Friday, 30 April 2021

వాల్మీకి రామాయణం - 18వ దినము, అరణ్యకాండ

 




రాముడు ఖర దూషణులని సంహరించడాన్ని అకంపనుడు అనే రాక్షసుడు చూసి లంకా పట్టణానికి చేరుకున్నాడు. అక్కడాయన రావణుడి పాదముల మీద పడి, రాముడు ఖర దూషణులను ఎలా సంహరించాడో వివరించాడు. ఆగ్రహించిన రావణుడు " అసలు ఆ రాముడు ఎవరు, దండకారణ్యంలో ఎందుకున్నాడు, వారితో ఉన్న ఆ స్త్రీ పేరేమి, అసలు 14,000 రాక్షసులని రాముడు ఒక్కడే ఎందుకు సంహరించాడు. నాకు కారణం చెప్పు " అన్నాడు.

అప్పుడు అకంపనుడు " రాముడు సామాన్యమైన వ్యక్తి కాదు, దశరథుడి కుమారుడు, విశేషమైన తేజస్సు కలిగినవాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు, రాముడికి బహిప్రాణంగా సంచరిస్తూ ఉంటాడు, ఆయన రాముడికి కుడిభుజం లాంటివాడు, సర్వకాలములయందు రాముడిని కాపాడుకోవడమే తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. రాముడు తన ధర్మపత్ని అయిన సీతతో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యానికి ప్రవేశించాడు. తాపసులైన ఋషులు రాక్షసుల చేత తాము పొందుతున్న బాధలని రాముడికి చెప్పుకుంటె, మీకు శత్రువులైన రాక్షసులు నాకూ శత్రువులే కనుక వారిని సంహరిస్తాను అని ఆ ఋషులకి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం రాక్షస సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడా రాక్షసులు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. ఆ రాముడు తన బాణముల చేత ఈ భూమిని కృంగేటట్టు చెయ్యగలడు, కృంగిపోతున్న భూమిని నిలబడేటట్టు చెయ్యగలడు, సముద్రాలని క్షోభింప చెయ్యగలడు, పర్వతాలని కదపగలడు " అని అకంపనుడు విశేషంగా రాముడి పరాక్రమాన్ని వర్ణించాడు.

" అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణులని సంహరిస్తాను " అని రావణాసురుడు అన్నాడు.

అప్పుడు అకంపనుడు " మీరు తొందరపడి వెళ్ళవద్దు, ఎందుకంటే విశేషమైన వేగం కలిగిన ప్రవాహంలోకి ప్రవేశించడం మంచిది కాదు. ఆయన ముందు మీరు నిలబడలేరు. రాముడిని సంహరించాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది, రాముడి భార్య అయిన సీత చాలా అందంగా ఉంటుంది. ఆ సీతతో అందంలో సమానమైన వాళ్ళు గంధర్వలులలో కాని, యక్షులలో కాని, కిన్నెరులలో కాని, రాక్షసులలో కాని, మనుష్యులలో కాని లేరు. అందుకని రాముడు లేని సమయం చూసి సీతని అపహరించి తీసుకొచ్చి నీ భార్యని చేసుకో. సీత పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. సీతని పోగొట్టుకున్న రాముడు తనంతటతానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుచేత నువ్వు ఈ కపటోపాయంతో రామవధకి పూనుకో " అన్నాడు.  

రావణుడు వెంటనే బయలుదేరి మారీచ ఆశ్రమానికి వెళ్ళి" నాకు ఒక ముఖ్యమైన పని పడింది, నువ్వు మాయలు తెలిసినవాడివి. అందుకని సీతాపహరణంలో నాకు ఉపకారం చెయ్యి " అని అడిగాడు.

ఈ మాటలు విన్న మారీచుడు " నీకు అసలు ఎవడు చెప్పాడు సీతాపహరణం చెయ్యమని. బహుశా నిన్ను సంహరించడం కోసమని నీ శత్రువు ఎవడో నీకు సలహాలు చెప్పేవాడిగా మాటువేసి ఉన్నాడు. వాడు నిన్నే కాదు సమస్త దానవ కులాన్ని నాశనం చెయ్యాలని ప్రతిజ్ఞ చేశాడు, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వాడు నీకు రాముడితో వైరం పెట్టాడు. రాముడితో వైరం పెట్టుకున్నవాడు ఎవడూ జీవించడు, రాముడి శక్తి సామర్ధ్యాలు ఏమిటో నాకు తెలుసు. నా మాట విని సీతాపహరణం చెయ్యకు " అన్నాడు.

" నువ్వు ఇంతగా చెప్తున్నావు కనుక నేను సీతాపహరణం చెయ్యను " అని రావణుడు వెనక్కి వెళ్ళిపోయాడు.

( పైన జెరిగిన కథ గురించి పెద్దలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని నిజంగా వాల్మీకి మహర్షి రచించార, లేక ఎవరన్నా రచించి రామాయణంలోకి చొప్పించార? ప్రధాన పాత్ర ప్రవేశించినప్పుడు వాల్మీకి మహర్షి ఆ పాత్ర గురించి తగినంత పరిచయము, వివరణ ఇస్తారు. కాని ఇక్కడ రావణ పాత్ర గురించి ఎలాంటి పరిచయము లేకుండానే కథ సాగిపోయింది. అలాగే మారీచుడు చెప్పగానే అంత బేలగా రావణుడు తిరిగి వచ్చేస్తాడ? కేవలం ఒక రాక్షసుడు చెప్పిన కథనాన్ని విని రావణుడు సీతాపహరణం చెయ్యడానికి వెళతాడ? శూర్పణఖ ఆకాశమార్గంలో లంకకి వెళితే, అకంపనుడు భూమార్గంలో వెళ్ళాడు. దీని ప్రకారం శూర్పణఖ ముందు వెళ్ళాలి, కాని అకంపనుడే ముందు వెళ్ళాడు. ఇవన్నీ వాల్మీకి రచనాశైలితో విభేదిస్తున్నట్టు కనబడడం చేత కొంతమంది పెద్దలు వీటిని అంగీకరించలేదు. ఈ సర్గలు బహుశా రామాయణంలోనివి కాకపోవచ్చు అన్నారు. కనుక వీటిని వివాదాస్పద సర్గలుగా ప్రకటించారు. అవునా, కాదా అన్నది ఆ పరమేశ్వరుడికే తెలియాలి.) ఇక కథ ప్రకారంగా చూస్తే....................

అకంపనుడు వెళ్ళిపోయిన తరువాత శూర్పణఖ లంకా పట్టణంలోకి ప్రవేశించింది. ఇంద్రుడి చుట్టూ దేవతలు సభలో కూర్చున్నట్టు, ఆ రావణుడి చుట్టూ మంత్రులు కూర్చొని ఉన్నారు. ఆ రావణుడు దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, కింపురుషుల చేత సంహరింపబడడు. ఆ సభలో నోరు తెరుచుకొని ఉన్న రావణాసురుడిని చూస్తే, నోరు తెరిచి మీదకి వస్తున్న యమధర్మరాజు జ్ఞాపకంవస్తాడు.


దేవ అసుర విమర్దేషు వజ్ర అశని కృత వ్రణం |
ఐరావత విషాణ అగ్రైః ఉత్కృష్ట కిణ వక్షసం ||
వింశత్ భుజం దశ గ్రీవం దర్శనీయ పరిచ్ఛదం |
విశాల వక్షసం వీరం రాజ లక్ష్మణ లక్షితం ||

దేవతలతో అనేకసార్లు యుద్ధాలు చెయ్యడం వలన, ఆయన గుండెల మీద ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బలు ఉన్నాయి. అలాగే ఐరావతం తన దంతాల చేత కుమ్మినప్పుడు తగిలిన గాయాలు కూడా కనబడుతున్నాయి. ఆ రావణాసురుడు 20 చేతులతో, 10 తలకాయలతో, విశాలమైన వక్షస్థలంతో ఉన్న మహావీరుడైన ఆ రావణుడు రాజులకి ఉండవలసిన లక్షణాలతో శోభిస్తున్నాడు. బాగా కాల్చిన బంగారపు కుండలములు పెట్టుకున్నాడు, విశాలమైన భుజాలతో ఉన్నాడు, తెల్లటి పళ్ళతో, పర్వతమంటి నోటితో ఉన్నాడు. శ్రీమహా విష్ణువు యొక్క చక్రము చేత కొట్టబడ్డప్పుడు తగిలిన దెబ్బలు ఆయన శరీరం మీద ఉన్నాయి, అలాగే మిగిలిన దేవతల ఆయుధముల దెబ్బలు వాడి ఒంటి మీద ఉన్నాయి. అంతమంది దేవతల యొక్క దెబ్బలు తిన్నా ఆయన ఎప్పుడూ క్షోభించలేదు. ఆయన అప్పుడప్పుడు సముద్రాలని కలయతిప్పుతూ ఉంటాడు. ఆయన పర్వతాలని విసురుతూ వ్యాయామం చేసేవాడు. కావాలని వెళ్ళి దేవతలతో యుద్ధం చేసేవాడు. ఎక్కడన్నా ఎవరైనా ధర్మ మార్గంలో ఉంటె, వాళ్ళని హింసిస్తాడు. ఇతరుల భార్యలని బలవంతంగా తీసుకొచ్చి అనుభవించడం ఆయనకి చాలా ఇష్టం.


అలాగే ఆయనకి అనేక రకములైన అస్త్రములను ప్రయోగించడం తెలుసు, ఆ అస్త్రములను ఉపసంహరించడం కూడా తెలుసు. ఎవరన్నా యజ్ఞాలు చేస్తుంటే, తనకున్న శక్తితో ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసేవాడు. ఒకసారి పాతాళంలో ఉన్న వాసుకిని ఓడించాడు, అలాగే తక్షకుడి భార్యని తీసుకొచ్చి తన భార్యగా పెట్టుకున్నాడు. కైలాసంలో కుబేరుడితో యుద్ధం చేసి ఆయన దెగ్గర ఉన్న పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు( కుబేరుడు స్వయంగా రావణుడికి అన్నయ్య. కాకపోతే కుబేరుడు మొదటి భార్య కొడుకు, రావణుడు రెండవ భార్య కొడుకు). ఉత్తర భారతంలో చైత్రరథం అనే అందమైన వనం ఉందని ఎవరో చెబితే, రావణుడు అక్కడికి వెళ్ళి, ఇంత అందమైన వనం నాకు లేనప్పుడు ఎవరికీ ఉండకూడదని ఆ వనాన్ని నాశనం చేశాడు. అలాగే స్వర్గలోకంలోని నందన వనాన్ని నాశనం చేశాడు. అప్పుడప్పుడు ఆకాశంలో నిలబడి సూర్యచంద్రుల గమనాన్ని ఆపుతాడు.

రావణుడు బ్రహ్మదేవుడి కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అన్ని సంవత్సరాలు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి తన పది తలకాయలు నరికి అగ్నిలో వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నమై ఏమి కావాలి అని అడుగగా........

దేవ దానవ గధర్వ పిశాచ పతగ ఉరగైః |
అభయం యస్య సంగ్రామే మృత్యుతో మానుషాద్ ఋతే ||

" నేను పాముల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత, ఎవ్వరి చేత నాకు మరణం కలగకూడదు " అని అడిగాడు, కాని రావణుడు మనుషుల చేత మరణించకూడదని అడగలేదు. యజ్ఞములలో దేవతలకి సమర్పించే సోమరసాన్ని ఆయన అపహరించేవాడు. ఎక్కడన్నా యజ్ఞం పూర్తవబోతుంది అనగా, అక్కడికి వచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడం రావణుడికి బాగా ఇష్టం. సర్వకాలములయందు దుష్ట ప్రవర్తనతోనే ఉంటాడు. ( ఒకసారి రావణుడు కైలాశ పర్వతాన్ని లేపాలని చూస్తే, పరమశివుడు తన బొటను వేలితో ఆ పర్వతాన్ని కిందకి తొక్కాడు. అప్పుడు రావణుడి రెండు చేతులూ ఆ పర్వతం కిందనే ఉండడంచేత రావణుడు గట్టిగా అరిచాడు. ముల్లోకాలని భయకంపితులని చేసేవిధంగా అరిచాడు కనుక(రవం చేశాడు కనుక) ఆయనని రావణ అని పిలిచారు.)


రావణం సర్వ భూతానాం సర్వ లోక భయావహం |
 రాక్షసీ భ్రాతరం క్రూరం సా దదర్శ మహాబలం ||

రావణాసురుడు సర్వ లోకములకు, సర్వ ప్రాణులకు భయంకరుడు. అలాంటి రావణుడు మంత్రుల చేత పరివేష్టితుడై ఉండగా, శూర్పణఖ భయపడుతూ ఆయన దెగ్గరికి వెళ్ళి "నువ్వు ఎప్పుడూ గ్రామ్యమైన భోగములని అనుభవిస్తూ ఉంటావు. కామమునకు క్రోధమునకు వశపడిపోయావు. నీకు రాజ్యపాలనం మీద ఇష్టం లేదు, సరైన గూఢచారులని నియమించుకోలేదు. నీ రాజ్యంలో ఏమి జెరుగుతుందో నీకు తెలియడం లేదు. స్మశానంలో ఉన్న అగ్నిని ఎవరూ ముట్టుకోనట్టు, సింహాసనం మీద కూర్చున్న నీలాంటి వాడిని చూసి ప్రజలు దెగ్గరకి రారు. నీ గూఢచారులు ఎక్కడ ఏమి జెరుగుతుందో తెలుసుకోరా?, తెలుసుకున్నా నీకు వచ్చి చెప్పరా?, చెప్పినా నువ్వు బాధపడవా?. రోజురోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు, నువ్వు మాత్రం కామంతో కళ్ళు మూసుకుని ఉండిపోయావు. ఒకసారి కాని నువ్వు రాజ్యభ్రష్టుడివి అయ్యావంటే, అవకాసం దొరికిందని ప్రజలు నిన్ను కొట్టి చంపుతారు. నీ కీర్తి అంతా సముద్రంలో ఉన్న పర్వతంలా, ప్రకాశించడం మానేస్తుంది.


నువ్వు దండకారణ్యంలో మునులని హింసించమని 14,000 మంది రాక్షసులని పెట్టావు. కాని, ఒక్క రాముడు భూమి మీద నిలబడి ఇంతమందిని చంపేశాడు. ఇవన్నీ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు, కొద్దికాలంలోనే నీ పతనం ప్రారంభమవుతుంది " అనింది.

శూర్పణఖ మాటలు విన్న రావణుడు " అసలు ఆ రాముడు ఎవరు? అరణ్యానికి ఎందుకొచ్చాడు? ఆయన దెగ్గర ఉండేటటువంటి ఆయుధములు ఏమిటి? రాక్షసులని ఎందుకు చంపాడు? నీ ముక్కు చెవులను ఎవరు కోశారు? నువ్వు చూసింది చూసినట్టు నాకు చెప్పు " అన్నాడు.

దీర్ఘబాహుః విశాలాక్షః చీర కృష్ణ అజిన అంబరః |
కందర్ప సమ రూపః చ రామో దశరథ ఆత్మజః ||

అప్పుడా శూర్పణఖ " రాముడు పెద్ద పెద్ద చేతులతో, విశాలమైన కన్నులతో, మునులలాగ నార చీర, కృష్ణాజినం వేసుకొని, మన్మధుడిలా అందమైన రూపంతో ఉంటాడు. ఆయన దశరథ మహారాజు పెద్ద కుమారుడు. దేవేంద్రుడు పట్టుకున్నట్టు ధనుస్సుని పట్టుకొని, నారాచ బాణములను సంధిస్తే, అవి నోరు తెరుచుకొని విషం కక్కుతూ వస్తున్న మహా సర్పాలలాగ ఉంటాయి. రాముడు 14,000 మంది రాక్షసులని చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చంపినవాడు రాముడని నాకు తెలుసు, కాని రాముడు బాణం ఎప్పుడు తీశాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు గురిచూసి వదిలాడో నేను చూడలేదు. కాని రాక్షసుల తలకాయలు టకటక తెగిపోవడం నేను చూశాను. రాముడు అంత తీవ్రమైన వేగంతో బాణ ప్రయోగం చేస్తాడు. రాముడితో గుణములయందు, తేజస్సుయందు సమానమైనవాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు.

రామస్య దక్షిణే బాహుః నిత్యం ప్రాణో బహిః చరః |


ఆ లక్ష్మణుడు రాముడికి కుడి భుజంలా, బయట తిరుగుతున్న ప్రాణంలా సర్వకాలములయందు రాముడిని రక్షిస్తూ ఉంటాడు. రాముడి భార్య పేరు సీత, ఆమె పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది. విశాలమైన నేత్రములు కలిగి ఉంటుంది. నిరంతరం రాముడిని అపారమైన ప్రేమతో సేవిస్తూ ఉంటుంది. ఆమె నల్లటి జుట్టుతో ఉంటుంది, అందమైన ముక్కుతో, అందమైన స్వరూపంతో ఉంటుంది, ఎంతో కాంతివంతంగా ఉంటుంది, ఆవిడ సాక్షాత్తు ఇంకొక శ్రీలక్ష్మిలా ఉంటుంది. కాల్చి తీసిన బంగారంలా ఆవిడ శరీరం ఉంటుంది, ఎర్రటి రక్తం లోపలినుంచి కనబడుతున్నటువంటి తెల్లటి గోళ్ళతో ఉంటుంది, పద్మంలాంటి ముఖంతో, సన్నటి నడుముతో ఉంటుంది. ఆవిడ గంధర్వులకి, యక్షులకి, కిన్నెరులకి, దానవులకి చెందినదికాదు, ఆమె నరకాంత. కాని ఈ భూమండలంలో నేను ఇప్పటివరకూ అటువంటి సౌందర్యరాశిని చూడలేదు. సీత ఎవరిని గాఢలింగనం చేసుకుంటుందో, ఎవడు సీతకి భర్త అని అనిపించుకుంటాడో, వాడే మూడు లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు, వాడు ఇంద్రుడితో సమానమైన కీర్తిని గడించినవాడు.

నాకు ఆ సీతని చూడగానే, ఈమె మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని నేను సీతని తేవడానికి ప్రయత్నిస్తే, ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు అన్నయ్యా. నువ్వు కాని సీతని చూస్తే, మన్మధ బాణాలకి వసుడవయిపోతావు. నిజంగా నీకు సీతని భార్యని చేసుకోవాలని ఉంటె, ఇంక ఆలోచించకుండ వెంటనే బయలుదేరు. నువ్వు సీతని నీదిగా అనుభవించు, అడ్డొచ్చిన రాముడిని సంహరించు " అనింది.

శూర్పణఖ మాటలు విన్న రావణుడు తన చుట్టూ కూర్చున్న మంత్రుల వంక చూసి " ఇక మీరు బయలుదేరండి " అన్నాడు. అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర మార్గం మీదుగా పయనమయ్యాడు. అలా వెళుతుండగా ఆయనకి ఒక పెద్ద వట వృక్షం కనబడింది.(తన తల్లి అయిన వినతకి దాస్య విముక్తి చెయ్యడానికని, గరుక్మంతుడు అమృతం తేవడానికి బయలుదేరేముందు తన తండ్రి అయిన కశ్యపుడిని అడిగాడు, నేను ప్రయాణం చేసేటప్పుడు ఆకలి వేస్తుంది కదా, అప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని. అప్పుడా కశ్యపుడు " నువ్వు హిమాలయ పర్వతాలకి దెగ్గరగా వెళుతున్నప్పుడు ఒక పెద్ద సరోవరం కనబడుతుంది, ఆ సరోవరం ఒడ్డున రెండు గజకచ్ఛపాలు కొట్టుకుంటూ ఉంటాయి. అవి ఒక తాబేలు ఒక ఏనుగు. పూర్వకాలంలో, ఒక బ్రాహ్మణుడికి విభాసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు మరణించిన కొంత కాలానికి ఆ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి, ఒకరిని ఒకరు శపించుకున్నారు. విభాసుడు సుప్రతీకుడిని ఒక పెద్ద ఏనుగుగా అవ్వమని, సుప్రతీకుడు విభాసుడిని ఒక పెద్ద తాబేలుగా అవ్వమని శపించుకున్నారు. ఆ తాబేలు చుట్టుకొలత 10 యోజనములు, మందం 3 యోజనములు ఉంటుంది. ఆ ఏనుగు 6 యోజనముల ఎత్తు, 12 యోజనముల పొడువు ఉంటుంది. ఏనుగు తాబేలుని బయటకి లాగాలని చూస్తుంటుంది, తాబేలేమో ఏనుగుని నీళ్ళల్లోకి లాగెయ్యాలని చూస్తుంది, అవి అలా కొన్ని వేల సంవత్సరముల నుండి కొట్టుకుంటూ ఉన్నాయి. అవి అలా కొట్టుకుంటూ ఉండడం వలన ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండడంలేదు. కనుక ఆకలి వేస్తే ఆ రెండిటినీ తినేసెయ్యి " అని కశ్యప ప్రజాపతి అన్నాడు. గరుక్మంతుడు సరే అని బయలుదేరాడు, అలా వెళుతూ వెళుతూ ఆ ఏనుగుని, తాబేలుని చూశాడు. ఆ రెండింటినీ తన కాలి గోళ్ళతో పైకి ఎత్తి, న్యగ్రోధం అనే మహావృక్షం యొక్క కొమ్మ మీద ఆ రెండిటినీ పెట్టాడు. ఆ గజకచ్ఛపాల బరువుకి ఆ కొమ్మ విరిగిపోతుండగా, గరుక్మంతుడు తన ముక్కుతో ఆ కొమ్మని పైకి ఎత్తి ఒక భద్రమైన స్థానానికి చేర్చాడు. తరువాత ఆ గజకచ్ఛపాలని ఒక పర్వతం మీద పెట్టుకొని తినేశాడు. ఆ తరువాత ఇంద్రుడి దెగ్గరికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి వినతని దాస్యం నుండి విముక్తురాలిని చేశాడు. ఆనాడు గరుక్మంతుడు ఆ గజకచ్ఛపాలని పెట్టినది ఈ వృక్షం మీదనే). రావణుడు ఆ న్యగ్రోధం అనే వృక్షాన్ని చూసి, కిందకి దిగి చుట్టూత చూసేసరికి, ఆయనకి ఒక తాపస ఆశ్రమం కనబడింది.

అప్పుడాయన ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూడగా, అందులో నారచీర కట్టుకొని, జటలు వేసుకొని, నియమముతో ఆహారాన్ని తింటున్నటువంటివాడై, ఒకప్పుడు రాక్షసుడైనటువంటి మారీచుడు కనబడ్డాడు. అప్పుడా రావణాసురుడు " ఓ మారీచా! నేను ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను. నీవంటి మహాత్ముడు కాకపోతే నాకు ఎవరు ఉపకారం చేస్తారు. నువ్వు నాకు తప్పకుండా ఉపకారం చెయ్యాలి. నీకు తెలుసు కదా, జనస్థానంలో 14,000 రాక్షసులను నియమించి మునుల యొక్క ధర్మాల్ని, యజ్ఞాలని నాశనం చెయ్యమని చెప్పాను.  నేను చెప్పిన పనులని వాళ్ళు ఎంతో శ్రద్ధా భక్తులతో ఆచరిస్తుండగా ఎక్కడినుంచో రాముడు వచ్చి ఖరుడిని, దూషనుడిని, త్రిశిరస్కుడిని, మహాకపాలుడిని మరియు 14,000 రాక్షసులను ఒక్కడే చంపేశాడు. నా మనస్సుకి ఎంత బాధగా ఉందో తెలుసా. రాముడు కర్కశుడు, తీక్ష్ణ స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు, లుబ్ధుడు, ఇంద్రియాలని జయించనివాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, అన్ని ప్రాణులను భయపెట్టేవాడు, దశరథుడికి అసహ్యం వేసి రాముడిని అరణ్యాలకి వెళ్ళగొట్టాడు, అందుకని నేను రాముడిని బాధపెట్టాలని అనుకుంటున్నాను. ఏ పాపం ఎరుగని పిచ్చి తల్లి నా చెల్లి శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. నన్ను ఇంత బాధపెట్టిన రాముడిని బాధపెట్టడానికి ఆయన భార్య అయిన సీతని అపహరించి తీసుకొద్దామని అనుకుంటున్నాను. రాముడితో యుద్ధం చేసి సీతని తీసుకురావడమనేది చాలా కష్టంతో కూడుకున్న పని, అందుకని ఏ యుద్ధమూ చెయ్యకుండా పని జెరిగిపోయే ఉపాయం ఒకటి నేను ఆలోచించాను. ఇప్పుడది నీకు చెబుతాను విను. నీకు సమస్త మాయలు తెలుసు కనుక, నువ్వు బంగారు లేడిగా మారిపో. నీ ఒంటిమీద వెండి చుక్కలు ఉండాలి, ఇంతకుముందు ఎవ్వరూ చూడని కొమ్ములు ఉండాలి. నువ్వు సీత కంటపడేటట్టుగా ఆశ్రమంలో పరిగెత్తు, అటూ ఇటూ ఆడు. అప్పుడు సీత నిన్ను చూసి, ఆ మృగం కావాలి అని అడుగుతుంది. సీత కోరిక తీర్చడం కోసం రాముడు నీ వెనకాల వస్తాడు, అప్పుడు నువ్వు అదృశ్యమవుతూ కనబడుతూ రాముడిని చాలా దూరం తీసుకుపో, అలా కొంత దూరం వెళ్ళాక హా! సీత, హా! లక్ష్మణా అని రాముడి కంఠంతో అరువు. రాముడికి కష్టం వచ్చిందనుకొని సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. అప్పుడు నేను వెళ్ళి సీతని, రాహువు చంద్రుడిని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తాను. అందుకని నువ్వు బంగారు జింకగా మారిపో " అన్నాడు.


ఈ మాటలు విన్న మహాత్ముడైన మారీచుడు, దేవతలు కనురెప్ప వెయ్యకుండా ఎలా నిలుచుంటారో అలా నిలుచుండిపోయాడు. శవం నిలబడితే ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడు. తరువాత ఆయన అన్నాడు.....

సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః |
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ||

" రావణా! మన మనస్సుకి ఇష్టమయ్యేటట్టు మాట్లాడేవాళ్ళు చాలామంది దొరుకుతారు, కాని వాళ్ళు మనన్ని అభ్యున్నతి వైపుకి నడిపించేటట్టుగా మాట్లాడేవారు కాదు. కొంతమంది మాట్లాడితే అప్రియంగా మాట్లాడినట్టు ఉంటుంది, కాని ఆ మాటలలో అవతలివారి అభ్యున్నతిని గూర్చిన మాటలు ఉంటాయి. అలా మనకి మంచి చెప్పేవాడు దొరకడు, ఒకవేళ అలాంటివాడు దొరికినా వినేవాడు దొరకడు. నీకు ఎవరో గూఢచారులు చెబితే రాముడి గురించి విన్నావు. ఆ గూఢచారి పరమ దుర్మార్గుడు, నీ మీద కక్షకట్టి నీ ప్రాణములు తియ్యాలని చూస్తున్నాడు. అందుకని నీకు అన్నీ అసత్యములు చెప్పాడు. నువ్వు ఇప్పటిదాకా రాముడి గురించి చెప్పినవన్నీ అబద్ధాలు. రాముడు మహా ధర్మాత్ముడు, మహేంద్రుడికి, వరుణుడికి ఎటువంటి పరాక్రమము ఉంటుందో రాముడికి అలాంటి పరాక్రమము ఉంది. అందరూ వచ్చి రాజ్యం తీసుకో అని అడిగినా, తన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కొసమని రాముడు అరణ్యాలకి వచ్చాడు. నీ మాటలు వింటుంటే నాకు ఒక అనుమానము వస్తుంది, సీతమ్మ మానవ స్త్రీ కాదు, నిన్ను చంపడానికని, రాక్షస కులాన్ని నాశనం చెయ్యడానికని భూమిమీదకి వచ్చిన దేవతా స్త్రీ. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నువ్వు నశించిపోతావు, నీతోపాటుగా లంకా పట్టణం నశించిపోతుంది, రాక్షసులందరూ భూమిమీద పడి నశించిపోతారు. నీకు ఎవరో అబద్ధాలు చెప్పారు, ఆ మాటలు విని అన్నీ నీకు తెలుసనుకొని ఆ మాటలు ఇంకొకరికి చెబుతున్నావు. నువ్వు రాజువి, ఇంత చపలబుద్ధితో ఉండకూడదు.

రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః |
రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవః ||

ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి ఒకచోట పోసి, దానికి ప్రాణం పోస్తే, ఆయనే రాముడు. సత్యమే పరాక్రమముగా కలిగినవాడు. రాముడు ఈ లోకములన్నిటికి రాజు. అటువంటి రాముడి జోలికి వెళితే నువ్వు నాశనమయిపోతావు. నీకు తెలియక సీతమ్మని తీసుకొస్తాను అంటున్నావు, ఆమె బూది కప్పిన నిప్పు, తన తేజస్సుతో తనని రక్షించుకోగలదు. ఆమె కారణజన్మురాలు. రాముడి యొక్క కోదండం నీడలో రక్షింపబడుతున్న సీతమ్మని అపహరించి తేవడం నీ తరం కాదు రావణ! ఆవిడని అపహరించడానికి నీ శక్తి సరిపోదు.

జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం |
యత్ ఇచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామ విప్రియం ||

నీకు రాజ్యం ఉంది, నిన్ను కామించన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళతో నువ్వు హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే, రాముడి పట్ల అప్రియాన్ని మాత్రం చెయ్యకు. నీకు ఒక విషయం చెబుతాను గుర్తుపెట్టుకో, నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి, బంగారు కుండలాలు పెట్టుకొని, వర గర్వంతో మదించి ఉండేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడంతటివాడు యాగం చేస్తుంటే, నేను ఆ యాగాన్ని ధ్వంసం చేశాను. అప్పుడు విశ్వామిత్రుడు అయోధ్య నుంచి రాముడిని, లక్ష్మణుడిని తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ యాగం చుట్టూ తిరుగుతూ ఆ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగం చివరికి వచ్చాక ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యాలనుకొని నేను ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరుందో, అప్పుడు నాకంత పొగరుండేది.

అజాత వ్యంజనః శ్రీమాన్ బాలః శ్యామః శుభేక్షణః |
ఏక వస్త్ర ధరో ధన్వీ శిఖీ కనక మాలయా ||

నేను కిందకి చూసేసరికి, మెడలో ఒక బంగారు గొలుసు వేసుకుని, మీసాలు సరిగ్గా రాని, పద్మములవంటి కన్నులున్న, ఒక్క వస్త్రం కట్టుకుని, చేతిలో కోదండం పట్టుకొని, పిలక పెట్టుకొని ఉన్నవాడిని చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి ఈ పిల్లవాడినా తీసుకొచ్చింది, వీడా నన్ను చంపేవాడు అని, నువ్వు ఇప్పుడు ఎలా అనుకున్నావో నేను కూడా అప్పుడు అలానే అనుకున్నాను. బాలచంద్రుడివంటి ముఖంతో ఉన్న ఆ రాముడు నన్ను ఏమి చేస్తాడులే అని నేను ఆ యాగ గుండంలో రక్తాన్ని వర్షించాను. అప్పుడు రాముడు నన్ను ఒక బాణం పెట్టి కొడితే నేను 100 యోజనముల అవతల సముద్రంలో పడిపోయాను. కొంతకాలానికి నాకు తెలివి వచ్చింది. అప్పటినుంచి నాకు రాముడన్నా, రామబాణం అన్నా హడల్.


పాములున్న సరోవరంలోకి చేరిన చేపలు ఎలా నశించిపోతాయో, తాను ధర్మంగా బతుకుతున్నా, అధర్మాత్ముడితో స్నేహంపెట్టుకున్నవాడు కూడా అలానే నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉంది. అసలు నీకు పరుల భార్యలని తెచ్చుకోవాలనే కోరిక ఏమిటి? నీకు ఉన్నటువంటి వేల భార్యలతో సుఖంగా ఉండలేవా? ఇప్పటిదాకా బాగానే ఉన్న నీకు ఇటువంటి పాడు బుద్ధి ఎందుకు కలిగింది? రాముడి జోలికి వెళ్ళమాకు నాశనమయిపోతావు.

ఆనాడు రాముడి బాణపు దెబ్బ తిన్నాక కొంతకాలానికి నాకు మళ్ళి అహంకారం పుట్టుకొచ్చింది. రాముడు మళ్ళి కనబడడులే అని ఒక పెద్ద మృగ రూపం పొందాను. నాకున్న పాత స్నేహితులిద్దరితో కలిసి తాపసులని చంపి, వారిని భక్షిద్దామని మేము బయలుదేరాము. అలా కొన్ని ఆశ్రమాల మీద దాడి చేసి, అక్కడున్న తాపసులని భుజించాము. తరువాత మేము అలా తిరుగుతుండగా నాకు నారచీర కట్టుకుని, జటలు వేసుకుని, సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి కోదండం పట్టుకుని ఉన్న రాముడు కనిపించాడు. అయితే రాముడు మారిపోయాడు, ఇప్పుడాయన ఒక తాపసి కనుక నేను తినేయ్యచ్చు అనుకొని, నా స్నేహితులిద్దరిని ప్రోత్సహించి రాముడి మీదకి పంపాను. అప్పుడు రాముడు వాళ్ళిద్దరిని రెండు బాణములతో సంహరించాడు. నేను కనపడితే రాముడు నన్ను చంపెస్తాడని, ఆయనకి కనపడకుండా పారిపోయి వచ్చేసాను. అప్పటినుంచీ నాకు నిద్రలో రాముడు కోదండం పట్టుకొని కనపడుతున్నాడు, నేను ఉలిక్కిపడి లేచిపోతుంటాను. అందుకని ఇక చంపడాలు మానేసి, నారచీర కట్టుకుని, శాఖాహారం తింటూ, తపస్సు చేసుకుంటున్నాను.

అలా నేను ఏ కందమూలాలో తెచ్చుకుందామని బయటకి వస్తే, ప్రతి కొమ్మ మీద, కాయ మీద, గడ్డిపరక మీద, భూమి మీద, నీటి మీద, ప్రతీ చోట నన్ను చంపడానికి యముడు వచ్చినట్టు రాముడు కనపడుతుంటాడు. అందుకని నేను బయటకి కూడా వెళ్ళడం లేదు. నాకు ఇప్పుడు కన్ను మూసినా, తెరిచినా రాముడే కనపడుతున్నాడు. నాకు అంతా రామమయమై కనపడుతుంటే, నేను ఎవరిని బాధపెట్టను, ఎవరి జోలికి వెళ్ళను? రావణా! ఇవ్వాళ నా పరిస్థితి ఏంటో తెలుసా, నా దెగ్గరికి ఎవరన్నా వచ్చి రథము అని అందామనో, లేకపోతే రత్నము అని అందామనో, 'ర' అని పలుకగానే, వారు తరువాత 'మ' అంటారేమో అని నేను పారిపోతున్నాను. నీ తీట తీరక యుద్ధం చేస్తాను అంటె, యుద్ధం చేసుకో, నా మాటలు విని నీ కోరిక తీరిపోతే ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఈ రెండిటిలో ఏదో ఒకటి చెయ్యి, ఇందులోకి నన్ను మాత్రం లాగకు.


ప్రతీసారి మా చెల్లి ముక్కు చెవులు కోసేసాడు అంటున్నావు కదా, అసలు మీ చెల్లి ఏమి చేసిందని ఆవిడ ముక్కు చెవులు కోసేసారో అని మీరెవరన్నా అడిగార. ఇలా అడగకుండా వెళ్ళిన ఆ ఖరుడు మరణించాడు. నువ్వు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతున్నావు. నామాట విని ఇటువంటి పనులు చెయ్యకు " అని మారీచుడు అన్నాడు.


మారీచుడు చెప్పిన మంచి మాటలు తలకి ఎక్కకపోవటం వలన రావణుడు ఇలా అన్నాడు " అన్ని గొప్పలు చెబుతావేంటి రాముడి గురించి, రాముడు కేవలం ఒక మనిషి, నాదెగ్గర రాముడిని పొగడద్దు, నా నిర్ణయం మారదు. ఖరుడు వెళ్ళిన మార్గంలోనే రాముడిని కూడా పంపుతాను. నీ సహాయంతోనే సీతని ఎత్తుకొస్తాను. నేను నిన్ను సీతని అపహరించడం కోసమని జింక వేషం వెయ్యమన్నాను. అంతేకాని ఇందులో అపాయం ఉందా లేదా అని నేను నిన్ను అడగలేదు. ఇవన్నీ నిన్ను ఎవడు చెప్పమన్నాడు. నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. ప్రభువు నీ దెగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, అడిగిన ప్రశ్నకి అంజలి ఘటించి జవాబు చెప్పడం నీ బాధ్యత, ఇక అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. రాజు అగ్ని, ఇంద్రుడు, సోముడు, వరుణుడు, యముడు అనే 5 రూపాలలో ఉంటాడు. నువ్వు నా మాట వింటే, నేను నీ పట్ల సౌమ్యంగా ఉంటాను, కాదంటే నేను నీకు యముడిని అవుతాను. నేను చెప్పినట్టు నువ్వు వెంటనే బంగారు లేడిగా మారి బయలుదేరు. జింకగా వెళితే రాముడి చేతిలో చస్తావో లేదో అన్నది అనుమానమే, కాని వెళ్ళనంటే మాత్రం నేను నిన్ను చంపేస్తాను " అన్నాడు.

అప్పుడు మారీచుడు " రాజు తప్పు త్రోవలో నడుస్తుంటే, మంత్రులైన వారు చుట్టూ చేరి నిగ్రహించాలి, అలా నిగ్రహించని మంత్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రాజ్యపాలన నిర్వహిస్తున్నవాడిని పాశములతో పట్టే స్థితిలో మంత్రులు లేకపోతే, ఆ మంత్రులకి మరణశిక్ష విధించాలి. రాజె ధర్మం, రాజె జయం, రాజు వల్లనే లోకానికి రక్షణ. ఆ రాజు ధర్మం తప్పిననాడు లోకంలో రక్షణ ఉండదు, ఆ రాజుని ఆశ్రయించిన వారెవరూ బ్రతకరు.

స్వామినా ప్రతికూలేన ప్రజాః తీక్ష్ణేన రావణ |
రక్ష్యమాణా న వర్ధంతే మేషా గోమాయునా యథా ||


రాజన్నవాడు ప్రజల వెనకాల ఎలా ఉండాలంటే, కొడుకుల వెనక తండ్రిలా ఉండాలి. అలా ఉండనివాడు ఆవుల వెనకాల వచ్చిన నక్కలాంటి వాడు. అలాంటివాడి వలన ఆ ప్రజలకి భద్రత ఉండదు. నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్న ఆ రాజ్యంతో పాటు, ఆ రాక్షసులూ నశించిపోతారు. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నీ సైన్యం కూడా నశించిపోతుంది. రాముడు చూస్తుండగా సీతమ్మని తీసుకురాలేవని తెలిసి, రాముడు లేనప్పుడు సీతమ్మని అపహరించాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకు తెలుసు నువ్వు పిరికివాడివని, యుద్ధంలో నిలబడలేవని. నువ్వు నా ప్రభువువి కనుక, నా కొనప్రాణం వరకూ నువ్వు చెప్పిన పనిని చెయ్యడానికి ప్రయత్నిస్తాను, కాని సీతమ్మ కంటే ముందు నన్ను రాముడు చూస్తే, నా పని అయిపోయినట్టే. రాముడిని చూసి నేను ఒక్కడినే చనిపోతాను, ఆ తరువాత సీతమ్మని తెచ్చి, నువ్వు సకల బంధుపరివారంతో చనిపోతావు. ఎప్పుడైతే ఈ పని చేస్తాను అన్నానో, అప్పుడే నా ప్రాణాలు పోయాయి, ఇప్పుడు నీ ముందు ఉన్నది మారీచుడు అనే బొమ్మ, ఆ బొమ్మని నీకు నచ్చినట్టు వాడుకో. నీకు ఎంత చెప్పినా నువ్వు వినడంలేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను, పద " అని అన్నాడు.






.........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............










No comments:

Post a Comment