Monday, 12 February 2018

మాఘపురాణం - 21వ అధ్యాయము


దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట
దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించిన ఆడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి వున్నారు.
దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు దత్తాత్రేయుని యాశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని. మాఘమాసం యొక్క మహాత్మ్యమును విని ఉండలేదు. గాన మాఘమాసముయొక్క విశిష్టతను గురించి మాఘ స్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను” అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి యీ విధంగా వివరించిరి.
“భూపాలా! భరత ఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరారంభమగును. గనుక అటువంటి నదులయందు స్నానం చేసి దాన పుణ్యము లాచరించినయెడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు. అందునూ మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయే గాక జన్మరాహిత్యం కలుగును. గనుక ఏ మానవుడైననూ మాఘమాసములో నదీస్నానం తప్పకుండా చేయవలెను. అటుల చేయని యెడల ఆ మనుజుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాపఫలము అనుభవించక తప్పదు.
మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా మాఘ స్నానంబు చేసి, ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైననూ ముక్తి నొందగలడు. అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునకు ఈవిధముగా చెప్పుచున్నాను.
పూర్వకాలమున గంగా నదీతీరమున ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు భాగ్యవంతులు. గొప్ప వ్యాపారములు చేసి దానం సంపాదించి అపర కుబేరుని వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు గలడు. అతడును గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు రాసుల కొలదీ ఉన్నవాడు.
మరికొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే ఇద్దరన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసి పంచుకొని ఇష్టమొచ్చినటుల పాడుచేయుచుండిరి. ఇద్దరూ చెరొక ఉంపుడుకత్తెను చేరదీసి కులభ్రష్టులు అయి ఉండిరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్దపులి నోటబడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురగలు గ్రక్కుచూ చనిపోయినాడు. ఆవిధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపొయినారు.
యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు. అప్పుడా చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు.
“అయ్యా, మేమిద్దరమూ ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒకేవిధంగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమేల? నాకు స్వర్గమేల? ప్రాప్తించును!” అని అడిగెను. ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయీ, వైశ్యపుత్రా! నీవు నీ మిత్రుని మిత్రుని కలుసుకొనుటకు ప్రతీదినము గంగానది దాటి ఆవలి గట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసంలో నదిని దాటుచుండగా కెరటాలు జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును. గాన విప్రుని చూచుటవలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియును గాక, ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడినది గనుక నీ పాపములు నశించునందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను. అని చిత్రగుప్తుడు వివరించెను.
“ఆహా! ఏమి నా భాగ్యం! గంగాజలము నామీద పడినంత మాత్రముననే నా కింతటి మోక్షం కలిగినదా” అని వైశ్య కుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.

No comments:

Post a Comment