Monday 12 February 2018

మాఘపురాణం - 20వ అధ్యాయము


భీముడు ఏకాదశీ వ్రతము చేయుట
పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు. భోజనప్రియుడు. ఆకలికి ఏమాత్రం ఆగనివాడు. బండెడన్నము అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలం పుట్టెను. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా? ఏకాదశినాడు భోజనం చేయకూడదు కదా! భోజనం చేసిన ఫలం దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి ‘ఓయీ పురోహితుడా! అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనెదరు గదా! దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను.
“అవును భీమసేనా! ఆరోజు అన్నిదినముల కంటెను ప్రశస్తమయినది. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. గనుక అన్ని జాతుల వారును ఏకాదశీవ్రతం చేయవచ్చును” అని పాండవ పురోహితుడు అగు ధౌమ్యుడు పలికెను.
“సరే నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమా! నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్వితమే కదా! ఒక ఘడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. గనుక ఆకలి తీరులాగున ఏకాదశీ వ్రత ఫలము దక్కులాగున నాకు వివరింపుము అని భీముడు పలికెను.
భీమసేనుని పలుకులకు ధౌమ్యుదు చిరునవ్వు నవ్వి “రాజా! ఏకాదశీ వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏకార్యము చేసిననూ కష్టములు కనిపించవు. గాన నీవు దీక్షబూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశీ అనగా మాఘశుద్ధ ఏకాదశీ మహా శ్రేష్ఠమయినది. దానికి మించిన పర్వదినం మరియొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశీ రోజు పుష్యమీ నక్షత్రముతో కూడినదై యుండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదియు లేదు. సంవత్సరము నందు వచ్చు ఇరువది నాల్గు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశీ మహా పర్వదినము గాన ఆ దినము ఏకాదశీ వ్రతం ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము. ‘నియమము’ తప్పకూడదు. అని ధౌమ్యుడు భీమునకు వివరించెను.
ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసముండెను. అందులకే మాఘ శుద్ధ ఏకాదశి “భీమ ఏకాదశి” అని పిలుతురు. అంతియేగాక ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు, అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును. గాన మహా శివరాత్రి మహాత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళుడవై ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి.
శివరాత్రి మహాత్మ్యము
ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘచతుర్దశీ అనగా శివ చతుర్దశి. దీనినే ‘శివరాత్రి’యని అందురు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమయిన దినము. ఇది మాఘమాసామునందు వచ్చు అమావాస్యకు ముందురోజు దానినే “మహాశివరాత్రి”యని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణ పక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు నదిలో గాని, తటాకమందుగాని, లేక నూతివద్ద గాని స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళీ బిల్వ పత్రములతో పూజించవలయును. అటుల పూజించి శివప్రసాడం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ వుండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన యెడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననూ అవన్నియు వెంటనే హరించుకు పోయి, కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివ రాత్రి కంటే మించినది మరియొకటి లేదు. గనుక మాఘమాసం కృష్ణ పక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. గాన శివరాత్రి దినమున ప్రతివారూ అనగా జాతి బేధములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రత మాచరించి జాగరణ చేయవలయును.
“మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి, వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు, క్రూర మృగములు సహితం బోయవానిని చూచి భయపడి పారిపోయెడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు.
ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళెను. ఆనాడు జంతులేమియు కంటపడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించనందున పొద్దు గుంకి పోయిననూ అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువు కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలిఎక్కువగుచు మంచు కురుస్తున్ననూ కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టుక్రింద వున్నా శివలింగము మీద పడినవి. ఆరోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది? శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడుట తిండిలేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.
జరామరణము లకు హెచ్చు తగ్గులు గాని, శిశువృద్ధులు గాని లేవు. పూర్వ జన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే.
మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకుపోవుచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను.
శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది తుంబుర నారద గణాలతో కొలువుతీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించెను.
అంతట యముడు మహేశా! చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. నారాకకు కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు. దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసియున్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆరాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వ పత్రములను కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు. కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. గనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా” అని యముడు విన్నవించుకున్నాడు.
యమధర్మరాజా! ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపైన వేసి, తిండిలేక జాగరణతో నున్న యీ బోయవాడు కూడా పాపవిముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కవలసినదే గనుక ఈ బోయవాడు పాపాత్ముడయినను, ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన ణా సాయుజ్యం ప్రాప్తమయినది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. యముడు చేసినది లేడి చంద్రశేఖరుని వద్దనుండి వెడలిపోయెను

No comments:

Post a Comment