Sunday 29 December 2019

సత్సంతానం కలిగించే దేవుడు... సుబ్రహ్మణ్యుడు.


బ్రహ్మ నుండి 'శివసుతుని చేత ' మాత్రమే మరణం పొందేలా వరం అందుకున్నాడు తారకాసురుడు, వాడి మరణానికై ఉద్భవించిన దివ్య తేజోమయుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన జన్మించిన రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి గా వ్యవహరిస్తారు.
సుబ్రహ్మణ్యస్వామి అనగానే నెమలి వాహనంతో శక్తి ఆయుధాన్నిధరించి, మెడ మీదుగా భుజాలపై నుంచి వేలాడే పూలమాలతో దర్శనమిచ్చే ధర్మ స్వరూపం గుర్తుకు వస్తుంది. పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడిగానే కాదు, అసురుల గుండెల్లో గుబులు పుట్టించిన వీరుడిగా కూడా ఆయనకి పేరుంది. ఈయనకు ఆరు ముఖాలు ఉంటాయి. ఆరువైపులా చూస్తూ పరిస్థితులను సమన్వయం చేసుకోగలడు. సుబ్రహ్మణ్యునికి కుమారస్వామి, మురుగన్, షణ్ముఖుడు, కార్తికేయ, స్కంద – అంటూ అనేక పేర్లు ఉన్నాయి.
స్వామిని పంచామృతాలతో అభిషేకించి, వివిధ పుష్పాలతో అలంకరించాలి. సుబ్రహ్మణ్య స్వామిని షోడశోపచారలతో పూజించి, ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా స్వామిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుందనీ ... అనారోగ్యాలు తొలగిపోతాయని ... విజయాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అనేక దోషాలు నశించి పోతాయనీ, పాపాలు పరిహరించబడతాయని స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ పర్వదినాన ఆ స్వామిని శక్తి కొద్దీ పూజించాలి ... భక్తి కొద్దీ సేవించాలి.
ఈరోజున ఉదయానే స్నానం చేసి (వీలైతే నదీ స్నానం) సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుని, దానధర్మాలు చేసినట్లయితే తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ తొలగిపోతాయి. సర్పదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రార్ధనలు చేసి పుట్టలో పాలు పోస్తారు. ఐదు ముఖాలున్న నాగదేవతను ఆరాధిస్తారు. నాగదేవతల్లో ఒకటైన శంకపాలను పూజిస్తారు. ఇలా చేయడంవల్ల సర్ప దోషాలు తొలగిపోతాయి. చర్మవ్యాధులు ఉంటే తగ్గుతాయి. పిల్లాపాపలతో సుఖసంతోషాలు అనుభవిస్తారు. సంతానం లేని వారు ఆయనను నమ్ముకుంటే చాలు సకల శుభాలు లభిస్తాయని ప్రతీతి.

No comments:

Post a Comment