Thursday 8 February 2018

మాఘ పురాణం – 19 వ అధ్యాయం


గంగాజల మహాత్మ్యము
ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమహాత్మ్యమును
గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు
సముద్రంపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి
వారధిని దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునపుడు
శివుని ధ్యానించి, రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును
దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరేముందు శివపూజ చేసి యుద్దరంగంలో
ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును
చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకొనిరి. గనుక పూజలందు శివపూజ
 పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా గంగాజలం
విష్ణు పాదములనుండి పుట్టినదియు, శివుని శిరస్సునుండి ప్రవహించునట్టియు
అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం
హరించిపోవును. గాన గంగాజలమునకు అంత ప్రాముఖ్యత వున్నది. ఇంకనూ గంగాజలం
గురించి చెప్పబోవునది ఏమనగా ఏనదిలో గాని, సెలయేరులో గాని, చెరువునందు గాని
స్నానం చేయునపుడు ‘గంగ గంగ గంగ! అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున
నీళ్ళు జల్లుకొనినచో అది గంగాజలంతో సమానమయినదగును. గంగాజలం విష్ణుమూర్తి
ప్రతిరూపం గనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచమునందెచ్చటనూ లేదు. అని
గంగా జలమును గురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించెను.

No comments:

Post a Comment