ఉత్తర ద్వార దర్శనం ఎందుకు?
వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకువస్తుంది. వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మనం ఇంతగా తపించిపోయే ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటీ
పౌరాణిక గాథ
పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథినాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి. అందుకనే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. మూడు కోట్ల ఏకాదశులకూ సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న వాదనా లేకపోలేదు. వైకుంఠంలోని విష్ణు మూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరూ ఉంది
ఈ రోజున మహా విష్ణువుని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగిందట. ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా విష్ణు మూర్తిని దర్శించుకుంటారో, వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటభులు కోరుకోవడంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాసస్త్యం ఏర్పడిందంటారు. ఉత్తర ద్వార దర్శనం నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భువికి చేరుకుంటారట
గాథ వెనుక తత్వం
మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాము. అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని, వికాసాన్నీ సూచిస్తుంది. బహుశా అందుకేనేమో పాతాళం వైపుకి సూచించే దక్షిణపు దిక్కుని మనం యమస్థానం అంటాము. మన శరీరంలోనూ జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి, సిద్ధ స్థితిని చేరుకుంటేనే ఆ ఊర్థ్వభాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని అంటారు
అంటే ఆ హరి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి శాశ్వతమైన శాంతినీ, సత్యమైన జ్ఞానాన్నీ ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం కావచ్చు. అందుకే ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా తమలోని భక్తినీ, జ్ఞానాన్నీ వికసింపచేయమనీ వేడుకుంటూ స్వామిని కొలుచుకోవాలి. ఇక ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోనే ఆ వైకుంఠ మూర్తిని దర్శించుకుని తమలోని అజ్ఞానాంధకారం తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి
హైందవ సంప్రదాయం భక్తుని మనసు పరిపక్వమై అది అనంతాత్మలో లీనమవ్వాలంటూ ప్రోత్సహిస్తుంది. గాయత్రి మంత్రాన్ని జపించినా, ఉత్తర ద్వార దర్శనంగుండా ఆ విష్ణుమూర్తిని దర్శించుకున్నా ఆ భక్తుని మేధస్సు వికసించాలనే కోరుకుంటుంది
🚩 వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి
కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి విశిష్టత, ఉపవాస విధానం
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే *వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారు*
శేషతల్పం మీద శయనించే విష్ణు మూర్తిని దర్శించుకోడానికి వైకుంఠానికి తరలివెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు
వైకుంఠ ఏకాదశి
వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు “వైకుంఠః” (వైకుంఠుడు) అయ్యాడు. అదేకాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు అని అర్ధాలున్నాయి*
ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైన పవిత్రతను సంతరించుకున్నందు వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం
విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా, వారి కోసం శ్రీ మహా విష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ , తమ కథ విని , వైకుంఠ ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందు చేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ఏడాది కూడా తిరుమలలో స్వామిని దర్శించే భక్తులకు ముక్కోటి ఏకాదశి రోజు నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది
పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది
ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని, ఇఛ్ఛని, జాగురూకతను, దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది
ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమ నిష్ఠలతో పూజ చేసి వారికి పుణ్య ఫలముతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠ వాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది
ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి.
వైద్య పరంగా
మన దేశంలో ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉన్నది ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం జ్యోతిష్యం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిధి ఆ రోజు చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య ఉండే దూరము, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని, అందువల్ల ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలని జ్యోతిష్యం తెలియపరుస్తోంది. ఈ విషయంలో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది. మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు. మన శరీరంలో కొంత భాగం మిగిలిపోతుంది. అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది. ఇది విషపదార్ధం. ఈనాటి శాస్త్రం దీనిని toxins అంటుంది. వీటివల్లనే మనిషికి 90% రోగాలు వస్తున్నాయి
ఈ toxins ను ఆయుర్వేదంలో ఆమం అంటారు, దాని వలన కలిగే రోగాలను ఆమ రోగాలంటారు. ప్రతి 12 రోజులకొకసారి చేసే ఈ ఉపవాస సమయంలో మన శరీరంలో ఉన్న విషాలు బయటకుపోయి శరీరం శుభ్రపడుతుంది. అందువల్ల మనిషికి దీర్ఘకాలంలో రోగాలు రాకుండా ఉంటాయి. చిన్న వయసు నుంచి ఏకాదశి వ్రతం చేస్తున్న వారు 70ఏళ్ళ వయసులో కూడా యువకుల్లాగా ఉత్సాహంగా ఉండడం మనం గమనించవచ్చు. ఎటువంటి మోకాళ్ళ నొప్పులు వీరిని బాధించకపోవడం ప్రత్యక్షంగా కనపడుతోంది. అందుకని ఏకాదశి తిధి నాడు ఉపవసించాలని ఆయుర్వేదం చెప్తోంది
ప్రధాన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా ప్రముఖమైనది. వైకుంఠ ఏకాదశినాడు భారతీయులు పాటించే నియమ నిష్ఠలు అటు ఆధ్యాత్మికత చింతనను పెంపొందించడమే కాకుండా, ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసం, జాగరణ, పూజాదికారాలు జరిపితే.. ఆ ఏడాదంతా మనశ్శాంతిగా, సమస్యలు లేకుండా, ఆరోగ్యంగా, ఆనందంగా బతుకుతారని ఆధ్యాత్మిక వాదులు విశ్వసిస్తారు. మహావిష్ణువుకు నివాసమైన వైకుంఠమంటే సాక్షాత్తూ స్వర్గమేనని, అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెబుతాయి
వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు , ఆస్తికులు సముద్రాల్లోనూ, పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా, ఉపవాసాలు చేసి, జాగరణ ఉంటూ, నియమ నిష్ఠలతో పూజాదికాలు చేసి, తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో, ఒకే విధమైన పూజాదికాలు అత్యంత వైభవంగా జరగడం విశేషం
మన శరీరంలో ఆరుచక్రాలు ఉంటాయి. మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుండి స్వాధిష్టాన, మణి పూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహస్ర కమలంలో పరమాత్మను దర్శించి , బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడం. అటువంటి వారికి ఇక ఉత్తర జన్మ (మరుజన్మ) ఉండదు
తాత్వికపరంగా ముక్కోటి ఏకాదశి
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయ గుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి , ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే , ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ, జపం -ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం , ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని , జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు
శ్రీరంగంలో ముక్కోటి ఏకాదశి
శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథ స్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణం లోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం
తిరుమలలో
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠ ద్వారా ప్రవేశం, తదనంతరం దైవ దర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠ ద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ సమయంలో భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు
https://vidhathaastronumerology.blogspot.com/2022/01/blog-post_13.html
సర్వేజనా సుఖినోభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.
FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE
FACEBOOK PAGE
HTTPS://WWW.FACEBOOK.COM/VIDHATHAASTORNUMEROLOGY/?
VIEW_PUBLIC_FOR=1712439968969888
FACEBOOK GROUP :
(20+) VIDHATHA ASTRO NUMEROLOGY | FACEBOOK
YOUTUBE
HTTPS://WWW.YOUTUBE.COM/CHANNEL/UCUPPMXZZ8X1HI5RRVBCOJSW
PRINTEREST
HTTPS://IN.PINTEREST.COM/VASTRONUMEROLOGY/SREE-VIDHATHA-PEETAM/
TWITTER
HTTPS://TWITTER.COM/VIDHATHAASTROLO
INSTAGRAM
HTTPS://WWW.INSTAGRAM.COM/SREEVIDHATHAPEETAM/
BLOG
HTTPS://VIDHAATHAASTRONUMEROLOGY.BLOGSPOT.COM/
WHATSAPP GROUP
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371
No comments:
Post a Comment