Thursday 5 May 2022

రామానుజాచార్యుడు

 


రామానుజాచార్య లేదా రామానుజాచార్యుడు (సా.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్తఆస్తిక హేతువాదియోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.

ముఖ్య ఉద్దేశాలు

ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన (సాధించిన) ముఖ్య ఉద్దేశాలు:

  • మొదటిది, ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
  • రెండవది విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.
  • ప్రస్థాన త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.
  • విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి. ఆయన క్రీస్తు శకం 1017 సంవత్సరంలో శ్రీపెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో జన్మించారు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారు పాతిక కిలో విూటర్ల దూరంలో ఉంది. కలియుగం 4118 సంవత్సరం, శాలివాహన శకం ప్రకారం 930 సంవత్సరం అవుతుంది. ఆయన జనన కాలానికి, కుటుంబానికీ సంబంధించిన ఇతర వివరాలు : పింగళ నామ సంవత్సరం, చైత్ర మాసం. శుక్లపక్షం పంచమి తిథి, బృహస్పతి వారం, ఆర్ద్రా నక్షత్రం, కర్కాటక లగ్నం. ఆయన తల్లి కాంతమతి, తండ్రి కేశవా చార్యులు. హరీత గోత్రం. ఆపస్తంబ సూత్ర యజుశ్శాఖా ధ్యాయులు. తండ్రి వద్దా, కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్దా ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువు తోనే భేదించి తన విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విద్యాభ్యాస కాలానికి విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని, అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవర్తకుడుగా ప్రోత్సహించాడని అంటారు. రామానుజుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ, కొన్ని సంప్రదాయాలను ఆయన పాటించలేదు. ఉదాహరణకు పదునెనిమిది సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణులనే తిరుక్కోట్టియార్‌ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు. తిరుక్కోట్టి యార్‌ నంబి యామునాచార్యుల శిష్యులలో ఒకరు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించ వద్దనీ, విన్నంత మాత్రాన్నే ముక్తి కలుగుతుందనీ నంబి చెపితే ‘‘నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తే నేమి, అందరికీ ముక్తి కలుగుతుంది గదా!’’ అనే ఉదార భావనతో ఆయన గుడి గోపరం ఎక్కి తిరు మంత్రాన్ని అందరికీ అందించారు. రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశ వ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహా సనాధిపులను, జియ్యంగార్లను, పరమై కాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ, అమ్మం గార్లూ శ్రీ వైష్ణవ దాసులు కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురా చారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు. తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం ‘‘ద్రావిడ, సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై, వడగలై అని రెండు శాఖలు ఏర్పడ్డాయి’’ అని తిరుమల రామచంద్ర ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రచురించిన ‘‘భార్గవ పురాణం’’ గ్రంథానికి పరిష్కర్తగా రచించిన ‘‘ఆళ్వారాచార్యుల చరిత్ర తత్త్వం’’ వ్యాసంలో వ్రాశారు.

ఆయన సందేశాలు

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి:

  • ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రథమ కర్తవ్యం.
  • దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
  • మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.
  • ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

దేశకాల పరిస్థితులు

రామానుజుల జన్మసమయానికి దక్షిణభారత దేశాన ఉన్న రాజవంశాలు, వారి మతసంబంధిత రాజకీయాలను ఈ క్రింది విధంగా సంక్షిప్త పరచవచ్చు:

  • చోళులు - చోళులు వైదికమత విధివిధానాలను పాటించేవారు. చోళరాజ ప్రముఖులలో ఒకడైన రాజరాజ నరేంద్ర చోళుడే వైదికమతకర్మలను, వర్ణాశ్రమాలనూ, ప్రోత్సహించి, పలు యజ్ఞయాగాదులు చేయించాడు. ఒకటవ కుళోత్తుంగ చోళుడు కూడా ఎందరో వైదిక బ్రాహ్మణులను ఆదరించి, దానధర్మాలు చేశాడని చరిత్రలో ఋజువులు ఉన్నాయి.
  • చాళుక్యులు - చాళుక్యులు మొదట శైవులైనప్పటికీ, రానురాను జైనమతాన్ని ఆదరించారని చరిత్ర చెబుతోంది. తూర్పు, పశ్చిమ చాళుక్య రాణులు అనేకమంది జైనమత ప్రభావానికి లోనై తమ రాజులను ఆ మతాన్ని ఆదరించేటట్లుగా మార్చి ఉన్నారని శిలాశాసనాలద్వారా తెలుస్తోంది. వేంగీ ( ఏలూరు) ప్రాంతాధిక్యతకై చోళ చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధాలలో అనేక మార్లు చోళులు చాళుక్య జైన ఆరామాలను, మందిరాలను ధ్వంసం చేశారని ఋజువులు ఉన్నాయి.
  • హోయసళ రాజులు - నేటి ఉత్తర కర్ణాటక ప్రాంతాలైన బేలూరు, బాదామిలను రాజధానులుగా చేసికొని, కర్నాటక ప్రాంతాన్ని పరిపాలించిన హోయసళ రాజులు జైన, వీరశైవ మతాలను ఆదరించారు. బిత్తిదేవన్ లేక బిత్తిగ లేక విష్ణు అను పేరున్న హోయసళ రాజును రామానుజాచార్యుడు జైనమతానుసరణ నుంచి వైష్ణవానికి మరల్చినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి.

ఇవియే కాక, ఈ క్రింది మతసంబంధిత విషయాలను కూడా మనసులో ఉంచుకోవటం వల్ల, రామానుజాచార్యుని జీవితాన్ని, ఆయన చేసిన సేవను మరింత హర్షించవచ్చు.

  • రామానుజుల కాలానికి మౌర్యరాజులు (ముఖ్యంగా అశోకుడు) ఆదరించిన బౌధ్ధమతం క్షీణదశలో ఉండినది. దీనికి ఆదిశంకరులవారి అద్వైత వేదాంతము కూడా కొంత కారణమై ఉండవచ్చు.
  • రాజాదరణ పొంది, ప్రాబల్యాన్ని పుంజుకొన్న జైన, శైవ మతాలు, స్థానిక ఆచారవ్యవహారాలతో కలసి అనేక శాఖలుగా విభజితమైనవి . ఈ వేర్వేరు శాఖలు, వేర్వేరు సిధ్ధాంతాలను ప్రతిపాదిస్తూ, తమ తమ శాఖలే గొప్పవని ఉటంకిస్తూ, మూల ఉపనిషత్సారాన్ని ప్రజలకు అందించలేక పోయాయి.
  • ఈ కాలంలో భక్తిమార్గానికి చాలా ప్రాబల్యం ఉండినది. భక్తిమార్గానికీ, విగ్రహారాధనకూ ఉన్న సంబంధం వలన పైన పేర్కొన్న రాజులందరూ, ఎన్నో దేవాలయాలు నిర్మించి, ఆ మార్గాన్ని ప్రోత్సహించటం జరిగింది. రాముడు, కృష్ణుడు, శివుడు (వేర్వేరు రూపాలలో) దేవుళ్ళుగా ఆరాధనలను అందుకోవటం ఈ కాలం యొక్క విశిష్టమైన మతసంబంధితమైన మార్పుగా చెప్పుకోవచ్చు.

జీవితకాల నిర్ణయం

సాంప్రదాయక జీవితచరిత్రకారుల ప్రకారం, రామానుజాచార్యులు సా.శ. 1017 - 1137 సంవత్సరాల మధ్య తన జీవితాన్ని కొనసాగించాడు. వీరి ప్రకారం ఆచార్యుల జీవితకాల వ్యవధి నూట ఇరవై సంవత్సరాలు (120 సం.) సాంప్రదాయక ఆధారాల ప్రకారం రామానుజాచార్యులు తమిళ 'పింగళ' సంవత్సరంలో జన్మించి, మరో 'పింగళ' సంవత్సరంలో పరమపదించారు. తమిళ కాలమానం ప్రకారం ఒకే పేరుగల సంవత్సరం మళ్ళీ రావటానికి అరవై సంవత్సరాల కాలం పడుతుంది. దీన్ని బట్టి మనం రామానుజాచార్యుల జీవితం అరవై లేక నూట ఇరవై సంవత్సరాలు ఉండవచ్చని భావించవచ్చు.

సా.శ. 1917 లో టి.ఏ. గోపీనాథ్‌, సాంప్రదాయక మూలాల ఆధారంగా, రామానుజాచార్యులను శైవమతాధిక్యతను ఒప్పుకొనేందుకు బలవంతం చేసిన రాజును, ఒకటవ కుళోత్తుంగ చోళునిగా గుర్తించి, ఆచార్యుల మేలుకోట ప్రవాసం సా.శ. 1079 - 1126 ప్రాంతంలో జరిగినట్టుగా అనుమానించారు. ప్రవాస కాలం నలభై ఏడు సంవత్సరాలు కావటం, ఒకటవ కుళోత్తుంగ చోళుడు వైష్ణవమత ద్వేషి కాకపోగా వైదికమత ఆదరణలో భాగంగా ఎన్నో దానాలను చేసినట్టుగా చారిత్రక ఆధారాలుండటం, ఈ జీవితకాల నిర్ణయానికి ఆక్షేపాలని చెప్పుకోవచ్చు.

టి.యన్. సుబ్రమణియన్ అనే మద్రాసు ప్రభుత్వ ఉద్యోగి, 'రామానుజాచార్య దివ్య చరితై' అనే తమిళ సాంప్రదాయక జీవితచరిత్రలో ఉల్లేఖించిన శ్రీభాష్య రచనా సమాప్తి కాలం (సా.శ. 1155-1156) ప్రకారం, రామానుజుల జీవితకాలం సా.శ. 1077 - 1157 మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. ఈ జీవితకాలం 80 సంవత్సరాలు కావటం, వైష్ణవ ద్వేషి ఐన రెండవ కుళోత్తుంగ చోళుడు ఇదే సమయంలో రాజ్యమేలటం, ఈ అంచనా సరియైనదేననటానికి ఋజువులుగా చెప్పుకోవచ్చు. 'విష్ణువర్ధనుడు' అనే పేరు గల హోయసళ రాజు (హోయసళ రాజులు) ఇదే సమయంలో కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించటం కూడా గమనించదగ్గ విషయం (ఇతడే పైన చెప్పుకొన్న భిత్తిగ దేవుడు అయి ఉండవచ్చు). ఐతే దేవాలయ శిలాశాసనాలు, రామానుజాచార్యుడు, అతని శిష్యులు మేలుకోటలో సా.శ. 1137 కు ముందే నివాసమున్నట్లు తెలుపుతుండటం ఈ జీవితకాల నిర్ణయానికి ఆక్షేపంగా చెప్పుకోవచ్చు.

జీవిత విశేషాలు

ఈయన విశిష్టాద్వైత మతోద్ధారకుఁడు. ఈయన 800 సంవత్సరములకు ముందు అవతరించినట్టు తెలియవచ్చెడి. ఈయన తండ్రి ఆసూరి కేశవాచార్యులు. తల్లి కాంతిమతి. జన్మస్థానము చెన్నపురికి సమీపమున 26 మయిళ్ల దూరమున ఉండు శ్రీ పెరుంబూదూరు (భూతపురము). విద్యాభ్యాసము చేసినచోటు కాంచీపురము. సకల శాస్త్రములను యాదవ ప్రకాశులు అను అద్వైత మతావలంబి అగు సన్యాసివద్ద చదివి, వానికెల్ల విశిష్టాద్వైత పరముగా అర్థము సాధించి ఆమతమును స్థాపించి పిమ్మట త్రిదండసన్యాసి అయి యతిరాజు అనుపేరు పొంది, మేలుకోట (తిరునారాయణపురము) శ్రీరంగము తిరుపతి మొదలగు అనేక దివ్యస్థలములయందు మఠములను ఏర్పఱచి అచ్చటచ్చట వైష్ణవ మతమును స్థాపించెను. వెండియు ఈయన బహుదేశాటనము చేసి పలుమతముల వారిని జయించి శిష్య సంఘమును సంపాదించి తమ మతమును వృద్ధిపొందించెను. ఈయన వ్యాససూత్ర భాష్యము, గీతాభాష్యము, తర్కభాష్యము, వేదార్థసంగ్రహము, న్యాయామృతము, వేదాంత ప్రదీపము, వేదాంత తత్త్వసారము, నారదీయ పాంచరాత్రాగమము, రంగనాథస్తవము, గద్యత్రయము, మఱియు పెక్కు స్వరూప గ్రంథములను రచియించెను. కనుక ఈయనకు భాష్యకార్లు అనియు ఎంబెరు మానారు అనియు నామధేయములు కలిగెను. ఈ రామానుజాచార్యులు శేషాంశసంభూతుఁడు.

జన్మ స్థలం, నక్షత్రం , ఇతర వివరాలు

మద్రాసుకు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరుంబుదూరులో శ్రీమాన్ ఆసూరి 'సర్వక్రతు' కేశవ సోమయాజి దీక్షితార్, కాంతిమతి అను పుణ్య దంపతులు ఉండేవారు. వేదాలలో చెప్పబడిన అన్ని యజ్ఞాలనూ పూర్తిచేసి 'సర్వక్రతు' బిరుదును పొందిన కేశవ సోమయాజి, ఎంతకాలానికీ తమకు సంతానం కలుగక పోవటంతో, భార్య కాంతిమతితో కలసి, తిరువళ్ళిక్కేణి (ట్రిప్లికేన్) ఒడ్డున ఉన్న పార్థసారథి స్వామి దేవాలయంలో యజ్ఞాల ద్వారా ఆ స్వామిని మెప్పించి సంతానం పొందే ఉద్దేశంతో శ్రీపెరుంబుదూరును వదిలి వెళ్ళారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల వీరిరువురికి ఒక సంవత్సరం అనంతరం జన్మించిన శిశువు రామానుజాచార్యుడు 'శ్రీ వైష్ణవ ఆచార్య పరంపర' అను సాంప్రదాయక గ్రంథం ప్రకారం, ఈ పుణ్యదినం కలియుగ సంవత్సరం 4118, పింగళ వర్షం, చైత్ర మాసం, తిరువాదిరై రాశి (ఆరుద్ర నక్షత్రం), శుక్లపక్ష పంచమి, శుక్రవారం. ఆంగ్ల కాలమానం ప్రకారం ఈ తేదీ సా.శ. 1017, ఏప్రిల్ 13.

నామకరణం

శిశువు యొక్క జనన మాసం,, రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల, శిశువు మామ అయిన పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు), ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి, "ఇళయ పెరుమాళ్" అనే నామధేయాన్ని నిర్ధారిస్తాడు. శిశువు శరీరంపైన ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి, నమ్మాళ్వార్ తన 'తిరువోయ్‌మోళ్ళి' అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి, గురువు, ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.

బాల్యం, వివాహం, విద్యాభ్యాసం

కంచిపూర్ణుడు

ఇళయ పెరుమాళ్ చిన్నతనంలో 'కంచిపూర్ణుడు' అనే భక్తుడు రోజూ కాంజీవరం (నేటి కంచి) నుంచి శ్రీపెరుంబుదూరు మీదుగా 'పూణమ్మెల్లె' అను గ్రామంలో ఉన్న దేవాలయానికి పూజకై వెళ్ళేవాడు. అతడి శ్రధ్ధాభక్తులు చిన్ని ఇళయ పెరుమాళ్‌ను ఎంతగానో ఆకర్షించాయి. ఒకరోజు పూజ పూర్తి చేసుకుని తిరిగి వెడుతున్న కంచిపూర్ణుడిని ఇళయ పెరుమాళ్‌ తన ఇంటికి సాదరంగా అహ్వానించి, అతడి భోజనానంతరం అతడి కాళ్ళుపట్టడానికి ఉద్యుక్తుడైనాడు. కానీ, నిమ్నకులానికి చెందిన కంచిపూర్ణుడు తత్తరపాటుతో వెనక్కు తగ్గి, ఉత్తమ బ్రాహ్మణ కులంలో జన్మించిన ఇళయ పెరుమాళ్ సేవను నిరాకరించాడు. భగవంతునిపైనున్న అతడి భక్తిశ్రధ్ధలు కేవలం అలంకారప్రాయమైన జంధ్యానికంటే ఉన్నతమైనవని, అందుచేత 'కంచిపూర్ణుడు' తనకు గురుసమానుడని వాదించి, ఇళయ పెరుమాళ్ అతడిని ఆకట్టుకున్నాడు. ఆనాటి నుంచి వారిద్దరిమధ్య పరస్పర గౌరవమర్యాదలు, ప్రేమ ఏర్పడ్డాయి. భక్తిలోని మొదటి పాఠాలు ఇళయ పెరుమాళ్ కంచిపూర్ణుడి వద్దనే అభ్యసించాడని చెప్పుకోవచ్చు.

యాదవప్రకాశుడు

ఇళయ పెరుమాళ్‌కు పదహారవ ఏట రక్షమాంబ లేక తంజమ్మాళ్‌తో వివాహం జరిగింది. వివాహానంతరం తండ్రి కేశవ సోమయాజి పరమపదించటంతో, కుటుంబ సమేతంగా, ఇళయ పెరుమాళ్ కాంచీ నగరానికి తరలివెళ్ళాడు. నాటికి కంచిలో పేరుపొందిన 'యాదవప్రకాశ' ఆచార్యుని వద్ద విద్యాభ్యాసం చేయసాగాడు. యాదవప్రకాశుడు అద్వైతం లోనూ భేదాభేద వేదాంతం లోనూ పాండిత్యాన్ని గడించి, అనేకమంది శిష్యులనాకర్షించి, వారికి విద్యనొసగుతుండినాడు. ఇళయ పెరుమాళ్‌ వంటి అసామాన్య ప్రతిభగల శిష్యుడు దొరికినందుకు పరమానందభరితుడైన యాదవప్రకాశుడు అనతి కాలంలోనే ఇళయ పెరుమాళ్‌ యొక్క 'భక్తి' పరమైన ఆలోచనావిధానాన్ని గమనించాడు. యాదవప్రకాశుని ఉపనిషద్వ్యాఖ్యలు అకర్మికము, అనాస్తికములుగా ఉండటం ఇళయ పెరుమాళ్‌ను బాధించేది.తత్కారణంగా అతడు తన గురువుతో తరచుగా వాగ్వాదానికి దిగేవాడు.

ఒకనాడు 'ఛాందోగ్యోపనిషత్తు' పై ఆదిశంకరుని వ్యాఖ్యానంలో 'కప్యాసం పుణ్డరీకమేవమక్షిణి' అనే వాక్యాన్ని ఆదిశంకరుడు 'ఎర్రనైన కోతి పిరుదులను పోలిన (కప్యాసం) కమలాలవంటి కన్నులుగలవాడు' అని అనువదించినట్లుగా యాదవప్రకాశుడు తన శిష్యులకు చెప్పాడు. అదివిన్న ఇళయ పెరుమాళ్ కన్నులలో ధారగా నీరుకారసాగింది. యాదవప్రకాశుడు కారణమడుగగా అది సరైన వ్యాఖ్య కాదని బదులిచ్చాడు ఇళయ పెరుమాళ్. ఆగ్రహించిన యాదవప్రకాశుడు వేరొక వ్యాఖ్యను చేయమని హేళన చేయగా 'కప్యాసం' అనే పదానికి 'కం జలం పిబతి ఇతి కపిః' (నీటిని గ్రహించువాడు, అనగా సూర్యుడు) అని నూతనార్థాన్ని చెప్పి 'కప్యాసం పుణ్డరీకమేవమక్షిణి' అనే వాక్యాన్ని 'నీటిని గ్రహించిన సూర్యుని కిరణాలతో పుష్పించిన (కప్యాసం) కమలాలవంటి కన్నులుగలవాడు' అని భావాధిక్యతనూ, ఆస్తికత్వమునూ ఉటంకించే అర్థాన్ని చెప్పాడు. మరొకమారు 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా' అనే మహావాక్యంపై జరుగుతున్న వాదంలో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మయొక్క గుణాలనీ, అవే బ్రహ్మ కాదనీ యాదవప్రకాశునితో వాదించాడు.

ఈ వాదోపవాదాలలో ఇళయ పెరుమాళ్‌ యొక్క పాండిత్యం, ఆస్తికత్వంతో కూడిన ఆ ర్ద్రతాభావం,, భక్తిపూరితమైన వ్యాఖ్యానం యాదవప్రకాశుడికి కంటగింపు కాసాగింది. అహంకారపూరితమైన మనస్సుతో, ఈర్ష్యతో, అతడు ఇళయ పెరుమాళ్‌ను హతమార్చటానికి పన్నాగం పన్నాడు. గోవిందుడనే శిష్యుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొన్న ఇళయ పెరుమాళ్ సమయానికి తప్పించుకోగలిగాడు. సాంప్రదాయక గ్రంథాల ప్రకారం, ఈ తరుణంలో కంచిలో వెలసిన 'వరదరాజ స్వామి' దంపతులు మారువేషంలో వచ్చి ఇళయ పెరుమాళ్‌కు కంచి దారి చూపించి అతడిని రక్షించారని తెలుస్తుంది. తరువాత కొంత కాలానికి ఇళయ పెరుమాళ్‌ వాదనలను అంగీకరించలేని యాదవప్రకాశుడు, అతడిని తన శిష్యరికం నుంచి విముక్తుణ్ణి చేస్తాడు.

ఏది ఏమైనప్పటికి, బ్రహ్మసూత్రాలనూ, ఉపనిషత్తులనూ, పురాణగ్రంథాలను, ఎంత తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారో తెలుసుకోవటానికి యాదవప్రకాశుడి శిష్యరికం ఎంతగానో దోహదపడిందనటంలో అతిశయోక్తి లేదు. వేదాంతానికి కొత్త అర్థం చెప్పవలసిన సమయం ఆసన్నమైనదని నిర్ణయించుకోవటానికి, ఇళయ పెరుమాళ్‌కు యాదవప్రకాశుడి శిష్యరికం సహకరించింది.

యమునాచార్యుడు

'ఆళవందార్‌' అను నామధేయముతో ప్రసిద్ధుడైన యమునాచార్యుడు, వైష్ణవ సాంప్రదాయంలో పేరుగాంచిన గురువు. ఈయన తిరుచిరాపల్లి (నేటి తిరుచ్చి) జిల్లాలో ఉన్న శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో తన సేవలనందించేవారు. యాదవప్రకాశుని శిష్యరికంలో ఉన్న ఇళయ పెరుమాళ్ యొక్క గొప్పతనాన్ని, తెలివి తేటలను, భక్తి పరమైన వ్యాఖ్యలను చూసి, అతడిని తన శిష్యునిగా చేసుకోవాలని ప్రయత్నించాడు. ఈ విషయంగా ఇళయ పెరుమాళ్‌ను కలుసుకోవాలని ఈయన కాంచీపురాన్ని సందర్శించాడు కూడా. కానీ కారణాంతరాల వల్ల ఇళయ పెరుమాళ్‌ను కలవలేక, నిరాశతో వెనుదిరిగాడు. యాదవప్రకాశుడు తన శిష్యగణం నుంచి ఇళయ పెరుమాళ్‌ను తొలగించిన విషయం తెలియగానే, అతడిని తన శిష్యునిగా చేసుకోవాలనే ఉద్దేశ్యాన్ని 'మహాపూర్ణుడు' అనే శిష్యుని ద్వారా తెలియచేశాడు.

మహాపూర్ణుడు ఇళయ పెరుమాళ్‌ను కలుసుకొని శ్రీరంగం తీసుకువెళ్ళే లోపల యమునాచార్యుడు తన ఆఖరిశ్వాసను విడిచాడు. ఇళయ పెరుమాళ్, మహాపూర్ణుడు వచ్చే సమయానికి యమునాచార్యుల భౌతిక కాయం అంత్యక్రియలకు సిధ్ధపరచబడి ఉంటుంది. కాని ఆయన కుడి చేతి మూడు వేళ్ళు ముడుచుకొని ఉండటం ఇళయ పెరుమాళ్ గమనిస్తాడు. ఆ మూడు వేళ్ళూ తను చేయవలసిన మూడు పనులకు సంకేతమని భావించిన ఇళయ పెరుమాళ్ ఈ క్రింది మూడు శపథాలను చేస్తాడు.

  • వైష్ణవ సంప్రదాయాలకు సంకేతమైన, పంచ సంస్కార కర్మ, నాలాయిర దివ్య ప్రబంధ బోధన, శరణాగతితో కూడిన మత ప్రతిపాదన, ప్రచారం, అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.
  • వేదాంతానికి మూలస్తంభాలవంటి వేదాంత సూత్రాలకు సరిక్రొత్త వ్యాఖ్యానం వ్రాయటం.
  • భాగవత, విష్ణుపురాణాలను రచించిన వేదవ్యాస, పరాశర మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి, వారికా నామధేయాలను ప్రసాదించి, వ్యాస, పరాశరులకు నివాళులు అర్పించటం.

గోష్టిపూర్ణుడు

ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని తిరుగోష్ఠిపురం లోని రాజగోపురం పైకి ఎక్కి, అందరికీ ఉపదేశిస్తాడు. గురువు 'నీవు నరకానికి వెడతావేమో' నని అంటే అందరూ స్వర్గానికి వెడతారని బదులిస్తాడు.

కార్యకలాపాలు

రామానుజులు తన జీవితకాలంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించడం, పలు ఆలయాల్లో మూర్తులను విష్ణు సంబంధమైన విగ్రహాలుగా నిరూపించడం, ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగమ విధానాలు, పరిపాలన పద్ధతులు ఏర్పరచడం వంటి కార్యకలాపాలు నిర్వహించారు. ఆ క్రమంలో విస్తృత పర్యటనలు, వాద ప్రతివాదాలు చేశారు.

తిరుమల ఆలయ వ్యవస్థల ఏర్పాటు

తిరుమలలోని మూలవిరాట్టు (ధ్రువబేరం) విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో, శివ ప్రతిమో, సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించారు. శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను, శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపి ఓడించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారనీ, రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తానికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు.
అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయపూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమాన్ని కొనసాగించారు. ఐతే అప్పటికి ఉన్న వైదికాచారాలతోపాటుగా ద్రవిడవేదాలను, పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. అంటరాని వారికి గుడిలో ప్రవేశం కల్పించడమే కాకుండా వారిని కైంకర్య సేవకు నియమించారు శ్రీ వైష్ణవ దాసులు (మాదిగమాలదాసులు), తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో, మూర్తి స్వరూపనిర్ధారణలో, ఆగమ పద్ధతుల్లో తిరుమల-తిరుపతిపైన రామానుజాచార్యునిది చెరగని ముద్ర.

రామానుజుని ప్రతిజ్ఞ

తనగురువు తనకు చెప్పిన తిరుమంత్రాన్ని ప్రజలందరికి తెలియజెప్పి తనమతంలో తరతమాలు లేవని నిరూపించినవాడు రామానుజుడు.తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయుటకు పూనుకొని ఆసిద్దాంతాన్ని వ్యతిరేకించినవారిని సయితము చిరునగవుతో లాలించి గౌరవించేవాడు. తనను గౌరవింపమని తన మతాన్ని పెంపొందింపమని ఏరాజును అర్ధించలేదు. వైష్ణవాన్ని బలవంతంగా ఎవరికి ఇప్పించలేదు. ఆనాడు కులోత్తుంగ చోళుడు తనకున్న అధికారగర్వంతో సామ్రాజ్యాలను కబళించాడు. ఆ రాజు శైవుడు. అందుచేతనే తన దేశంలో వైష్ణవుడు ఉండటానికి వీల్లేదని హింసలు పెట్టాడు. ఇట్టి పరిస్థితులు దేశంలో ఉన్నప్పటికి రామానుజుడు తన మతాన్ని ప్రచారం చేయుట ఆపలేదు. దేశంలో అందరు రామానుజుని ప్రతిభను గుర్తించారు. రామానుజుని ప్రతిభ కులోత్తుంగుని హృదయాన్ని మానని గాయం చేసింది. రామానుజుని వర్గం ఒక వైపున వైష్ణవ మత ప్రచారం చేస్తున్నది. మరొకవైపున కులోత్తుంగుడు దానిని నాశనం చేయుటకు పూనుకున్నాడు. కులోత్తుంగ ప్రధాని త్రిపురాంతకుడు ప్రేరణ వలన కులోత్తుంగుడు రామానుజుని పైన ద్వేషం ఏర్పరచుకొన్నాడు. రాజు, రామానుజుని బంధించాలని ప్రయత్నించాడుకాని సాధింపలేకపోయాడు. చివరకు కులోత్తుంగుడు తానుచేసిన తప్పిందాన్ని గ్రహించి, అటుపై జీవతంలో ఎదురైన సమస్యలకు తాళలేక సిగ్గుపడి దుఃఖపడి ప్రజలకు మతస్వాతంత్ర్యం ప్రదానం చేసాడు. ప్రదానం చేసిన తరువాత ప్రజల పరిస్థితులు తెలుసుకొనకనే కులోత్తుంగుడు కన్నుమూసాడు. శైవ వైష్ణవ మతాలమధ్య జరిగిన ఉద్యమంలో రామానుజుడే చివరకు జయిస్తాడు.

ఈయనకు పూర్వం విశిష్టాద్వైతము ప్రతిపాదించిన వారు

ఈయనకుముందు విశిష్టాద్వైతమును ప్రతిపాదించినవారు కొందఱు కలరు. వారిలో ముఖ్యులు పన్నిద్దఱు.

  1. సరోయోగి (పొయ్‌గై యాళ్వారు) : ఈయన కంచియందలి పొయ్‌హై అను పుష్కరిణియందు ఒక బంగారు తామరపువ్వులో ద్వాపరయుగాంతమునందు పాంచజన్యాంశమున అయోనిజుఁడై జనించెను.
  2. భూతయోగి (పూదత్తాళ్వారు) : ఈయన సరోయోగి అవతరించిన మఱునాడు మల్లాపురి (తిరుక్కడల్‌మల్లై) అను గ్రామమునందు ఒక సరస్సు లోని నల్ల కలువపూవునందు గణాంశమున అయోనిజుఁడు అయి అవతరించెను.
  3. మహాయోగి (పేయాళ్వారు) : ఈయన భూతయోగి అవతరించిన మఱునాడు మాయారము (మామైలైనగరు) అను ఊరి యందు ఒక సరస్సునంది యెఱ్ఱకలువ పూవునందు నందకాంశమున అయోనిజుఁడు అయి అవతరించెను.
  4. భక్తిసారుఁడు (తిరుమళిశైయాళ్వారు) : ఈయన మీఁదచెప్పిన మూవురును అవతరించిన మూడునెలలకు మహీసారక్షేత్రము (తుముపి) అనుచోట తపస్సు చేయుచున్న భృగు మహర్షికి ఇంద్రునిచే ప్రేరేపింపఁబడి ఆఋషిని మోహింపఁజేసిన అప్సరస వలన చక్రాంశ సంభూతుఁడు అయి జనించెను. భగవద్భక్తుఁడును బిడ్డలు లేనివాఁడును అగు ఒక మేదరవాఁడు వెదుళ్లకై అచ్చటికి వచ్చి ఆశిశువును తన యింటికి ఎత్తుకొనిపోయి పెంచెను.
  5. శఠారి (నమ్మాళ్‌వారు) : ఈయన *** కురుకాపరి. (తిరుక్కు*** గ్రామమునందు కారి అను పేరుగల సచ్ఛూద్రునికి ఉడయనంగై అను భార్యయందు విష్వక్సేనాంశమున జనించెను. అట్లు అవతరించి ఎల్ల శిశువులవలె స్తన్యపానము చేయక అభివృద్ధి పొందెను.
  6. పరాంకుశదాసుఁడు (మధురకవి ఆళ్వారు) : ఈయన ద్వాపరయుగాంతమున పాండ్యదేశము లోని తిరుక్కోళూరు అను గ్రామమునందు ఒక పురశ్చూడుఁడు (ముందరి జుట్టువాఁడు) అగు బ్రాహ్మణునికి కుముదాంశమున జనించి సామవేదాధ్యాపకుఁడు అయి దివ్యదేశ యాత్రచేయుచు అయోధ్యకు పోయి ఉండెను. అప్పుడు ఇచ్చట దక్షిణ దేశమునందు నమ్మాళ్వారు అవతరించి ఆతేజస్సు తనకు కనఁబడఁగా అందుండి వచ్చి నమ్మాళ్వారువల్ల తత్వవిషయమును గ్రహించెను.
  7. కులశేఖరాళ్వారు : ఈయన కలియుగాదియందు దృఢవ్రతుఁడు అను రాజునకు పుత్రుఁడు అయి కౌస్తుభాంశమున అవతరించి ధనుర్వేదాదివిద్యలు నేర్చి పరమజ్ఞానసంపన్నుఁడై భగవత్కటాక్షమును పొందెను.
  8. విష్ణుచిత్తుఁడు (పెరియాళ్వారు) : ఈయన కలియుగాదియందు శ్రీవిల్లిపుత్తూరు అను గ్రామమునందు ఒక పురశ్చూడుఁడు అగు వైష్ణవునకు గరుడాంశమున పుత్రుఁడై అవతరించి వేదవేదాంగములెల్ల అభ్యసించి అచ్చటి వటపత్రశాయి అను విష్ణుమూర్తికి తులసి కైంకర్యము చేయుచు ఉండి పాండ్యదేశపు రాజునొద్ద పరతత్వ నిర్ణయము చేసి బహుమతి పడసి పిదప లక్ష్మీపతి అగు శ్రీమన్నారాయుణుని ప్రత్యక్షము చేసికొని తులసివనమునందు అయోనిజయై జనించి తన కొమార్తే అయిన ఆముక్తమాల్యదను (చూడికొడుత్త నాంచారును) ఆ దేవునికి భార్యగా సమర్పించి కృతార్థుఁడు అయ్యెను.
  9. గోదాదేవి (చూడికొడుత్తాళ్‌) : ఈమె కలియుగాదిని శ్రీవిల్లిపుత్తూరి యందు విష్ణుచిత్తునియొక్క తులసివనమునందు అయోనిజయై భూమ్యంశమున జనించి ఆపెరియాళ్వారుచే పెంపఁబడి ఆయన పెరుమాళ్లకు కట్టికొని పోయెడు తులసిమాలలు తాను ముందు ధరించి పిమ్మట పూలబుట్టలో పెట్టుచువచ్చి కడపట ఆపెరుమాళ్లకు భార్య అయ్యెను. కనుక ఈమె ఆఁడుది అయినను తక్కిన ఆళ్వారులలో చేర్చి ఎన్నఁబడెను.
  10. భక్తాంఘ్రిరేణువు (తొండరడిప్పొడి యాళ్వారు) : ఈయన కలియుగము పుట్టిన ఇన్నూఱేండ్లకు పిమ్మట చోళదేశమునందు మండంగుడి అను గ్రామములో ఒక పురశ్చూడ వైష్ణవునకు పుత్రుఁడై వనమాలాంశమున జనియించి విప్రనారాయణుఁడు అనుపేరు వహించి భగవత్కైంకర్యపరుఁడై కాలము గడపెను.
  11. మునివాహనుఁడు (తిరుప్పాణాళ్వారు) : ఈయన కలియుగము పుట్టిన మున్నూఱు ఏండ్లకు పిమ్మట చోళదేశము లోని నిచుళాపురము (ఉరయూరు) అను గ్రామములో విడవలి గంటలలో అయోనిజుఁడు అయి శ్రీవత్సాంశమునందు జనియించి బిడ్డలులేనివారైన చండాల దంపతులచే పెంపఁబడి వీణాగానమునందు నిపుణుఁడై భగవన్నామస్మరణచేసి కృతార్థుఁడు అయ్యెను.
  12. పరకాలుఁడు (తిరుమంగై యాళ్వారు) : ఈయన కలియుగము పుట్టిన నన్నూఱు సంవత్సరములకాలమున తిరువాలిత్తిరునగరు అను గ్రామమునందు నీలుఁడు అను ఒక శూద్రునికి పుత్రుఁడు అయి అవతరించి ధనుర్విద్య మొదలు అగు విద్యలనేర్చి చోళరాజునొద్ద కొంచెపాటి అధికారము ఒకటి సంపాదించుకొని తనకు తగిన నలుగురు మంత్రులను చేర్చుకొని మెలఁగుచు అయోనిజయై జనించిన కుముదవల్లి అను కన్యకను వివాహము అగుటకొఱకు దొంగిలించియు మోసపుచ్చియు ధనమును ఆర్జించి శ్రీరంగపు రంగనాథుని దేవాలయగోపుర ప్రాకారాదులను కట్టించి ఆమెను పెండ్లాడి పరమ భాగవత భక్తుఁడు అయి ముక్తుఁడు అయ్యెను. ఈచెప్పఁబడిన వారే పన్నిద్ద ఱాళ్వార్లు అనఁబడుదురు.

.....................
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............

No comments:

Post a Comment