శ్రావణమాస విశేషాలు:శ్రావణమాసం వచ్చిందంటేచాలు ప్రతీ ఇల్లు దేవాలయాన్ని తలిపిస్తుంది. నెల రోజుల పాటు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణ వినిపిస్తుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి దైవ కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు వేదపండితులు. అంత గొప్ప పవిత్రమాసం నేటి నుంచి (సోమవారం) ప్రారంభమైంది.
అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్టపండుగలు సైతం రానున్నాయి. సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవదైన శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగినటువంటింది. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు ఏర్పడింది. ఈ శ్రావణమాసంలోనే వర్షరుతువు ప్రారంభమవుతుంది.
త్రీమూర్తులలో స్థితికారుడు దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి (భార్య) అయినటువంటి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం. వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణం. మహావిష్ణువు జన్మనక్షత్రం కూడా శ్రావణనక్షత్రం కావడం, అటువంటి శ్రావణనక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైన మాసం. ఈ మాసంలో చేసే దైవకార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది. నెల రోజులు నిష్ట, నియమాలతో పూజలు నిర్వహించినట్లయితే కోరిన కోరికలు తప్పక నేరవేరుతాయానేది భక్తుల ప్రగాఢవిశ్వాసం.
శ్రావణ మాసంలోని మరిన్ని విశిష్టతలు..
శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే ఎంతో మోక్షం లభిస్తుంది. శుక్లపక్ష పౌర్ణమి, శ్రావణపౌర్ణమి, రాఖీపౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, వేదభ్యాసాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన లాంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటి ముఖ్య పండుగలు సైతం శ్రావణమాసంలో రావడం శ్రావణమాసానికున్న ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ మాసంలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు, తూచాతప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటున్నాయి మన పూరాణాలు.
శివారాధనకు ఎంతో విశిష్టత కలిగిన మాసం..
శ్రావణమాసంలోని దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు కూడా విశిష్టమైన మాసం. శ్రావణమాసం ముఖ్యంగా భగవారాధనలో శివ, కేశవ బేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ మాసంలో చేసే ఏ చిన్న కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుంది. ఈ మాసంలో సోమవారాలు పగలంత ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రభిషేకాలు, బిల్వార్చనలు జరిపినట్లయితే సకల పాపాలు కూడా నశిస్తాయాని శస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా ఉపవాసం ఉండి దీక్షను పూర్తిచేయాలి. అలా సాధ్యం కానీ పక్షంలో రాత్రి సమయంలో పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని బుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనేక శుభఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణశుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఈ పక్షంలోని ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్ర్తాలు చెబుతున్నాయి. భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉటుందంటున్నారు పండితులు. అందుకే శ్రావణమాసంలోని అన్ని సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది.
శ్రావణ మాసంలో విశేష పర్వదినములు:
- మంగళగౌరీ వ్రతం 25-7-2017
- నాగపంచమి 28-7-2017
- వరలక్ష్మీ వ్రతం 4-8-2017
- సర్వేశం ఏకాదశి 3-8-2017
- రాఖీ పూర్ణిమ7-8-2017
- హయగ్రీవ జయంతి 7-8-2017
- రాఘవేంద్ర జయంతి -8-2017
- శ్రీ కృష్ణాష్టమి 14-8-2017
- కామిక ఏకాదశి 18-8-2017
- పోలాల అమావాస్య 21-8-2017
శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
ఈ వ్రత విదానం & వివరములకు క్లిక్ చేయండి —-> మంగళగౌరీవ్రత వివరములు
వరలక్ష్మీ వ్రతం:
మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణమాసంలో మరొక శుక్రవారమైన ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. పూజ మండపంనందు నిండు కళశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి శ్రీవరలక్ష్మీదేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ కింది శ్లోకాని పటించాలి.
శ్లోకం :
బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే
అని పటిస్తూ తోరణాన్ని చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను శ్రవణం చేస్తూ ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా మహాశివుడు పార్వతిదేవికి సూచించి సౌభాగ్యం, మాంగల్యబలాన్ని వివరించినట్లు పురణాలు చెబుతున్నాయి.
శుక్లా పంచమి-నాగుల పంచమి: 28-7-2017
దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈరోజుని నాగులచవితి పండుగలా నాగాపుజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి.
శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి:
శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది. శ్రావణ పూర్ణిమ – రాఖీపూర్ణిమ:
అన్న/తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అనికూడా అంటారు.
ముఖ్యమైన విషయం..
7వ తేదీ రాఖీపౌర్ణమి
ఈ రోజు రాత్రి చంద్రగ్రహణం ఉంది. కాబట్టి ఆరోజు ఎలాంటి పూజలు చేయకపోవడం మంచిది. ఉదయం 9గంటల వరకు పూజాకార్యక్రమాలు ముంగించుకుని దైననామ స్మరణలో ఉంటే శుభం చేకూరుతుంది.
హయగ్రీవ జయంతి:
ఈరోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని, హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వ శ్రేష్టం.
కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి:
మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. అంతే కాదు. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర, శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడినది.
కృష్ణపక్ష అష్టమి – శ్రీకృష్ణాష్టమి:
శ్రీమహావిష్ణువు యోక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది.
కృష్ణపక్ష ఏకాదశి – కామిక ఏకాదశి:
ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి. ఈరోజున నవనీతమును(వెన్న) దానం చేయాలని పెద్దలు అంటారు. తద్వారా ఈతి బాధలు పోయి, కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.
కృష్ణపక్ష అమావాస్య – పోలాల అమావాస్య:
పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్లు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్తా, పోలేరు అమావాస్య గా మారి, పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.
శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహ సిద్ధిరస్తు.