Tuesday, 15 December 2020

ద్వాదశ ఆళ్వార్లు

 


రేపు ధనుర్మాసం లోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా... పన్నిద్దరాళ్వారుల చరిత్ర , చరితామృతం
భక్తి ప్రవృత్తి శరణాగతి భావాలు అసలు లేనిచో మానవులు నైతికంగా పతనమవుతారని
తలచిన ఆళ్వారులు ,
ప్రజలలో భక్తి ప్రవత్తులు పెంపొందించేందుకై కృషి చేసారు. వారు చూపిన భక్తి మార్గాలన్నీ లోక కల్యాణం కోసమే !
నిత్యం భగవంతునే తలుస్తూ ,
కొలుస్తూ , స్మరిస్తూ , తన్మయంతో సర్వం మరచి ,
అలౌకికమైన ఆనందాను భూతితో ,
భగవత్ చరణాలనే సర్వస్వమని భావించి
తరించిన మహానుభావులు ,
సర్వవిశ్వపౌరులు మహామహిమాన్వితులైన మహానుభావులు ఎందరో !
నిరవదికమైన భగవత్ ప్రేమ సాగరంలో మునిగి ,
ఆర్తితో , పరమాత్మ యొక్క గుణగానం చేస్తూ తరించేవారే ఆళ్వారులు. కారణజన్ములు.
మానవకోటికంతటికీ ఆదర్శంగా నిలిచినా భాక్తాగ్రేసురులు.
ఆళ్వారులు అంటే లోతులను చూసిన వారని అర్థం.
దేని లోతులను అనే ప్రశ్న సహజంగానే వస్తుంది.
సత్యం లోతులను , ఆనందం లోతులను
అని అర్థం చేసుకోవాలని పెద్దల మాట.
విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఆచార్యత్రయం అంటే శ్రీనాథముని ,
యామునాచార్యులు ,
రామానుజాచార్యులు
ఆళ్వారుల వల్ల ప్రభావితులైన వారే.
(ఆచార్య త్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు.)
ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి ఆధారాలు లేవు.
కాని , నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. ఆచార్యత్రయంలో మొదటి వారైన శ్రీనాథముని క్రీ.శ. 824 లో జన్మించిన వారు.
ఆళ్వారులు అంతకు ముందువారే గాని
అందులో కొందరు క్రీస్తుకు పూర్వం వారా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఆళ్వారులు విష్ణుభక్తిలో పారవశ్యం చెందిన వారు. విష్ణువును గురించి సంస్కృతంలోనూ ,
తమిళంలోనూ స్తోత్రాలు రచించారు.
తమిళంలో రచించిన స్తోత్రాలను ‘పాశురాలు’ అంటారు. పాశురాల సంకలనాన్ని ద్రావిడ వేదం అన్నారు.
ఆళ్వారులు పదిమంది అని ఒక వాదం ,
పన్నెండు మంది అని మరో వాదం ఉంది.
పన్నెండుమంది అనే వాదమే లోకంలో స్థిరపడింది. ‘పన్నిద్దరాళ్వారులు’ అనే పదబంధం వాడుకలో ఉంది.
‘భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ , శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్‌ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్‌ శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యమ్‌’’ అని పరాశర భట్టర్‌ రచించిన శ్లోకం ఆధారంగా ఆళ్వారులు పదిమందే.
కాని , ఇందులో పదాలను చీల్చి
శ్రీ అనే శబ్దానికి ఆండాళ్‌ అనీ ,
యతీంద్ర మిశ్రాన్‌ అనే పదబంధాన్ని రెండుగా చేసి , మిశ్రాన్‌ను మధురకవిగా మార్చినందువల్ల
ఆళ్వారులు పన్నిద్దరైనారు.
పదుగురి పేర్లివి:
1. భూత ఆళ్వారు
పూదత్త ఆళ్వారు అని వాడుక.
కౌమోదకి అనే విష్ణు ఆయుధం గద అంశంతో జన్మించాడని ఐతిహ్యం
2. పొయగై ఆళ్వారు.
పాంచజన్యం అనే శంఖం అంశ.
సరోయోగ అని కూడా అంటారు.
3. పేయాళ్వార్‌.
మహదాహ్వయ ఆళ్వారు అని వాడుక.
నందకం అనే ఖడ్గం అంశ.
4. తిరుమళిశై ఆళ్వారు.
భక్తిసార ఆళ్వారు. సుదర్శన చక్రం అంశ.
5. కులశేఖ రాళ్వారు.
కౌస్తుభమణి అంశ.
6. తొందర డిప్పొడి ఆళ్వారు.
విప్ర నారాయణుడిగా ప్రసిద్ధి.
తులసీదళాలు , పుష్పాలతో కూర్చిన వైజయంతీమాల.. వనమాల అంశ.
ఇది ఎన్నటికీ వాడని హారమని విశ్వాసం.
7. తిరుప్పాణి ఆళ్వారు.
యోగి వాహన ఆళ్వారు.
ఇతడు పంచముడిగా జన్మించాడని అంటారు.
విష్ణువు వక్షస్థలంపై ఉండే శ్రీవత్స లాంఛనం అనే పుట్టుమచ్చ అంశ.
8. తిరుమంగై ఆళ్వారు.
పరకాల ఆళ్వారు. క్షత్రియుడిగా జననం.
విష్ణువు ఆయుధం శార ఙ్గం అంశం.
9. పెరియాళ్వారు.
భట్టనాథ ఆళ్వారు.
ఇతడినీ విష్ణుచిత్తుడని కూడా అన్నారు.
వైకుంఠంలోని విష్ణువు రథం అంశ.
10. నమ్మాళ్వారు.
పరాంకుశ ఆళ్వారు.
విష్వక్సేనుడి అంశ.
శూద్రులలో గీత కార్మిక కులంలో జననం.
ఈ పదిమందిగాక ఆండాళును , మధురకవిని కూడా ఆళ్వారులన్నారు.
పరాశరు భట్టరు శ్లోకంలో శ్రీ అంటే ఆండాళు అని వ్యాఖ్యాతలు అర్థం చెప్పారు.
గోదాదేవిగా ఆమె ప్రసిద్ధురాలు.
సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అంటారు.
పెరియాళ్వారుకు చెందిన తులసివనంలో ఆమె శిశువుగా కనిపించినదని గాథ.
కనుక ఆయనే ఆమెకు తండ్రి అని వ్యవహరిస్తారు.
మిశ్రాన్‌ శబ్దం ఆధారంగా వ్యవహారంలోకి వచ్చిన మధురకవి బ్రాహ్మణ కులజుడు.
గరుడాంశగా చెపుతారు.
భట్టరు శ్లోకంలోని యతీంద్ర పదానికి రామానుజుడని అర్థం చెప్పిన వారున్నారు.
కాని , ఇది ఎక్కువ మందికి ఆమోదయోగ్యం కాలేదు.
వైష్ణవ సాంప్రదాయానికి, భక్తిని జోడించి , ప్రచారం చేసిన ఆళ్వారులు 12 మంది. వారు.
1. పుదత్తాళ్వారు
2. పాయ్ గైయాళ్వారు
3. పేయళ్వారు
4. పెరియాళ్వారు
5. ఆండాళ్
6. తిరుమళిశైయాళ్వారు
7. కులశేఖరాళ్వారు
8. తిరుప్పాణియాళ్వారు
9. తొండరడిప్పాయాళ్వారు
10. తిరుమంగైయాళ్వారు
11. మధురకవియాళ్వారు
12. నమ్మాళ్వారు
అతి సాధారణంగా చెప్పబడే పన్నిద్దరు ఆళ్వారులు ,
వారి సంస్కృత నామములు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
పొయ్‌గయాళ్వార్ - మరొక పేరు సరోయోగి
పూదత్తాళ్వార్ - మరొక పేరు భూతయోగి
పేయాళ్వార్ - మరొక పేరు మహాయోగి
పెరియాళ్వార్ - మరొక పేరు భట్టనాథులు
తిరుమళిశై యాళ్వార్ - మరొక పేరు భక్తిసారులు
కులశేఖరాళ్వార్ - మరొక పేరు కులశేఖరుడు
తిరుప్పాణాళ్వార్ - మరొక పేరు మునివాహనులు
తొండరడిప్పొడి యాళ్వార్ - మరొక పేరు భక్తాంఘ్రి రేణువు
తిరుమంగయాళ్వార్ - మరొక పేరు పరకాలయోగి
ఆళ్వారుక్కు అదియాన్ - మరొక పేరు మధురకవి (శ్రీవైష్ణవ సాంప్రదాయానికి ప్రవర్తకులైన 'ఉడయవర్', 'ఎమ్బెరుమనార్' అనే నామాంతరాలుగల భగవద్రామానుజాచార్యుల వారిని కొంతమంది మధురకవికి మారుగా చేరుస్తారు ఈ పన్నిద్దరిలో.)
ఆండాళ్ - మరొక పేరు గోదాదేవి
నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని .
వీరు ద్వాపర యుగాంతంనుండి కలియుగారంభం మధ్య ఉద్భవించారని సంప్రదాయ గాథలు.
కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం
క్రీ.శ. 7వ శతాబ్దం - 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు.
పొయ్‌గయాళ్వారు పాంచజన్యము అంశ అనీ , నమ్మాళ్వారు విష్వక్సేనుని అంశ అనీ -
ఇలా ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్క విష్ణుసేవకుని అంశ అని చెబుతారు.
భక్తి ప్రపత్తి యోగముల పరమానందభరితులుగా ఉన్న ఆళ్వారుల దివ్యజీవిత చరితలు ,
వారి రచనలు దక్షిణాన వైష్ణవ భక్తిప్రాధాన్యతకు , విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూలమయ్యాయి.
1. పుదత్తాళ్వారు
2. పాయ్’గైయాళ్వారు
3. పేయళ్వారు
వీరు ముగ్గురుని మూలాళ్వారులు అంటారు.
కాంచీపురంలో ఒక సరోవరంలో కమలం మధ్యన పాయ్’గైయాళ్వారు జన్మించారు.
వీరిని ‘కాసారయోగి’ అంటారు.
ఇప్పుడు మహాబలిపురం ఐన మామల్లపురంలో మాధవీపుష్పంలో పూదత్తాళ్వారు జన్మించారు.
వీరిని ‘భూతయోగి’ అంటారు.
ఇప్పుడు మైలాపురం అనబడే మయురపురంలో ఒక సరస్సులోని తెల్లకలువ నుండి పేయాళ్వారు జన్మించారు. వీరిని ‘మహాయోగి’ అని అంటారు.
ఈ ముగ్గురులో పాయ్’గైయాళ్వారు ఆళ్వారు పరంపరలో మొదటివారుగా చెప్పుకుంటారు.
ఈ ముగ్గురు మహానీయుల జన్మ ఒక్కొక్కరోజు వ్యత్యాసంతో జరగటం ఆశ్చర్యకరం.
ముందు జన్మించింది పాయ్’గైయాళ్వారు.
తర్వాత ఒక్కొక్క రోజు తేడాతో పూదత్తాళ్వారు , పేయాళ్వారు చెబుతారు.
ఈ ముగ్గురు మహాయోగుల కలయిక చాలా ఆసక్తికరంగా జరిగింది.
ఒకసారి పాయ్’గైయాళ్వారు, తిరుక్కొమూర్ అనే గ్రామానికి వచ్చారు.
చీకటి పడింది.
ఆ రాత్రి విశాంత్రి తీసుకోవడానికి ఓ చోటికి చేరుకున్నారు. అనుకోకుండా ఆ చోటికే పూదత్తాళ్వారు వచ్చి ,
కొంచెం చోటిమ్మని అడిగారు.
ఇద్దరు సర్దుకొని కూర్చున్నారు.
కొంచెంసేపు తర్వాత పేయాళ్వారు వచ్చి ,
కొంచెం చోటిమ్మని అడిగారు.
ఆ ముగ్గురు విష్ణుభక్తులూ సంతోషంగా ,
ఆ చిన్నచోటులోనే నిలుచుని సర్దుకున్నారు. గాఢాంధకారం , ఎటు చూసినా కటిక చీకటి.
కొంచెంసేపటికి వారికి నాలుగోమనిషి వచ్చి తమ మధ్యన నిల్చున్నాడనే అనుభూతి కలిగింది.
కానీ , ఎవరూ కనపడలేదు.
వారు ఆశ్చర్యంతో పరంధాముని ప్రార్ధించగా , శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు.
ఆ మహాయోగులు , ఆనంద పరవశులై తమిళంలో ఆశువుగా మూడు పాశురాలతో
ఆ దేవదేవుని స్తుతించి ధన్యులైనారు.
4. తిరుమళిశైయాళ్వారు.
వీరి జన్మ గురించి కొంత విచిత్రంగా చెబుతారు. కాంచీపురానికి దగ్గరలో మహిషాపురం అనే గ్రామం ఉండేది.
ఆ గ్రామంలో భార్గవుడు కనకాంగి దంపతులకు తిరుమళిశైయాళ్వారు జన్మించారు.
పుట్టినప్పుడు ఆ బాలునిలో కదలిక లేదట.
దుఃఖితులైన తల్లిదండ్రులు ఆ బాలుని అడవిలో
ఒక పొదలో పడేశారు.
తిరువాలన్ అనే వ్యక్తి అడవి వేటకొచ్చాడు.
పొదలో పసిపిల్లాడి ఏడుపు విన్న తిరువాలన్ ,
ఆ బాలుడ్ని తీసుకెళ్ళి తన భార్య పంకజవల్లి
చేతుల్లో పెట్టాడు.
ఆ దంపతులు ఆ పిల్లవానికి శివక్కియార్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.
అయితే ఆ పసివాడి ప్రవర్తన ఆశ్చర్యకరంగా ఉండేది. పాలు తాగేవాడు కాదు.
ఆనోటా ఈనోటా ఈవిషయం పల్లెలోని వృద్ధదంపతుల చెవిన పడింది.
వారు పాలు తెచ్చి పట్టగానే శివక్కియార్ పాలు తాగేశాడు.
ఆ దంపతులు ఆనందంగా , రోజూ పాలు తెచ్చి శివక్కియార్ కి పట్టి ,
కొంచెం పాలు ప్రసాదంగా తీసుకునేవారు.
అధ్బుతమైన సంఘటన.
వృద్ధ దంపతులకు కొంత కాలానికి కొడుకు పుట్టాడు.
ఆ పిల్లవాడికి కణ్ణకృష్ణుడు అని పేరు పెట్టుకున్నారు.
శివక్కియార్ పెద్దవాడైనాడు.
ఎన్నో విద్యలు నేర్చాడు.
దేశాటన చేస్తూ తిరువళ్ళిక్కేణికి చేరుకున్నాడు.
అక్కడే తపోదీక్ష స్వీకరించి ఎన్నో సిద్ధులు సాధించాడు. తిరువళ్ళిక్కేణికి మైలాపురం దగ్గరే.
మైలాపురంలోనే పేయాళ్వారు నివాసం.
వారు ఆనోట ఈనోట శివక్కియార్ గురించి విన్నారు. అతనిని ఎలాగైనా వైష్ణవునిగా చేయాలని సంకల్పించుకున్నారు.
ఒకసారి శివక్కియార్ అటువైపుగా వెళుతుండగా , పేయాళ్వారు చూశారు.
అదే మంచి సమయమని
శివక్కియార్ చూస్తుండగా , తోటలో చెట్లను తల్లక్రిందులుగా పాతారు.
అది చూసి పరిహసించిన శివక్కియార్ తో వాదించి వైష్ణవునిగా మార్చారు పేయాళ్వారు.
అప్పటినుంచి శివక్కియార్ ని భక్తిసారుడు
అని పిలిచేవారు.
భక్తిసారుడు కాంచీపురం వచ్చాడు.
అప్పుడే కణ్ణకృష్ణుడు కూడా అక్కడికి వచ్చాడు.
కాంచీపురం దేవాలయం వద్ద ఒక వృద్ధురాలైన దేవాంగన ఉండేది.
ఆమె రోజూ దేవాలయాన్ని ,
భక్తిసారుని ఆశ్రమ పరిసరాలని శుభ్రం చేస్తుండేది.
ఆమె శ్రద్దకి తృప్తి చెందిన భక్తిసారుడు ,
ఆ దేవాంగనకి యవ్వనాన్ని ప్రసాదించాడు.
ఆ దేవాంగన అందాన్ని చూసి మోహించిన కాంచీపురం రాజు ఆమెని పెళ్ళాడాడు.
తనకు కూడా యౌవ్వనాన్ని ప్రసాదించమని భక్తిసారుని బ్రతిమాలాడాడు.
కానీ భక్తిసారుడు నిరాకరించాడు.
రాజు కోపంతో భక్తిసారుని కాంచీపురం వదలి వెళ్ళి పోవలసిందిగా ఆజ్ఞాపించాడు.
భక్తిసారుడు రాజాజ్ఞను శిరసావహించి ,
కణ్ణకృష్ణునితో పాటు కాంచీపురం నుండి వెళ్ళిపోయాడు. ఆలయంలో శేషశాయి కూడా అదృశ్యమయ్యాడు.
తన తప్పు తెలుసుకున్న రాజు భక్తిసారునికి క్షమాపణలు చెప్పి , కాంచీపురానికి రావలసిందని సగౌరవంగా ఆహ్వానించాడు.
ఆ తర్వాత తిరుమళిశై ఆళ్వారు అని పిలవబడే భక్తిసారుడు కుంభకోణం చేరి ,
ఎన్నో మహిమలు చూపించాడు.
విష్ణుదేవుని కీర్తిస్తూ , ఎన్నో రచనలు చేసాడు. *‘తిరుచ్చందవిరుత్తం’, ‘నాన్ముఖం తిరు అందాది’* –
ఈ రెండు గ్రంథాలు ప్రసిద్ధాలు.
వీరు కుంభకోణంలోనే ఎన్నో ఏళ్లు తపస్సు చేసి ,
ఎన్నో మహిమలు చూపి , భక్తితత్త్వాన్ని ప్రచారం చేసి విష్ణుసాయుజ్యం పొందారు.
5.నమ్మాళ్వారు ,
6.మధుర కవి.
వైష్ణవ సంప్రదాయ గురువులలో నమ్మాళ్వారు స్థానం విశిష్టమైంది.
వీరి తండ్రి తిరుక్కూరుగూరు పాలకుడైన శూద్ర ప్రభువుకారుడు.
తల్లి ఉజయనంగ.
సంతానం లేని వీరు తిరుక్కురుల గుడికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించగా , భక్తికి మెచ్చి ,
తానే స్వయంగా కుమారుడిగా జన్మిస్తానని వరం ఇచ్చాడు విష్ణుమూర్తి.
కొన్నాళ్ళకు వారి కలలపంటగా కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి మారుడు అని పేరు పెట్టుకున్నారు.
అయితే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎంతకాలమో లేదు.
ఆ పిల్లవాడు కళ్ళు తెరవడు.
పాలు తాగాడు.
ఇదంతా చూసిన మంత్రులు పిల్లవాడిని స్వామి ఆలయానికి తీసుకెళ్ళమని సలహా ఇచ్చారు.
రాజుకీ అదే మంచిది అనిపించి ,
మారుడిని తీసుకొని ఆలయానికి వెళ్లాడు.
పిల్లవాడిని విష్ణుసన్నిధిలో పడుకోబెట్టారు.
మారుడు కళ్ళు తెరచి , స్వామిని చూసి పాక్కుంటూ దగ్గరలో ఉన్న చింతచెట్టు దగ్గరకెళ్ళాడు.
తొర్రలో దూరాడు.
పద్మాసనంతో తపోనిష్ణుడైనాడు.
ఆ పిల్లవాడు సామాన్యుడు కాదని , కారణజన్ముడని , దైవాంశసంభూతుడని అందరికీ అర్థమైపోయింది. కారుడు కూడా చింతపడకుండా ,
మనస్సు గట్టి చేసుకొని ,
మారుడికి తపోభంగం కలగకుండా కట్టుదిట్టం చేశాడు.
నిద్రాహారాలు లేకుండా తీవ్రమైన తపోదీక్షలో ఉన్న మారుని చుట్టూ గొప్ప తేజస్సు ప్రకాశించింది.
అతనే నమ్మాళ్వారు.
పాండ్యదేశంలో గోళూరు అనే గ్రామం.
ఆ గ్రామంలో నారాయణుడు అనే బ్రాహ్మణునికి
ఒకే పుత్రుడు.
ఆ పిల్లవాడు అతి చిన్న వయసులోనే వేదవేదాంగాలు , చదివాడు.
సంసార తాపత్రయాలకు విముఖుడై , దేశాటన చేస్తూ బదిరికాశ్రమం చేరాడు.
అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసి అయోధ్యా నగరానికి వచ్చాడు.
ఒకరాత్రి అతనికి దక్షిణ దిశనుంచి మహాతేజస్సు కనబడింది.
దానికి కారణం అన్వేషిస్తూ తిరుక్కడూరు చేరాడు. ఆయనే మధురకవి.
విష్ణ్వాలయంలో చింతచెట్టు తొర్రలో తపోదీక్షలో ఉన్న తేజోమూర్తిని చూసి పరవశించి పోయాడు.
వారితో మాట్లాడాలనే ఉత్సాహముతో పెద్దగా శబ్దం చేశాడు.
తపోభంగమై కళ్ళు తెరిచిన నమ్మాళ్వారు ,
మధురకవి అడిగిన సందేహాలకన్నింటికి
చక్కని వివరణలు ఇచ్చారు. మధురకవి అయన చెంత మోకరిల్లి తన గురువుగా స్వీకరించాడు.
సంవత్సరాలు గడిచిపోయాయి.
భక్తి పరిపక్వత చెందిన నమ్మాళ్వారు తనలో ఉప్పొంగే భావాలను , గ్రంథస్థం చేశాడు.
‘తిరువిరుత్తం’, ‘తిరువాశరియం’, ‘తిరువందాది’, ‘తిరువయిమొళి’ వీరి ముఖ్య గ్రంథాలు.
శఠులను అంటే వంచకులను అణచుటచే , సంసారదోషాలను నిర్జించుటచే ఈయనకు ‘శఠకోపుడు’ అని , ఆదినాధ స్వామి ప్రసాదించిన పొగడపూల మాల ధరించటంచే ‘వకుళాభరణుడు’ అని , పరమతాలను విరసించటంవల్ల ‘వరాంకుశుడని’ పిలవబడేవాడు.
ఎందరికో సన్నిహితుడై , ముక్తి పొందే తరుణోపాయం ఉపదేశించటం వల్ల ‘నమ్మాళ్వారు’ అన్నారు.
‘నమ్’ అంతే మన. నమ్ + ఆళ్వార్ = మన ఆళ్వార్.
వైష్ణవ ప్రచారంలో అతి ముఖమైన మహానీయులలో ఒకరైన నమ్మాళ్వార్ 35వ ఏట పరమపదం చేరారు. నమ్మాళ్వారుకి ముఖ్యశిష్యులై ,
ఆయన అడుగుజాడలలో నడిచి ,
వైష్ణవ సాంప్రదాయానికి అశేషమైన ప్రాచుర్యానికి తోడ్పడిన మధురకవి ,
జీవితమంతా విష్ణు చరణ సేవలో గడిపి భగవదైక్యం చెందారు.
వారు రచించిన భగవన్నుతి ‘కణ్ణిమణ్ శిరుత్తాయి’.
7. కులశేఖరాళ్వారు
భక్తకోటికి , భక్తిసంభరితమైన ‘ముకుందమాల’ ను అందించిన కులశేఖరాళ్వారుని ఎరుగనివారు ,
తలచని వారు ఉండరు.
కులశేఖరాళ్వారుల తండ్రి ‘కొల్ల’ (నేటి క్విలన్) పరిపాలకుడు ధృఢవ్రతుడు.
అల్లారుముద్దుగా పెరిగిన బిడ్డ సకల శాస్త్రపారంగతుడైనాడు.
తండ్రి దృష్టి వానప్రస్థాశ్రమం స్వీకరించిన తరువాత రాజ్యభారాన్ని తాను తీసుకున్నాడు.
రాజ్యపాలనలో క్షణం తీరికలేక తలమునకలై ఉన్నా , కులశేఖరుల దృష్టి ఆధ్యాత్మికత్వం పైనే ఉండేది.
ప్రాపంచిక సుఖాలకు విముఖుడై ,
శ్రీరామచంద్రుని శరణంటూ ‘పెరుమాల్ తిరుమొళి’ అనే దివ్య ప్రబంధాన్ని రచించారు.
ఈయన భక్తికి మెచ్చిన స్సేనముదలి అనే వైష్ణవాచార్యులు పంచసంస్కార దీక్షను ఇచ్చి అనుగ్రహించారు.
అది మొదలు కులశేఖరాళ్వారులో భక్తి రెట్టింపైంది. శ్రీరంగనాథుని దర్శించాలని తపనపడ్డాడు.
కానీ , మంత్రులు ఈయనవెళితే మళ్ళీ తిరిగిరాడని శంకించి ,
వైష్ణవాచార్యునే దూరం చెయ్యాలని ఆలోచించారు. పూజాగృహంలోని రత్నహారాన్ని దాచి ,
ఆ నేరం ఆచార్యుని మీద మోపారు.
నేరాన్ని నిర్ధారించుకోవటానికి ఒక కుండలో విషసర్పాన్ని ఉంచి , తన ఉంగరాన్ని అందులో వేసి ,
తన గురువుపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచి , కులశేఖరులు ఉంగరాన్ని పైకి తీసారు.
మంత్రులు తమ తప్పిదానికి సిగ్గుపడి క్షమాపణలు అడిగారు.
జీవితకాలమంతా పరమాత్మ సేవలో తరించినారాయన.
ఎక్కువ కీర్తనలలో శ్రీరాముని స్తుతించాడు.
తిరుమలలో బంగారు వాకిలి వద్దనున్న మెట్టును
ఇతని పేరుమీద కులశేఖర పడి అని అంటారు.
8.పెరియాళ్వారు ,
9.ఆండాళ్ళు.
పెరియాళ్వారు అసలు పేరు విష్ణుచిత్తుడు.
ఈయన తల్లిదండ్రులు ముకుందా చార్యులు , పద్మావతీదేవి.
ముకుందాచార్యులు శ్రీవిల్లిపుత్తూరు విష్ణ్వాలయంలో పరిచారకుడు.
చిన్నప్పటినుంచి విష్ణుచిత్తుడు తిరుమంత్రమైన అష్టాక్షరీమంత్రాన్ని జపిస్తూ ఉండేవారు.
ఒకసారి విష్ణుచిత్తుడు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ, మాలాకారుని తరింప చేసిన ఘట్టం విన్నాడు.
తాను కూడా అట్లాగే తరించాలని ,
స్వయంగా చక్కటి పూలతోట పెంచి ,
ఆ తోటలో పూలతో విష్ణుమూర్తిని పూజించి ఆనందించేవాడు.
ఆ కాలంలో మధురను వల్లభరాయుడు పరిపాలిస్తుండేవాడు.
ఆ రాజు రాత్రి పూట మారువేషంలో తిరుగుతూ ప్రజల కష్ణసుఖాలను కనిపెడుతుండేవాడు.
ఒకరోజు రాత్రి తిరుగుతూ తిరుగుతూ ,
ఒక అరుగు మీద పడుకున్న బ్రాహ్మణుని చూశాడు.
ఆ బ్రహ్మానుడు మహాజ్ఞాని అని గ్రహించి , నమస్కరించి , తనకేదైనా ఉపదేశించమని అర్థించాడు.
ఆ బ్రాహ్మణుడు వార్థక్యం రాకముందే పరమాత్మ యందు అనురక్తి పెంచుకొమ్మని సోదాహారణగా బోధించాడు.
రాజు నిజమందిరం చేరి ఆ రాత్రంతా ఆలోచించాడు. మర్నాడు పొద్దున్నే పండితసభ ఏర్పాటు చేశాడు.
సభ మధ్యలో స్తంభం పాతించి , దాని మీద బంగారు నాణేలు నింపిన సంచి కట్టించాడు.
పండిత సభలో గెలిచిన వారికి ఆ నాణేల సంచి బహుకరించబడుతుందని ,
ఆ విజేతయే తన గురువని ప్రకటించాడు.
ఎందరో పండిత ప్రకాండులు వచ్చారు.
విష్ణుచిత్తుడు (పెరియాళ్వారు) కూడా వచ్చారు. పరమేశ్వర ప్రేరణతో పండితులతో వాదించి విజయం పొందారు.
పరమానంద భారితుడైన రాజు ,
పెరియాళ్వారును గురుపీఠం పై ఉపవిష్టులను చేసి ,
గజారోహణం చేయించాడు.
ఒకరోజు పెరియాళ్వారు తోటపని చేస్తుండగా ,
వారికి , జనకమహారాజుకి సీతమ్మ లభించినట్లు ,
ఒక బాలిక దొరికింది.
ఆ బాలికను భాగవత్ప్రసాదంగా భావించి ,
గోదాదేవి అని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.
కారణజన్మురాలు గోదాదేవి , నిత్యం విష్ణునామం స్మరిస్తూనే ఉండేది. బాలిక పెరిగి పెద్దదైంది.
మహావిష్ణువునే మనసులో భర్తగా భావించి
తన్మయత్వం చెందేది. తండ్రితోపాటు మాలలల్లేది.
తండ్రి లేనపుడు ఆ మాలను తాను తలలో మురిపెంగా ధరించి , ఆపై శ్రీరంగనాథునికి అలంకరించేది. అనుకోకుండా ఒకరోజు పెరియాళ్వారు అది గమనించారు. గోదాదేవిని మందలించి , ఆ రోజు మాలను శ్రీరంగనాథునికి అలంకరించలేదు. ఆ రాత్రి శ్రీరంగనాథుడు పెరియాళ్వారుకి కలలో కనిపించి , తనకు గోదాదేవి ధరించిన మాలలే ఇష్టమని , వాటినే తనకు అలంకరించమని ఆదేశించాడు. గోదాదేవి వయసుతో పాటు భక్తి కూడా పెరిగింది. శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ ‘తిరుప్పావై’ అనే 30 పాశురాలు , ‘నాచ్చియార్ తిరుమొళి’ అనే 140 పాశురాలు వ్రాసింది. ఆ పాశురాలను పాడుకుంటూ తనను తాను మరిచిపోయేది.
గోదాదేవికి వివాహ ప్రయత్నాలు జరిగాయి.
కానీ ఆమె శ్రీమహావిష్ణువును తప్ప ఎవరినీ వివాహమాడనని ఖచ్చితంగా చెప్పింది.
108 శ్రీమహావిష్ణుక్షేత్రాలలో ,
శ్రీరంగంలో శ్రీరంగానాథుడే తనకు ఇష్టుడని ,
ఆయనకిచ్చి వివాహం చేయమని కోరింది. మహదానందంగా విష్ణుచిత్తుడు గోదాదేవికి , శ్రీరంగనాథుడికి వివాహం జరిపించాడు.
వివాహానంతరం ఆలయం లోనికి వెళ్ళిన గోదాదేవి క్షణమాత్రంలో ఆర్చామూర్తిలో ఐక్యం అయింది. గోదాదేవికే భక్తులను రక్షించేది అనే అర్థంతో
‘ఆండాళ్ళు’ అని , స్వామికి తాను ధరించిన మాలలే అలంకరింపజేయటం చేత ‘శూదికొడుత్తాళి’ అని పేర్లతో ప్రసిద్ధికెక్కింది.
నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని.
క్రీ.శ. 798 కలంవాడు కావచ్చును.
పుట్టుక రీత్యా శూద్రుడు. ఆళ్వారులలో నమ్మాళ్వారుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. మిగిలిన ఆళ్వారులందరూ శరీరం , నమ్మాళ్వారులు శరీరి. జ్ఞాని. శ్రీవైష్ణవం దీక్షను తీసికొనేవారు తమ ప్రస్తుత గురువునుండి నమ్మాళ్వారు వరకూ అంజలి ఘటిస్తారు. దేవాలయాలలో 'శఠగోపం' పెట్టడం అనేది
ఈ 'శఠకోపముని' పేరుమీద మొదలయిన ఆచారమే.
తన జీవితకాలం అంతా ఒక చింతచెట్టు క్రిందనే గడిపాడు. నమ్మాళ్వారు రచించిన నాలుగు దివ్య ప్రబంధాలూ నాలుగు ద్రవిడ వేదాలుగా ప్రశస్తమయ్యాయి.
ఇతడు యోగాభ్యాసపరుడు. నాధముని , మధురకవి అనువారలీతని శిష్యులు. ఈతడు విష్ణుసారమ్యమును , సర్వ వ్యాపిత్వమును మోక్షదాయకత్వమును గూర్చి తన రచనలలో హెచ్చుగా ప్రతిపాదించాడు. ఈతని కాలమునకు దక్షిణదేశమున జైన బౌద్ధ మతములు క్షీనదశనొంది శైవవైష్ణవములకు గల స్పర్ధకూడ కొంత తగ్గిపోయినట్లు కనబడును.
మధురకవి యాళ్వార్. ఇతను బ్రాహ్మణుడు.
తక్కిన ఆళ్వారులు శ్రీమన్నారాయణుని కీర్తించగా మధురకవి మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే కీర్తించాడు. ఇతని గురుస్తోత్రం శ్రీవైష్ణవులకు చాలా ముఖ్యమైన ప్రార్థన.


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment