వృశ్చిక రాశి ఫలితములు
విశాఖ 4 వ పాదము (తొ)
అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)
జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)
ఆదాయం-8 వ్యయం-14 రాజయోగం -4 అవమానం-5
ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 5 నుండి సెప్టెంబర్ 14 వరకు మరియు నవంబరు 20 నుండి సంవత్సరాంతం వరకు కుంభంలో (చతుర్థం) సంచరించి మిగిలిన కాలము అంతయు మకరరాశి (తృతీయం)లో సంచరించును. శని సంవత్సరం అంతయు మకరంలో (తృతీయం) సంచరించును. రాహువు వృషభంలో (సప్తమం) కేతువు వృశ్చికంలో (జన్మం) సంచరించెదరు. ఈ సంవత్సరం అధిక కాలము శని కుజ గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. చికాకులు పోగొట్టుకుంటారు. ఎక్కువ అవకాశములు వస్తాయి. అయితే మీకు ఒక రకమైన భయము నిరుత్సాహం వెంబడించి పనులు ప్రారంభించకుండా ఆగిపోతారు. నష్టములు వచ్చే అవకాశములు లేని పనులు కూడా మీరు పొరపాటుగా వదిలివేయు అవకాశం ఉంటుంది. సప్తమ రాహువు, మిమ్మల్ని ఆలోచనలు సరిగా చేసుకునే అవకాశం కూడా యివ్వకుండా తొందరపాటుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది.
నిర్ణయాలు తీసుకోవడానికి సమస్య మీద అవగాహన పూర్తిగా లేకుండా చేయడం లేదా కాలము లేకుండా చేయడం లేదా భయముతో నిర్ణయం తీసుకోవడం వంటివి చేసి చికాకులు అధికం చేస్తారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉంటారు. శని కుజ సంచారం అనుకూలం దృష్ట్యా ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తే కచ్చితంగా కార్య విజయమే లభిస్తుంది. ఈ రాశివారు ఎవరైతే ఓర్పుగా వ్యవహరిస్తారో వారికి లాభాలు తప్పవు. ఎవరు ఓర్పు తక్కువగా ఉంటారో వారికి చికాకులు తప్పవు.
ఉద్యోగం విషయంలో దూకుడు పనికిరాదు. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది. గుర్తింపులేని జీవితం గడుపుతారు. గురువు కుంభంలో వుండగా బుద్ది చాంచల్యం ఎక్కువ అవుతుంది. వ్యాపారుల విషయంలో సానుకూల ఫలితాలు తక్కువ అయితే నష్టాలు పెద్దగా ఉండవు. ప్రధానంగా లేబర్ మీకు కుటుంబ, ఉద్యోగ వ్యాపార విషయాలలో బాగా అనుకూలిస్తారు. యిక ఆదాయం చాలా బాగా సిద్ధిస్తుంది. కానీ ఖర్చులని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సందర్భానుసారంగా ప్రవర్తింపవలెను అనే ఆలోచనలు వున్ననూ అమలు చేయు విషయంలో అనుకూల స్థితి ఉండదు. కొన్ని సందర్భాలలో ప్రాకృత ధర్మానికి సంబంధించిన పనులు ఆపివేసి విజ్ఞాన వినోద కార్యముల మీద ఆసక్తులై వెడతారు.
దైవ సంబంధమైన కార్యములు చేయువారికి కొంత ఉపశమనం లభిస్తుంది. లేని ఎడల భవిష్యత్ శూన్యంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు కచ్చితంగా సానుకూలమే అవుతాయి. అయితే చేయు ప్రయత్నాలలో మీరు అవగాహనా లోపాలతో సంచరించడం లేదా నమ్మకూడని వారిని ఆశ్రయించడం ద్వారా కొంత సమస్యలు పొందే అవకాశం కచ్చితంగా ఉన్నది. కన్స్ట్రక్షన్ రంగంలోను రియల్ ఎస్టేట్ రంగంలో వున్నవారికి చాలా విచిత్ర స్థితి ఉంటుంది. వీరికి ఆర్థిక వెసులుబాటు వున్ననూ అసంతృప్తి బాగా వెంబడిస్తుంది. ఫైనాన్స్ వ్యాపారులు తెలివిగా మంచి లాభాలు అందుకుంటారు. షేర్ వ్యాపారులు మరియు సరుకులు నిల్వచేసి వ్యాపారం చేయు వారికి సామాజిక స్పృహ అధికంగా వుండి. దూకుడుతనం తగ్గించి ముందుకు వెడితే శుభపరిణామాలు ఉంటాయి.
శుభకార్య ప్రయత్నాలు మరియు పుణ్యక్షేత్ర సందర్శన పుణ్యకార్య విషయాల యందు అన్ని కోణాలలోను సానుకూల వాతావరణమే ఉంటుంది. తరచు గోదాన ధర్మాలు చేయు విషయమై మనసు లగ్నం అవుతుంది. విద్యార్థులకు రాహువు ప్రభావం అనుకూలం లేదు కావున విద్యా వ్యాసంగం సరిగా ఉండదనే చెప్పాలి. రైతులు పురుగుమందులు, ఎరువులు, పంటలు నిర్ణయాలలో అధిక జాగ్రత్తలు పాటించాలి. కోర్టు వ్యవహారములలో వున్నవారికి రాహు కేతువుల ప్రభావం సరిగా లేకపోవడం చేత మీరు ఎవరినీ నమ్మలేని స్థితి ఏర్పడి కార్య నష్టాలకు దారితీయును. జాగ్రత్త పడండి.
స్థానచలన ప్రయత్నాలలో వున్నవారికి గురు శని సంచారం ప్రభావంగా మంచి ఫలితాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి అంతా విచిత్రమైన స్థితి. ధనంచేకూరితే వస్తువు చేకూరదు. వస్తువు చేకూరితే ధనం చేకూరదు. మధ్యవర్తులతో జాగ్రత్త వహించండి. ప్రమోషన్ ప్రయత్నాలు సరిగా సాగవు. జాగ్రత్తగా వ్యవహరిస్తే అంతా శుభప్రదంగా లాభదాయంగా మార్చుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మీరు స్వయంగా చేసుకుంటే అనుకూలం. యితరుల యందు ఆధారం అనవసరం. నూతన వ్యాపార ప్రయత్నాలు వేగంగా సాగవు. అనవసర ఖర్చులు మోసపూరిత వాతావరణం ఉంటాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా అనుకూల స్థితి ఉంటుంది.
పిల్లల అభివృద్ది వార్తలు బాగా వింటారు. విచిత్రం ఏమిటంటే కుటుంబ విషయంలో సమస్యలు రావడం సరిచేసుకోవడం వంటివి మీ స్వబుద్దితో సరిచేసుకుంటారు. బంధుమిత్రుల ప్రమేయం ద్వారా మీకు చికాకులు వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం కుటుంబ సభ్యులు అందరూ కలిసి తరచుగా విజ్ఞాన వినోద కార్యక్రమముల యందు పాల్గొంటారు.
ఋణ విషయంలో పాత ఋణములు వున్నవారికి యిబ్బందికరమైన ఘటనలు ఏమీ వుండవు. కొత్తవి అవసరానికి తగిన రీతిగా అందుతాయి. ఋణములు ప్రతికూలం కాదు అనే చెప్పాలి. ఆరోగ్య విషయంలో తరచుగా కాళ్ళు చేతులు వేళ్ళు గోళ్ళు నరములు ఇన్ ఫెక్షనకు గురి అవుతాయి. అయితే ఈ సంవత్సరంలో అంతా ముందు జాగ్రత్త చర్యలు అధికంగా తీసుకొని సుఖజీవనమునకు దగ్గర అవుతారు. ఈ సంవత్సరం అన్ని రంగాలలోను కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా వుండడం అంత శ్రేయస్కరం కాదు. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ చేసి టార్గెట్ లు పూర్తి చేస్తారు కానీ ఫలితాలు అనుకూలంగా అందుకోలేరు. గుర్తింపులేని వృత్తి విషయాలను నడపవలసిన పరిస్థితి. మొత్తం మీద శ్రమ మిగులుతుంది.
స్త్రీలకు ఈ సంవత్సరం ఉద్యోగ విషయాలలో శ్రమ ఎక్కువ అవుతుంది కానీ లాభాలు అందుకుంటారు. అదేరీతిగా వ్యాపార విషయాలలో కూడా శుభ ఫలితాలు అందుకుంటారు. అయితే కుటుంబ విషయంలో మంచి ఫలితాలకు కుటుంబ సభ్యుల సహకారమునకు అవకాశం తక్కువ. గర్భిణీ స్త్రీలు రాహు కేతు అనుకూలం లేదు కావున బహుజాగ్రత్తలు తీసుకోవలసిన కాలము.
విశాఖ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా తరచుగా పనులు మానివేసి షికార్లు చేయడం యిష్టం. అయితే పనిచేయడం లేకపోతే మానివేయడం వంటి తరహాలో జీవనం చేస్తుంటారు. విజ్ఞాన వినోద కార్యముల మీద దృష్టి బాగా పెరుగుతుంది.
అనురాధ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా వాహనములు ద్వారా చాలా చికాకులు ఎదురౌతాయి. ఉద్యోగ విధి నిర్వహణ సక్రమంగా చేయవలెను అనే మీ కోరికకు బలమైన అవరోధములు వస్తాయి. తోటి ఉద్యోగుల సహకారం సరిగా అందదు.
జ్యేష్ట నక్షత్రం వారికి విశేషములు ఏమనగా భార్య తరఫు బంధువుల ద్వారా కలహప్రాప్తి. కుటుంబ విషయాలు సరిగా ఆశించిన రీతిగా వుండవు. ఉద్యోగం వ్యాపారం విషయాలలో మీకు చాలా చికాకులు వస్తాయి. తెలివిగా సరిచేసుకుంటారు.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
శ్రీమన్నృసింహ విభవే గరుడ ధ్వజాయ - తాపత్రయో పశమనాయ భవౌషధాయ - తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ - క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే. ఈ శ్లోక పారాయణ చేయుట ద్వారా సమస్యలను దూరం చేసుకోగలుగుతారు.
శాంతి : దోషము చేయు గ్రహములు గురు రాహు కేతు నిమిత్తంగా జూన్ మాసములో జపదాన హోమ శాంతి మీరు దగ్గర వుండి చేయించుకోండి. సప్తముఖి రుద్రాక్ష ధారణ అధికంగా మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది. రోజూ సంకట నాశన గణపతి స్తోత్రం దుర్గా సప్తశ్లోకీ పారాయణ చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం పఠనం చేయండి.
ఏప్రిల్ : వేగవంతమైన నిర్ణయాలు కూడదు. ఎవరి విషయాలలోనూ ఎక్కువగా కలుగచేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం శుభప్రదం. అన్ని పనులు ప్రశాంతత చిత్తంతో చేసుకోవలసిన కాలం. ప్రధానంగా మీకు సంబంధం లేని ఏ వ్యవహారం జోలికి వెళ్ళవద్దని ప్రత్యేకమైన సూచన. ఆర్థిక కార్యకలాపాలను స్వయంగా చూసుకోవలసిన అవసరం ఉంది. కావలసిన ఋణాలు సకాలంలో అందక ఇబ్బందులకు గురవుతారు. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి.
మే : ఎవరిని నమ్మి, ఎవరి మీదయినా ఆధారపడి ఏ కార్యమునకు శ్రీకారం చుట్టవద్దు. మీ ప్రతిపనీ మీరే స్వయంగా చేసుకోవడం చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగానే పూర్తవుతాయి. అన్ని వ్యవహారాలలోనూ మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. స్వయంగా చూసుకొనే వృత్తి విషయాలలో ఎటువంటి సమస్యలు రావు. ప్రధానంగా పార్టనర్ షిప్ వ్యాపారాలలో విభేదాలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. తరచుగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం, వాటిని సరిచేసుకోవడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనే కోరిక ఉంటుంది.
జూన్ : ఆర్థిక వెసులుబాటు తక్కువ. ఖర్చులు ఎక్కువ. అనవసర విషయంలో ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో మనస్పర్థలు పెరుగుతాయి. ఋణ సదుపాయం చేకూర్చేటటువంటి మీ సన్నిహితులతో ఈ నెలలో ఇబ్బందులు అవమానాలు పెరిగే అవకాశం ఉంటుంది. అనవసర ప్రయాణాలు విరమించుకోండి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీ యొక్క ప్రతి అంశాన్ని మీరే స్వయంగా చూసుకోవడం వలన చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎవరికీ ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. రోజువారీ కార్యక్రమాలు కాకుండా కొత్త కార్యక్రమాల జోలికి వెళ్ళవద్దు.
జూలై: మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. రోజూ ఉద్యోగ వ్యాపార విషయాలలో చికాకులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలమే. ఆరోగ్య విషయంలో ఏదో సమస్య ఉందనే భావన తరచుగా వెంబడిస్తుంది. అయితే ప్రమాదకరమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు. అనవసరమైనటువంటి ఆందోళనతో కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలలో మాత్రం మీకు అందరూ సహకారం చేస్తున్నా మీరు ఎవరినీ నమ్మలేని స్థితిలో సంచారం చేస్తారు.
ఆగష్టు: పుణ్యక్షేత్ర సందర్శనము చేస్తారు. ధనవిషయం, వృత్తి విషయం కుటుంబ విషయం బహు అనుకూలంగా ఉంటుంది. అలంకరణ వస్తువులు కొనుగోలు జరుగుతుంది. అలాగే ఋణ సంబంధమైన వ్యవహారాలను సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ప్రతి అంశంలోనూ సత్ఫలితాలు తీసుకుంటారు. పూజ్యులను, గురువులను కలిసి భవిష్యత్తు ప్రణాళిక గురించి ఎక్కువగా చర్చలు చేసే అవకాశం ఉంటుంది. అదేరీతిగా మీ యొక్క శ్రేయోభిలాషులు మీకు సంబంధించిన శుభ కార్యక్రమాలలో బాగా సహకరిస్తారు. మీ వలన కూడా ఇతరులు బాగా సహకారం అందుకొనే అవకాశం ఉంటుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
సెప్టెంబర్ : మీ ప్రయత్నాలు అన్నీ అధిక ఆర్థిక వ్యయమును సూచిస్తున్నాయి. రోజూ పుణ్యకార్య భంగం ఏర్పడుతూ ఉంటుంది. మితభాషణ అవసరం. ఋణములు ఇచ్చిన వారి దగ్గర నుండి అవమానములు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ దగ్గర ఋణములు తీసుకునే వారు తీర్చే ప్రయత్నములో మీకే సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త కొత్త ప్రయోగాలు ఏమీ చేయకుండా, రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ కొనసాగడం మంచిది. అనుకోని సమస్యలు నిత్యకృత్యంలో తరచుగా వచ్చే అవకాశం ఉంటుంది.
అక్టోబర్ : ఎవరినీ నమ్మి ఏ విధమైన కార్యక్రమము చేయవద్దు. మీ బంధు, మిత్ర వర్గములతో మితభాషణ చేయండి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ, వ్యాపార విషయాలలో అధికారుల ద్వారా ప్రారంభంలో ఒత్తిడి పెరిగినా, క్రమంగా వారే సహకరించడం వలన ఈ నెలలో వృత్తి సౌఖ్యం బాగానే ఉంటుందని చెప్పాలి. వాహనాలు తరచుగా ఖర్చును పెంచుతాయి. మీ యొక్క ఆర్థిక వెసులుబాటు ఋణ సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా ఉండవనే చెప్పాలి. కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి పెరుగుతుంది.
నవంబర్ : చికాకులు లేకుండా ఒక రోజు కూడా ఉండదు కానీ పనులు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెడతారు. అభివృద్ది కాలమే. మొండిధైర్యంతో అన్ని పనులు సాధించాలనే కాంక్షతో ప్రయాణం సాగుతుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు సానుకూల స్థితిని సూచిస్తున్నాయి. అయితే మీరు ప్రతిపనిలోనూ ప్రత్యేకమైన శ్రద్ధను వహిస్తే సమస్యలు దూరమై, సానుకూల స్థితి ఏర్పడుతుంది. లేనియెడల సమస్యలు మాత్రమే మీతో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
డిసెంబర్ : స్థాన చలన ప్రయత్నములు అనుకూలము. కొన్ని కార్యములు విఘ్నములతోను మరికొన్ని సానుకూలముగాను నడుచును. ఎవరి వ్యవహారముల జోలికి వెళ్ళవద్దు. ఉద్యోగ విషయంలో ప్రతిపనిని స్వయంగా చేసుకోండి. అలాగే గత సమస్యలను పరిష్కరించుకోవడం కోసం చేసే ప్రయత్నాలలో చాలా ఓర్పుగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవనే చెప్పాలి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచవలసిన అవసరం బాగా ఉంటుంది.
జనవరి : మీ పనులు గోప్యంగా వుంచవలసిన కాలము. కుటుంబ పరంగా అనుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారములలో అధికారుల ద్వారా సహకారం బాగుంటాయి. దైనందిన కార్యక్రమాలు చక్కగా నడుస్తాయి. తద్వారా వృత్తి విషయాలు, ఇతర విషయాలు సమయపాలనతో కూడుకొని పూర్తి చేసుకొనే అవకాశం ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాలను, అనవసర ప్రయాణాలను విరమించుకోవడం మంచిది. మీ ప్రతి పనిని కూడా మీరే స్వయంగా సమీక్షించుకోవడం అవసరం.
ఫిబ్రవరి : ప్రయాణాలు అధిక శ్రమను ఖర్చును యిస్తాయి. అంతే కాకుండా రోజు వారి కార్యక్రమాలు కూడా యిబ్బందికరంగా నడుచును. మొండిధైర్యంతో ముందుకు వెడతారు. ఉద్యోగ రీత్యా తిరుగుడు ఎక్కువ అవుతుంది. టార్గెట్ తో కూడుకొని చేయవలసినటు వంటి ఉద్యోగ వ్యాపార విషయాలలో ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఎదురవడం, వాటిని ఓర్పుతో సరిచేసుకోవడం జరుగుతుంది.
మార్చి : పని ఒత్తిడి అధికం అవుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు శ్రమ యుక్తమనే చెప్పాలి. అయితే నష్టములు వచ్చే అవకాశం లేదని గ్రహించండి. ఆర్థిక కార్యకలాపాలు సరిగా జరిగే అవకాశం ఉండదు. అనుకోని ఖర్చులు తరచుగా వెంబడిస్తాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, ఋణ వ్యవహారాలు అన్నీ కూడా ఇబ్బందికరంగా సాగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైన శ్రద్ధతో జీవనం సాగించాలి.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment