంగారు వర్ణమని, నోటి పండ్లు భీకరమని, శత్రువులను నాశనం చేసే అధిదేవునిగా భక్తులు ఆరాధిస్తారనీ పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
ఇదీ అర్చన విధానం
సాధారణంగా అన్ని శివాలయాలలో నిత్యపూజలు సూర్యాది నవగ్రహాల ఆరాధనతో మొదలై భైరవుని పూజతో ముగుస్తాయి. నెయ్యితో స్నానం, ఎరుపు పూలు, నేతి దీపం, విడగొట్టని కొబ్బరికాయ, తేనె, ఉడికించిన ఆహారం, పీచుతో కూడిన పండ్లు భైరవదేవునికి ప్రీతికరమని వేదపండితులు అంటారు. భైరవుని ఆరాధనకు అర్ధరాత్రి అసలైన సమయమని, ఆ వేళ తాను తన దేవేరి (భైరవి)తోకూడి భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. శుక్రవారం అర్ధరాత్రి ఇది సంభవిస్తుందని, అర్చనలో 8 రకాల పూలు వినియోగించాలని వారు చెప్తారు. మంగళవారం పూట కూడా భైరవపూజ అత్యంత ఫలప్రదమనీ అంటారు.
No comments:
Post a Comment