దుర్వాసుడు అంబరీషుడిని శపించుట
మహారుషులు అంబరీషుడితో ఇలా చెబుతున్నారు…. ”ఓ అంబరీషా! పూర్వజన్మలో నీవు చేసిన కొద్దిపాటి పాపం వల్ల ఈ అవస్థ వచ్చింది. అయితే నీకు ఒకరు చెప్పడం కంటే… నీ బుద్దితో దీర్ఘంగా ఆలోచించి, నీకెలా అనిపిస్తే అలా చేయి”అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో అంబరీషుడు ”ఓ పండితోత్తములారా! మీరు వెళ్లేముందు నా అభిప్రాయం కూడా వినండి. ద్వాదశి నిష్టను వీడడం కంటే.. విప్ర శాపం అధికమైనది కాదు. జలపానం చేయడం వల్ల బ్రాహ్మణుడిని అవమానపరుచుట కాదు. ద్వాదశిని విడుచుటా కాదు. అప్పుడు దుర్వాసులవారు నన్నేల నిందిస్తారు? నిందించరు. నా పుణ్యఫలం నశించదు” అని చెప్పి నీళ్లు తాగాడు. ఆ మరుక్షణమే దుర్వాస మహాముని స్నానజపాదులు పూర్తిచేసుకుని, అక్కడకు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారుడై… కళ్ల వెంట నిప్పుకక్కుతూ… ”ఓరీ మదాందా! నన్ను భోజనానికి పిలిచి, నేను రాకుండానే నువ్వు ఎలా తింటావు? ఎంత దుర్మార్గం? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిథికి అన్నం పెడతానని ఆశచూపించి, నాకు పెట్టకుండా నీవు తినగలవా? అలా తినేవాడు మాలభక్షకుడవుతాడు. అలాంటి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు. నీవు భోజనానికి బదులు జలపానం చేశావు. అది కూడా భోజనంతో సమానమైనదే. నువ్వు అతిథిని విడిచి భుజించావు. కాబట్టి, నీవు నమ్మకద్రోహివి అవుతావేకానీ, హరిభక్తుడివి కాలేవు. శ్రీహరి బ్రాహ్మణావమానాన్ని సహింపడు. మమ్మల్ని అవమానిస్తే… శ్రీహరిని అవమానించినట్లే. నీవంటి హరినిందాపరుడు ఇంకొకడు లేడు. నీవు మహాభక్తుడివనే అహంకారం, గర్వంతో ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి పిలిచి, అవమానపరచావు. నిర్లక్ష్యంగా జలాపానం చేశావు. అంబరీషా! నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు? నీ వంశం కళంకం కాలేదా?” అని కోపంతో నోటికి వచ్చినట్లు ధూషించాడు. అంబరీషుడు గజగజావణుకుతూ… ముకుళిత హస్తాలతో ”మహానుభావా! నేను ధర్మ హీనుడను, నా అజ్ఞానంతో ఈ తప్పు చేశాను. నన్ను క్షమించి, రక్షించండి… బ్రాహ్మణులకు శాంతి ప్రధానం. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యాలున్నవారు” అంటూ ఆయన పాదాలపై మోకరిల్లాడు. దయార్ద్ర హృదయమేలేని దుర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమ కాలితో తన్ని ”దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటిజన్మలో చేపగాను, రెండో జన్మలో తాబేలుగానూ, మూడో జన్మలో పందిగాను, నాలుగో జన్మలో సింహంగానూ, అయిదో జన్మలో వామనుడిగా, ఆరోజన్మలో క్రూరుడవైన బ్రాహ్మణుడిగా, ఏడో జన్మలో ముధుడవైన రాజుగా, ఎనిమిదో జన్మలో రాజ్యంగానీ, సింహాసనంగానీ లేని రాజుగా, తొమ్మిదో జన్మలో పాషండమతస్తునిగా, పదో జన్మలో పాపబుద్దిగలిగి, దయలేని బ్రాహ్మణుడవై పుట్టెదవు గాక” అని శపించాడు. ఇంకా కోపం తగ్గని దుర్వాసుడు మళ్లీ శపించేందుకు ఉద్యుక్తుడవ్వగా… శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృథాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయం కలుగకుండా – అంబరీషుని హృదయంలో ప్రవేశించి ”మునివర్యా! అలాగే… మీ శాపాన్ని అనుభవిస్తాను” అని ప్రాధేయపడ్డాడు. కానీ, దుర్వాసుడు కోపం పెంచుకుని శపించబోగా… శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు. ఆ సుదర్శనం ముక్కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ దుర్వాసుడిపై పడబోయెను. అంతట దుర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయడం తథ్యమని భావించి ”బ్రతుకుజీవుడా” అని పరుగు ప్రారంభించాడు. మహాతేజస్సుతో చక్రాయుధం దుర్వాసుడిని తరమసాగింది. దుర్వాసుడు తనను కాపాడమని భూలకంలో ఉన్న మహామునులు, దేవలోకంలో దేవేంద్రుడిని, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు, కైలాసంలో శివుడు ఇలా కనిపించిన దేవతలందరినీ ప్రార్థింపసాగాడు. వారెవ్వరూ చక్రాయుధం నుంచి దుర్వాసుడిని కాపాడే సాహసం చేయలేదు.
_*స్కాందపురాణాంతర్గతంలో వశిష్టుడు బోధించిన కార్తీక మహత్యంలోని ఇరవై అయిదో అధ్యాయం సమాప్తం.*_
No comments:
Post a Comment