కుంభ రాశి ఫలితములు
ధనిష్ఠ 3,4 పాదములు (గూ, గే)
శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)
పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సో, దా)
ఆదాయం-14 వ్యయం-14 రాజయోగం-6 అవమానం-1
ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 5 నుండి సెప్టెంబరు 14 వరకు మరియు నవంబరు 20 నుండి సంవత్సరాంతం వరకు కుంభంలో (జన్మం) సంచరించి మిగిలిన కాలము అంతయు మకరరాశి (వ్యయం)లో సంచరించును. శని సంవత్సరం అంతయు మకరంలో (వ్యయం) సంచరించును. రాహువు వృషభంలో (చతుర్థం), కేతువు వృశ్చికంలో (దశమం) సంచరించెదరు. ఈ సంవత్సరం అధికకాలము కేతువు, బుధుడు గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును. ఏలినాటి శని చాలా విచిత్రాలు ఎదురౌతాయి.
మీ యొక్క జీవనశైలి నియమబద్ధమైన ప్రమాణాలతో నడుపుటకు అలవాటు పడండి. ప్రాకృత ధర్మాన్ని విడిచి యితర వ్యవహారములు మరియు యితరుల వ్యవహారములలో జోక్యం చేసుకోవద్దని మనవి. ఈ రాశివారు గోచారం తెలుసుకొని భయపడడం కంటే మంచి ప్రణాళికా బద్ధంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తే మంచిది. మాసవారీగా మారే రవి, శుక్ర, బుధ కుజులు అనుకూల ప్రభావం మీకు మంచి జీవనాన్ని యిస్తుంది. సహజంగా ఎప్పుడు గోచారంలో గురు రాహు శని వలన ఫలితాలు చెబుతూ ఉంటారు కదా! ఆ కోణంలో యిబ్బందికరమైన ఫలితాలే చెప్పాలి కానీ బుధ శుక్ర రవి కుజ అనుకూలం ఉన్నది జూలై నుండి అక్టోబరు వరకు కుజసంచారం కూడా సరిలేదు. అలాగే సంవత్సరం చివరి రోజులలో కూడా కుజసంచారం బాగా లేదు.
సహజంగా మకర కుంభరాశులలో సంచారం చేయు శని మకర కుంభరాశుల వారిని యిబ్బంది పెట్టరు అని నానుడి. అందువలన కొంత ప్రశాంతం. గౌరవ మర్యాదలకు యిబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించండి. ఎవరి మీదా ఆధారపడి ఏ పనీ చేయకండి. ఉద్యోగ విషయంలో అందరితో కలహములు పెరుగుతాయి. సకాలంలో విధి నిర్వహణ చేయలేక ఉద్యోగ భంగం పొందినా ఆశ్చర్యం లేదనే చెప్పాలి. అధికారుల నుండి ఒత్తిడి అధికంగా ఉంటుంది. లేబర్ ప్రాబ్లమ్ ఉద్యోగం వ్యాపారం విషయాలలో అధికం అనే చెప్పాలి. వ్యాపారులకు కూడా సంతృప్తికరంగా వ్యాపారం లేకపోగా ఆర్థిక లావాదేవీలు వ్యాపారాన్ని యిబ్బంది పెడతాయి.
ఈ సంవత్సరం ఆదాయం తక్కువ ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రతిపనిలోను విశేషమైన ఖర్చులు ఉంటాయి. ప్రమాణ విఘ్నములు ఎక్కువ సమాజంలో బంధువులలో తోటి స్నేహతులలో మిమ్మల్ని అర్థం చేసుకునే వారు తక్కువ. పరిస్థితి సమీక్షించుకుని సంచారం చేయు లక్షణాలు మీకు తక్కువ. నిబద్దత లేని జీవనశైలి బాగా అనుసరిస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్న వారికి చికాకులు చాలా ఎదురౌతాయి. అవకాశం ఉన్నంతవరకు విరమించుకోవడం మంచిది. అన్ని కోణాలలోను చికాకులు గోచరిస్తున్నాయి. అవకాశం ఉంటే వెడితే వెళ్ళిన చోట యిబ్బంది పడే అవకాశములే ఎక్కువ.
కుంభంలో గురువు వున్న కాలములో కొంతవరకు అనుకూలము వున్నది. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగాలలో వ్యాపారం చేయువారు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా ఉంటే మంచిది. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీ ఖాతాలు బాగా పెరుగుతాయి. షేర్ వ్యాపారులు మరియు సరుకు నిల్వచేసి వ్యాపారం చేయువారి విషయాలు బహుజాగ్రత్తలు అవసరం అని సూచన. యితరులను చూచి పోలిక చేసికొని వ్యాపారం చేయవద్దు. అవకాశం ఉంటే విరమించడం మంచిది. కొన్నిసార్లు లాభం వచ్చినా అది తరువాత చేయు లావాదేవీలలో యిబ్బంది సృష్టిస్తుంది. శుభకార్య పుణ్యకార్య ప్రయత్నాలు యిబ్బందికరంగా సాగుతాయి.
విద్యార్థులు బహుశ్రద్ధ ప్రదర్శించవలసిన కాలము. ఏలినాటి శని మిమ్మల్ని దారి తప్పిస్తుంది. అంతేకాక విద్యావ్యాసంగం దారి తప్పుతుంది. రైతులకు అన్ని కోణాలలోను సహకారం లభింపక యిబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారములలో వున్నవారికి ఏ పనీ పూర్తి అవ్వద్దు. మీరు ఎవరి వలననూ సరియగు సహకారం సూచనలు పొందలేరు. కార్యనాశనమునకు యిబ్బందులకు అవకాశం ఉన్నది. స్థానచలన ప్రయత్నాలలో వున్నవారికి పనులు ఆలస్యం ధనవ్యయం సూచిస్తున్నాయి. శ్రమతో కార్యలాభం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి చికాకులు అధికం అవుతాయి. అసలు కొన్ని సందర్భాలలో ఆలోచనలు విరమించే పనిచేస్తారు. అదికూడా మంచిదే.
ప్రమోషన్ ప్రయత్నాలు అనవసరం. ప్రమోషన్ వచ్చినా పని ఒత్తిడి పెరుగుతుంది. లేదా స్థానచలనం కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సరిగా సాగవు. చాలా విచిత్ర సమస్యలు ఈ విషయంలో ఎదుర్కొంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలు చేయక తప్పదు - అవసరం అనుకున్న వారు మాత్రమే చేయండి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా అనుకూల స్థితి తక్కువ. ఎంత శ్రమ చేసినా ఫలితాలు వృథా అవుతుంటాయి. పిల్లల యొక్క అభివృద్ధి ఆశించిన రీతిగా ఉండకపోవడం ద్వారా తీవ్ర మనస్తాపమునకు గురి అవుతారు.
భార్యాపిల్లలు తరచుగా ప్రయాణాలు లేదా వాహనాల వలన ఖర్చులు సమస్యలు పెంచుతూ ఉంటారు. యిది చికాకు ఎక్కువ. యితరుల ప్రమేయము మీ కుటుంబ విషయాలలో తగ్గినకొద్దీ శుభ పరిణామాలు పెరుగుతాయి. శని ప్రభావంగా ఋణ విషయంలో పాత ఋణములు వున్నవారికి ఋణములు అవమానం చేస్తాయి. కొత్త ఋణములు అవసరానికి తగిన రీతిగా అందవు. బహు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. అవకాశం ఉంటే ఋణం చేయకండి.
ఆరోగ్య విషయంలో ముందుగా గుర్తింపలేక యిబ్బందులు పెంచుకునే అంశాలు ఉంటాయి. వాతము, హృదయము, జీర్ణవ్యవస్థ యిబ్బందులు ఉన్నవారు యిబ్బందులు ఎక్కువ పొందుతారు. జాగ్రత్తలు అవసరం. స్వంతగా చేయు నిర్ణయాలు మీకు ఈ సంవత్సరం శ్రీరామరక్ష అని చెప్పాలి. యితరులకు జ్వరబాధలుంటాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్ లు సరిగా పూర్తి అవ్వవు. తరచుగా పని ఒత్తిడి పెరుగుతుంది. ఆశించిన రీతిగా ఫలితాలు అందవు. నిరుత్సాహపడకుండా ఓర్పుగా ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఎక్కువగా ఉన్నది.
స్త్రీలకు ఈ సంవత్సరం ప్రతిపనీ మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రత్యేకంగా మరొక సూచన ఏమంటే ఉద్యోగ విషయంలో బహుశ్రద్ధ ప్రదర్శించడం. కుటుంబ వృత్తి విషయాలు సమతూకంగా నిర్వహించలేరు. యిబ్బందికర ఘటనలు ఎక్కువ. పుణ్యకార్యములు శుభకార్యములు చేస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు ఈ సంవత్సరం బహు జాగ్రత్తలు పాటించాలి. వైద్య సలమాలు తూ.చ. తప్పక పాటించండి.
ధనిష్ఠ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా కుటుంబ సౌఖ్యం తక్కువ. రాజదర్శనం చాలా ఎక్కువసార్లు చేయు అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల యందు బాగా లాభదాయకము. ఈ నక్షత్రం వారు విద్యావ్యాసంగంలో బాగా సక్సెస్ అవుతారు.
శతభిషా నక్షత్రం వారికి విశేషములు ఏమనగా నరములకు సంబంధించిన యిబ్బందులు పెరుగుతాయి. ఓర్పు సహనం చాలా అవసరం. ప్రతి పని అనుకున్న సమయం కంటే ఎక్కువ ఆలస్యం అవుతుంది. చతుష్పాద జంతువుల వలన లేదా వాహనాల వలన యిబ్బంది ఉంటుంది.
పూర్వాభాద్ర నక్షత్రం వారికి విశేషములు ఏమనగా రక్తసంబంధ మైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారములో కలుగచేసుకోవద్దు. మీకు అవమానకర ఘటనలు ఎక్కువగా ఎదురౌతాయి. ఆర్థిక లావాదేవీలు యిబ్బందికరము.
నిత్యం పఠింపవలసిన స్తోత్రం : వందేవానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్రాంచితం - నానాలంకరణం త్రిపచనయనం దేదీప్య మానం రుచా - హస్తాబ్జెరసిఖేట పుస్తుకసుధా కుంభాంకుశాద్రీన్ హలం - ఖట్వాగం ఫణి భూరుహంచ దథతం దేవారి గర్వాపహం - ఈ శ్లోక పఠనం మీకు భవిష్యత్ మీద ఆశను కలిగిస్తుంది.
శాంతి : దోషము చేయు గ్రహములు గురు శని నిమిత్తంగా ఏప్రిల్ / అక్టోబర్ మాసములో జపదాన హోమశాంతి మీరు దగ్గర వుండి చేయించుకోండి. త్రిముఖ రుద్రాక్షధారణ అధికంగా మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది. సుందరకాండ పారాయణ చేయండి. రావిచెట్టు క్రింద ఉన్న ఆంజనేయస్వామి వారి దేవాలయం గోచరిస్తే రోజూ 11 ప్రదక్షిణలు చేయండి.
ఏప్రిల్ : కొత్త ప్రయత్నాలు చేయవద్దు. శుభ పరిణామాలు చేయి జారిపోవు స్థితి ఉంటుంది. అందరి నుండి ప్రోత్సాహం తక్కువ. కుటుంబ సౌఖ్యం తక్కువ. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో, పిల్లల అభివృద్ధి విషయంలో మీకు అనుకున్న రీతిగా వ్యవహారములు లేకపోవడం, చేస్తున్న ప్రతి పనిలోనూ ఆటంకం రావడం, గృహోపకరణాలు తరచుగా రిపేరుకు రావడం వలన ప్రాకృత ధర్మానికి సంబంధించిన పనులు ఆలస్యం అవ్వడం, ఇతర వ్యవహారాలతో కాలక్షేపం అవ్వడం తద్వారా చికాకులకు గురవుతారు.
మే : బంధువుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. రోజు శుభకార్య పుణ్యకార్య విషయాలకై చర్చలు చేయడం ప్రశాంతంగా జీవనం చేయడం జరుగుతుంది. ఉద్యోగ విషయంలో అన్ని కోణాలలోనూ సత్ఫలితాలు అందుతాయి. అధికారుల నుండి సానుకూలంగా ప్రతిస్పందన లభిస్తుంది. తోటివారు బాగా సహకరించడం వలన సామాజికంగానూ, వృత్తిపరంగానూ ఆనందంగా కాలక్షేపం చేస్తారు. పుణ్యకార్యాలు, శుభకార్యాలు వాటికి సంబంధించినటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి.
జూన్ : అంతా బాగుంటుంది అయినా అనవసర భయాందోళనలకు గురి అవుతారు. అందరితోనూ మితభాషణ చేయండి. ఉద్యోగం అనుకూలం. ఆరోగ్య విషయంగా ఇబ్బంది వస్తుందేమో అనేటటువంటి భయము కొన్ని కోణాలలో మిమ్మల్ని వెంటాడుతుంటుంది. కొన్ని సందర్భాలలో ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళతారు. అన్ని విషయాలు నెలాఖరులో మంచి ఫలితాలతోనే పూర్తవుతాయి. ప్రధానంగా ఆర్థిక సమస్యలు ఈ మాసాంతంలో సానుకూలంగా పూర్తవుతాయి.
జూలై : కొన్ని సందర్భాలలో ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు. కొన్ని సందర్భాలయందు కుటుంబ చికాకులు మిమ్మల్ని యిబ్బంది పెడతాయి. ఉద్యోగం, వ్యాపార విషయంలో పరిపూర్ణంగా సంతృప్తికరంగా దృష్టిని కేంద్రీకరించలేక పనులు సరిగా చేయలేక కొన్ని ఇబ్బందులు మీ నడవడి వలననే ఏర్పడుతాయి. అయితే మీ యొక్క ఆర్థిక కార్యకలాపాలు అనుకూలంగా నడవడం మూలంగా కొన్ని కొన్ని పనులు సమస్యల నుండి బయట పడేలాగా చేయగలుగుతారు.
ఆగష్టు : విచిత్రమైన స్థితి నెలకొని ఉంటుంది. కొన్ని పనులు వేగంగా పూర్తి అవుతాయి. కొన్ని పనులు సమస్యగా నడుచును. పుణ్యకార్యాసక్తత పెరుగును. ఉద్యోగ విషయంలో సంతృప్తికరంగా ఫలితాలు ఉండవు. ఆరోగ్యం బాగా ప్రతిబంధకంగా ఉంది అనేటటువంటి భావన తరచుగా వెంబడిస్తుంది. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార అంశాలను సమన్యాయంతో ఈ నెలరోజులు నడపలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఆదాయం, ఖర్చు కొత్తగా కావలసిన ఋణములు కూడా సమన్యాయంతో నడిపే అవకాశం ఉండదు. మాటతీరు బాగా జాగ్రత్త పరచుకోవాలి.
సెప్టెంబర్ : ఆర్థిక, ఆరోగ్య విషయాలు చిన్న చిన్న చికాకులు చూపుతాయి. ఎవరి విషయంలోను కలుగ చేసుకోకండి. కలహాలకు దూరంగా ఉండండి. తరచుగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వృత్తి పరమైన కలహములు వెంటాడుతుంటాయి. మీ పనులు ఎంత ఓర్పుగా ప్రయత్నం చేసినా సానుకూల స్థితిని చూపలేని పరిస్థితి అలాగే కుటుంబంలో అనుకూల స్థితి లేకపోవడం తరచుగా కలహములు రావడం ఇబ్బందిని కలుగచేస్తుంటాయి.
అక్టోబర్ : మంచికాలము అనే చెప్పాలి. అయితే వృత్తి విషయంగా ఒత్తిడి ఉంటుంది. సమస్య పరిష్కారములు వెంటనే లభిస్తుంటాయి. గత సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాలు వెతకడంలో ప్రతి కోణంలో కృతకృత్యులవుతారు. ఉద్యోగంలో అధికారుల ద్వారా ఒత్తిడి, వ్యాపారంలో వర్కర్స్ ద్వారా ఇబ్బంది ఉన్నప్పటికీ తెలివిగా వాటిని దాటవేసి సమస్యలనుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలు సానుకూలం చేసుకోవడం కోసం కుటుంబ సభ్యులతో సహవాస ధోరణితో మెలగవలసిన అవసరం ఉంటుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరిగే కాలము.
నవంబర్ : పని ఒత్తిడి పెరుగుతుంది. ఎవరి వ్యవహారములను కలుగచేసుకోవద్దు. మితభాషణ మీకు శ్రీరామరక్షగా భావించండి. మీ పనులు మీరు చేసుకుంటూ వెళుతున్న కాలం సమస్యలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఇతరుల ప్రమేయం మీ వ్యవహారములలో ఉన్ననూ మీ ప్రమేయం ఇతరుల వ్యవహారములో ఉన్ననూ సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా లేకపోయిననూ మీరు ప్రశాంతం గానే జీవనం చేస్తారు.
డిసెంబర్ : అంతా శుభ పరిణామములు ఉంటాయి. దైనందిన కార్యములు లాభదాయకంగా ఉంటాయి. పుణ్యకార్యములు, శుభకార్యములు చక్కగా జరుపుకుంటారు. తరచుగా గురువులను, పూజ్యులను దర్శించుకోవడం, విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. పనిముట్లు వాడకంలో, వాహనాల వాడకంలో చికాకులు ఉంటాయి. ఆర్థికంగా బలపడకపోయినప్పటికీ ఖర్చులను సమర్థంగా తట్టుకొనే విధంగా ఆదాయం ఉంటుంది.
జనవరి : సమస్యలు వస్తుంటాయి. తెలివిగా దాటవేస్తారు. మీ ఓర్పు మీకు శ్రీరామరక్ష. కుజ శుక్ర అనుకూలం చేత వృత్తి సౌఖ్యం ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో వచ్చే సమస్యలకు మీ అధికారులే మీకు రక్షణ చేస్తారు. అలాగే వ్యాపారం సంతృప్తికరంగా లేకపోయినా నష్టాలు లేకుండా నడుస్తుంది. ఈ నెలలో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ఫలితాలు ఎలా ఉన్నా ప్రశాంతంగా జీవించడానికి అలవాటు పడతారు. ఋణ సంబంధమైన ప్రతిబంధకాలు లేకుండా జాగ్రత్తపడండి.
ఫిబ్రవరి : చివరివారంలో యిబ్బందికర ఘటనలు ఎక్కువ అవుతాయి. ప్రారంభం అంతా శుభఫలితాలతో కాలక్షేపం అవుతుంది. మంచి ప్రయత్నాలలో మంచి ఫలితాలుంటాయి. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం, అవి భవిష్యత్తులో ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. వృత్తి విషయంలో బహు జాగ్రత్తతో సంచారం చేయాలి. మీ యొక్క ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాలను ఎవరి దగ్గరా చర్చలు చేయవద్దు. మీ యొక్క ప్రతి పనిని మీరే స్వయంగా చూసుకోవడం వలన చాలా లాభాలు అందుకొనే అవకాశం ఉంటుంది.
మార్చి : మంచి ఫలితాలు అందుతాయి. కానీ మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. రోజూ ఏదో ఒక సమస్య రావడం దానిని సరిచేసుకోవడంతో కాలక్షేపం అవుతుంది. సహజంగా ఉద్యోగ, వ్యాపార విషయాలలో ఈ నెలలో ఎన్ని సమస్యలు వచ్చినా అన్నింటిని తెలివిగా సరిచేసుకుంటూ ముందుకు వెళతారు. దైనందిన కార్యక్రమములు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలన్నీ కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి. మంచి జీవనం సాగిస్తారు.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment