Friday 2 March 2018

ఘంటానాద శ్రవణంతో శుభకరాల ప్రాప్తి

No automatic alt text available.

నిత్యం ఆలయాలకు వెళ్లేవారందరూ దైవదర్శనం చేసుకుంటూ ఆలయంలో ఉండే ఘంటను మ్రోగిస్తుంటారు. కొంతమంది దైవ దర్శనం చేసుకోవటానికి ముందుగాను, మరికొంతమంది ప్రార్ధన చేయుటకు సంకల్పించినప్పుడు మ్రోగిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే మరి.
ఆలయాలలోని ఈ ఘంటానాదం కొన్ని ప్రత్యేకమైన వారాలలో, ప్రత్యేక నక్షత్రాలు కలసి వచ్చినప్పుడు ఆలయానికి వెళ్లి ఆ ఘంటానాదాన్ని వింటే శుభకరాలు ప్రాప్తిస్తాయి. మరి శుభకరంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాలు గడిచి పోవాలంటే ఏ ఏ రోజులలో ఈ ఘంటానాదాన్ని ఏ విధంగా శ్రవణం చేయాలో తెలుసుకుందాం.
ఆదివారాలలో అశ్వని, మూల నక్షత్రాలు వచ్చివున్నచో ఆనాటి రాహుకాలమైన సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు ఘంటానాదాన్ని వినాలి. ఆరుద్ర, స్వాతి, శతభిషం వచ్చిన సోమవారాలలో ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు గల రాహుకాల సమయంలోనే ఘంటానాదాన్ని శ్రవణం చేయాలి. పుష్యమితో కూడిన గురువారాలలో మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 గంటల వరకు గల రాహుకాల సమయంలోను, హస్తా నక్షత్రంతో కలసిన శుక్రవారం ఉదయం 10.30 నుంచి 12.00 గంటల వరకు గల రాహుకాల సమయంలోను, చివరిగా రేవతి, రోహిణి నక్షత్రాలు వచ్చిన శనివార రాహుకాలమైన ఉదయం 9.00 నుంచి 10.30 లోపు సమయంలోనే శుభకరాలను అందించే ఘంటానాదాన్ని విని శుభకర జీవితాన్ని సొంతం చేసుకోండి.
పైన చెప్పిన వారాలలో, ఆయా నక్షత్రాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండవలసిన అవసరం లేదు. కేవలం ఆనాటి రాహుకాల సమయంలో మాత్రమే ఆ నక్షత్రం ఉంటే చాలు. అయితే పై వారాలతో కూడిన నక్షత్రాలు గల రోజు శుక్ల పక్ష పాడ్యమి నుంచి శుక్ల చతుర్దశి వరకు వస్తే ఘంటానాదం మీకు ఎడమవైపున వినపడాలి. అనగా మీ ఎడమచెవి పై భాగాన ఘంట ఉండేలా నిలబడి ఆలయంలో ఉన్న మూర్తి స్వరూపాన్ని నమస్కరించుకోండి. ఆ ధ్వని సహజంగా రెండు చెవులకు సోకుతుంది. కాని ఎడమ చెవి వైపున ఘంట ఉండేలా శుక్ల పక్షంలో ఆచరించాలి.
పై వారాలతో కూడిన నక్షత్రాలు గల రోజు బహుళ పక్ష పాడ్యమి నుంచి బహుళ చతుర్దశి వరకు వస్తే ఘంటానాదం మీకు కుడి వైపున వినపడాలి. అనగా మీ కుడి చెవి పై భాగాన ఘంట ఉండేలా నిలబడి ఆలయంలో ఉన్న మూర్తి స్వరూపాన్ని నమస్కరించుకోండి. ఆ ధ్వని సహజంగా రెండు చెవులకు సోకుతుంది. కాని కుడి చెవి వైపున ఘంట ఉండేలా బహుళ పక్షంలో ఆచరించాలి.
అలాకాక పై వారాలలో ప్రత్యేక నక్షత్రాలు వచ్చిన సమయంలో పూర్ణిమ తిథి కనుక వస్తే... ఘంటకు మీరు కుడి వైపున గాని లేక ఎడమ వైపున గాని.... ఎటువైపునైననూ వినవచ్చును. అతి ముఖ్యంగా గుర్తుంచుకొనవలసిన విషయం ఏమిటంటే పై వారాలలో ప్రత్యేక నక్షత్రాలు వస్తున్న రాహుకాల సమయాలలో అమావాస్య తిథి జరుగుతుంటే విసర్జించండి. ఒకవేళ ఆ సమయంలో ఆలయంలోకి వెళ్ళవలసిన అవసరం ఏర్పడితే ఘంటను మ్రోగించటానికి ముందు మనసులో ఓమారు మీకిష్టమైన పితృదేవతలను (ఈ సమయంలో వారిని శోభనా దేవత అని అనుకోవాలి) తలుచుకొని ఆపైన ఘంటను మ్రోగించండి.
ఫలానా దైవానికి సంబంధించిన ఆలయంలోనే ఘంటానాదం వినాలనే నియమం ఏమి లేదు. ప్రత్యేక నియమాలు లేవు. ఉపవాసములు, నివేదనలు లేవు. స్త్రీ, పురుషులలో ఎవరైననూ వినవచ్చును. కాల పరిమితి ఏమి లేదు. కనుక ఆది, సోమ, గురు, శుక్ర , శని వారాలలో వచ్చే పైన పేర్కొన్న తొమ్మిది నక్షత్రాలు వస్తే, ఆనాటి రాహు కాలాలలో శుభకర ఘంటానాద శ్రవణంతో శుభకర జీవితాన్ని కైవసం చేసుకోండి.

No comments:

Post a Comment