Thursday, 5 May 2022

ఆది శంకరాచార్యులు

 



ఆది శంకరాచార్యులు (ఆది శంకరులుశంకర భగవత్పాదులు ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త సా.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి.హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.

హిందూధర్మం ఆలోచనలో ప్రధాన ప్రవాహాలను ఏకీకృతం చేసి, స్థాపించిన ఘనత ఉన్నప్పటికీ, వాచస్పతి మిశ్రా అంతకు ముందే ఏకీకృత భావంతో రచనలు చేశాడు. అతని సమకాలికుడు, అతని కంటే పెద్దవాడైన మందన మిశ్రా రచనలు ప్రాచుర్యం పొందాయి. శంకర చారిత్రక కీర్తి, సాంస్కృతిక ప్రభావం అతని జీవితకాలం పై శతాబ్దాల గడిచిన తరువాత ముఖ్యంగా ముస్లిం దండయాత్రల కాలంలో, భారతదేశం వినాశనం సందర్భంలో పెరిగింది. 

సంస్కృతంలో ఆయన చేసిన రచనలు ఆత్మ, నిర్గుణ బ్రాహ్మణ ("గుణాలు లేని బ్రాహ్మణ") ఐక్యతను చర్చిస్తాయి. ఆయన తన సిద్ధాంతానికి మద్దతుగా వేద నియమావళిపై ( బ్రహ్మ సూత్రాలు, ప్రధాన ఉపనిషత్తులు, భగవద్గీత) విస్తారమైన వ్యాఖ్యానాలు రాశాడు. ఆయన రచనలు ఉపనిషత్తులలో కనిపించే ఆలోచనలను విశదీకరిస్తాయి. శంకర ప్రచురణలు ఆచార ఆధారిత మీమాంస హిందూ సంప్రాదాయాన్ని విమర్శించాయి. హిందూ మతం, బౌద్ధమతం మధ్య ఉన్న ముఖ్య వ్యత్యాసాన్ని కూడా ఆయన వివరించాడు. హిందూ మతం "ఆత్మ ఉనికిలో ఉందని" పేర్కొనగా, బౌద్ధమతం "ఆత్మ లేదు" అని పేర్కొంది.

శంకర భారతీయ ఉపఖండంలో పర్యటించి తన తత్వాన్ని ఇతర ఆలోచనాపరులతో ఉపన్యాసాలు, చర్చల ద్వారా ప్రచారం చేశాడు. మీమాంస హిందూ మత సంప్రాదాయం కఠినమైన కర్మకాండను స్థాపించి, సన్యాసాన్ని ఎగతాళి చేసిన సమయంలో, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాల ప్రకారం సన్యాసి జీవితం ప్రాముఖ్యతను ఆయన స్థాపించాడు. అతడు నాలుగు మఠాలను ("మఠాలు") స్థాపించినట్లు పేరుపొందాడు, ఇది అద్వైత వేదాంతం యొక్క చారిత్రక అభివృద్ధి, పునరుజ్జీవనం వ్యాప్తికి సహాయపడింది. అందువలన హిందూమతం గొప్ప పునరుజ్జీవన కర్తగా పేరొందాడు. ఆది శంకర దశనామి సన్యాసి క్రమం ప్రారంభించాడని, షణ్మత ఆరాధన సంప్రదాయాన్ని ఏకీకృతం చేశాడని నమ్ముతారు.


శంకరుని అవతారం

శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.

దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి).


జీవిత గాధ

శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని -  శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.

  • మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన
  • చిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దాల మధ్యకాలంలో చిద్విలాసుని రచన
  • కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన

వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగారు. తెలుగులో వీరి జీవిత చరిత్రను 1001 పద్యాలతో ధర్మదండము పేరిట పద్య కావ్యంగా డా. కోడూరి విష్ణునందన్ రచించారు.


జననము

సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మించారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు సా.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో  జన్మించారు.

బాల్యము


శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది .

ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.


సన్యాస స్వీకారము

సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.

గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.


గోవింద భగవత్పాదుల దర్శనం


తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరులకు అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదులు 'ఎవరు నువ్వు?' అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.

న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.

ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరులు)

శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.


వారాణసిలో శంకరులు

గుర్వాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.

మనీషా పంచకం

ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.

అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు

ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశారు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.

ప్రస్థానత్రయం

అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరికి బయలు దేరారు. బదరిలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము, "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.


వ్యాసమహర్షి


ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశంసించాడు.

వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని కోరగా, వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్ధాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక" అని దీవించాడు.


శంకరాచార్యుల శిష్యులు

శంకరులకు అనేకులు శిష్యులుగా ఉన్నారు. ఆయన ప్రఙ్ఞాపాఠవాలకు కొందరు, చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు. వారిలో అతి ముఖ్యులు కొందరు ఉన్నారు

పద్మపాదుడు


పద్మపాదాచార్యుడు సా.శ. 9వ శతాబ్దానికి చెందిన తత్త్వజ్ఞుడు, అద్వైత వేదాంతి. శంకరాచార్యుని నలుగురు ముఖ్యశిష్యులలో ఈయన ఒకడు. శంకరాచార్యుడు భారతదేశానికి తూర్పున పూరిలో గోవర్ధన పీఠాన్ని సంస్థాపించి, ఇతనిని అధిపతిగా నియమించాడు.

పూర్వాశ్రమం (సన్యాసానికి ముందు జీవితం)

దక్షిణ భారతదేశంలో కావేరీ నదీతీరంలో విమల అనే బ్రాహ్మణునికి సంతానంగా ఈయన జన్మించాడు. బాల్యంలో వేదాలను చదువుకుని, సన్యసించి, కాశీ నగరం చేరుకున్నాడు. అక్కడ శంకరాచార్యుని కలుసుకొని శిష్యునిగా చేరాడు. ఆయనకు శంకరాచార్యుడు "సనందన" అని నామకరణం చేసాడు.

శంకరాచార్యుని వద్ద శిష్యరికం

పద్మపాదుడు శంకరాచార్యుని మొదటి శిష్యుడు

కొత్త పేరు

శంకరుని కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రాహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి జ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్థించాడు. అలా శంకరునకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరునికి అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల, తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరుడు గ్రహించి, వారిలోని ఆ అసూయను పోగట్టదలచాడు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడిని పిలిచాడు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా, అతడు మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు "పద్మపాదుడు" అయ్యాడు. పద్మపాదునికి సంబంధించిన మరొక కథ: శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసాడు. శంకరుడు తపస్సు చేసుకొంటూ, ఆపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరుడు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు. అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి, తపమాచరించుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున, శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ, కూర్చొని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోగ్రుడై, శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండొ హఠాత్తుగా ఒక సింహము దాడి చేసింది. అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి, ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి, పద్మపాదుని శక్తికి, అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.

అద్వైత సాహిత్యాన్ని బట్టి చూస్తే, ఈయనకు పద్మపాదుడు అని పేరు రావడానికి వెనుక ఒక కథ ఉంది. ఒక సారి శంకరాచార్యుడు గంగానదికి ఒక వైపు, శిష్యులందరూ మఱొక వైపు ఉండగా, గురువుగారు వారిని నది దాటి రమ్మన్నారట. తక్కిన శిష్యులందరూ ఒక పడవ కోసం చూస్తుండగా, గురువు గారి ఆజ్ఞ విన్న తఱువాత, రెండవ ఆలోచన ఎఱుగని సనందుడు మధ్యలో ఉన్న నది సంగతి మరిచిపోయి, నది మీద పరుగెట్టడం మొదలెట్టాడు. ఆ గురుభక్తిని మెచ్చి, గంగ సనందుడు అడుగు వేసిన చోటల్లా పద్మాన్ని ఉంచి నదిని దాటించింది. అందుకని ఆయనకు పద్మపాదుడు అనే పేరు సంప్రాప్తించింది.

పంచపాదిక

పద్మపాదుని ముఖ్యరచనలలో పంచపాదిక ఒకటి. అద్వైతుల సాహిత్యంలో ఈ రచన వెనుక ఒక కథ ఉంది. శంకరాచార్యులు బ్రహ్మసూత్రాల గురించి వ్రాసిన భాష్యాన్ని చదివిన పద్మపాదుడు దాని పైన ఒక టీకాను రచించి గురువుగారికి అర్పించాడు. ఒక సారి పద్మపాదుడు తీర్థయాత్రలకు వెళ్ళాలని సంకల్పించుకున్నాడు. దారిలో శ్రీరంగంలో తన మేనమామను కలిసి తన రచనను చూపించాడు. స్వయంగా కర్మకాండను అనుసరించే తన మేనమామకు వీరి పోకడ నచ్చక ఆ గ్రంథాన్ని తగలబెట్టాడు. అంతే కాక పద్మపాదులకు నల్లమందు పెట్టి మందమతిని చేసారు. పద్మపాదుడు శంకరాచార్యులను కలిసి ఈ దుర్ఘటనను వివరించగా, శంకరాచార్యుడు ఆ గ్రంథాన్ని యథాతథంగా జ్ఞప్తికి తెచ్చుకుని చదివాడు. ఆ టీకా పేరే పంచపాదిక (ఐదు పాదాలు కలది). కానీ, ఇందులో కేవలం నాలుగు భాగాలే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి.

ఈ కథ చెప్పిన విద్యారణ్య స్వామి కూడా దీనికి సరైన మూలాలు తెలియవని అనడం వలన ఇది ఎంత వరకు నిజమో ప్రశ్నార్థకమే.

అభినవ గుప్తుని శాపం

శంకరాచార్యునిపై అసూయతో అభినవగుప్తుడు ఒక శాపం ఇచ్చాడని, తత్ఫలితంగా శంకరాచార్యునికి భంగంధరం అనే ఒక వ్యాధి వచ్చిందని కొన్ని రచనలు చెప్తున్నాయి. కానీ అభినవగుప్తుడు శంకరాచార్యుని తఱువాతి శతాబ్దంలో ఉండటం వలన ఈ కథ నిజమయ్యే అవకాశం లేదు. వ్యాసాచలుడు అనే అద్వైతి రచన ప్రకారం ఆ శాపం కాపాలికుల పని. శంకరాచార్యుల కాలంలో ఉన్న కాపాలికులకు ఆయన అంటే పడదు కాబట్టి ఇది నమ్మశక్యమైన వాదన. ఏదేమైనా, ఆ శాపాన్ని తిప్పి కొట్టింది పద్మపాదుడు అని ప్రతీతి. ఈ కథపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నది గమనార్హం.

రచనలు

కచ్చితంగా వీరి రచన అని తెలిసినది పంచపాదిక. విజ్ఞానదీపిక, ఆత్మానాత్మవివేకము, వేదాంతసారము (శంకరాచార్యుల "ఆత్మబోధ"కి భాష్యం) వీరికి ఆపాదించబడే ఇతర రచనలు.






కుమారిల భట్టు ను కలవడం

తన 15 వ ఏట, శంకరులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుల గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుల దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరులు "శివుని పుత్రుడైన కుమారస్వామి గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు" అని కోరారు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరులతో చెప్పాడు.

భట్టిపాదుడు

భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన ఙ్ఞాని. అతడు పుట్టేనాటికి బౌద్ధమతం వ్యాప్తి జరిగి ఉంది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు బౌద్ధం గురించి తెలుసుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని బౌద్ధ భిక్షువుగా వేషం ధరించి ఒక బౌద్ధ మతగురువు వద్ద బౌద్ధ శాస్త్రాల గురించి తెలుసుకోసాగాడు. ఒకనాడు ఒక బౌద్ధ బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోయింది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా బౌద్ధ సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం బోధించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపాటున ఉండగా జరిగింది. మీరు ఇపుడు పరీక్షించవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాదుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక ఖాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహా విష్ణువు ఉన్నాడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమాణముగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని బౌద్ధ బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు. దానితో అతని గురువుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, బౌద్ధంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా శంకరులు అక్కడకు వచ్చి వారిస్తారు. తన సూత్ర భాష్యానికి వార్తికము రచించమని అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యము నెరవేర్చమని, శంకరుల చేతిమీదగా మోక్షము ప్రసాదించమని వేడుకొనగా శంకరులు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్తి ప్రసాదిస్తారు.

మండన మిశ్రునితో తర్క గోష్ఠి

మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితో వ్యాసభగవానుడిని, జైమినిమహా మునిని ఆహ్వానించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నాడు. శంకరులు ఇంటికి రావడం గమనించి, తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని, అందువలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే, మహర్షుల ఆదేశంతో శంకరులను లోపలికి ఆహ్వానించాడు. తరువాతి రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యాసుడు, జైమిని లను ఉండమని అభ్యర్థించగా, మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి సాక్షాత్తూ సరస్వతీ స్వరూపమనీ, ఆమెను న్యాయనిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమనీ వారు చెప్పారు. ఉభయభారతి మధ్యవర్తిగా ఉండటానికి అంగీకరించి, వాళ్ల ఇద్దరి మెడలలోనూ రెండు పూలమాలలు ఉంచి, వాదనసమయంలో ఎవరి మెడలో పూలమాల వడలిపోతే వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పింది. వాళ్లిద్దరూ వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటికి మండనమిశ్రుని మెడలోని మాల వడలిపోయింది. కాని, భర్త శరీరంలో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కాని తన భర్త ఓడినట్లు కాదని ఉభయభారతి చెప్పింది. శంకరులు దానికి అంగీకరించారు. ఉభయభారతి ఎన్నో చిక్కు ప్రశ్నలను శరపంపరగా సంధించగా, శంకరులు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పగలిగినా ఆమె చివరిగా అడిగిన మన్మధ కళలెన్ని, వాటి స్వరూపార్ధాలేమిటి, శుక్ల పక్షాలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి అని అడిగింది. బ్రహ్మచారియైన శంకరులు వాటిని గురించి తెలుసుకొనే ఉద్దేశంతో జవాబులు చెప్పేందుకు కొంత కాలం గడువు ఇమ్మని అడిగారు.

కామరూపవిద్య

శంకరులు వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో తన శరీరమును కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా నూర్గురు భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మధనోత్పాదిక, మద, దీసిని, వశకరి, రంజని, మోహిని అనే పదిహేను కళలూ నేర్చి తన శరీరంలో ప్రవేశించి ఆమెను పరాభూతురాలిని చేశారు. చివరికి మండనమిశ్రుడు తన ఓటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా స్వీకరించి, సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధుడవుకమ్మని ఆశీర్వదించారు.

దిగ్విజయ యాత్రలు

తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో "శివానందలహరి" స్తోత్రాన్ని రచించారు. శ్రీశైలం సమీపంలోని చానుకొండలోని శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో "శివ పంచాక్షరీ స్తోత్రము"ను రచించారు. ఈ ఆలయం సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధి పొందినది. నాగసిద్ధుడు ఇక్కడి కొండల్లో తపస్సు ఆచరించినట్లు స్థల పురాణం. శంకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరులను సంహరింపబోయినపుడు శంకరుల శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్థించాడు. అపుడు శ్రీనృసింహుడు శంకరులను రక్షించాడు. ఆ సందర్భంలోనే శంకరులు శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రంతో దేవుని స్తుతించారు. ఈ స్తోత్రాన్నే కరావలంబస్తోత్రం అని కూడా అంటారు. 

తరువాత శంకరులు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబిక మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు హస్తామలకాచార్యుడనే పేరుతో శంకరుల శిష్యుడైనాడు. తరువాత శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు. తోటకాచార్యుడు శంకరుల శిష్యుడయ్యాడు. పిదప శంకరులు దక్షిణ, ఉత్తర దేశాలలో తన "దిగ్విజయం" సాగించారు. హిందూ, బౌద్ధ పండితులను వాదాలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించారు. కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగింది. గోకర్ణం, సోమనాధ, ద్వారక, ఉజ్జయినిలను దర్శించారు. బాహ్లిక దేశంలో జైనులను వాదంలో ఓడించారు. కాష్మీర, కాంభోజ దేశాలలో తాంత్రికులను కలుసుకొన్నారు.

సర్వజ్ఞపీఠం అధిరోహణ

శంకరులు కాష్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు. ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఆధీన ప్రాంతంలో ఉంది. ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్ధండ పండితులు ఉన్నారు. కాని దక్షిణ ద్వారం అంతవరకు తెరువబడలేదు (అనగా దక్షిణ దేశంనుండి గొప్ప పండితులెవరూ రాలేదు). పండితులను మీమాంస వేదాంతాది తర్కాలలో ఓడించి శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.

తన జీవితం చివరి దశలో శంకరులు కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి దేహ విముక్తుడయ్యారు. కేదారనాధ మందిరం వెనుక శంకరుల స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది. అయితే శంకరులు కేరళలోని త్రిస్సూర్‌లో దేహంవిడిచారని "కేరళీయ శంకర విజయం" చెబుతున్నది. 

శంకరుల జీవిత కాలము

శంకరుల జీవిత కాలం గురించి ప్రబలమైన అభిప్రాయాలున్నాయి.

  • క్రీ.పూ. 509 – 477 :ద్వారక, పూరి, కంచి మఠాల ఆచార్యుల గురించిన రికార్డుల ద్వారా ఈ కాలం నిర్ణయింపబడుతున్నది.

అయితే శంకరులు ధర్మకీర్తి అనే బౌద్ధ పండితునితో వాదం సాగించిన ఆధారం ప్రకారం ఈ కాలం గురించి సంశయాలున్నాయి. ఎందుకంటే ధర్మకీర్తి గురించి 7వ శతాబ్దంలో హ్యూన్‌త్సాంగ్ తన రచనలలో ప్రస్తావించాడు. అంతే కాకుండా ఇంచుమించు శంకరుల సమకాలీనుడైన కుమారిలభట్టు 8వ శతాబ్దం వాడని భావిస్తున్నారు. దండయాత్రల కారణంగాను, మధ్యలో వచ్చిన అంతరాయాల కారణంగాను, ద్వారక, పూరి రికార్డు కంటే శృంగేరి రికార్డులు మరింత బలంగా ఉండే అవకాశం ఉండవచ్చును.

చతుర్మఠాల వ్యవస్థ

(జగద్గురు బోధలు,సాధన గ్రంథ మండలివారి శంకరుల జీవిత చరిత్ర ల నుండి)

మఠము-పీఠము. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి (వందల సంవత్సరాల)నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరులు ఏప్రాతిపదికపై ఎంత పటిష్ఠంగా నిర్మించారో తెలుస్తుంది. చతుర్ధామాలు నిరంతరాయంగా నిర్వహించబడేందుకు శంకరులు మఠామ్నాయము, మహాశాసనము అనే నిర్వహణ పద్ధతులను ప్రవేశ పెట్టారు. మఠామ్నాయము, మహాశాసనములు నేటి ఆధునిక కంపెనీలు తయారు చేసుకొనే, నిర్వహణ స్వరూపమైన, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే రెండు ప్రధాన పత్రాల వంటివి. ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించినది కాగా రెండవది సంస్థకు బయటి ప్రపంచంతో సంబంధాన్ని వివరిస్తుంది. నేటి ఆధునిక పద్ధతులను శంకరులు ఆనాడే మఠాల నిర్వహణ కొరకు ప్రవేశపెట్టుట జరిగింది.

శంకరులు మఠ నిర్వహణ కొరకు నియమింపబడే సన్యాసుల నామాంతరము యోగపట్టము అనే దానిని ప్రవేశపెట్టారు.హిందూధర్మం ప్రకారం సన్యాసం తీసుకొన్న వ్యక్తి పాతపేరును తీసివేసి సన్యాసి అని సూచించే కొత్తపేరును తీసుకొంటాడు. అటువంటి ప్రత్యేక నామాన్ని యోగపట్టము అంటారు. అటువంటి పది పేర్లను శంకరులు నిర్దేశించారు. అవి .తీర్ధ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. హిందూ సన్యాసుల పేర్ల చివర ఇలాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు- ఆనందతీర్ధ, విద్యారణ్య, సత్యవృతసామాశ్రమి, విద్యాప్రకాశానందగిరి, చంద్రశేఖరసరస్వతి, నృసింహ భారతి, తోతాపురి అనే పేర్లు సుప్రసిద్దాలు. శంకరులు నాలుగు మఠాల స్థాపనకు ప్రమాణంగా దిక్కులను, వేదాలను, సంప్రదాయాలను అనుసరించారు.

మఠాల వివరాలు
శిష్యుడుమఠంమహావాక్యంవేదంసంప్రదాయం
హస్తామలకాచార్యుడుగోవర్ధన పీఠం
పూరి
ప్రజ్ఞానం బ్రహ్మాఋగ్వేదంభోగవార
సురేశ్వరాచార్యుడుశృంగేరి శారదాపీఠం
శృంగేరి
అహం బ్రహ్మాస్మియజుర్వేదంభూరివార
పద్మపాదాచార్యుడుకాంచి పీఠం
ద్వారక
తత్వమసిసామవేదంకీటవార
తోటకాచాఱ్యుడుజ్యోతిర్మఠం
బదరీనాధ్
అయమాత్మా బ్రహ్మాఅథర్వవేదంఆనందవార

ఆమ్నాయాలు: ఆమ్నాయాలు ఏడు. పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ, స్వాత్మ, నిష్కల ఆమ్నాయములు. వీటిలో మొదటి నాలుగు దృష్టికి గోచరించేవి కాబట్టి దృష్టి గోచరములు అని, చివరి మూడు దృష్టికి గోచరించనివి బుద్ధికి మాత్రమే అందేవి కాబట్టి జ్ఞానగోచరములు అని వ్యవహరించారు.

వేదము- మహావాక్యము :వేదాలు నాలుగింటి లోను ఒక్కొక్కదానినుండి ఒక్కొక్క వాక్యము తీసుకొనబడింది.

  • ఋగ్వేదం నుండి ప్రజ్ఞానం బ్రహ్మ
  • యజుర్వేదం నుండి అహం బ్రహ్మస్మి
  • సామవేదం నుండి తత్త్వమసి
  • అధర్వణ వేదం నుండి అయమాత్మా బ్రహ్మ

అనేవాక్యాలు తీసుకొనబడినవి. ఈ వాక్యాలు ఒక్కొక్కటి సమస్త వేదసారాన్ని వేర్వేరు దృక్కోణాలలో వ్యక్తీకరించగలిగేది.

సంప్రదాయాలు: సంప్రదాయాలు నాలుగు విధాలైనవి. అవి కీటవార సాంప్రదాయం, భోగవార సాంప్రదాయం,ఆనందవార సాంప్రదాయం, భూరివార సాంప్రదాయం అనేవి. వీటిని ప్రామాణికంగా తీసుకొని శంకరులు నాలుగు మఠాలను నిర్దేశించారు.

పూర్తి వ్యాసం కొరకు చూడండి. - చతుర్ధామాలు (మఠాలు), పూరీ మఠం, ద్వారక మఠం, శృంగేరి, బదరీనాథ్ మఠం

మఠ నిర్వహణలో శంకరుల వ్యవస్థానైపుణ్యము

మఠామ్నాయము అని పిలువబడే మఠ నిర్వహణ వ్యవస్థలో కొన్ని విశేష లక్షణాలను శంకరులు ఏర్పరిచారు. వాటిలో

  1. శంకరులు పీఠాలకు నారాయణుని, సిద్ధేశ్వరుని{శివుడు} అది దేవతలుగా నిర్ణయించాడు. దీని ద్వారా హిందూ ధర్మంలోని ఏ ఒక్క పంథా నో అనుసరించలేదు అని స్పష్టం చేసాడు.
  2. వివిధ యోగ పట్టములు ధరించిన సన్యాసులకు వేర్వేరు బాధ్యతలను కేటాయించుటద్వారా హిందూ ధర్మావలంబులైన ప్రజల వివిధ ధార్మిక అవసరాలకు, వారుండే వేర్వేరు భౌగోళిక ప్రాంతాలకు ధర్మాచార్యులు అందుబాటులో ఉండే ఏర్పాటు చేసాడు.
  3. పర్యటన, భిక్ష అనబడే వ్యవస్థలు సన్యాసులు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చేందుకు, వైయుక్తికంగా ఆర్థిక లంపటాలలో చిక్కుకొనకుండా సామాన్య ప్రజలపై ఆధార పడుతూ,"తమ ధర్మాన్ని తామే పోషించాలి"-అనే స్పృహను ప్రజలలో కలుగచేసేందుకే రూపొందించాడు.
  4. ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకూ బాధ్యత ఉందని ప్రజలకు తెలియ చెప్పేందుకు, ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తిచేయడానికి తమ శక్తిని ఉపయోగించాలి అనే భావనను పీఠాధిపతులలో కలుగ చేయడానికి యోగ పట్ట వ్యవస్థను రూపొందించాడు.

శంకరుల రచనలు

ఉపనిషత్తులలోని విషయాలు ఆధారంగా అద్వైత వేదాంతాన్ని నిరూపించడం శంకరుల రచనలలో ముఖ్య విషయం. ఇందుకు వేదాలనుండి, ఇతర పురాణేతిహాసాలనుండి శంకరులు ఉదహరించారు. స్వానుభవానికి శంకరులు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఆయన రచనలలో తర్కం చాలా బలమైన స్థానం కలిగి ఉంది. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, ఇతర వేదాంత విరుద్ధ హిందూ భావాలను ఖండించాడు. శంకరుల రచనలు మూడు విధాలుగా విభజింపవచ్చును - భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు.

భాష్యాలు

వేదాంత, పురాణేతి హాసాలను వివరంచే గ్రంథాలు. అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించేవి. శంకరులు తన భాష్యాలలో శ్వేతాశ్వర, కౌషీతకి, మహానారాయణ, జాబాల వంటి ఉపనిషత్తులనుండి విస్తృతంగా ఉదహరించారు. శంకరులు క్రింది గ్రంథాల గురించి భాష్యాలు వ్రాశారు.

  • బ్రహ్మసూత్రాలు
  • ఐతరేయోపనిషత్తు (ఋగ్వేదము)
  • బృహదారణ్యకోపనిషత్తు (శుక్ల యజుర్వేదము)
  • ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు) (శుక్ల యజుర్వేదము)
  • తైత్తరీయోపనిషత్తు (యజుర్వేదము)
  • ఛాందోగ్యోపనిషత్తు (అధర్వణ వేదము)
  • మాండూక్యోపనిషత్తు (అధర్వణ వేదము), గౌడపాదకారిక
  • ముండకోపనిషత్తు (అధర్వణ వేదము)
  • ప్రశ్నోపనిషత్తు (అధర్వణ వేదము)
  • భగవద్గీత
  • విష్ణు సహస్రనామ స్తోత్రము
  • గాయత్రీ మంత్రము

ఇప్పుడు లభించే కొన్ని (కౌషీతకి, నృసింహ తాపని, శ్వేతాశ్వర) ఉపనిషద్భాష్యాలు శంకరులు వ్రాశారా అన్న విషయం గురించి సందేహాలున్నాయి. బ్రహ్మ సూత్రాలకు శంకరులు వ్రాసిందే మనకు లభించే మొదటి భాష్యం. కాని శంకరులు ద్రవిడ, భర్తృప్రపంచ వంటి భాష్యాలను పేర్కొన్నారు.

ప్రకరణ గ్రంథాలు

ప్రకరణ గ్రంథాలు అనగా తత్వ, వేదాంత వివరణలు. గురువు శిష్యులకు వివరించి చెప్పే విధంగా ఉండేవి.

  • వివేక చూడామణి
  • ఉపదేశ సహస్రి
  • శతశ్లోకి
  • దశశ్లోకి
  • ఏక శ్లోకి
  • పంచ శ్లోకి
  • ఆత్మబోధ
  • అపరోక్షానుభూతి
  • సాధనా పంచకము
  • నిర్వాణ శతకము
  • మనీషా పంచకము
  • యతి పంచకము
  • వాక్య సుధ
  • తత్వబోధ
  • సిద్ధాంత తత్వవిందు
  • వాక్యవృత్తి
  • నిర్గుణ మానస పూజ
  • శంకరులు వ్రాసారని చెప్పబడే వాటిలో "ఉపదేశ సహస్రి" మాత్రం శంకరులు వ్రాసారని అధికుల అభిప్రాయం. మిగిలిన వాటిపై సంశయాలున్నాయి (వేరేవారు వ్రాసినా శంకరుల పేరు మీద ప్రసిద్ధమయ్యాయని)
  • స్తోత్రాలు

భక్తి, లయ, కవితా సౌరభాలతో భగవంతుని అర్చించే సాధనాలు. శంకరులు తన "గురు స్తోత్రం" ఆరంభంలో చెప్పిన "గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః, గురుఃసాక్షాత్ పరంబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః" అనే స్తోత్రం ప్రార్థనా గీతంగా చాలా ప్రసిద్ధమైనది. శంకరులు వ్రాశారని చెప్పబడే కొన్ని స్తోత్రాలు:

  • శివ పంచాక్షరీ స్తోత్రం
  • ప్రస్థానత్రయం
  • పాండురంగాష్టకం
  • సాధన పంచకం
  • వివేకచూడామణి
  • శివానందలహరి
  • మనీషాపంచకం
  • సౌందర్యలహరి
  • మీనాక్షీ పంచరత్న స్తోత్రం
  • ఆనందలహరి
  • గణేశ పంచరత్న స్తోత్రం
  • లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం
  • భజగోవిందం
  • కనకథారా స్తోత్రం
  • సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం
  • గంగా స్తోత్రము
  • శ్రీదక్షిణామూర్తి స్తోత్రము
  • వీటిలో కొన్ని శ్లోకాలు ఇతరులు వ్రాయగా అవి శంకరుల పేరుతో జగత్ప్రసిద్ధమయ్యాయని కొందరి భావన.
  • శంకరుల తత్వం, సిద్ధాంతం: అద్వైతం 

  • శంకరులు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. ఇందుకు మౌలికమైన సూత్రాలను శంకరులు ప్రస్థాన త్రయం (ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు) నుండి గ్రహించారు.

  • అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. అతని "వివేక చూడామణి" అనే ప్రకరణ గ్రంథంలో అద్వైతం గురించి క్లుప్తంగా ఇలా చెప్పబడింది -

    బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నఽ పరః

    బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య. జీవునకు, బ్రహ్మమునకు భేదం లేదు.

    శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూలస్తంభాలు. అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలు మరణం వరకు సాధన ద్వారా "తత్వమసి" అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొన్నవారే జీవన్ముక్తులు, మహాత్ములు.

    శంకరుల మాయావాదాన్ని తీవ్రంగా విమర్శించేవారున్నారు. అయితే బ్రహ్మమొక్కటే సత్యమనే విషయానికి ఫలితంగా సంసారం మిథ్య అనే నిర్ణయానికి రావలసి వస్తుందని అద్వైత వాదులు అంటారు.

  • శంకరుల ప్రభావం

  • బౌద్ధం, జైన మతాల ప్రాబల్యం కారణంగా శంకరుల కాలంనాటికి హిందూమతం క్షీణ దశలో ఉంది. అనేక శాఖలు వారిలో వారు తగవులాడుకొంటుండేవారు. మీమాంస, సాంఖ్య వాదులు దాదాపు దేవుడిని నమ్మరు. చార్వాకులు వేదాలను నిరసించారు.

    ఆది శంకరులు వివిధ శాఖలకు చెందిన పండితులను వాదంలో ఓడించి వారిచే తన సిద్ధాంతాన్ని ఒప్పించారు. భగవంతుని నమ్మేవారినందరినీ షణ్మత వ్యవస్థలో ఏకీకృతులను చేశారు. వేదాలకు తరిగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశారు.

    • ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.
    • శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
    • గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి. ఈయన 108 గ్రంథాలు రచించారు.

    కేవలం 32 సంవత్సరాలు జీవించిన శంకరుల ప్రభావం హిందూమతంపై అనన్యమైనది. స్మార్తులు, సంతులు అతను నెలకొలిపిన సంప్రదాయాలను ఆచరిస్తారు. దశనామి సంప్రదాయం, షణ్మత విధావం, పంచాయతన విధానం శంకరులు నెలకొలిపినవే.

    సంప్రదాయాలతో సరిసమానంగా శంకరులు స్వానుభవానికి ప్రాముఖ్యతనిచ్చారు. వ్యాకరణం, మీమాంస వంటి అధ్యయనాలు వేదాంత విద్యార్థులకు ముఖ్యమైన అధ్యయన రంగాలు.

    శంకరుల గురించి ఒక ప్రసిద్ధ శ్లోకం

    శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం
    నమామి భగవత్పాద శంకరం లోక శంకరం

    శంకరుల తరువాత రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు హిందూమతం పునరుద్ధరణలో ముఖ్యమైన పాత్ర వహించారు. ఇప్పటికీ ఈ ముగ్గురు ప్రారంభించిన తత్వ, వేదాంత, పూజాది నియమాలు, సంప్రదాయాలలో వేటినో కొన్నింటిని హిందువులలో అధికులు పాటిస్తున్నారు. వీరు మువ్వురి కృషివలన వేదాంతానికి సుస్థిరమైన స్థానం ఈ నాటికీ లభిస్తున్నది. 

  • అనంతర పరిణామాలు

  • శంకరుల అనంతరం అతడి శిష్యులు అద్వైత సిద్ధాంతాన్ని తత్సంబంధిత మతాచారాలను ముందుకు తీసుకొని వెళ్ళారు. అద్వైత సిద్ధాంతంలో పాండిత్యాన్ని సంపాదించిన పిదప ఎందరో పండితవర్యులు వ్రాసిన వ్యాఖ్యలను పరిశీలించిన మీదట నేడు అమలులో ఉన్న అద్వైత వ్యవస్థలను నాలుగు రకాలుగా విభజించవచ్చు.

    • నిర్గుణబ్రహ్మ వాదము
    • బ్రహ్మవివర్త వాదము
    • అనిర్వచనీయ ఖ్యాతివాదము
    • జీవన్ముక్తి వాదము

    అద్వైత సిధ్ధాంతపు పునాదులపై ప్రతిపాదించ బడిన ఈ నాలుగు సిధ్ధాంతాలూ, ఒకదానికొకటి చక్కని పొంతన కలిగి ఉన్నాయనటంలో సందేహం లేదు. మొదటి రెండు సిద్దాంతాలకూ అధిభౌతిక భావార్థముంటే, మూడవ దానికి అధిభౌతిక, జ్ఞానమీమాంసకు సంబంధించిన భావార్థాలున్నయి. నాలుగవ సిద్ధాంతానికి గొప్ప మౌక్తిక భావార్థమున్నది.












.....................
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............















No comments:

Post a Comment