Monday, 12 April 2021

2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర తులా రాశి ఫలాలు

 




తులా రాశి ఫలితములు
చిత్త 3,4 పాదములు (రా, రి)
స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)
విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)

ఆదాయం-2 వ్యయం-8 రాజయోగం-1 అవమానం-5

🎉ఈ గురువు ఏప్రిల్ 5 నుండి సెప్టెంబరు 14 వరకు మరియు నవంబరు 20 నుండి సంవత్సరాంతం వరకు కుంభంలో (పంచమం) సంచరించి మిగిలిన కాలము అంతయు మకరరాశి (చతుర్థం)లో సంచరించును. శని సంవత్సరం అంతయు మకరంలో (చతుర్థం) సంచరించును. రాహువు వృషభంలో (అష్టమం) కేతువు వృశ్చికంలో (ద్వితీయం) సంచరించెదరు. ఈ సంవత్సరం అధిక కాలము గురు బుధ శుక్ర గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును.
🎉అసంతృప్తి విడనాడవలెను. అసంతృప్తి మీకు ప్రతి అంశంలోను ప్రతిరోజు మిమ్మల్ని వెంబడించి చాలా చికాకులు తీసుకువస్తుంది. అష్టమ రాహు అర్ధాష్టమ శని మీ ఫలితాలను సానుకూల ధోరణి నుండి దూరం చేస్తున్నప్పటికీ గురుబలం దృష్ట్యా ఈ సంవత్సరం నష్టపోకుండా కాలక్షేపం చేయగలుగుతారు. సహజంగా అష్టమ రాహు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అనవసర పనులు చేయించడం కావలసిన పనులు చేయు దృష్టి కూడా రాకపోవడం వంటివి కలిగిస్తారు. తద్వారా మీతో ముడిపడిన ప్రతి వ్యవహరములోను మీకు యిబ్బందులు అవమానములు కలహములు యిస్తుంటారు. మీరు చేయవలసిన ఉద్యోగ విధి నిర్వహణ సరిగా చేయకపోవడం - తద్వారా చికాకులు రాకుండా మీ స్నేహితులు సహకారం చేయడం జరుగుతుంది. స్థిరబుద్ధి ప్రదర్శించలేని స్థితి వుంటుంది.
🎉మీకు మీరు వ్యాపారం చేయు స్థలం నుండి లేదా మీరు నివాసం చేయు గృహము నుండి ఖాళీ చేయించే విషయంగా కలహబాధ పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో దుష్ట సహవాసములు యిబ్బందులు కలుగచేస్తాయి. అధికారులు మీ ఉద్యోగ వ్యాపార విషయాలలో తరచుగా యిబ్బందులు కలుగచేస్తారు. మీరు తెలివిగా దాటవేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయములే కాక యితర విషయములను గురించి కూడా అనవరస ప్రమాణములు చేస్తుంటారు. ఆదాయం తగిన రీతిగా అందుతూ ఉంటుంది. ఖర్చులు అధికం అయిననూ తెలివిగా అన్నీ సాధించుకుంటారు. మీ శక్తి సామర్థ్యము తెలివి తేటలకు ఓర్పుకు పరీక్షాకాలము సాంఘికం కార్యకలాపాలు అధికంగా చేస్తుంటారు.
🎉తరచుగా శుభ సంబంధ వార్తలు వింటారు. శుభ కార్యములు పుణ్య కార్యములు నిమిత్తంగా ప్రయాణ విఘ్నములు అధికంగా అవుతాయి. విజ్ఞాన వినోద కార్యక్రమముల యందు అధికంగా పాల్గొంటారు. కొన్నిసార్లు మీ సలహా, మీ సహకారం ఫలించి లబ్ది పొందినవారు మిమ్మల్ని అధికంగా గౌరవిస్తారు. వృత్తి విష యంలో కొన్ని సందర్భాలు బహు అనుకూలంగా వస్తాయి. అది ఒక లాటరీ వంటిది.
🎉విదేశీ నివాస ప్రయత్నాలకై ప్రయత్నం చేయు వారికి ఒక సూచన తొందరపడి మీరు చేయుచున్న ఉద్యోగం మానివేసి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు చేయకండి. యిబ్బందికరం కాగలదు. విద్యాపరమైన ఆలోచనలో వున్నవారికి విదేశీ ప్రయత్నాలు సత్ఫలితాలను యిస్తాయి కానీ అవరోధములు అధికంగా వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగంలోను రియల్ ఎస్టేట్ రంగంలోను వున్నవారికి లేబర్ ప్రాబ్లమ్, మధ్యవర్తుల వలన చికాకులు బాగా పెరుగుతాయి. ఫైనాన్స్ వ్యాపారులకు శని రాహువుల ప్రభావంగా మోసపూరిత వాతావరణం అధికమని చెప్పాలి. షేర్ వ్యాపారులు సరుకులు నిల్వచేసి వ్యాపారం చేయువారికి లాభాలు వస్తాయి కానీ యితరులతో పోలిక అనవసరము.
🎉శుభకార్యముల ప్రయత్నంలో గురుబలం బాగున్ననూ రాహు శని సంచారం వలన యిబ్బందికర ఘటనలు, ఆటంకములు ఉంటాయి. అదేరీతిగా పుణ్యకార్య నిమిత్తంగా చేయు ప్రయత్నాలలో ఎంతో శ్రమను పొంది కార్యములు సాధించుకునే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు గురుబలం బాగుంది కానీ రాహు ప్రభావంగా స్థిరచిత్తం కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రత్యేక శ్రద్ధ అవసరం రైతులు తొందరపడి ఎవరినీ నమ్మవద్దని సూచన. శ్రమకు మంచి ఫలితమే ఉంటుంది.
🎉కోర్టు వ్యవహారములలో వున్నవారికి ప్రతి విషయంలో మీరు తెలివిగా ప్రవర్తించినా మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా ఉండకపోవడం చేత కార్యసాఫల్యం ఆలస్యం అవుతుంది. స్థానచలన ప్రయత్నాలలో వున్నవారికి మానసిక ఒత్తిడి ఎక్కువై సత్ఫలితాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి ధనం సమకూరుతుంది. అయితే దీనిని విశ్వసించ లేని స్థితిగా కార్యం నడుచును. కొన్ని సందర్భాలలో వ్యవహార చికాకులు కూడా రాగలవు. జాగ్రత్త పడండి. ప్రమోషన్ ప్రయత్నాలు సరిగా సాగవు. మీరు చేసిన పనులకు రావలసిన ఫలితాలే సరిగా అందవు.
🎉నూతన ఉద్యోగ ప్రయత్నాలు బాగా సాగుతాయి. చేస్తున్న ఉద్యోగం మానివేసి కొత్త ప్రయత్నాలు చేయవద్దు. నూతన వ్యాపార ప్రయత్నాలు చేయువారికి అవరోధాలు అధిక ఖర్చులు వుండి పనులు పూర్తి అవుతాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి. సమస్యలు ముందుగా గుర్తించి మీరు సమస్యా పరిష్కారం చేయగలుగుతారు. మరొక విషయం మీ పిల్లల నుండి మీరు ఆశించిన ఫలితాలు పొందరు. గురుబలం వుంది కావున కుటుంబ విషయంగా సమస్యలు దాటవేయగలుగుతారు. ఈ కుటుంబ అంశాలు మీరు ఓర్పుగా సాధించాలి.
🎉దూకుడుతనం ప్రమాదాలకు దారి తీస్తుంది. కలహాలు పెరగకుండా జాగ్రత్త పడండి. ఋణ విషయంలో పాత ఋణములు వున్నవారికి ఋణదాతల ద్వారా అవమానాలు వస్తాయి. కొత్త ఋణములు కూడా తేలికగా లభిస్తాయి. తీర్చే విషయంలో కూడా యిబ్బందులు ఉండవు. ఆరోగ్య విషయంలో వాత సంబంధమైన అనారోగ్యం వున్నవారికి ఈ సంవత్సరం యిబ్బందులు పెరుగుతాయి. తరచుగా శరీరం పుష్టిని కోల్పోవు స్థితి ఏర్పడుతుంది. దానికి మానసిక బాధలే కారణం. యితరత్రా ఈ రాశివారి ఆరోగ్య విషయంగా యిబ్బందులు ఉండవు. పెద్దగా భయపడవలసిన అవసరం వున్న కాలం కాదు.
🎉మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు శ్రమతో కూడి పూర్తి అవుతాయి. కానీ తగిన గుర్తింపు అందదు. ఈ సంవత్సరం సమస్యలు దాటవలెను అనీ కోరిక ఉన్నవారు ఓర్పు మౌనం బాగా వహించాలి. స్త్రీలకు ఈ సంవత్సరం విచిత్రమైన స్థితి ఉంటుంది. బుద్ధి వికాసం సందర్భానుసారంగా నడవదు. ఉద్యోగ విషయాలలో శ్రమచేసి పనులు పూర్తి చేసినా గుర్తింపు అందుదు. వ్యాపారంలో వుండే స్త్రీలకు సానుకూల స్థితి తక్కువ. కుటుంబ వ్యవహారములతో అంతా శుభపరిణామాలే ఉంటాయి. గర్భిణీ స్త్రీలు గురుబలం బాగుంది. కావున అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు పాటించి సక్సెస్ అవుతారు.
🎉 చిత్తా నక్షత్రం వారికి విశేషములు ఏమనగా మితభాషణ ఓర్పు ప్రదర్శించి ఎన్నో రకములు అయిన చికాకులు దాటవేస్తారు. బంధువర్గం, స్నేహితులు, బాగా సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలలో నష్టాలని వారిస్తారు.
🎉స్వాతీ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా భార్యభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది. కొత్త కొత్త గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంగారం వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్నిసార్లు దూరప్రాంతములకు విహారార్థం వెడతారు.
🎉 విశాఖ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా మానసిక క్షోభ పెరుగుతుంది. పెద్దలు వారి అలవాట్లు యితరులకు యిబ్బందికరం అయి భార్యాభర్తలకు తల్లిదండ్రులు పిల్లలకు కలహాలు రేపుతాయి. ఆహారం విషయంలో మాత్రం చాలా సంతుష్టిగా ఉంటారు.
🎉నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
"ఓం నమో భగవతే పంచవదనాయ మహాబల ప్రచండాయ |
మహాభీమ పరాక్రమాయ సకల బ్రహ్మాండ నాయకాయ |
సకల భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ యక్షిణీ పూతనా మహామారీ సకల విఘ్న నివారణాయ సకల శత్రు సంహారణాయ స్వాహా" - పఠనద్వారా మనోధైర్యం పెరుగుతుంది.
🎉శాంతి : దోషము చేయు గ్రహములు శని రాహు నిమిత్తంగా ఏప్రిల్, నవంబర్ మాసములో జపదాన హోమశాంతి మీరు దగ్గర వుండి చేయించుకోండి. షణ్ముఖ రుద్రాక్ష ధారణ అధికంగా మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది. రోజూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి “దుర్గాసప్తశ్లోకీ” 11సార్లు పారాయణం చేయడం, కుదిరితే ప్రదోషంలో చేయడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి.
🎉ఏప్రిల్ : అందరి నుండి సహకారం తగ్గుతుంది. ప్రతిరోజూ ఒక ప్రత్యేక పరీక్షా కాలముగా నడుచును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిపనీ మీరే స్వయంగా చేసుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి. కుటుంబ విషయంగా, ఉద్యోగ విషయంగా ఎవరినీ నమ్మి ఏ పనీ చేయడానికి అవకాశం ఉండదు. ఉద్యోగంలో తోటి ఉద్యోగుల ద్వారా అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అనవసర ప్రయాణాలు తద్వారా శారీరక శ్రమ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
🎉మే : ప్రత్యేక జాగ్రత్తలు పాటించవలసిన కాలము. అడ్డంకులు అధికంగా ఉంటాయి. ఎవరితోనూ కలహములకు అవకాశం యివ్వవద్దు. మౌనం శ్రేయస్కరం. అన్ని కార్యక్రమాలలోనూ అనుకూల స్థితి ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏ పనీ సవ్యంగా సాగే అవకాశం ఉండదు. ఆర్థిక సంబంధమైన సమస్యలు చాలా విచిత్రంగా వస్తాయి. తొందరపడి ఎవరికీ కూడా ఆర్థిక వ్యవహారాలలో ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. ఉద్యోగం, వ్యాపారం విషయాలు ఒత్తిడితో కూడుకొని పూర్తవుతాయి. ఈ నెలలో ఓర్పు చాలా అవసరం.
🎉జూన్ : విజ్ఞాన వినోద కార్యముల నిమిత్తంగా ప్రయాణం చేస్తారు. ఖర్చులు అధికం అవుతాయి. రోజూ మీ ఆచార వ్యవహారములకు సంబంధించి పూజలు చేస్తారు. మీ యొక్క ప్రతిపనిని మీరు స్వయంగా చేసుకోవడం మంచిది. క్రమంగా ఈ నెల ద్వితీయార్థంలో మంచి మార్పులకు అవకాశం చేకూరుతుంది. నిరుత్సాహపడకుండా ప్రతిపనిని గమనించడం చాలా అవసరం. ఎవర్నీ నమ్మి ఏ కార్యక్రమములు కూడా చేయవద్దని ప్రత్యేక సూచన. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో సమయపాలన చేయడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేయండి.
🎉జూలై: రోజూ ప్రతిపనికీ శ్రమ ఎక్కువ అయిననూ మంచి ఫలితాలు అందుతాయి. అంతా ధనలాభంతో, అందరి సహకారంతో పని నడుచును. శుభకాలమే. కుటుంబసభ్యుల అవసరాలు తీర్చే ప్రయత్నంలో బాగా ఇబ్బందులు ఎదురౌతాయి. అసంతృప్తితో కుటుంబ సభ్యులు వ్యవహరించి మీకు చికాకులు సృష్టిస్తారు. ఋణ సంబంధమైన వ్యవహారాలలో తెలివిగా ప్రవర్తించి కావలసిన ఋణాలు పొందడం, సమస్యలను తెచ్చుకోవడం జరుగుతుంది. వృత్తిరీత్యా తోటివారి సహకారం బాగా అందుతుంది. శుభ పరిణామాలు బాగా పొందుతారు.
🎉ఆగష్టు: 11వ తేదీ నుండి చిన్న చిన్న కుటుంబ కలహములు మరియు వాహన చికాకులు ఉంటాయి. వృత్తి విషయంగా అధికారుల నుండి సహకారం ఉంటుంది. మాసారంభంలో అన్ని విషయాలలోనూ కూడా పనులు వేగంగా పూర్తవ్వడం, సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. అయితే క్రమక్రమంగా ఒక్కొక్క వ్యవహారం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రణాళికా బద్ధంగా ఆర్థిక విషయాలను నడపడం చాలా అవసరం. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించుకోవలసిన అవసరం ఎక్కువగా కనబడుతుంది.
🎉సెప్టెంబర్ : కొత్త ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారం చాలా బాగుంటుంది. ఎవరి విషయంలోనూ కలుగ చేసుకోకండి. ఉద్యోగ విషయంలో సమయపాలన చేయడానికి ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకొనే ఆలోచనలు విరమించుకోండి. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం చాలా అవసరం. గ్రహాలు ఎక్కువగా వ్యతిరిక్తమైనటువంటి సంచారంలో ఉన్నాయి. శుక్రసంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ మీ ఆలోచనలు అమలులో పెట్టడానికి కావలసిన ఇతర గ్రహాల సంచారం అనుకూలంగా లేదు.
🎉అక్టోబర్ : పుణ్యకార్యాసక్తత పెరుగుతుంది. అయితే ప్రతిపని కూడా విఘ్నములతో ఉంటుంది. ధనవ్యయం అధికం అవుతుంది. ప్రధానంగా కుజగ్రహ ప్రతికూల సంచారం వలన ఏదో తెలియని సమస్యలు నిత్యం వస్తూనే ఉంటాయి. వాహనాలు నడిపే విషయాలు బహు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు, ఋణ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు ఇబ్బందికరం కాకుండా ఉండేలాగా మీరు ప్రత్యేక ప్రయత్నం చేయాలి.
🎉నవంబర్ : కలహాలు నివారిస్తారు. ఖర్చులు తగ్గిస్తారు. రోజు రోజుకూ అభివృద్ధి ఉంటుంది. మంచి జీవనం సాగుతుంది. అన్ని పనులు ఇబ్బందికరంగానే సాగుతాయి. అదృష్టవశాత్తు సమస్యలను ముందుగానే గుర్తించి, వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళతారు. నూతన ప్రయత్నాలన్నింటిలో కూడా మీ సన్నిహితులు సహకరించే అవకాశం ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య సదుపాయం అనుకూలంగా ఉన్న కారణంగా మీరు చాలా వ్యవహారాలలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కోణాలలోనూ సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెడతారు.
🎉డిసెంబర్ : కొత్త కొత్త ఆలోచనలు చేసినా అమలు జరిపే అవకాశం ఉండదు. అందరితో సఖ్యతగా ఉండడం చాలా అవసరం. కుటుంబ వ్యవహారములు చికాకు యిస్తాయి. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంగా వచ్చే సమస్యలు మీ ఇతర కార్యక్రమాలను అవరోధం చేస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తరచుగా వెంబడించే అవకాశం ఉంటుంది. తొందరపడి ఎవరి వ్యవహారాలకు సహకారం చేయడం అనే కార్యక్రమం పెట్టుకోవద్దు. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవడం చాలా అవసరం.
🎉జనవరి : ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచి పనులు చేయవలసిన కాలము. ధైర్యంగా అన్ని పనులు, సమస్యలు పూర్తి చేయుట తగిన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు స్వయంగా చేసుకొనే పనులన్నీ కూడా చాలా వరకు విజయవంతంగా పూర్తవుతాయి. ఎవరి సహకారం లేకుండానే చాలావరకు పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వెసులుబాటు చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు చాలా చక్కగా పూర్తవుతాయి.
🎉ఫిబ్రవరి : నిత్యకృత్యాలు అన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ప్రతిపని విషయాలు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి, సమస్యల్ని దూరం చేసుకొని ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగరీత్యా ఒత్తిడి పెరుగుతుంది. అయితే వాటిని తెలివిగా సరిచేసుకుంటూ ముందుకు వెళతారు. వ్యాపార విషయంగా కూడా ఒత్తిడి పెరిగినప్పటికీ తెలివిగా సరిచేసుకుంటూ ముందుకువెళ్ళే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలు తీర్చడానికి కావలసిన ఆర్థిక వెసులుబాటు ఇబ్బందిలేకుండా చేకూరుతుంది.
🎉మార్చి : ఉద్యోగంలో అధికారులు, వ్యాపారంలో మీ పనివారు బాగా సహకరిస్తారు. అంతా శుభసూచకమే. ఆర్థికంగా బాగుంటుంది. అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. అవసరమైనటు వంటి కొత్త కొత్త ఋణాలు తేలికపాటి ప్రయత్నాలతో అందుకుంటారు. జీవనశైలి మీకు సంతృప్తికరంగా ఉంటుంది. ఒత్తిడితో పనులు ప్రారంభమైనప్పటికీ విజయవంతంగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళతారు.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371





No comments:

Post a Comment