నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్
పాంచాలరాజు సాయుజ్యము
నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను.
పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేనివాడునగు శ్రీమహావిష్ణువును యిట్లు స్తుతించెను.
నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం |
యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1||
ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం |
అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2 ||
సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి |
తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం ఖలనిగ్రహాయ || 3 ||
తమోగుణం రాక్షస బంధనాయ రజోగుణం నిర్గుణ విస్వమూర్తే |
దిష్ట్యాదంఘ్రిః ప్రణతాఘనాశన స్తీర్దాస్పదంహృదిధృతః సువిపక్వయోగైః || 4 ||
ఉత్సిక్త భక్త్యుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతింతవ పదస్మృతిమాత్రతోయే |
భవాఖ్యకాలోరగపాశబంధః పునఃపునర్జన్మజరాది దుఃఖైః || 5 ||
భ్రమామి యోనిష్వహమాఖు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతేః |
నూనం న దత్తం న చతే కధాశ్రుతా నసాధవో జాతు మయాసిసేవితాః || 6 ||
తేనారి భిర్ద్యస్త పరార్ధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టః స్వహరూహ్యగుం స్మరన్ |
స్మతౌ చ తౌమాంసముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్త బంధూ || 7 ||
వైశాఖధర్మ్రైః శ్రుతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది పుమర్ధహేతుభిః |
తద్భోధతో హంకృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ || 8 ||
తస్మాదభూన్మేపరమః ప్రసాదః తేనాఖిలాః సంపద ఊర్జితా ఇమాః |
నాగ్నిర్నసూర్యోన చ చంద్రతారకా నభూర్జలంఖంశ్వసనో ధవాఙ్మనః || 9 ||
ఉపాసితాస్తేపి హరంత్యఘంచిరాద్విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా |
యన్మన్యసేత్వంభవితాపి భూరిశఃత్యక్తేషణాన్ త్వద్పదన్యస్తచిత్తాన్ || 10 ||
నమస్స్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ |
తన్మాయయోమోహితోహం గుణేషు దారార్థరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ || 11 ||
త్వద్పాద పద్మే సతిమూలనాశనే సమస్త పాపాపహరే సునిర్మలే |
సుఖేచ్ఛయానర్ధ నిదాన భూతైః సుతాత్మదారైర్మమతాభియుక్తః || 12 ||
నక్వాపినిద్రాంలభతే న శర్మప్రవృద్దతర్షః పునరేవతస్మిన్ |
లబ్ద్వాదురాపం నరదేవజన్మత్వం యత్నతః సర్వపుమర్ధహేతుః || 13 ||
పదారవిందం న భజామి దేవ సమ్మూఢ చేతావిషయేషు లాలసః |
కరోమి కర్మాణి సునిష్ఠితః సన్ ప్రవృద్ధతర్షః తదపేక్షయాదద్ || 14 ||
పునశ్చభూయామహమద్యభూయామిత్యేన చింతాశత లోలమానసః |
తదైవ జీవస్య భవేత్కృపావిభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే || 15 ||
సమాగమః స్యాన్మహతాంహి పుంసాం భవాంబుధిర్యేనహి గోష్పదాయతే |
సత్సంగమోదేవయదైవ భూయాత్తర్హీశదేవేత్వయిజాయతేమతిః || 16 ||
సమస్త రాజ్యాపగమహిమన్యేహ్యనుగ్రహం తేమయి జాత మంజసా |
యధార్ధ్యతే బ్రహ్మసురాసురాద్యైః నివృత్త తర్షైరపిహంసయూధైః || 17 ||
ఇతః స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాదసరోరుహం విభో |
అకించన ప్రార్ధ్యమమందభాగ్యదం నకామయేన్యత్తవ పాదపద్మాత్ || 18 ||
అతోన రాజ్యం నసుతాదికోశం దేహేన శశ్వత్పతతారజోభువా |
భజామినిత్యం తదుపాసితవ్యం పాదారవిందం ముని భిర్విచింత్యం || 19 ||
ప్రసీదదేవేశ జగన్నివాస స్మృతిర్యధాస్యాత్తవ పాదపద్మే |
సక్తిస్సదాగచ్ఛతు దారకోశ పుత్రాత్మచిహ్నేషు గణేషు మే ప్రభో || 20 ||
భూయాన్మనః కృష్ణ పదారవిందయోః వచాంసితే దివ్యకధానువర్ణనే |
నేత్రేమమేతేతన విగ్రహేక్షణే శ్రోత్రేకధాయాం రసనాత్వదర్పితే || 21 ||
ఘ్రూణంచత్వత్పాద సరోజ సౌరభే త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ |
స్యాతాంచ హస్తౌ తవమందిరేవిభో సమ్మర్జనాదౌ మమనిత్యదైవ || 22 ||
కామశ్చమే స్యాత్తవసత్కధాయాంబుద్ధిశ్చమే స్యాత్తవచింతనేనిశం |
దినానిమేస్యుస్తవ సత్కధోదయైః ఉద్గీయమానైః మునిభిర్గృహా గతైః || 23 ||
హీనః ప్రసంగస్తవమేనభూయాత్ క్షణం నిమేషార్థ మధాపి విష్ణో |
న పారమేష్ఠ్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో || 24 ||
త్వత్పాదసేవాంచ సదైవకామయే ప్రార్ద్యాంశ్రియా బ్రహ్మభవాదిభిః సురైః || 25 ||
అని స్తుతించెను.
పాంచాలరాజు చేసిన యీ స్తుతి అర్ధవంతము శక్తిమంతమునగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాలరాజువలె పూర్వ కర్మననుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలెనే కష్టములను దాటి సర్వసుఖములనంది పాంచాలరాజువలె భగవంతుని దర్శనమును పొందగోరువారమే కదా! అందుకని యీ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమోయని తలచి భావమునిచ్చుచున్నాము. సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించకొనగలరు. 24 తత్త్వములు పరమేశ్వరుడు/శ్రీహరి ఒకడు మొత్తము 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న యీ స్తోత్త్రము సాభిప్రాయమైనదే.
1.స్వామీ! నీవు దేనియందును ఆసక్తుడవుకావు ఏదియు అంటనివాడవు. సృష్టికర్తలకు అధిపతివి. పరాత్పరుడవు. నీమాయకులోబడిన తత్త్వవేత్తలును సృష్టికర్తలనెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు.
2. తత్త్వవిదులును మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువా! దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించినవాడవు, రక్షించువాడవు. నశింపజెయువాడవును నీవొక్కడవే.
3.స్వామీ! నీవు కోరికలన్నియు తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు.
4.తమోగుణమున దుష్టులను శిక్షింతువు. రజోగుణమున రాక్షసుల నిగ్రహించు చున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది.
5.స్వామీ! గర్వము-భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము/పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు.
6.నేనును యిట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియు దానము చేయలేదు. నీ కథలను వినలేదు. ఉత్తముల సేవయును చేయలేదు.
7.ఇందువలన శత్రువులు నా రాజ్యము నాక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్తబంధువులగువారు నా యొద్దకు వచ్చి తమ ప్రభోధములచే నా దుఃఖమును పోగొట్టిరి.
8.ధర్మార్థకామమోక్షములను, స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖధర్మముల నాచరించితిని.
9.అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరియనుగ్రహము కలిగినది. అందువలన నుత్తమ సంపదలు అధికములుగ నొనగూడినవి. అగ్ని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగువానిని సేవింపలేదు.
10.నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులనుపాసింపలేదు. అవి యన్నియు స్థిరములు కావు. అన్నిటిని ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును.
11.స్వామీ! నీవు స్వతంత్రుడవు. ఎవరికిని లోబడినవాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు. అందరికంటె నుత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందాసక్తుడనైతిని.
12.మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వపాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగానేను సుఖము కావలయుననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యమున్నగు కోరికలచే పీడింపబడితిని.
13.స్వామీ! ఎచటను సుఖనిద్రలేదు, శుభములేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవజన్మనెత్తియు నీవే సర్వపురుషార్థకారణమని యెరుగజాలకపోతిని.
14.నీ మహిమనెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును యెవరికిని యిచ్చుటలేదు.
15.స్వామీ! ప్రభూ! పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలయుననియున్నను చేయలేకున్నను. కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును.
16.సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగరభయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నది అగును. అంతేకాడు దైవమగునీయందు భక్తి భావము కలుగును.
17.ప్రభూ! నీ రాజ్యమంతయు పోవుట మంచిదేయని అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీయనుగ్రహమును పొందు అవకాశము కలిగినది.
18.స్వామీ! అచ్యుతా! నీపాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులును ప్రార్థింపదగినవి. అనంతభాగ్యము నిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొకదానిని స్మరింపను.
19.కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటివారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును.
20.జగన్నాధా! ప్రసన్నుడవగుము. నీ పాదపద్మస్మృతి నన్ను విడువకుండ చూడుము. నీ పాదములయందు ఆసక్తియు, భార్యాపుత్రాదులయందనాసక్తియు కలుగజేయుము.
21.ప్రభూ! నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందములయందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణకధాను వర్ణనమున ప్రవర్తించుగాక. నా యీ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నాయీ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక.
22.నా ముక్కు నీ పాదపద్మగంధమునే వాసన జూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక! స్వామీ! నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక.నా పాదములు నీ క్షేత్రములున్నచోటకు, నీ కథలు చెప్పుచోటకు మాత్రమే వెళ్లుగాక. నాశిరమున నీకై నమస్కారము నిమగ్నమగు గాక.
23.నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ది నీ చింతనమునందాసక్తమగుగాక.
24.నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడచుగాక. నీ యింటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచుగాక. నీ ప్రసంగములేని క్షణమైనను గడువకుండు గాక.
25..ప్రభూ! బ్రహ్మపదవి అక్కరలేదు. చక్రవర్తిత్వము కలదు. మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కాని వారికి నీ పాద సేవ సులభముకాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము.
ఇట్లు పాంచాలరాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలెనన్న కన్నులతో ప్రసన్నుడై వానిని జూచుచు మేఘగంభీరస్వరముతో నిట్లనెను. నాయనా నీవు నా భక్తుడవని కోరికలు కల్మషములేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. పదివేల సంవత్సరముల దీర్ఘాయువునందుము. సర్వసంపదలను పొందుము. నీకు నాయందు నిశ్చలమైన భక్తియుండును. తుదకు ముక్తినందుదువు. నీవు చేసిన యీ స్తుతితో నన్ను స్తోత్రము చేసినవారికి సంతుష్టుడనై భుక్తినిముక్తిని యిత్తును. సందేహములేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయతృతీయాతిధి సార్ధకనామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తుల నక్షయముగ నిత్తును. భక్తిపూర్వకముగ గాకున్నను బలవంతము వలననో మొగమాటమువలననో ఏదోయొక కారణమున వైశాఖస్నానాదికమును చేసినవారికిని భుక్తిని, ముక్తిని యిత్తును.
ఈ అక్షయతృతీయయందు పితృదేవతలకు శ్రాద్దమును నిర్వహించినచో వారికి వంశవృద్ది అనంతపుణ్యము నిత్తును. ఈ అక్షయతృతీయాతిధి మిక్కిలి యుత్తమమైనది. దీనికి సాటియైన తిధిలేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయఫలములనిచ్చును. కుటుంబముకల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వసంపదలను వర్షించి ముక్తి నిత్తును. సమస్త పాపములను పొగొట్టు వృషభదానమును చేసినవానికి అకాలమృత్యువేకాదు, కాలమృత్యువును కూడ పోగొట్టి దీర్గాయుర్దాయము నిత్తును. వైశాఖవ్రతమును దాన ధర్మములను యధాశక్తిగ చేసినవారికి జన్మ, జరా, మృత్యు, వ్యాధి, భయములను, సర్వపాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ దానము మున్నగువాని వలన సంతోషించినట్లుగ నితరమాసములందు చేసిన పూజాదికమునకు సంతోషపడను. వైశాఖమాసమునకు మాధవమాసమని పేరు. దీనిని బట్టి నాకీ మాసమెంత యిష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖవ్రతము నాచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును.
వైశాఖవ్రతమును దానాదులను ఆచరించినవారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యముకాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేలకొలది మహాపాపములు చేసినవారైనను వైశాఖవ్రతము నాచరించిన పాపక్షయమును అనంత పుణ్యము నిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును.
పాంచాలమహారాజా! నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్దలతో నాచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగనే అంతర్ధానమందెను. పాంచాలరాజును శ్రీహరి యనుగ్రహమునకు మిక్కిలి యానందమునందెను. శ్రీహరి యందు నిశ్చలభక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు. గౌరవింపలేదు. భార్యాపుత్రాదులకంటె శ్రీమన్నారాయణుడే తనకు కావలసినవాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు పరివారము అందరితో గలసి వైశాఖవ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వసుఖభోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.
ఉత్తమమైన యీ కథను విన్నను వినిపించినను సర్వపాపవిముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగ నారదుడు అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు చెప్పెను.
వైశాఖ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము
........
No comments:
Post a Comment