Saturday, 13 May 2017

అర్జునుని పది పేర్లు - విరాట పర్వం


అర్జునునికి అర్జున, ఫల్గుణ, జిష్ణు, కిరీటి, శ్వేతవాహన, బీభత్సు, విజయ, కృష్ణ, సవ్యసాచి,
నంజయులు అని పది పేర్లు.

ధనంజయుడు - దేశాలన్నీ జయించి ధనం పన్నుగ స్వీకరించి తెచ్చి ఆ ధనం మధ్యలో వుంటాడు కనుక ధనంజయుడు.


విజయుడు - యుద్ధంలో యుద్ధోన్మత్తులైన వారిని ఎదుర్కొనటానికి వెళ్ళి విజయం పొందకుండా తిరిగి రాడు కనుక వీరులకు విజయుడిగా తెలుసు.


శ్వేతవాహనుడు - యుద్ధానికి సిద్ధమయ్యే అర్జునుని రథానికి తెల్లని గుర్రాలు కనపడతాయి. కాబట్టి శ్వేతవాహనుడు.


ఫల్గుణుడు - హిమాలయ శిఖరం మీద ఉత్తర ఫల్గుణీ నక్షత్రం రోజున పగటివేళ పుట్టాడు కాబట్టి ఫల్గుణుడు.


కిరీటి - రాక్షసవీరులతో తలపడ్డప్పుడ్ సూర్యకాంతిని విరజిమ్మే కిరీటాన్ని ఇంద్రుడు అర్జునుని తలపై వుంచాడు. అందువల్ల కిరీటి అని పిలువబడుతున్నాడు.


బీభత్సు - "న కుర్యాం కర్మ బీభత్సం యుధ్యమానః కథంచన!
తేన దేవ మనుష్యేషు బీభత్సురితి విశ్రుతః!!"
యుద్ధం చేసే వేళ ఎట్టి పరిస్థితులలోను, ఏవగింపు కలిగించే పని చేయడు కాబట్టి దేవమానులందరిలో బీభత్సుడిగా ప్రసిద్ధుడయ్యాడు.


సవ్యసాచి: "ఉభౌ మే దక్షిణౌ పాణీ గాండీవస్య వికర్షణే
తేన దేవమనుష్యేషు సవ్యసాచీతి మాం విదుః!!
గాండీవాన్ని ఎక్కుపెట్టడానికి కుడి ఎడమ చేతులు రెండూ సమర్థత కలిగి వున్నాయి కాబట్టి దేవమానవులలో సవ్యసాచి అని పిలుస్తారు.


అర్జునుడు - సముద్రం దాకా నేల నాలుగు చెరగులా అర్జునుని శరీరకాంతి వేరెవ్వరికీ లేదు. అందరిపట్ల సమభావంతో వుంటాడు. పరిశుద్ధమైన పనినే ఆచరిస్తాడు. ఈ కారణాల వల్ల విజ్ఞులు అర్జునుడుగా ఎరుగుదురు.


జిష్ణువు - అర్జునుని పట్టుకోవడం, ఓడించడం చాలా కష్టం. ఇంద్రుడి కొడుకైన అర్జునుడు శత్రువులను అణచి, విజయాన్ని పొందే వీరుడు కాబట్టి దేవమానవులలో జిష్ణువుగా ప్రసిద్ధుడయ్యాడు.


కృష్ణ - నల్లగా మెరుస్తున్న దేహకాంతి కలిగి పసితనంలో మనసునాకట్టుకొనే రీతిలో ఉండడం చేత తండ్రి కృష్ణ అని పేరు పెట్టాడు.



No comments:

Post a Comment