Saturday 13 April 2019

సీతారాములకళ్యాణం-కళ్యాణము విశిష్టత



💐
కళ్యాణముఅంటే శుభము, మంగళము. 'కళ్యాణము' అనే పదానికి 'మేలు కలిగించటము' అని అర్ధముపెద్దలు పిల్లలను 'కళ్యాణమస్తు' అని ఆశీర్వదిస్తారు. అంటే శుభం కలగాలని ఆశీర్వదించడం. పెద్దలు పెళ్ళీడు కొచ్చిన వారిని 'శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు' అని దీవిస్తారు. అంటే, త్వరలో పెళ్ళి జరిగి, పెళ్ళి వలన శుభం కలగాలని ఆశీర్వదించడ మన్నమాట

లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు అవతరిస్తాడు. దైవానికి కళ్యాణం జరిపిస్తే, లోకానికి కళ్యాణం జరుగుతుంది. పాపాలు నశిస్తాయి. శుభము, శాంతి, సుఖము, సంపద లభిస్తాయి.

ప్రతి ఏట చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ సీతారామ కళ్యాణం చేస్తాము. శివరాత్రి మరునాడు శివపార్వతుల కళ్యాణం చేస్తాము. శ్రవణ నక్షత్రం రోజున శ్రీనివాస కళ్యాణం చేస్తాము. కానీ ఎప్పుడు కావాలన్నా, దేవతల కళ్యాణం జరిపించ వచ్చును. దైవ కల్యాణం ఎంత ఎక్కువ మంది ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే, లోకానికి అంత ఎక్కువ కళ్యాణం జరుగుతుంది. ఎందుకంటే, యావద్విశ్వానికీ మూలము పరమాత్మ. విశ్వమే పరమాత్మ. 'సర్వం ఖల్విదం బ్రహ్మ. '
"వృక్షస్య మూల సేచనాత్ వృక్షో భవతి సించితః". చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తే, చెట్టంతటికీ నీళ్ళు అందుతాయి. చెట్టు పుష్పిస్తుంది, ఫలిస్తుంది. అలాగే ప్రపంచానికి మూలమైన పరమాత్మకు కల్యాణం చేస్తే, ఫలితం పరమాత్మ స్వరూపమైన ప్రపంచానికి లభిస్తుంది. మానవులందరూ, సర్వ ప్రాణికోటి శుభములను పొంది ఆనందంతో వర్ధిల్లుతారు.

వివాహం వల్ల విడివిడిగా ఉన్న స్త్రీ పురుషులు ఏకమై ఒక్కరుగా భాసించి, ఒక్కరైన జంట సత్సంతానాన్ని పొంది సృష్టిని విస్తరింప చెయ్యటమే కళ్యాణం యొక్క పరమార్ధం. ప్రకృతి పరమాత్మలు రెండుగా కనిపిస్తున్నా, ప్రకృతి అంతా అంతర్లీనంగా ఉండి నడిపిస్తున్న పరబ్రహ్మ శక్తి, ప్రకృతి, రెండు ఒక్కటేనని చెప్పటమే కళ్యాణం యొక్క అంతరార్ధం.

నిర్గుణ, నిరాకార, నిరంజనమైన పరమాత్మ భక్తుల కోసం సగుణ సాకార రూపంలో అవతరిస్తాడు.

"చిన్మయస్యాద్వితీయస్య నిష్కళస్యాశరీరిణః !
ఉపాసకానాం కార్యార్ధం బ్రహ్మణో రూప కల్పనా"
శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ పరమాత్మ ఇచ్చినవే ! పరమాత్మ శక్తి వల్లే ఇవన్నీ శక్తి వంతమయ్యాయి. కనుక వీటితో పరమాత్మను అర్చించి కృతజ్ఞత తెలియ పరచాలి. పరమాత్మ సేవ చెయ్యాలి. నోటితో పరమాత్మ గుణగానం చెయ్యాలి, కీర్తించాలి. చేతులతో పూజించాలి, చెవులతో భగవత్కథలు వినాలి, కన్నులతో భగవద్రూపాన్నే చూడాలి, మనస్సుతో భగవంతుని ధ్యానం చెయ్యాలి.
శ్రీమన్నారాయణుని అవతారాలన్నీ ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం వచ్చి, ప్రయోజనం సిద్ధించగానే అవతారం చాలించి వెళ్ళిపోయినవే  అలాంటి అవ తారమే రామావతాము
ప్రతి గ్రామంలో జరిగే సీతారాముల కళ్యాణము నిర్వహిస్తున్న వారు, తిలకిస్తున్న వారు కూడా ఆనంద పరవశులై, తన్మయులై ధన్యులవుతారుకళ్యాణములో ప్రవరలు చెప్పటము, జీలకర్ర బెల్లం పెట్టటము, మంగళ సూత్ర ధారణ, తలంబ్రాలు, మంగళహారతులు దర్శిస్తున్న భక్తుల ఆనందానికి అవధులుండవు.

No comments:

Post a Comment