Thursday, 4 May 2017

వైశాఖమాసంలో దానం........


‘‘వైశాఖ మాస శుక్ల తృతీయా- అక్షయ తృతీయోచ్ఛతే’’ అని శాస్త్ర వచనం. అనగా వైశాఖ శుద్ధ తృతీయ ‘అక్షయ తృతీయ’యనబడుతుంది.


వైశాఖ మాసంలో వచ్చే ఈ రోజు వైదిక కాలమానం ఖగోళ శాస్త్ర, జ్యోతిష శాస్త్రాల ననుసరించి సూర్యచంద్రులు శక్తివంతమైన స్థానాల్లో వుండి ప్రకాశవంతముగా వెలిగిపోతూంటారనీ, సూర్యుని జీవానికి, చంద్రుడిని మేధస్సుకు అధిదేవతగా భావించే మన హిందూ సంప్రదాయంలో ప్రకృతి రమణీయతతోపాటు, సూర్యుని తీవ్ర ఉష్ణ ప్రభావం కుటుంబీకులకు అంటకుండా అనగా తగలకుండా క్షేమంగా సూర్యునికి నమస్కరించే విధానమే అక్షయ తృతీయ. ఈ రోజున చేసే పూజలు హోమము- దానము- పితృతర్పణము అక్షయమైన పుణ్యఫలాన్ని యిస్తాయి. కావున యిది అక్షయ తృతీయగా పిలువబడుతుంది. ఈ రోజున గంగా స్నానం- యవల ధాన్యంతో వండిన భోజనం, యవలతో చేసే హోమం సర్వ శ్రేష్టము. సకల పాపహారం.


వైశాఖ మాసమునకు ‘మాధవ మాసమని’ మరో పేరు ఉంది. ఈ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే తదియనాడు రోహిణీ నక్షత్రం కలిసిన రోజుని ‘అక్షతదియ’గా అక్షయ తృతీయగా పిలుస్తారు ప్రాచీనులు. పవిత్రమైన ఈ రోజున ఏ కార్యాన్ని తొలుతగా ప్రారంభించినా అది అక్షయంగా అనగా తిరుగులేకుండా వుండి వృద్ధి చెందుతుంది. క్షయముకానిది అక్షయముగదా! ఈ తదియ బుధవారం లేదా సోమవారంనాడు వస్తే మరీ విశేషమని అంటారు. ప్రతి మాసంలో రెండు తదియలు పౌర్ణమి, అమావాస్య ఒకటి తరువాత మరొకటి వస్తుంటాయి. ఒక్కో మాసంలో వచ్చే తదియకు ప్రత్యేక పేర్లున్నాయి అని పండితుల అభిప్రాయం. చైత్రంలో వచ్చే తదియకు ‘డోలావ్రత’ తదియయని, వైశాఖ మాసంలో వచ్చే తదియను ‘రంభాతదియ’యనీ అంటారు. ఈ రోజుల్లో మహిళలు ఆచరించే పూజలు వ్రతాలు విశేష పుణ్యఫలాన్ని యిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.అక్షయ తృతీయ రోజున కొంచెం బంగారాన్ని కొన్నా అది సంవత్సరమంతా ఆ వ్యక్తికి సంపదనూ, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గల భక్తుల దృఢ విశ్వాసం.
వైశాఖమాసం అనేక విశేషాలకు వేదికగా కనిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో నదీ స్నానాలు ... శక్తి కొద్ది దానాలు అనంతమైన ఫలితాలను అందిస్తాయని అంటున్నాయి. దాంతో ఎవరి స్థాయిలో వాళ్లు దానధర్మాలు చేయడానికి ముందుకు వస్తుంటారు. అయితే ఏదిపడితే అది దానం చేయడం వలన ఆశించిన ఫలితాన్ని అందుకోవడానికి సమయం పడుతుంది.


అదే .. దానాన్ని గ్రహించిన వాళ్లకి ఆ దానం వలన వెంటనే ఉపయోగం వుంటే, చేసినవారికి అంతే త్వరగా ఫలితం కనిపిస్తుంది. ఇలా ఆశించిన ఫలితాన్ని త్వరగా పొందాలనుకుంటే, దానం చేసే వాళ్లు ఆయా కాలాలాను బట్టి ... అవసరాలను బట్టి దానం చేయవలసి వుంటుంది. అలా వైశాఖ మాసం విషయానికి వచ్చే సరికి, ఈ మాసంలో ఎండలు విపరీతంగా వుంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక సాధారణ ప్రజలు నానాఅవస్థలు పడుతుంటారు.



No automatic alt text available.

అలాంటి వారికి 'చలివేంద్రాలు' ద్వారా మంచినీటి దానం చేస్తూ వారి దాహార్తిని తీర్చాలి. అంతే కాకుండా వేసవి కాలపు ఎండలను తట్టుకునే విధంగా గొడుగులు ... పాదరక్షలు ... విసన కర్రలు ... దానం చేయవలసి వుంటుంది. ఇవి తక్కువ ఖర్చుతో వీలైనంత ఎక్కువమందికి దానంగా అందించే అవకాశం వుంటుంది. ఎండవేడిమి నుంచి తక్షణమే ప్రజలకు ఉపశమనాన్ని అందించినట్టు అవుతుంది. ఈ విధంగా తక్షణమే ప్రయోజనాన్ని కలిగించే దానాలను వైశాఖ మాసంలో చేయడం వలన సకల శుభాలు చేకూరతాయనీ, ఉత్తమగతులు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.ఈ రోజున గొడుగులు - చెప్పులు- గోవు- భూమి- బంగారం- వస్త్రాలు- నీరు నిండిన ఘటం దానం చేస్తే పుణ్యమని శాస్త్రం.

No comments:

Post a Comment