1) నిత్య శ్రాద్ధం :
ప్రతిరోజు అన్నం తినే ముందు ఆపోశన పట్టిన తరువాత ఒక ఐదు మెతుకులు ఒక్కొక్కటిగా కేవలం ఉత్తి అన్నం మెతుకులు
ఓం ప్రాణాయ స్వాహా
ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
అని నోటిలో వేసుకుంటే అది నిత్య శ్రాద్ధంతో సమానము లేదా అన్నం తినేముందు ఆకులో వేసిన అన్ని పదార్థములతో అన్నమును కలిపి ఒక బొటనవేలు పరిమాణమంత చిన్న ముద్దను చేసి దానిని ఆకులో కానీ, నేలమీద కానీ, కుడి వైపున పెట్టి, అన్నం తిన్న తరువాత ఆ ముద్దని కాకులకు లేదా వేరే పక్షులకు పెట్టినా అది కూడానిత్య శ్రాద్ధంతో సమానము. దీనివలన పితృదేవతలు సంతోషిస్తారు.
2) తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఏదో ఒక క్షేత్రములో వారి పితృదేవతల పేరు మీదుగా అన్నదానం చేస్తే అది ఏకధాటిగా సంవత్సరంపాటు శ్రాద్ధం పెట్టిన ఫలితమును ఇస్తుంది.
3) పుట్టినరోజు నాడు వారి పేరు మీదుగా అన్నదానము కానీ ప్రసాద దానము కానీ చేస్తే అది 100 సంవత్సరముల పాటు అటు దేవతలకు నైవేద్యం పెట్టిన పుణ్యము ఇటు పితృదేవతలకు పిండం పెట్టిన పుణ్యం వస్తుంది.
4) పితృదేవతలు యమధర్మరాజు రాజధాని నగరం అయిన సంయమని పురమునకు నైరుతి భాగంలో ఉంటారు. వీరు చాలా శక్తివంతులు, వీరందరికీ కలిపి దక్షుడి కూతురైన స్వధాదేవియే భార్య.
5) మనము పితృ కార్యములలో తండ్రికి కానీ, తల్లికి కానీ, తాతల పేరు మీదుగా గాని పెట్టే పిండము పితృలోకంలో ఉన్న పితృదేవతలకు చెందుతుంది.
ఈ విధముగా మనము పెట్టిన పిండములను పితృదేవతలు స్వీకరించి, మనము ఎవరి పేరు మీదుగా పిండము పెట్టామో వారు ఒకవేళ యమలోకంలో ఉంటే ఆ నరక బాధల నుండి విముక్తి పొంది ఉత్తమ గతులకి వెళతారు. ఒకవేళ ఉత్తమ గతులకి వెళ్లి ఉంటే ఈ పిండం పెట్టడం ద్వారా ఇంకా ఉత్తమగతులు కలుగుతాయి. ఒకవేళ పునర్జన్మ ఎత్తి ఉంటే ఈ పిండం పెట్టడం ద్వారా ఇంకా వారికి ఉత్తమ జన్మలు లభిస్తాయి.
మన తండ్రి పేరు, ఆయన తండ్రి పేరు, ఆయన తండ్రి పేరు చెప్పి పెట్టే 3 పిండములు ఈ పితృదేవతలు స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తారు. తద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది.
6) ఈ భూమి మీద కొడుకుగా పుట్టిన ప్రతి ఒక్కడు అయితే సంపూర్ణ శ్రాద్ధం కానీ లేదా స్వయంపాకం వంటివి కానీ ఇవ్వాలి.
7) కొన్ని ఇళ్లల్లో పిల్లలు పుట్టడం లేదు అంటే కారణము ఈ పిండాలు పెట్టకపోవడమే.
8) శ్రాద్ధ విశేషాల గురించి వినడం వలన, తెలుసుకోవడం వలన అకాల మరణాలు, దుర్మరణాలు ఉండవు. అటువంటి కుటుంబాలలో వాళ్ళు సంపూర్ణ ఆయువుతో జీవిస్తారు.
9) సూర్య, చంద్ర గ్రహణాల తరువాత యథాశక్తిగా (నువ్వులు,దర్భలతో కలిపి నీళ్లు తర్పణాలుగా వదలాలి, అన్నం ముద్దలు చేసి పెట్టాలి)
పిండం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు.
గ్రహణానంతరం పితృదేవతలకు తర్పణాలు తండ్రి బ్రతికి ఉన్న వారు ఇవ్వకూడదు. వీరు కేవలం దేవతలకు మాత్రమే తర్పణాలు(కేవలం నీళ్లు మాత్రం) ఇవ్వాలి.
10) ప్రతి సంక్రమణానికి, వ్యతీపాత తిథులలో, విషువత్తులకు తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంతో సమానం.
11) మొదటి సారి క్షేత్ర దర్శనం (కాశీ వంటి క్షేత్రము), దేవతా దర్శనం చేసుకున్న తరువాత నువ్వులు దర్భలు కలిపిన నీళ్ళతో మూడుసార్లు తర్పణం విడిచి పెడితే ఇది కూడా శ్రాద్ధంతో సమానము. ఇది ఆ వంశానికి అపార రక్షణ కలిగిస్తుంది.
12) జన్మ నక్షత్రం వచ్చినప్పుడు, గ్రహాల అనుగ్రహము లేకుండా జాతక దోషాలు ఉన్నప్పుడు, పీడకలలు వచ్చినప్పుడు, తండ్రి లేని వాడు నువ్వులు నీళ్లు తీసుకొని తర్పణాలు విడిచి పెడితే అది అపూర్వ శ్రాద్ధంతో సమానం.
13)భోక్తలుగా ఎవరిని పిలవాలి?
యోగి అయిన వాడు భోక్తగా వస్తే చాలా ఉత్తమం. ఉత్తమ శ్రోత్రియుడు కానీ, ఇంటికి పెద్దవాడుగా పుట్టిన వాడు కానీ, వేదాలు బాగా చదువుకున్న వాడిని కానీ పిలవాలి.
శ్రాద్ధం పెట్టేటప్పుడు చచ్చిపోయిన ఆయన మేనల్లుడు గాని లేదా కూతురు కొడుకు (మనుమడు) కానీ ఉంటే చాలా మంచిది.
14) భోక్తలుగా ఎవరిని పిలవకూడదు?
అవయవ లోపం ఉన్న వాళ్ళు, రోగిష్టి వాళ్ళు,
పునర్భవుడు (ఒక స్త్రీ ఒక భర్త పోయాక రెండవ భర్త ద్వారా పొందిన సంతానం), దొంగ ఉపాధ్యాయుడు, వేదాలను తిరస్కరించే నాస్తికులు, అగ్నిహోత్రానికి నమస్కారము చేయని వారిని, వైద్య వృత్తిలో ఉన్న వారిని, గురువులను పితృదేవతలను తిరస్కరించే వాడిని, సోమరసం అమ్ముకునే వాడిని, పిసినిగొట్టు వాడిని, దంతములు నల్లగా ఉన్న వాడిని, ఎక్కువ తక్కువ అవయవాలు కలిగిన వాడిని (6 వేళ్ళు లేక 4 వేళ్ళు ఉన్నటువంటి వారు), అంధులు, గోర్లు బాగా పుచ్చిపోయి ఉన్నవాళ్ళు భోక్తలుగా పనికిరారు.
15) దైవ కార్యములో లోటు ఉంటే దేవతలు అంతగా ఆగ్రహించరు. కానీ పితృకార్యంలో ఏదైనా లోటు ఉంటే పితృ దేవతలు వెంటనే ఆగ్రహిస్తారు.
16) శ్రాద్ధములో భోక్తలుగా వచ్చిన వారు మరియు శ్రాద్ధము పెట్టిన వారు, ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ సాంగత్యము చేయకూడదు, రాత్రికి భోజనం చేయకూడదు (తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వారైతే మధ్యాహ్నం పితృకార్యంలో మిగిలిన గారెలు కానీ అప్పాలు కాని తినవచ్చును).
17) పితృదేవతలకు శుక్లపక్షము కంటే కృష్ణపక్షము అంటే ఇష్టము.
18) శ్రాద్ధము ఎప్పుడూ మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తరువాత పెట్టాలి. విదేశీ ప్రయాణం ఉన్నప్పుడు కానీ, లేదా యాత్రలకు వెళుతున్నప్పుడు కానీ 12లోపు శ్రాద్ధం పెట్టుకోవచ్చు.
ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితులలో 12 గంటల లోపు పిండప్రదానం చేస్తే, అప్పుడు వెండి దానము చేస్తే, ముందుగా పిండప్రదానం చేయడం వలన వచ్చే దోషం తొలగిపోతుంది.
19) విశ్వేదేవతల స్థానంలో ఇద్దరు, పితృదేవతా స్థానంలో ఒకరు మొత్తం ముగ్గురు భోక్తలు ఉండాలి. కుదరని పక్షంలో కనీసం ఇద్దరయినా ఉండాలి.
20) శ్రాద్ధ సమయంలో ఈ మూడు తప్పక ఉండి తీరాలి :
*మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత సమయము.
*నల్ల నువ్వులు
*కూతురు కొడుకు (దౌహిత్రుడు). ఒకవేళ దౌహిత్రుడు లేకపోతే మిగతా రెండు ఉన్నా, ఆ శ్రాద్ధం కూడా సంపూర్ణం అవుతుంది.
21) శ్రాద్ధం పెట్టేవాడు, భోక్తలుగా వచ్చినవారు ఆరోజు ప్రయాణం చేయకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ కోపం పొందకూడదు. తొందర పడకూడదు.
22) శ్రాద్ధం పెట్టే వాళ్ళు ఒకవేళ నీరసంగా ఉంటే పాలు తాగ వచ్చు కానీ ఎట్టి పరిస్థితులలోనూ మజ్జిగ, రాగిజావ, అంబలి వంటివి తీసుకొనరాదు.
23) శ్రాద్ధము అత్యంత ఫలితమును ఇవ్వాలంటే వెండిని పదేపదే చూడడము, వెండి పాత్రలు వాడడము, వెండి పుట్టుకను తెలుసుకోవడం, వెండిని పొగడడం, వెండిని దానం చేయడం వంటివి చేయాలి.
24) శ్రాద్ధం పెట్టేవారు బంగారమును ఎట్టి పరిస్థితులలోనూ ధరించరాదు. వారి ఇంటిలో స్త్రీలు కేవలం బంగారం మంగళసూత్రం తప్ప వేరే ఏ ఇతర బంగారు ఆభరణములు ధరించకూడదు.
25) శ్రాద్ధ సమయములో వీటితో చేసిన వంటలు శ్రేష్ఠము :
నువ్వులు, యవలు, గోధుమలు, నల్ల ఆవాలు, కాంచన ధాన్యములు, పెసలు, కందులు, మినుము.
26) శ్రాద్ధములో వాడకూడనివి, పనికిరానివి :
పెండలం, దోసకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఆనపకాయ, ఇంగువ, అలసందులు, ప్రత్యక్ష లవణము (విస్తరిలో ఉప్పు పెట్టడము), చిరు శనగలు. భార్య ధనముతో పితృకార్యము చేయకూడదు.
రాత్రి తెచ్చి నిల్వ పెట్టిన నీరు, దుర్వాసన వస్తున్న నీరు శ్రాద్ధానికి పనికిరాదు. ఒకవేళ తాజా నీరు దొరకకపోతే ఆవుపాల చుక్క కానీ, దర్భలు కానీ లేదా గంగాజలం చుక్క కానీ ఆ నీటిలో వేస్తే అది స్వచ్ఛ జలం అయిపోతుంది. నీటిలో వేసే ఆవుపాలు ఆవు ఈనిన పది రోజుల తరువాత పాలు మాత్రమే వాడాలి, ఈనిన పది రోజుల ముందు పాలు వాడకూడదు.
27) శ్రాద్ధం జరిగే చోటులోకి కోడి, కుక్క, ఊర పంది, నపుంసకుడు, రాక్షసులు, పతితులు, మైల ఉన్నవాళ్లు, బయట ఉన్న వాళ్ళు రాకూడదు.
28) శ్రాద్ధ సమయములో ఇంటి చుట్టూ నల్ల నువ్వులను
కోణం నీలాంజన ప్రఖ్యం మంద చేష్ట.......
అనే శ్లోకం చదువుతూ చల్లితే ఇంటికి ఉన్న వాస్తు దోషాలతో పాటు శ్రాద్ధంలో ఉన్న దోషాలు కూడా పోతాయి.
29) శ్రాద్ధంలో భోక్తల ఎదురుగా పితృదేవతా స్తోత్రమును చదివితే శ్రాద్ధంలో తెలిసి కాని తెలియక గాని చేసిన ఎటువంటి దోషం అయినా పరిహారమై పోయి ఆ శ్రాద్ధం అఖండ ఫలితమును ఇస్తుంది.
No comments:
Post a Comment