Saturday, 12 October 2019

దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి?*


*పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం , అజ్ఞాత వాసాలు చేయడంలో అంతర్యం ఏంటి? ఈ ప్రశ్న ప్రతిఒక్కరు వేసుకోవలసినది..*
*1. పాండవులు మాయజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులపాలు అయ్యారని అందరికి తెలిసిందే. అరణ్యవాస చేస్తూ ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా పాండవులను కలుసుకోవడానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని ధర్మరాజు "జూదం ఆడేటప్పుడు మమ్మల్ని ఎందుకు కాపాడలేదు" అని ప్రశ్నిస్తాడు. అందుకు సమాధానంగా కృష్ణుడు "నేను ఆ రోజు అక్కడలేను, సాల్వుడు అనే రాజుతో మాయ యుద్ధం చేస్తున్నాను (6 నెలల పాటు ఆ యుద్ధం జరిగింది!) నాకు కానీ ఆ విషయం తెలిసుంటే అలా జరగనిచ్చేవాడిని కాను" అన్నాడు. (ఆ సర్వాంతర్యామికి జూదం సంగతి తెలియదంటారా)?.*
*అసలు ఈ పాండవులు , శ్రీకృష్ణుడు వచ్చిందే భూమి మీద దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం. కానీ పాండవులు మానవులు కావడం చేత శక్తులు కానీ, కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడానికి సరైన ఆయుధాలు కానీ, ఏమీలేవు. ఉన్నది ఒక్కటే 'ధర్మం'.. అరణ్యవాసం అజ్ఞాత వాసంలో వీళ్ళని నిలబెట్టింది ధర్మమే. కాని అలాగే కొనసాగితే ధర్మం పేరుతో బ్రష్టులు అయిపోతారు. ధర్మాన్ని అన్ని కోణాల్లో ప్రయోగించాలి. ఆలా చేయాలంటే బలం, బలగం, ఆయుధ సంపత్తి, అస్త్ర శాస్త్రాలు, దైవబలం మెండుగా ఉండాలి. కాని ఆడిన మాట కోసం అడవుల పాలైన పాండవులు రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామంలో గెలవడం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అసాధ్యం. అందుకే శ్రీకృష్ణుడు తన మాయని ప్రదర్శించాడు. తాత్కాలిక కృష్ణమాయ కల్పించాడు.* *వస్త్రాపహరణం సమయంలో ద్రౌపతి శ్రీకృష్ణ స్మరణ చేయగానే వచ్చి వస్త్రాలు ఇచ్చాడు. మరి అక్కడే ఉన్న ధర్మరాజు అదంతా చూసికూడా శ్రీకృష్ణుడిని తలచుకోలేకపోయాడు!(ఇదే మాయ అంటే).*
*అటుపక్క భీష్ముడు లాంటి యోధుడు (21సార్లు క్షత్రియులు మీదకి దండెత్తి క్షత్రియ వంశాన్ని నిర్మూలం చేసిన దీరోధత్తుడు, పరశురాముడిని ఓడించిన మహావీరుడు), పరశురాముడి వద్ద శిష్యరికం చేసి కౌరవుల పాండవులకు శిక్షణ ఇచ్చిన వీరాధి వీరుడు ఎలాంటి అస్త్ర శాస్త్రాలనైనా అలవోకగా ఎదుర్కోగల ద్రోణుడు ఒకప్రక్క. పుట్టుకతోనే కవచంతో పుట్టిన కర్ణుడు(ఈ కవచాన్ని బెదించాలంటే మానవమాత్రుడి వల్ల కాదు! దైవబలం పుష్కలంగా ఉండాలి). కపటి శకుని, పుత్రప్రేమతో తపించిపోయే దృతరాష్ట్రుడు, అన్నకోసం దేనికైనా తెగించే దుశ్శాసనుడు వీళ్ళు ఒక పక్క.*
*ఇంతటి వీరులైన వీరందరిని ఓడించాలి. వీరికి సామంతులు మహాబలవంతులు. వీరిని ఓడించి ధర్మాన్ని నిలబెట్టాలంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్న శక్తి చాలదు. కనుక వీరిని పుటం పెట్టిన బంగారంలా, సానబెట్టిన వజ్రంలా తయారుచేసి శత్రువుల మీదకి సాధించాలి. అప్పుడే విజయం వరిస్తుంది. అందుకే మనకి పైకి శ్రీకృష్ణుడు తోడు ఉన్నా పాండవులు అడవుల పాలయ్యారు. కౌరవులు సుఖపడ్డారు అనుకునేలా కనబడుతుంది. లోక రక్షణ కోసం తాత్కాలిక కష్టాలు అనుభవించినా భవిష్యత్తు బావుంటుంది కనుక దుష్టశిక్షణ జరుగుతుంది కనుక పాండవులు అడవులలో తిరుగాడవలసి వచ్చింది.*
*2. జూదంలో ఒడి అడవులపాలు అయ్యారు. అసలు ఇక్కడ జరిగింది వేరు. వీళ్ళని అడవులకి పంపించాము ఇక తిరుగులేదు అని దుష్టచతుష్టయం అనుకుంది. భోగాల్లో మునిగి తేలారు. ఆయుధ సంపత్తి పెంచుకోవడం కానీ, అస్త్రశస్త్రాలు సాధిచడం కానీ ఏమి చేయకపోగా ఋషులు వచ్చినప్పుడు దుర్యోధనుడు అహంకారంతో అగౌరవపరచి శాపాలు పెంచుకున్నాడు. అడవుల్లో పాండవులని శ్రీకృష్ణుడు ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. పాండవుల క్షేమం కోసం ఎప్పటికప్పుడు మునులని, ఋషులని, ఎవరిని చూస్తే జన్మ చరితార్ధం అవుతుందో అలాంటి మార్కండేయ మహర్షిని పంపించి జ్ఞానాన్ని ప్రసాదించి, ఎన్నో శక్తులని అందిపుచ్చుకునేల చేశాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి ప్రేరేపణతో శివుడి కోసం తపస్సు చేస్తున్న అర్జునుడికి సాక్షాత్తు శివుడే కిరాత రూపంలో వచ్చి అర్జునుడితో తలపడ్డాడు.*
*అర్జునుడు వేస్తున్న బాణాలు వేసినట్లు వేసినట్లు మాయమవుతున్నాయి. చివరికి అమ్ములపొద కూడా మాయమయింది. అయినా కూడా వచ్చింది ఎవరో గ్రహించకుండా విల్లుతో మీదికి దూకాడు. విల్లు మాయమయింది. అర్జునుడు శివుడిని పిడిగుద్దులు గుద్దాడు. శివుడు నవ్వుకొని ఒక్క పిడికిటి పోటు పొడవడంతో మూర్చిల్లి కిందపడ్డాడు. తెప్పరిల్లిన తరువాత చూస్తే ఇంకేముంది! కిరాతుల రూపంలో ఉన్న శివపార్వతులు అసలు రూపంలో దర్శనం ఇచ్చారు. పాశుపతాస్త్రం అందించారు. ఆవిధంగా అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాడు. శివా! ఎందుకు నన్ను ఇలా ఆట పట్టించావ్? అని అడిగితె! అర్జునుడు శివుడుని తాకి కలబడటం వల్ల శరీరం వజ్రకవచంలా తయారయ్యింది (ఇదొక వరం). దానికితోడు పాశుపతాస్త్రం వచ్చింది.*
*తదనంతరం ఇంద్రుడు వచ్చి స్వర్గలోకానికి తీసుకెళతాడు. అక్కడ అనుకోని సంఘటన వలన ఊర్వశి చేత స్వర్గలోకంలో పేడి (నపుంసకుడు) అవుతావు అని శాపం పొందుతాడు. ఇది అంతా గమనించిన ఇంద్రుడు అర్జునుడి సత్యనిష్ఠ కి సంతసించి ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇంద్రుడు వరంగా తిప్పాడు. దీనికి తోడు ఇంద్రుడు అర్జునుడికి నాట్యం శిక్షణ ఇస్తాడు. ఈ శాపం అజ్ఞాత వాసంలో వరంగా మారింది. నృత్యం వలన విరాట కొలువులో విరాటుడి కుమార్తె ఉత్తరకి నాట్యశిక్షణ కోసం ఉపయోగపడింది. ధర్మరాజు జ్ఞానాన్ని, తప్పస్సుని పెంచుకుంటే, అర్జునుడు ఆయుధ సంపత్తిని పెంచుకున్నాడు. భీముడు గురించి చెప్ప పనిలేదు. భీముడు హిమగిరులలో విహరిస్తుండగా పుష్పం కోసం బయలుదేరి ఇలా అరణ్య అజ్ఞాత వాసాలు ముగించి ఆయుధ సంపత్తిని, ఎనలేని కీర్తి గడించారు.*
*ఇప్పడు అసలు విషయంలోకి వద్దాం!*
*ప్రతి మనిషి జీవితంలో గడ్డుకాలం ఉంటుంది. ఏపని చేసినా కలిసిరావడంలేదు అని వాపోతారు. దేవుడుని నిందిస్తారు. నేను ఎం పాపం చేశాను! ఎందుకు నాకు ఈ శిక్ష అని లోకంలో కష్టాలన్నీ వీళ్ళకే వచ్చినట్లు బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో మునుపు పనికిమాలిన పనులు గుర్తుండవు. గుర్తురావు. పైగా కష్టాలలో ఉండడం చేత ఎక్కడ సాయం అడుగుతారో అని పలకరించడానికి కూడా ఎవరు రారు. అప్పుడు మనం చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఎవరులేరు. నాబ్రతుకు ఇంతే! ఇంకేమి సాధించలేను మరణమే శరణ్యం అనే ఆలోచనల్లోకి వెళ్ళిపోతారు. ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది.*
*దీన్నే మనం అరణ్యవాసం అనుకోవాలి. ఆ సమయంలో ఎవరులేరని భాధపడకూడదు. ఎందుకంటే ఎవరు లేకపోతేనే తపస్సు చేయడానికి మంచి అవకాశం. ఎందుకంటే ఇంతకుముందు అన్ని ఉన్నాయి. అందరూ ఉన్నారు. అప్పుడు ఈ ఆలోచన రాలేదు. ఇప్పుడు కష్టంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరూ రారు. రారు అని నింద వేసి ఏడుస్తూ కూర్చుంటే ఇంకా మీరు సాధించేది ఏమిటి? ఒకవేళ వస్తే సాధన చేస్తారా? చేయరు. (ఒకటి ఆలోచించండి! పాండవులు అరణ్యవాసం చేయకపోతే కురుక్షేత్రం జరిగేది కాదు. ఎల్లప్పుడూ రాజ్యం కోసం ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ, యజ్ఞాలు యాగాలు అంటూ వీటితోనే కాలం గడిచేది. దుష్టశిక్షణ జరిగేది కాదు. మహాభారతం మనకి దొరికేది కాదు..*
*వాళ్ళుకూడా చరిత్రలో కలిసిపొయెవారె!).. అలాగే మనం కూడా కష్టం అనే గడ్డు కాలాన్ని గ్రంధ పఠనం అనే తపస్సు చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి. అలాగే ఏదైనా విద్యలని అభ్యసించాలి. సరైన గురువు కోసం అన్వేషించాలి! అప్పుడు తెలుస్తుంది జీవితం ఎలా సరిదిద్దుకోవాలో. కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో!*
*ఒకరకంగా చెప్పాలంటే సుఖపడుతున్నాం అంటే పుణ్యం కరిగిపోతున్నట్టు. కష్టపడుతున్నాం అంటే పాపం కరిగిపోతున్నట్టు. ఇప్పడు ఆలోచించుకోండి!*
*సుఖాలలో ఉన్నప్పుడు కూడా కష్టపడుతూ పుణ్యాన్ని డిపాజిట్ చేసుకుంటారా! కష్టాలలో కూడా సుఖాల కోసం వెంపర్లాడుతూ కష్టాలు కొనితెచ్చుకుంటారా! సుఖపడుతున్నప్పుడు దానధర్మాలు చేయాలి. యజ్ఞయాగాదులు (రోజుకు ఒక పేజి అయినా గ్రంధ పటనం చేస్తుంటే అదే కలియుగంలో యజ్ఞం) చేయాలి. అప్పుడు కష్టాలు మీదగ్గరికి రావు సరికదా. మీకు ప్రమాదం కలిగించాలి అనుకున్నవారు మీ చుట్టూ ఉన్నా అనతికాలంలోనే వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు ఒక అడుగు వేశారు కనుక ఆదైవం ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు. భగవంతుడు మీప్రక్కనే ఉన్నట్లు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కష్టం వచ్చిందంటే దానికి ఎదో కారణం ఉంటుంది. శ్రీకృష్ణుడు తోడు ఉండి కూడా పాండవులు అరణ్యవాసం చేసినట్లు.. కనుక ఎప్పుడూ దేనికి బెదిరిపోవద్దు. కృంగిపోవద్దు.

No comments:

Post a Comment