Sunday, 12 August 2018

శ్రావణమాసం విశిష్టత



ఎంతో పవిత్రమైన విశేషమైన శ్రావణమాసం వచ్చేసింది. ఈ నెలరోజులు ఉదయం, సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లులతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవన్నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతుంది. మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది అయిన శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగినటువంటింది. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసమంటే మహా ప్రీతికరం. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు ,వ్యాపారాలు ,మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు…

శ్రావణ సోమవారములు.

ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారుపండితులు. శివారాధన కూడా చాలా ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం. అంటే కాకుండాఅమ్మవారికి ఆమెను పూజించేకంటే ఆ పరమేశ్వరుని పూజిస్తేనే ఎక్కువమక్కువ అనిపెద్దలుచెపుతారు.

శ్రావణ శనివారములు.

ఈ శ్రావణమాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శనివారం రోజున అఖండ దీపంవెలిగించి, ఉపవాసముఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియచేస్తారు


మంగళ గౌరీ వ్రతం.

ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి,ఈ నెలలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలోసుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.


నాగపంచమి.

శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చే పంచమిని నాగపంచమి అంటారు. ఈరోజున ఉదయాన్నే లేచి పాముపుట్టల వద్దకు వెళ్లి ఆ నాగేంద్రునికి పాలు పోస్తారు.


వరలక్ష్మీ వ్రతం.

శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో వచ్చే మిగతా శుక్రవారాలలో ఏదైనా ఒకవారం ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. ముత్తయిదువులు పిలిచి తాంబూలం ఇవ్వాలి. ఈ పూజ వలన సౌభాగ్యం,సంతోషం, ధన దాన్యములతో వర్ధిల్లుతాము. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు చెబుతారు.లక్ష్మీదేవికి శుభప్రదమైన శుక్రవారమంటే చాలాఇష్టం అని శ్రీ సూక్తం తెలియచేస్తోంది.


శుక్ల పక్ష పౌర్ణమి.

ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిమరియు రాఖీ పౌర్ణమి అంటారు. ఈ రోజున నూతన యజ్ఞోపవీతంధరిస్తారు, అంతేకాకుండా శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుం టాము.


కృష్ణాష్టమి

ఈమాసంలోనే శ్రీకృష్ణ జన్మాష్టమి. అందరూ ఎంతో భక్తిశ్రద్దలతో శ్రీకృష్ణుని పూజించి, చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలు ధరించి ఉట్టికొట్టి ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు.


మతత్రయ ఏకాదశి.

శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెపుతున్నాయి.
శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు కూడా ఈ మాసంలోనే ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.


పొలాల అమావాస్య 

ఈ వ్రతం శ్రావణ మాసం చివరి రోజున చేసుకుంటారు.ఇది పెళ్ళయిన ఆడవాళ్ళుపిల్లల(శ్రేయస్సు)కోసంచేస్తారు శ్రావణ మాసం చివరగా వొచ్చే అమావాస్యరోజున జరుపుకుంటారు.పండగపూట కందమొక్కకు పూజ చేస్తారు.
ఇన్ని పండుగలు అన్ని ఈ మాసంలోనే వస్తాయి కాబట్టి శ్రావణమాసం అంటే సందడే సందడి. మనశక్తి ని బట్టి భక్తితో,మనసులో, మనస్పూర్తిగా ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ… వీలైనన్ని పూజలు చేసుకుని ఆ లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది, అమ్మ ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు పొందుదాము.




సర్వేజనా సుఖినోభవంతు


No comments:

Post a Comment