Saturday, 13 April 2019

రాముడా? రామ నామమా?




రావణ వధానంతరం సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యానగరానికి విచ్చేసిన రాముడు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నాడు. ప్రతిరోజూ సభ ఏర్పాటు చేయడం, సభకు సామాన్యప్రజానీకంతో సహా పెద్దలు, మునులు విచ్చేసి ధార్మిక విషయాల మీద చర్చలు చేయడం నిత్యకృత్యం.

రోజు అలాగే సభ జరుగుతోంది. సభకు నారద, వశిష్ట, విశ్వామిత్రులు కూడా విచ్చేశారు. ముందుగా నారద మహర్షి సభలో ఒక సందేహం లాంటి ప్రశ్నను సంధించాడు. భగవంతుడు గొప్పవాడా, భగవంతుడి నామం గొప్పదా అన్నదే సందేహం. ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం అందరూ మల్లగుల్లాలు పడ్డారు. ఎన్నో తర్జన భర్జనలు చేశారు. ఆఖరికి వశిష్ట విశ్వామిత్రులకు కూడా సరైన సమాధానం ఇదీ అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పడం సాధ్యం కాలేదు. దాంతో అందరూ కలసి నారదుణ్ణే అడిగారు, ‘ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పండి మహర్షీ!’ అని.

‘‘రాముని కన్నా, రామనామమే గొప్పది. ఇందులో సందేహించవలసిన పనిలేదు.’’ అని చెప్పాడు నారదుడు.  ‘‘కావాలంటే నిరూపిస్తాను’’ అంటూ హనుమను పిలిచి, ‘‘హనుమా! సభానంతరం నువ్వు ఒక్క విశ్వామిత్రుడికి తప్ప సభలోని అందరికీ నమస్కారం చేయి’’ అని చెవిలో చెప్పాడు.

సరేనన్నాడు హనుమ.

సభముగిశాక నారదుడు చెప్పినట్లుగానే హనుమ సభలోని పెద్దలందరికీ భక్తి గౌరవాలతో వినయంగా నమస్కరించాడు. విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయనకు నమస్కరించ కుండానే వెనుదిరిగాడు.

కాసేపయ్యాక నారదుడు విశ్వామిత్రుని వద్దకెళ్లి, ‘‘చూశావా విశ్వామిత్రా, హనుమకు ఎంత పొగరో! అందరికీ నమస్కరించి, నిన్ను మాత్రం విస్మరించాడు.’‘ అన్నాడు రెచ్చగొడుతున్నట్లుగా.

విశ్వామిత్రుడు కోపంతో మండిపడ్డాడు. రాముడి వద్దకెళ్లి, ‘‘రామా! మదాంధుడైన హనుమను రేపు సూర్యాస్తమయంలోగా  సంహరించు! ఇది నా ఆజ్ఞ.’’ అన్నాడు.

మాటలకు నిర్ఘాంతపోయాడు రాముడు. ‘‘ఎంతటి విపత్కర పరిస్థితి! నాకు ఎంతో ఇష్టుడైన హనుమను నా చేతులతో నేను చంపుకోవడమా!? అదీ నిష్కారణంగా! చంపనంటే గురువాజ్ఞ మీరినట్లవుతుంది. ఇప్పుడేమిటి దారి?’’ అంటూ తలపట్టుకు కూర్చున్నాడు.

ఈలోగా హనుమను రాముడు చంపబోతున్నాడనే వార్త క్షణాలలో రాజ్యమంతా వ్యాపించింది. వింత సంఘటన గురించి ప్రజలందరూ కథలు కథలుగా చెప్పుకోసాగారు.

హనుమ వెంటనే నారదుడి వద్దకెళ్లాడు. ‘‘మహర్షీ మీ మాట వినే కదా, నేను పని చేశాను. దానికి ఇంతటి దారుణమైన శిక్షా?’’అని వాపోయాడు.

అందుకు నారదుడు ‘‘నీకేం భయం లేదు హనుమా! నేనున్నాను కదా, నువ్వు ఒక పని చెయ్యి, సూర్యోదయానికన్నా ముందే సరయూనదిలో స్నానం చేసి, ‘శ్రీరామ జయరామ జయజయ రామ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించకు’’ అని చెప్పాడు.

నారదుడు చెప్పిన విధంగానే హనుమ తెల్లారేలోగా సరయూనదిలో స్నానం చేసి, భక్తిశ్రద్ధలతో నారదుడు చెప్పిన మంత్రాన్ని జపించసాగాడు. తెల్లవారగానే ఏం జరుగుతుందో చూడాలన్న ఆసక్తితో నగర ప్రజలంతా గుంపులు గుంపులుగా సరయూనది ఒడ్డుకు చేరుకోసాగారు.
 
రాముడు ఒకసారి తన ప్రేమపూర్వక నయనాలతో తనకెంతో ఆప్తుడు, నమ్మిన బంటు, సఖుడు అయిన హనుమను చూస్తూ, నదిలో నడుము లోతు నీటిలో నిలిచి, రామమంత్రాన్ని తదేక దీక్షతో పఠిస్తున్న హనుమపై బాణాన్ని వదిలాడు. ఆశ్చర్యం! బాణం హనుమను ఏమీ చెయ్యలేకపోయింది. అలా సంధ్యా సమయం వరకు నిర్విరామంగా బాణాలు వదులుతూనే ఉన్నాడు రాముడు. బాణాలన్నీ ఒక్కొక్కటిగా నేలరాలిపోతున్నాయి కానీ, హనుమకు మాత్రం కించిత్తు కూడా హాని కలగడంలేదు. ఇలా లాభం లేదనుకుని చివరకు బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి సిద్ధమయ్యాడు  రాముడు. దాంతో ప్రకృతి మొత్తం కంపించిపోసాగింది. ప్రజలంతా హాహాకారాలు చేయసాగారు.

ఇంతలో నారదుడు విశ్వామిత్రుని వద్దకెళ్లి, ‘‘మహర్షీ! చూశారా, రామ నామ మహిమ ఎంత గొప్పదో! మహిమకు రాముడు కూడా తలవంచక తప్పడం లేదు. బ్రహ్మాస్త్రం గనక నిర్వీర్యం అయిపోయిందంటే ఎన్నో ఉత్పాతాలు జరుగుతాయి. అన్నింటికీ మించి అది నీకూ, నీ శిష్యుడికీ కూడా ఎంతో అవమానకరం. హనుమ నీకు నమస్కరించకపోతే ఏమైంది చెప్పు. నీవే ఇక అస్త్రప్రయోగం చాలించమని నీ శిష్యుడికి చెప్పు’’ అని సలహా ఇచ్చాడు.

విశ్వామిత్రుడు ‘‘ఇక ఆపు రామా!’’ అనడంతో రాముడు ధనుర్బాణాలు కిందపడవేసి, హనుమను ప్రేమతో కౌగలించుకున్నాడు.

సీతా దేవి జననము



హిందూ మతంలోని విశ్వాసాల ప్రకారం సీత శ్రీమహాలక్ష్మి అవతారం. విష్ణువు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని. రామాయణము సీతాయాశ్చరితం మహత్ అని చెప్పబడింది. జానకి, మైధిలి, వైదేహి, రమ కూడా సీత పేర్లు. సీతను తరచు సీతమ్మ తల్లి, చల్లని తల్లి అని వివిధ రచనలలోను, కీర్తనలలోను ప్రస్తావిస్తారు
మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు 'సీత' అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు, శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము ఆశ్లేష నక్షత్రము . సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు. సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున చైత్ర మాశం శుక్లపక్షంలో జరిగింది.
ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉన్న జనక్ పూర్ అప్పటి మిధిలా నగరమని చెబుతారు.


రామాయణము విశిష్టత




భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము.   రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 500 B.c లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది  రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము