ఇప్పుడు మరల కదలిక రావాలంటే లోకములు రక్షింపబడాలంటే మరల మహానుభావుడయిన శంకరుడే పూనుకోవాలి. మళ్ళీ పార్వతీదేవి తనతో కలిసి ఉండడానికి మార్గమును తానే సుగమం చేయాలని శంకరుడు భావించాడు. మహానుభావుడు భక్తవశంకరుడు, లోకవశంకరుడు. ఇప్పుడు శంకరుడు తన పెద్ద కొప్పును తగ్గించేసి చివరన కొప్పులాంటి దానిని పక్కకి ముడివేశాడు. పైకి ఉండే జటాజూటం పక్కకి తిరిగింది. మూడవ నేత్రమును కనపడకుండా దాచేశాడు. పెద్ద కుంకుమ బొట్టును పెట్టుకున్నాడు. ఒంటికి రాసుకున్న విభూతినంతటినీ పక్కన పెట్టేశాడు. ఒళ్ళంతా పసుపు రాసేసుకున్నాడు. త్రిశూలమును తీసేసి దానికి బదులు చేతిలో సజ్జనొకదానిని పట్టుకున్నాడు. ఎప్పుడూ తన శరీరంలో వామార్ధభాగం పార్వతీ దేవికి ఇచ్చేశాడు కాబట్టి సగభాగం స్త్రీతో కూడుకున్న వాడయిన శంకరుడు ఈవేళ పూర్తిగా స్త్రీగా మారిపోయాడు. ‘నేను ఎరుక చెప్తాను-సోది చెప్తాను’ అంటూ హిమవంతుడు పరిపాలిస్తున్న ప్రాంతమునకు వచ్చాడు. గౌరీదేవి ఈమెను అంతఃపురంలోంచి చూసింది. ‘ఎప్పటినుండో నాకు అయిదు శిరస్సులు ఉన్నవాడిని భర్తగా పొందాలని కోరిక. దగ్గరకి వస్తోంది అనుకున్న ముహూర్తం భగ్నమయిపోయింది. ఎక్కడ ఉన్నాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆ అయిదు ముఖముల ఉన్నవాడిని భర్తగా ఎలా పొందుతానో, పొందడానికి మార్గమేదో నాకేమయినా చెప్తుందేమో అని లోపలికి తీసుకురండి’ అని చెలికత్తెలకు చెప్పింది. శంకరుడే సోది చెప్పే ఆవిడరూపంలో అంతఃపురంలోకి వచ్చాడు. పార్వతీదేవి ఒక పీటవేసి ఆ ఎరుకల సానిని కూర్చోపెట్టింది.
‘ఈ పర్వతరాజు ఇంట్లో నేను ఎన్నాళ్ళు ఇలా ఉండిపోవాలి? నేను ఇక్కడనుండి బయలుదేరి ఎంత తపస్సు చేస్తే శంకరుడు నన్ను తీసుకు వెడతాడు? కాముడిని కాల్చేసిన వాడు నా చిటికెన వేలు ఎప్పుడు పట్టుకుంటాడు? నా ఈ ప్రశ్నలకు సమాధానములు కావాలి. వాటిని నీవు చెప్పవలసినది’ అని అడిగింది.
సోది చెప్పించుకుందుకు ఆవిడ పళ్ళెంలో ముత్యాలు పోసి పట్టుకు వెళ్ళింది. సోది చెప్పే ఆవిడ ఆ ముత్యాలను ఒకసారి చేతితో నలిపి వాటిని మూడు కుప్పల క్రింద పెట్టి తన ఎడమచేతితో పార్వతీదేవి చేతిని పట్టుకుంది. ఆమెకి సోది చెప్పేటప్పుడు ఎడమ చెయ్యి పట్టుకుని కుడిచేతిని ముత్యాలకుప్పకు తగిలించి తరువాత తలకి తగిలించాడు. ఇదిగిదిగో చెప్తున్నా వినుకోయమ్మా – రహస్యం చెప్తున్నా – చెయ్యిచ్చి వినుకోయమ్మా – పై అందాలకు వాడు లొంగడే తల్లి – నీకు తెలియనిదా – యోగ పట్టం కట్టు అయ్యప్ప సామికి - నామాట నమ్మమ్మ – చెప్పింది చెయ్యమ్మ – చీరవద్దు, సారె వద్దు, తాంబూలం వద్దు, నీకు కావలసిందే నాకూ కావాలి. అందుకే వచ్చానే తల్లి. అన్నీ చెప్పానోయమ్మా మళ్ళీ వస్తానోయమ్మా అవసరమయితే అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ సోది విని పార్వతీదేవి చాలా సంతోషపడిపోయింది. శంకరుడిని సౌందర్యంతో ఆకట్టుకోవడం కుదరదని గ్రహించింది. శంకరుడు సౌందర్యమునకు సౌందర్యము. ఆయనను వశం చేసుకోవాలంటే తాను కూడా తపస్సు చేయాలని అనుకుంది. హిమవంతుడి దగ్గరకు వెళ్ళి ‘నాన్నగారూ శంకరుని భర్తగా పొందాలనుకుంటున్నాను. నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరి వెడతాను. మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసింది’ అని తండ్రి పాదములు పట్టి ప్రార్థన చేసింది. తండ్రి ఆమె మనసు ఎరిగిన వాడు. ‘అమ్మా, ఇది చాలా కష్టంతో కూడుకున్న విషయం. అయినా నీవు అడిగిన కోర్కె చాలా గొప్పది. కనుక నిన్ను అలాగే పంపుతాను. వెళ్ళిరా’ అన్నాడు. పిమ్మట ఆమె తల్లి మేనక దగ్గరకు వెళ్లి ఆమె పాదములు పట్టి నమస్కరించి తపస్సు చేసుకుందుకు వెళ్ళడానికి అనుమతి కోరింది. ‘నేను నిన్ను అరణ్యములకు ఎలా పంపను? నీకు భర్తను వెతకవలసిన తల్లిదండ్రులం మేము ఉండగా నీవు తపస్సు చేయడానికి వెళ్ళడం ఏమిటి? ఒకవేళ శంకరుడు తపస్సు చేస్తే తప్ప రాడని అంటావేమో అటువంటప్పుడు ఇంట్లోనే శంకరుడిని గూర్చి పూజ చేసుకో’ అని చెప్పింది. అపుడు పార్వతీదేవి ‘అమ్మా అలా అనకు మనశ్శాంతి కోసం దూరంగా ఉండి లోపలి అంతర్ముఖురాలనై శంకరుని పాదములు పట్టి పూజించి శంకరుడిని నావాడిగా చేసుకోవాలి. ఇది నా కోరిక. కనుక నేను తపోభూములకు బయలుదేరతాను’ అని చెప్పింది. చివరకు మేనకాదేవి అంగీకరించింది. కొంతమంది చెలికత్తెలనిచ్చి తపస్సుకు పంపుతూ ఆఖరి నిముషంలో మేనకాదేవి పార్వతిని ఉమా అని పిలిచింది. ‘ఉ’ అంటే తపస్సునకు ‘మా’ అంటే వెళ్ళవద్దు. తపస్సునకు వెళ్ళవద్దు అని పిలిచింది కాబట్టి పార్వతీదేవికి లోకంలో ‘ఉమా’ అనే పేరు వచ్చింది.
ఇప్పుడు పార్వతీ దేవి తపస్సుకు బయలుదేరుతోంది. అందమయిన కబరీ బంధంతో పూలతో అలంకారం చేయబడే ఆ ముడికి ఆవిడ రుద్రాక్షలను చుట్టుకుంది. బాలచంద్రుడిలా ఉండే ఫాలస్థలం మీద మూడు విభూతిరేఖలను తీర్చుకుని బొట్టు పెట్టుకుంది. ఒంటినిండా అంగరాగములను రాసుకునే తల్లి పలుచగా ఒంటినిండా భస్మమును రాసుకుంది. పట్టుబట్టలు కట్టుకునే తల్లి ఒక కాషాయవస్త్రమును కట్టుకుంది. కమండలం పట్టుకుని తాపసియై బయలుదేరి వెళ్ళి అరణ్యములో కూర్చుని తపస్సు మొదలుపెట్టింది. పరమ ఘోరమయిన తపస్సు చేసింది. శీతాకాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసింది. వర్షాకాలంలో వర్షధారల మధ్య నిలబడి తపస్సు చేసింది. కొంతకాలమునకు ఆహారం కూడా మానేసి కేవలం ఆకులను మాత్రమే తిన్నది. అంత అందమయిన పార్వతీ దేవి శుష్కించి పోయి సన్నగా దర్భలా అయిపొయింది. చివరకు ఆకులను కూడా తినడం మానివేసింది. అపర్ణ అయిపొయింది.
ఆమె అలా తపస్సు చేస్తుంటే శంకరుడు కదిలిపోయాడు. తాను కదిలి వచ్చాడు. ఒంటిమీద ఉన్న పాములన్నీ తీసివేశాడు. జటాజూటమును తీసేశాడు. చంద్రరేఖను తీసేశాడు. పట్టుపుట్టం విప్పేశాడు. అన్నీ తీసివేసి బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు. ఆవిడ మనస్సు ఎంతవరకు నిలబడుతుందో చూడాలనుకున్నాడు. యథార్థమునకు శివపార్వతుల ఇద్దరి మనస్సులూ ఒక్కటే. కానీ పార్వతీదేవి మనస్సు శంకరుడి మీద ఎంత గొప్పగా ఉంటుందో లోకమునకు చూపించాలనుకున్నాడు. బ్రహ్మచారి వచ్చినట్లుగా పార్వతీదేవి తపస్సు చేస్తున్న ప్రదేశమునకు బయలుదేరి వచ్చాడు. బ్రహ్మచారి రూపంలో వచ్చిన శంకరుని అందమును చూసి జగత్తు మోహించింది.
అక్కడకు వచ్చి పార్వతీదేవి వంక చూసి ఏమీ తెలియని వాడిలా ‘ఈమె తల్లిదండ్రులు ఎవరు? అరణ్యంలో కూర్చుని పెళ్ళికావలసిన పిల్ల తపస్సు చేయడం ఏమిటి? ఎవరిని భర్తగా పొందాలనుకుంటోంది? ఎందుకింత గొప్ప తపస్సు చేస్తోంది? ఈవిడ కథ ఏమిటో తనకు చెప్పవలసినది’ అని ఆమె చుట్టూ ఉండే చెలికత్తెలను అడిగాడు. అపుడు చెలికత్తెలు ‘ఈమె హిమవంతుని కుమార్తె గౌరి. మూడుకన్నులు ఉన్న పరమశివుణ్ణి భర్తగా పొందాలని తపస్సు చేస్తోంది’ అని చెప్పారు. ఇపుడు బ్రహ్మచారి “నీవు హిమవంతుని కూతురివి, గొప్ప అందమయిన దానివి, మేనకాదేవి కూతురువి. పార్వతీ దేవివి. ఎక్కడో ఉన్న జంగమదేవర గురించి తపస్సు ఏమిటమ్మా? నేను ఎందరినో కన్యలను చూశాను. సిద్ధ గంధర్వ గరుడ కిన్నెర కింపురుషాది గణముల కుమార్తెలను చూశాను. నీకు ఉన్న అందం వాళ్ళు ఎవరికీ లేదు. తెలియక శివుడంటే అందంగా ఉంటాడు అనుకుంటున్నావు. ఏ ఆడదయినా లోకంలో అన్నం పెట్టేవాడు కావాలని కోరుకుంటుంది. ఆయన బ్రహ్మకపాలం పుచ్చుకుని ఇంటింటి ముందూ నిలబడి ‘భవతి భిక్షాందేహి’ అంటూ ఉంటాడు. ఈయన నీకు భర్తగా దొరికాడా? అతని వయసే తెలియదు, ఆకారమే లేదు. కులగోత్రములు తెలియవు. తల్లి తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. ఏదో మాయయో, మంత్రమో ప్రయోగించి నిన్ను పెళ్ళి చేసుకుందామని నీచేత తపస్సు చేయించేస్తున్నాడు. నిజంగా శంకరుడు ప్రత్యక్షమై నిన్ను పెళ్ళి చేసుకుంటే నీవు ఎందుకూ పనికిరాకుండా అయిపోతావు. ఆయన బుద్ధి నీకు తెలియదు. ఒకళ్లిస్తే పుచ్చుకోడు. ఆయనకు ఉన్నవే వాడుకుంటాడు. ఆయనకున్నవి పుర్రెలమాల, ఏనుగు చర్మం, పాములు కంకణములుగా, సుగంధ లేపనములకు బదులు బూడిద, కాపురానికి రుద్రభూమి నివాసం, పుష్పమాలలకు బదులు చంద్రబింబం, ప్రయాణమునాకు ముసలి ఎద్దు, ఎవరికయినా చెప్పుకుంటే కూడా సిగ్గు. వెర్రితనం కాకపోతే శివుడిని పెళ్ళిచేసుకోవడం ఏమిటి? ఈ తపస్సు మంచిది కాదు ఆపవలసింది. నేను బ్రహ్మచారిని. నిన్ను పెళ్ళి చేసుకోవడానికి యోగ్యుడను. నాతో రావలసినది’ అని చెప్పాడు. అమ్మవారి వైభవమును ప్రకాశింపజేయడానికి, తన పెళ్ళి తాను పాడుచేసుకోవడానికి శంకరుడిలా చెప్పుకునే వాడు ఎక్కడా ఉండడు.
ఆ బ్రహ్మచారి మాటలను విని పార్వతీదేవి ‘శంకరుడి గురించి వీడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వెంటనే వీడిని మెడబట్టి తోసి అవతల పారేయండి’ అని చెలికత్తెలకు చెప్పింది. గబగబా చెలికత్తెలందరూ తోసెయ్యడానికి సిద్ధపడుతున్నారు. అపుడు బ్రహ్మచారి రూపంలో ఉన్న శంకరుడు వాళ్ళకి దొరకకుండా అటూ ఇటూ పరుగెడుతూ ‘నన్ను నారాయణుడు, చతుర్ముఖ బ్రహ్మ కూడా పట్టుకోలేరు. నాకు తగిన పిల్ల ఈ పిల్లే. ఎవరు అడ్డు వస్తారో చూస్తాను. ఇప్పుడే ఇక్కడే పీతల మీద కూర్చుని ఈమె మెడలో తాళి కట్టేసి ఈమెను నాదానిని చేసేసుకుంటాను’ అన్నాడు. అపుడు పార్వతీదేవి వీడెవడో ఇంత దూర్తంగా ఉన్నాడు అనుకుని గభాలున పైకిలేచి ‘వీడిని మామూలుగా విడిచి పెట్టవద్దు. కర్రలు పట్టుకు వచ్చి వీడి పళ్ళు ఊడి పోయేటట్లు కొట్టి త్రోసి అవతల పారేయండి’ అని చెప్పింది. వెంటనే చెలికత్తెలు పెద్ద పెద్ద కర్రలు పట్టుకువచ్చి ఆయన మీదకు విసరడం ప్రారంభించారు. అపుడు శంకరుడు ఒక్కసారిగా ఏనుగు చర్మం కట్టుకున్న వాడయి, జటాజూటంతో చంద్రరేఖతో, మూడవకంటితో మెడలో వేసుకున్న నాగాభరణములతో రుద్రాక్ష మాలలతో దివ్యమయిన సుగంధముతో జటాజూటమునందు గంగతో వృషభవాహనం పక్కన నిలబడిన వాడయి పార్వతీదేవికి ప్రత్యక్షం అయ్యాడు. అపుడు పార్వతీదేవి పొంగిపోయి ఆయన పాదముల మీద పడి నమస్కరించింది. అమ్మవారు తన తపస్సు ఫలించింది అనుకుంది.
పార్వతీదేవి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ‘అయ్యో పార్వతీ, నా గురించి ఇంత తపస్సు చేశావా” నీ అంతః సౌందర్యమును ప్రకాశింపజేయడానికి నేను ఇలా ప్రవర్తించాను. నేను నీవాడను. పార్వతీ మనం ఎప్పుడూ రెండుగా లేము. ఇద్దరమూ కలిసే ఉంటాము. కాబట్టి వచ్చి నందివాహనమును అధిరోహించు. కైలాసమునకు వెళ్ళిపోదాం’ అన్నాడు. అపుడు పార్వతీదేవి మహానుభావా, నీవు ఎంతటి గొప్పవాడివో నాకు తెలుసు. నాది ఒక్క కోరిక. కాదనకుండా మన్నించాలి. నేను సతీదేవిగా ఉన్నప్పుడు నీవు నా పాణిగ్రహణం చేసినప్పుడు ఒక చిన్న వెలితి జరిగింది. మనం నవగ్రహారాధనతో కూడిన విధానంతో ఆనాడు మన కళ్యాణం చేసుకోలేదు. అలా చేసుకోలేక పోయినందుకు సతీదేవిగా నేను శరీరం వదిలిపెట్టాను. నీవు మా వారి వద్దకు వచ్చి కన్యను ఆపేక్షించలేదు. దక్షుడే వచ్చి పిల్లనిచ్చాడు. ఈ జన్మలో అలా కాకూడదు. నీవే పెద్ద మనుషులైన సప్తఋషులను మా నాన్నగారి దగ్గరకు పంపి ‘మీ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాను’ అని అడగాలి. నన్ను కన్నందుకు మా నాన్నగారు పొంగిపోయి ‘అలాగే మా అమ్మాయిని ఇస్తాను’ అని మాట ఇవ్వాలి. నీవు నీ పరివారమును అంతటినీ తీసుకుని ఆడపెళ్ళి వారింటికి రావాలి. అక్కడ జరిగే వివాహ తంతులో నన్ను నీదానిగా స్వీకరించి మా తండ్రి అయిన హిమవంతుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా చందన తాంబూలాది సత్కారములు చేసి పొంగిపోతే అపుడు కన్యాదానం చేసిన ఫలితం మానాన్నగారికి పూర్ణంగా కలుగుతుంది. ఆ తరువాత నీవు నన్ను కైలాసమునకు తీసుకువెళ్ళాలి. శంకరా, ఈ జన్మలో నాకలా పెళ్ళి చేస్తానని మాటిస్తావా?’ అని అడిగింది. అది అమ్మవారి కోరిక. శంకరుడు అందుకు అంగీకరించి కైలాసమునకు వెళ్ళిపోయాడు.
తదనంతరము పార్వతీదేవి తన తపస్సును విరమించినదై ఆమె కూడా హిమవత్పర్వతమునకు చేరుకుంది. తండ్రి హిమవంతుడు కూతురు ముఖంలో కనపడుతున్న ఆనందం చూసి ‘అమ్మా ఈవేళ నీ కళ్ళు అరవిరిసిన తామరపువ్వుల్లా ఉన్నాయి. నీ ముఖం చాలా కాంతివంతంగా ఉన్నది. నీవు చాలా సంతోషంగా ఉన్నావు. నీ చెలికత్తెలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఏమిటమ్మా విశేషం?’ అన్నాడు. పరమశివదర్శనం పరమశివుని అనుగ్రహం తన కుమార్తె అయిన పార్వతీదేవి పొందినది అని ఆయన గ్రహించాడు. చెలికత్తెలందరూ పార్వతీదేవి వెళ్లి తపస్సు చేసిన విధానము, శంకరుడు ప్రత్యక్షం కావడం, శివనింద చేసి పార్వతీదేవి మనస్సు స్థితిని ఆవిష్కరించిన విధానం, అమ్మవారి శివభక్తి లోకమునకు ఆవిష్కరింపజేసిన విధానం తదనంతరం శంకరుడు సంతోషించి తానే కన్యను అపేక్షించడం కోసం పెద్ద మనుష్యులను కైలాసం నుండి పంపిస్తానని ప్రతిజ్ఞచేసిన వృత్తాంతం హిమవంతునికి చెప్పారు. అపుడు హిమవంతుడు తన కుమార్తెతో ‘అమ్మా, పార్వతీ, నువ్వే నన్ను అనుగ్రహించి నీవు నాకు కుమార్తెగా జన్మించావు. అంతేకాని యథార్థమునకు నిన్ను కుమార్తెగా పొందడానికి నాకు ఈ అర్హత ఉన్నాడని చెప్పడానికి నా దగ్గర ఏమి ఉన్నది! కానీ నువ్వు జన్మించి నాకు ఎన్నో గొప్ప విషయములను ఇచ్చావు. దేవతలు ఈవేళ నన్ను స్తోత్రం చేస్తున్నారు. ఈవేళ నా రాజ్యంలోకి ఎవరూ తొంగిచూడలేరు. ఇపుడు నేను శక్తి స్వరూపమయిన అమ్మవారికి తండ్రిని. శంభునికి మామగారు హిమవంతుడు అనే పేరు ప్రఖ్యాతులు ఈవేళ నేను పొందగలుగుతున్నాను. అని కూతురిని చూసుకుని పొంగిపోయాడు.
ఇపుడు కైలాసపర్వతం మీదకు శంకరుడు సప్తర్షులను పిలిచాడు. శంకర దర్శనం అంటే మాటలు కాదు. ఆయనే స్వయంగా పిలిచే సరికి ఎంతో సంతోషంతో సప్తర్షులు గబగబా కైలాసమునకు వెళ్ళారు. వాళ్ళు లోపలికి వెడుతూనే నమస్కారం చేసి భూమిమీద ప్రణిపాతం చేసి శరణుచెప్పారు. శంకరుడు వాళ్ళ యోగ్యతను గుర్తించి వాళ్ళను కూర్చోబెట్టి ఇలా చెప్పాడు ‘నా వివాహమునకు మీరు పెద్దలుగా ఉండాలి అని చెప్పారు. పార్వతీ పరమేశ్వరుల పెళ్ళిలో వారిద్దరికీ అనుసంధానం చేసే పదవిని పొందినందుకు అటువంటి అదృష్టం తమకు కలిగినందుకు సప్తర్షులు పొంగిపోయి ‘ఏమి మా అదృష్టము! వేదముల చేత కూడా చూడబడని పరమాత్మ ఈవేళ మాకు సాకారరూపుడై పిలిచి దర్శనం ఇచ్చి పనిచేసి పెట్టమని అడుగుతున్నాడు. మమ్ములను ధన్యులను చేస్తున్నావు. మేము ధన్యులం అయ్యే కార్యం ఏమిటో మాకు చెప్పు తండ్రీ’ అని అడిగారు. అపుడు శంకరుడు నవ్వి ‘హిమవంతునికి పార్వతీదేవి అనే కూతురు ఉంది. మీరు వెళ్లి ఆయనతో, ఆయన భార్యతో మాట్లాడి ఆ అమ్మాయితో నాకు వివాహం కుదిరేటట్లుగా మాట్లాడండి. ఆ అమ్మాయితో నాకు సంబంధం కలగడం కోసమని ఒకవేళ అవతలివాళ్ళు ఏదైనా పణం అడిగినట్లయితే దానిని మీరు పెట్టి రండి. అంత అందమయిన ఆ పార్వతీదేవిని నాకిచ్చి వివాహం చేసేటట్లుగా మాట్లాడి రండి. మీరు వెళ్ళి మాట్లాడి వచ్చేసేటప్పుడు పాల అన్నం తినిరండి. తప్పకుండా వారు అంగీకరించేలా చేసి రండి. ఇది నాకు చాలా ఇష్టమయిన పని. దీనిని మీరు జాగ్రత్తగా చేసుకురావాలి. ఇప్పుడే ఇక్కడి నుంచే హిమవంతుడి దగ్గరకు వెళ్ళండి’ అని చెప్పాడు.
దానికి సప్తర్షులు పరమ సంతోషముతో అంగీకరించి అక్కడినుండి బయలుదేరారు. అరుంధతీదేవి ఒక్కతీ మాత్రం సప్తర్షులతో పాటు బయలుదేరింది. అరుంధతిని మాత్రం పక్కకు పిలిచి ఒక రహస్యం చెప్పాడు శంకరుడు. ‘నువ్వు స్వతంత్రంగా లోపలకు వెళ్ళి హిమవంతుని భార్యయైన మేనకాదేవితో మాట్లాడుతూ నేను అన్ని విధములా పార్వతీ దేవికి తగినవాడినే’ అని నచ్చచెప్పాలి. శంకరుని ఈ మాటలకు అరుంధతి కొంచెం ఆశ్చర్యపోయి అలాగే స్వామీ అని చెప్పింది. ఇప్పుడు సప్త ఋషులు, అరుంధతి హిమవంతుని పట్టణమునకు చేరారు. హిమవంతుడు సప్తర్షులను చూసి గబగబా బయటికి వచ్చి వారితో ‘మీరు కబురు చేస్తే నేను రావాలి. మీరు మా ఇంటికి రావడమా! నేను చాలా సంతోషపడి పోతున్నాను. నేను ఎంత పుణ్యం చేశానో! మీరు ఏ కార్యం మీద వచ్చారో, నేను ఏమి చేయాలో దయచేసి తెలపండి’ అన్నాడు. అపుడు సప్తర్షులు ‘నీ కూతురు పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని శంభుదేవుడు అనుకుంటున్నాడు. పిల్లను అడగమని ఆయన తరపున మా ఏడుగురిని పంపించాడు. అందుకని మేము ఆ విషయం మాట్లాడడానికి వచ్చాము’ అన్నారు. అపుడు హిమవంతుడు ‘శంకరుడు మా అమ్మాయిని అడగడం నిజంగా నన్ను చాలా పెద్ద చేయడం. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు. ఆయన నా కుమార్తెను అనుగ్రహించి ప్రత్యక్షం అయి తీసుకు వెళ్ళిపోతే చాలు! నీ పిల్లని పంపు అని నాకు కబురు చేస్తే చాలు కానీ అలా చేయకుండా ఎంతో మర్యాదతో సప్తర్షులను నాకు పెళ్ళివారిగా పంపాడా! శంకరుడు నన్ను ఎంత పెద్దవాడిని చేశాడు! ఆ తల్లి పార్వతీదేవి ఆయన సొత్తు. నేను ఆయనకు ఇవ్వడమా. నన్ను అనుగ్రహించదానికి కొన్నాళ్ళపాటు మా ఇంట్లో పెట్టాడు అంతే. ఆయనదయిన సొత్తు ఆయనకే ఇమ్మనమని నన్ను ప్రార్థించి అడగడం ఆయన నన్ను పెద్దవాడిని చేసి పుణ్యం కట్టబెట్టడం తప్ప వేరొకటి కాదు. పైగా శంభుడు నాకు దైవము. నేను ఆయనకు దాసుడను. నేను ఆయన కింకరుడను. ఆయన నన్ను చేయమని ఆజ్ఞాపించాలి. నన్ను అర్థించమని సప్తర్షులను పంపడమా! ఎంత గొప్ప విషయం’ అని అనుకున్నాడు. ఈలోగా సప్తర్షులు వచ్చారు తన పిల్లను అడుగుతున్నారు అని మేనకాదేవికి వార్త వెళ్ళింది. ఆవిడ ఎంతో సంతోషంగా తన కూతురుని కూడా వెంటబెట్టుకుని అక్కడికి వచ్చింది. హిమవంతుడు ‘అయ్యా, మా అమ్మాయి వచ్చింది చూడండి, మీరు నిర్ణయించండి’ అన్నాడు. హిమవంతుడు గొప్ప అదృష్టవంతుడు. సప్తర్షుల రాకవలన హిమవంతుడు పావనుడయ్యాడు. ఆ రాత్రివారు అక్కడ నిద్రించారు. వారు ఏడుగురు పాలకూడులు తిని పడుకుని మరునాడు పొద్దున్న దేవతార్చన చేసుకుని బయలుదేరబోతుంటే ‘అయ్యా మహాత్ములు మీరు మా ఇంటికి వచ్చారు చాలా సంతోషం అని మేనకా హిమవంతులు ఏడుగురు సప్తర్షులకు అరుంధతీదేవికి బట్టలు పెట్టారు. వాళ్ళు వాటిని స్వీకరించి పరమసంతోషంగా కైలాసం వెళ్ళి అక్కడ శంకరునికి పార్వతీదేవి గురించి చెప్పడం ప్రారంభించారు. ‘శంకరా పార్వతీదేవికి ఉన్న లక్షణములు మరెవ్వరియందు లేవు. ఆవిడ ముఖమునకు ఆవిడ ముఖమే సాటి అని చెప్పి ఆమె ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటే ఆమె అందమును నాలుగు ముఖములు ఉన్న చతుర్ముఖ బ్రహ్మ కూడా చెప్పలేడు. ఆవిడ అటువంటి అందగత్తె. వాళ్ళు పిల్లనిస్తానన్నారు అని చెప్పారు.
వీరిమాటలు విని శంకరుడు చాలా సంతోషించాడు. సప్తర్షులు వివాహ శుభలేఖ వ్రాసేశారు. పెళ్ళికి ముహూర్తం పెట్టాలి కదా! బ్రహ్మగారిని మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే బ్రహ్మ అక్కడకు వచ్చాడు. ముహూర్తం పెట్టమని అడిగాడు. బ్రహ్మముహూర్తం పెట్టాడు. శుభలేఖలు వేసేశారు. అందరూ మగపెళ్ళి వారయిన శంకరుని ఇంటికి వచ్చేస్తున్నారు. దేవతలందరూ వచ్చారు. ఈ వచ్చిన దేవతలందరితో కలిసి పరమేశ్వరుడు కూడా బయలుదేరాడు. సమస్త లోకములలో ఉన్న దేవతలు, ఋషులు, దిక్పాలురు, నారదుడు అందరూ శంకరుడి వెనక పెద్ద ఊరేగింపుగా బయలుదేరారు.
శంకరుడు పెళ్ళి కొడుకు కదా! ఒంటినిండా భస్మమును రాసుకున్నాడు. పాములను పెట్టుకున్నాడు. పట్టు పుట్టమునొకదానిని కట్టుకున్నాడు. దానిమీద చక్కగా ఏనుగు తోలును కప్పుకున్నాడు. చక్కని జటాజూటమును కట్టుకుని నీలకంధరముతో దేవతలు ఋషులు కొలుస్తుండగా బయలుదేరుతున్నాడు. నందీశ్వరుడు ఆనందంతో పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు. వీళ్ళ మీద నుంచి వచ్చే గాలి చప్పుడు దిక్కులను కప్పేస్తోంది. కొన్ని కోట్లమంది అన్ని లోకములనుండి ఆ పెళ్ళికి బయలుదేరి పోతే ఆ బరువు ఒక్కచోటికి వెళ్ళిపోయేటప్పటికీ ఇంకా శేషుడు భూమిని పట్టుకోలేక ఒక పక్కకి వంగిపోయాడు.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment