నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్
పిశాచ మోక్షము
పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన, ఆకలి దప్పికలచేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడ త్రాగగనే కాలకూట విషమువలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగ నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపైనుండి ఆకలిదప్పికల బాధను భరింపలెక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధ ననుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును జూచి అబ్బురపడితిని. ఇదేమి యద్భుతమా యని అనుకొంటిని.
పిశాచరూపమున నున్న అతడు నన్ను జూచి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియు చేయజాలకపోయెను. నేనును వానిని జూచి జాలిపడి ఓయీ భయపడకుము. నీకు నావలన నేభయమును రాదు. నీవెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్నీ కష్టముండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడనని యతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రియని గుర్తింప లేకపోతిని. అప్పుడా పిశాచ రూపమున నున్న యతడిట్లు పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడనువాడను. సంకృతి గోత్రమువాడను. అన్ని విద్యలను నేర్చినవాడను. అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను. సర్వదేవతలను సేవించినవాడను. కాని నేను వైశాఖమాసమున కూడ అన్నదానమెవరికిని చేయలేదు. లోభము కలిగియుంటిని అకాలమున వచ్చిన వారికిని భిక్షమునైన యీయలేదు. కావున నాకీ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా యీ దురవస్థకు కారణము. శ్రుతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్దికలవాడు. వైశాఖమున గూడ అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు పిశాచరూపము నందితిననియు, నేనిట్లు బాధపడుచున్నానియు వానికి చెప్పవలయును. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై యున్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై నున్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖమాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము నిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధనుండి విడిపోయి శ్రీమహావిష్ణు సాన్నిధ్యమునందుదును. కావున ఆ విధముగ చేయుమని వానికి చెప్పుము. నాయందు దయయుంచి నాకీ సాయమును చేయుము. నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము. అనుచు నా పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలముంటిని. నన్ను నేను నిందించుకొంటిని. కన్నెరు విడుచుచుంటిని. తండ్రీ నేనే శ్రుతదేవుడను. దైవికముగ నిచటకు వచ్చినవాడను. తండ్రీ! యెన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు. నీకీ బాధనుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలయునో చెప్పుమని ప్రార్థించితిని.
అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంత సేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరచుకొని యిట్లనెను. నాయనా! నీవు తలచిన యాత్రలను పూర్తిచేసికొని యింటికి పొమ్ము. సూర్యుడు మేషరాశియందుండగా, వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీమహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మనవంశము వారందరికిని ముక్తి కలుగును. కావున అట్లు చేయుమని చెప్పెను.
నేనును నా తండ్రి యజ్ఞననుసరించి యాత్రలను చేసి నా యింటికి తిరిగి వచ్చితిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగ శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన యన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపమునుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి యాశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి యచట శాశ్వత స్థితినందెను.
కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములయందును యిదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా! నీకింకేమి కావలయునో అడుగుము చెప్పెదనని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వివరించెను.
ఈ విషయమును నారదమహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను.
వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము
No comments:
Post a Comment